భారతదేశంలో సెక్యులరిజం అంటే ‘అన్ని మతాల పట్ల సమానంగా సహిష్ణుత కలిగి ఉండడం’. మద్రాస్‌ ‌హైకోర్టు ఫిబ్రవరి ఆరో తేదీన ఇలా పునరుద్ఘాటించవలసి వచ్చింది. పాశ్చాత్య దేశాలలో సెక్యులరిజానికీ, భారతీయ సెక్యులరిజానికీ మధ్య ఉన్న తేడాను వివరించింది. పాశ్చాత్య దేశాలలో సెక్యులరిజం అంటే మతానికీ, రాజ్యానికీ మధ్య విభజన. కానీ భారత్‌లో అన్ని మతాల ఎడల సమభావంతో, సమ సహిష్ణుత కలిగి ఉండడం తెలుసుకోండి అని వివరణ ఇచ్చింది. ఇది కొన్ని దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్నదే. కానీ చాలామంది నిత్యం పరగడుపే. అందుకే మళ్లీ ఒకసారి మద్రాస్‌ ‌హైకోర్టు గుర్తు చేసింది.

 హిందూధర్మాన్నీ, దేవాలయాలనూ అదే పనిగా దూషిస్తున్న క్రైస్తవ మత ప్రచారకుడు మోహన్‌ ‌సి లాజరస్‌ ‌కేసులో ఏక సభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అవన్నీ. హిందూ దేవాలయాల గురించి అనుచితంగా మాట్లాడినందుకు ఇతడి మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ ఎన్‌ ఆనంద్‌ ‌వెంకటేశ్‌ ఏక సభ్య ధర్మాసనం నిందితుడిని తీవ్రంగా మందలించింది. తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పినందున ఇతడి మీది దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు కొట్టివేసి ఉండవచ్చు. కానీ ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తెలుసుకోవడం మత ప్రచారం విషయంలో అన్ని మర్యాదలు మరచిపోతున్న క్రైస్తవ మతప్రచారకులకు అవసరమే. ఇతర మతాల మీద, వారి విశ్వాసాల మీద, ప్రార్థనామందిరాల మీద ఇలాంటి ధోరణే కొనసాగిస్తే అది సెక్యులరిజం పతనానికి దారి తీస్తుందని న్యాయమూర్తి గట్టిగానే చెప్పారు.

మాకు కూడా ఈ దేశంలో భాగం కావాలనే వరకు క్రైస్తవ మతప్రచారకులు వెళ్లిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఈశాన్య భారతంలో వేర్పాటువాద ఉద్యమాల వెనుక ఉన్నది ఇలాంటి క్రైస్తవ ప్రచారకులే. ఇదే ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నది. ఇలాంటి చిన్నా చితకా నినాదాలను పరిగణనలోనికి తీసుకోనవసరం లేదని చాలామంది చెప్పవచ్చు. కానీ వారిని ఇలాంటి తీవ్ర ఆలోచనకు వచ్చేటట్టు చేసిన వాస్తవాలు ఏమిటో బయటకు రావలసిన అవసరం అయితే ఉంది. గుడుల మీద దాడులు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలకు అపచారం చేయడమే తమ ధ్యేయమని బాహాటంగా చెబుతున్న క్రైస్తవ మత గురువులు ఇప్పుడు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ వాస్తవాలను ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌, ‌శివశక్తి వంటి సంస్థలు, కొందరు వ్యక్తులు చిరకాలంగా చెబుతూనే ఉన్నారు. సాక్ష్యాలు చూపుతూనే ఉన్నారు. ఓట్ల రంధిలో ఉన్న రాజకీయ పక్షాలు, మేధో బిరుదాంకితులు ఇదేమీ పెద్ద విషయం కాదన్నట్టే తీవ్రతను తక్కువ చేసి చూపడం మామూలైపోయింది. అదే క్రైస్తవ మతోన్మాదులకి వరంగా మారింది. ఈ నేపథ్యంలో మద్రాస్‌ ‌హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇలాంటి వారి కళ్లు తెరిపిస్తాయేమో చూడాలి. పొరుగు మతం పట్ల సహనంతో ఉండాలి. వారి మనోభావాలను మన్నించాలి. వారి ప్రార్థనామందిరాలను గౌరవించాలి అని కోర్టు మంచి మాటే చెప్పింది. ఇంకొన్ని విలువైన మాటలు కూడా ఉన్నాయి.

పరమతాలకు వ్యతిరేకంగా విషం కక్కడం, ఒక మతం అనుయాయులలో పరమతం పట్ల ద్వేషం పెంచడం అంటే సమున్నత సత్యాల దర్శనం కోసం ఆశ్రయించిన సొంత మతం ఉద్దేశాన్నే వ్యతిరేకించడమేనని కోర్టు అభిప్రాయపడింది. స్వేచ్ఛ, సెక్యులరిజం, సహిష్ణుత లేదా సహనం అవసరం ఏమిటో కూడా ధర్మాసనం ముందు చర్చకు వచ్చాయి. మతాలను వ్యాప్తి చేసే పనిలో ఉన్నవారి బాధ్యత మరింత గురుతరమైనదనీ కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే ప్రతి మాటా ఆ మతానుయాయుల మీద గట్టి ప్రభావం చూపి, ఆంతరంగిక ఎదుగుదలను దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. నిజానికి మతాన్ని వ్యాప్తి చేసే పనిలో ఉన్న వారు నేరుగా పరమతాన్ని అవమానించే పనిలో లేక పోయినా లక్షలాది మంది వారి అనుయాయులు వాటిని గుడ్డిగా స్వీకరిస్తారని మరచిపోరాదు అని కూడా తెలిపింది. ఈ ధోరణి అనుయాయులలో కేవలం ద్వేష బీజాలను నాటడానికే ఉపయోగపడుతుందని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు. మత వ్యాప్తి ఇతరుల మనోభావాలను పణంగా పెట్టి చేసేది కాదని కూడా ధర్మాసనం హితవు చెప్పింది. ఈ సూత్రాన్ని కనుక ఆచరించకపోతే ఈ దేశ సెక్యులర్‌ ‌వ్యవస్థను అది ధ్వంసం చేస్తుందని హెచ్చరించింది కూడా. అంతేకాదు, మన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగకరంగా తయారవుతుందని చెప్పింది. భారత సెక్యులరిజం అంటే మత వ్యతిరేకమైనది కాదు. అన్ని మతాలకు, అందరు పౌరులకు సమాన స్థానం ఇచ్చేది అని న్యాయమూర్తి నిర్వచించారు.

ఒకే కేసులో అన్ని అంశాలను కోర్టు చర్చించలేదు కాబట్టి, వర్తమాన పరిస్థితులను బట్టి వాస్తవాలను పౌరులంతా సమీక్షించుకోవలసిన అవసరం ఉంటుంది. ఇస్లాం వ్యాప్తే ధ్యేయమన్న పేరుతో మతోన్మాదులు ప్రపంచమంతటా పెచ్చరిల్లిపోతున్నారు. ఫ్రాన్స్ అం‌దుకు ఉదాహరణ. ఇక క్రైస్తవ విస్తరణకు మరొక రకమైన కుట్ర జరుగుతోంది. ఈ రెండు మత వర్గాలు కలిపి ముప్పయ్‌ ‌శాతం లోపే ఉన్నా, ఇంతగా చెలరేగిపోవడం వెనుక ఉన్నది హిందువుల సహనమే. అదే విధంగా మెతకతనం కూడా. ఇలాంటివి కోర్టు చెప్పలేకపోవచ్చు. గుర్తించవలసింది పౌరులే.

About Author

By editor

Twitter
Instagram