నిర్మల్‌ ‌జిల్లాలోని భైంసా తాజాగా వార్తల్లో నిలిచింది. జనవరి 12, 2020న జరిగిన మత ఘర్షణ ఇంకా మరచిపోక ముందే మరొకసారి ఆ పట్టణం పేరు పతాక శీర్షికలకు ఎక్కింది.  సిగ్గుపడాల్సిన సంఘటనలు చోటు చేసుకున్నందుకు మళ్లీ వార్తల్లో ప్రధానంగా నిలిచింది. మత సామరస్యాన్ని నెలకొల్పాలన్న మంచి ఆశయంతో పోలీసులు ఆ  ‘రెండు వర్గాలు’ అంటూ ఆ చిదబర రహాస్యాన్ని దాచి పెట్టాలని విఫలయత్నం చేస్తున్నా, ఆ వర్గాలు ఏవో జనానికి తెలియనిది కాదు. దాదాపు పదమూడు మాసాల క్రితం సంక్రాంతికి ముందు జరిగిన విధ్వంసమే, అదే తీరులో మళ్లీ చెలరేగింది. అప్పుడు కోర్బా గల్లీలో సైలెన్సర్లు లేని ద్విచక్ర వాహనాలతో రగడ ఆరంభమైతే, ఇప్పుడు జుల్ఫీకర్‌ ‌లేన్‌లో అచ్చంగా అదే దృశ్యం మార్చి 7, ఆదివారం రాత్రి పునరావృతమై అరాచకానికి తెర లేపింది.

ఈ పరిణామం అంతర్లీనంగా శత్రుత్వం నివురుగప్పిన నిప్పులా ఇంకా కొనసాగుతూనే ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. సాటి మనిషిని, మరో మనిషి, తమవర్గం కానందుకు రక్తం కళ్లజూసే సంస్కృతి ఇంకా సజీవంగానే ఉందని చాటిచెప్పింది. సర్ది చెప్పేందుకు, ఈ చెడు సంస్కృతిని నివారించేం దుకు ప్రయత్నిస్తే ఎవరినీ వదలరన్న భయంకర సత్యానికి కూడా మరోసారి నిదర్శనంగా నిలిచింది. పోలీసులు, మీడియా ప్రతినిధులు, సామాన్య జనం ఎవరూ తమకు లెక్క కాదని సంకేతాలిచ్చింది. పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేలా చేసింది. కొందరి మస్తిష్కాల్లో ముసుగేసుకున్న వికృత క్రీడను మరోసారి బట్టబయలు చేసింది.

భైంసా పేరు వింటేనే ఘర్షణలు గుర్తొస్తాయి. ఎందుకంటే గడచిన మూడు దశాబ్దాలుగా అక్కడ అదే పరిస్థితి. ఒకవైపు జాతీయ స్ఫూర్తి ప్రదాత శివాజీ మహరాజ్‌ ‌కటౌట్‌, ‌మరొక పక్క టిప్పు సుల్తాన్‌ ‌కటౌట్‌ అక్కడ దర్శనమిచ్చేవి. భైంసా అల్లర్లను తలుచుకుంటే ‘రెండు వర్గాల’ పోరు మదిలో మెదులుతుంది.  గొడవలు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు తొలుత మీడియాలో పతాక శీర్షికల్లో వస్తాయి. తర్వాత సద్దుమణుగుతాయి. జరిగిన నష్టం, అల్లర్ల తీవ్రత బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలుస్తుంది. దీనికి అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం తమవంతు పాత్రను నిర్వర్తిస్తాయి. ఈ వర్గపోరు గురించి బయటకు తెలిస్తే ఇతర ప్రాంతాలకు గనక విస్తరిస్తే అరికట్టడం అసంభవంగా మారుతుందన్న ఉద్దేశంతో మీడియాలో వార్తలు, దృశ్యాలు రాకుండా కట్టడి చేయాల్సి వస్తుంది. ఈ ఆలోచన ఆహ్వానించ దగినదే అయినా, అప్పటికే జరిగే తప్పుడు ప్రచారంతో బాధిత వర్గమే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కో వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇది కూడా విపరిణామాలకు కారణమవుతోంది.

తరచూ భైంసాలో ఇలాంటి అపశ్రుతులు చోటు చేసుకోవడం, దాడులు జరుగుతూనే ఉండటం పరిపాటిగా మారింది. అప్పుడప్పుడూ ఏదో ఓ కారణంతో, చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, పరస్పర దాడులకు దిగడం, ఇళ్లు తగుల బెట్టడం, వాహనాలు దగ్ధం చేయడం సర్వ సాధారణమై పోయాయి. అయితే, ప్రతిసారీ మెజార్టీ వర్గం బాధితులుగా మిగలడమే చేదు వాస్తవం, అనుభవం.

ఈ క్రమంలోనే ఈనెల 7వ తేదీన మరోసారి భైంసా రక్తసిక్తమయ్యింది. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. రాత్రివేళ అల్లరిమూకలు తమ మేకలు తప్పిపోయా యని, వాటిని వెతుకు తున్నామని హిందువుల ఇళ్లల్లో చొరబడి బీభత్సం సృష్టించారు. మహిళలతో దురుసుగా ప్రవర్తించారు. వారు నిలదీసే సరికి వారి ప్రార్ధనా స్థలాల్లోకి వెళ్లి రాళ్లు రువ్వారు. రోడ్ల మీద కనిపించినవారిని చితకబాదారు. స్థానికుడు దేవారెడ్డిని కత్తులతో పొడిచారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. రాజ్‌న్యూస్‌ ‌రిపోర్టర్‌ ‌వినోద్‌పైనా దాడి జరిగింది.

