కాలం మారుతూ ఉంటే, కొత్త వృత్తులు పుట్టుకొస్తూ ఉంటాయి. కొత్త వృత్తులు కాబట్టి కొత్తకొత్తగా కనిపిస్తాయి. కానీ ఆ పాత వృత్తుల మాదిరిగా ఈ కొత్త వృత్తి కడుపు నింపడమనే చిన్నాచితకా అవసరానికి సంబంధించింది కాదు. ఇదంతా వేల కోట్ల రూపాయల వ్యవహారం. ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి వృత్తి గురించి యావత్‌ ‌భారతజాతి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వృత్తి-ఆందోళన్‌జీవి. ఎవరూ తొట్రుపడకుండా ఉండేందుకూ, ఎలాంటి గజిబిజికి తావు లేకుండా చేసేందుకూ మోదీ ఆ మాట లోతుపాతులు సవివరంగా ఆవిష్కరించారు. బుద్ధిజీవులు తెలుసు. శ్రమజీవులు ఇంకా బాగా తెలుసు. అలాగే కొత్తగా ఆందోళనా జీవులనే వృత్తికారుల తెగ ఒకటి బలిసింది. బహుశా ఇది భారతదేశానికి ప్రత్యేకం.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియచేసే తీర్మానానికి సమాధానం ఇస్తూ మోదీ ఈ పదాన్ని పరిచయం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు చేస్తున్న అలజడి గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ వృత్తి గురించి వివరించారు. ‘దేశంలో ఆందోళన్‌ ‌జీవి అనే కొత్త జాతి పుట్టుకొచ్చింది. నిష్ణాతులైన నిరసనకారులు ప్రతీ ఆందోళనలో కనిపిస్తున్నారు. వారంతా ఆందోళనల నుంచి లాభం పొందాలనుకునే పరాన్నజీవులు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి లేకపోతే వారు బతకలేరు’ అని చక్కగా నిర్వచించారు. నిజానికి మోదీ ఈ మాట పెద్దల సభలో చెప్పారు గాని, ప్రభుత్వ పథకాలని ముఖ్యమంత్రులూ, మంత్రులూ లాంఛనంగా ప్రారంభించిన చందమే అది. ఈ కిరాయి ఆందోళనకారుల ఆచూకీ భారతజాతి ఏనాడో గ్రహించింది.

జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణం రద్దు గురించి ఆందోళన జరిగినా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నెలల తరబడి గుడారాలలో తిష్ట వేసినా, జేఎన్‌యూలో, అలీగడ్‌ ‌ముస్లిం యూనివర్సిటీలో భారత వ్యతిరేక రగడ జరిగినా, అయోధ్య రామ మందిరం మీద సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఈ ఆందోళన జీవులే ఠంచన్‌గా హాజరయిపోతారు. ఇవేకాదు, దీపావళికి మాత్రమే కాలుష్యం పెరుగుతుందంటూ, చవితి నిమజ్జనాలతోనే జల సంపదంతా కలుషితమైపోతాయంటూ కోర్టులకెక్కే తెగ కూడా ఈ ఆందోళనజీవులలో ఉప తెగే. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ, జాతీయవాదశక్తులను, హిందూ జీవన విధానాన్ని బలహీనపరచడమే ప్రథమ కర్తవ్యంగా ఈ ఆందోళనజీవులు కఠోరదీక్షతో రోడ్లెక్కుతారు. ఈ చిల్లర పనులకి కొన్ని అంతర్జాతీయ సంస్థలు పడేసే డబ్బుతో, ఆ పడుపు కూడుతో గడుపుకుంటూ ఉంటారు. ఆందోళన వారి ఊపిరి అంటూ ఉంటారు గానీ, నిజానికి వృత్తి. దాని మీద సంపాదన దండిగా ఉంటుంది కాబట్టి ఆందోళనల నిర్వహణ మంచి వృత్తి నైపుణ్యంతో, సృజనాత్మకంగా సాగిస్తారు. దానికి ఢోకా లేదు. ఇందుకు అంతర్జాతీయ స్థాయి కిటుకులు మాత్రమే ఉపయోగిస్తారు. దీనికే ప్రధాని ఎఫ్‌డీఐ – ఫారెన్‌ ‌డిస్ట్రక్టివ్‌ ఐడియాలజీ అని నామకరణం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్రపతి ఆదేశాలు, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న  పార్లమెంట్‌ ‌నిర్ణయాలు- వీటిలో వేటిని వ్యతిరేకించాలన్న జాతీయ పతాకం భుజాన వేసుకునే వస్తారు. గాంధీ, అంబేడ్కర్‌, ‌భగత్‌సింగ్‌, ‌ఫూలే వంటి వారి చిత్రపటాలతో, రాజ్యాంగ ప్రతులను చేత ధరించి మరీ ‘శాంతియుత’ విధ్వంసం చేస్తారు. రాజ్యాంగం మీద గౌరవం అని పైకి అంటారు. లోపల అస్సాంను భారత్‌ ‌నుంచి ఎలా విడగొట్టవచ్చో మెలకువలు నేర్పుతూ ఉంటారు. త్రివర్ణ పతాకమంటే గౌరవం అంటారు, గణతంత్ర దినోత్సవాన ఎర్రకోట మీద నేరగాళ్లూ, తుంటరుల చేత మత పతాకాలను ఎగరవేయిస్తారు. ఇందుకు టూల్‌కిట్‌లతో ప్రచారం చేస్తారు.

ఈ కళకి కమ్యూనిస్టులు పెట్టింది పేరు. అధికారం పోయాక తీరికగా కాంగ్రెస్‌ ‌నేడు వాళ్ల నుంచి ఆ కళను అభ్యసిస్తోంది. పార్టీలూ, ఆశయాలూ వేరుగా ఉన్నట్టు పైకి కనిపించినా, ఆందోళనే జీవికగా ఉన్న ఆ జీవుల ఐకమత్యం  అసాధారణం. ఆ జీవులలో ఏ ఒక్కరి మీద ఈగ వాలినా ఈ మూక కోరస్‌గా నిరసన గీతాలు అందుకుంటుంది. తాను విమర్శిస్తున్నది కర్షక ఛద్మ వేషధారులనే అని ప్రధాని అంత స్పష్టంగా చెప్పినా కూడా రాహుల్‌ ‌గాంధీ అనే కాంగ్రెస్‌ ‌ఘన మందమతి ‘రైతులను ప్రధాని అవమానిస్తున్నారు’ అంటూ గొంతు చించుకున్నారు. ‘ఔను, నేను ఆందోళనజీవినే. అందుకు గర్వపడుతున్నాను’ అని అదే శతాధిక వృద్ధ వేదిక ప్రముఖుడు పి.చిదంబరం వెంటనే స్పందించారు. ఆయన సత్యం చెప్పినందుకు అభినందించాలి. కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చిన భద్రతాదళాలను తప్పించుకోవడానికి లోపల దాక్కుని, తలుపులన్నీ మూయించిన ఈ సుప్రీంకోర్టు న్యాయవాది నోటి వెంట ఇంతటి న్యాయబద్ధమైన మాట వచ్చిందంటే, ఆ గర్వం కారణంగానే. ఈ దేశంలోని ప్రతి రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమే, దిగజార్చడమే పనిగా పెట్టుకున్న వారే ఆందోళనాజీవులను సమర్ధిస్తారనడానికి చిదంబరం వ్యాఖ్య నిదర్శనం.

చైనాకు దీటుగా ఎదుగుతూ, స్వశక్తి మీద నిలబడాలనుకుంటున్న భారత్‌ అం‌టే, గొప్ప ధర్మంగా నిలిచిన హిందూ జీవన విధానమంటే సహించని క్రైస్తవ, ముస్లిం ఉగ్రవాద సంస్థల చేతిలో కీలుబొమ్మలే ఈ ఆందోళనాజీవులు. అర్బన్‌ ‌నక్సల్స్‌కు వీళ్లు ‘రక్త’సంబంధీకులే కూడా. అవార్డు వాపసీ ఘనకీర్తులు కూడా వీరే. వీళ్లు ఏదో ఒకటి మాట్లాడతారు. ఒక వర్గం మీడియా అచ్చేసి వదులుతుంది. ప్రజాస్వామ్యానికీ, భారతీయతకూ వ్యతిరేకంగా సాగుతున్న ఈ వికృత విన్యాసాలు ఇంకా సాగకూడదంటే ప్రజలే తిరగబడాలి. మోదీ పిలుపుతో ఆయన పార్టీ వారు మూడు వందల మందిని గెలిపించిన భారతీయులలో ఇలాంటి స్పృహ కూడా ఇప్పుడు అవసరం.

About Author

By editor

Twitter
Instagram