భైంసా తాజా అల్లర్లను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌  ‌ఖండించారు. ముగ్గురు రిపోర్టర్లు, పోలీసులు, బీజేపీ కార్యకర్తలు గాయ పడటంపై  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిపోర్టర్లపై, పోలీసులపై దాడి చేస్తారా అని  ప్రశ్నించారు. అది భైంసానా, పాకిస్తానా అని మండిపడ్డారు. పోలీసులు వెంటనే అల్లర్లను ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్లనే భైంసాలో తరుచుగా అల్లర్లు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. దాడిలో గాయపడి, హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని బీజేపీ ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్‌  ‌పరామర్శించారు. అయితే అదే రోజు రాత్రి వీరిని పోలీసులు అరెస్ట్ ‌చేయడం గమనార్హం. తరువాత బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌కూడా వెళ్లి బాధితులను పరామర్శించారు. స్థానిక మజ్లిస్‌ ‌నాయకుడు తాజా అల్లర్లకు కారణమని అర్వింద్‌  ‌మీడియా ముందు ఆరోపించారు. కొన్నేళ్లుగా అక్కడ ఉద్రిక్తతలు ఉన్నప్పటికి పరిష్కారం చేయక పోవడంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, పోలీస్‌ ‌యాంత్రాంగం దారుణంగా విఫలమైనాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, మజ్లిస్‌ ‌పార్టీల ఒత్తిడి పోలీసులపై తీవ్రంగా ఉందని కూడా అన్నారు. భైంసా అంశాన్ని రాజకీయ పార్టీలు మత కల్లోలంగా చిత్రించరాదని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ ఈ అల్లర్లకు కారణమైన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నానని కాంగ్రెస్‌ ‌నాయకుడు వి. హనుమంతరావు అన్నారు.

భైంసా పట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారంటేనే దాని తీవ్రత తెలియడం లేదా? హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ ‌చేసి వివరాలు వాకబు చేశారు. భైంసాలో పరిస్థితులను  బట్టి అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పవలసిన అవసరం ఎంతో ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వానిదే. దాడులు, అల్లర్ల సంస్కృతిని అరికట్టాలి. ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.  ఉద్రిక్తత తరువాత హిందువులు నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాలు ఆగ్నికి ఆహుతయ్యాయి. రెండు ఆటోలు, 15 ద్విచక్ర వాహనాలు, ఒక కారుకు కూడా నిప్పు పెట్టారు. ఫిర్యాదులో పేర్కొన్న ఏ ఒక్కరినీ అరెస్ట్ ‌చేయలేదు. కంటితుడుపు చర్యగా ఏడుగురు ముస్లింలను మాత్రం అరెస్ట్ ‌చేశారు. ఏ తప్పు చేయకపోయినా ఇరవై మంది హిందువులను అరెస్ట్ ‌చేశారు.  భైంసాలో ప్రస్తుతం 144 సెక్షన్‌ అమల్లో ఉంది.

ఒక పథకం ప్రకారమే, పాత మూసలోనే అల్లర్లు ఆరంభమయినాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన గొడవ ‘రెండు వర్గాల’ మధ్య అల్లర్లకు దారితీసింది. జుల్ఫీకర్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, ‌మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో పాటు ఓ ఎస్సై, కానిస్టేబుల్‌, ‌ముగ్గురు ఎలక్ట్రానిక్‌ ‌మీడియా ప్రతినిధులు గాయపడినవారిలో ఉన్నట్టు ఇప్పటికి వెలువడిన వార్తల వల్ల తెలిసింది. ఘర్షణ నేపథ్యంలో భైంసా పట్టణంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. నిర్మల్‌ ఇం‌ఛార్జి ఎస్పీ విష్ణు వారియర్‌ ‌పర్యవేక్షణలో అదనపు బలగాలను నిర్మల్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాల నుండి భారీగా భైంసాకు తరలించారు.

నిరుటి జనవరి ఘటనే కాకుండా, కరోనా లాక్‌డౌన్‌ ‌సమయంలోను ఒకసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కానీ జనవరి ఘటన చిన్నదేమీ కాదు. ఆ అల్లర్లలో భారీ నష్టం జరిగింది. ప్రభుత్వం ఆ అంచనాలు రూపొందించింది. రెవెన్యూ అధికారులు భైంసాలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారుచేశారు. ఆ అల్లర్లలో 11 ఇళ్లు పూర్తిగా, 23 పాక్షికంగా ధ్వంసం అయినట్టు, మొత్తం రూ.3.93 కోట్ల నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నివేదికను జిల్లా కలెక్టర్‌కు కూడా సమర్పించారు. అధికారిక లెక్కల కంటే నష్టం ఎక్కువేనని నాటి అల్లర్ల దృశ్యాలు, బాధితుల ఆవేదనలు సాక్ష్యమిస్తున్నాయి. బాధితులకు సేవాభారతి, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ‌వంటి సంస్థలు అండగా నిలిచాయి.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram