లోకాలను ముంచెత్తే మహా వరదలకు వెనుక ఉన్న కారణాలు చాలా చిన్నవే అంటారు పెద్దలు. దేవభూమిగా ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి ఏడో తేదీన సంభవించిన పెను విపత్తును చూస్తే ఇదే అనిపిస్తుంది. హిమాలయ  సానువుల పాదాల దగ్గర సొరంగాలు తవ్వుతున్నారు. వీటి కోసం కొండలలో విస్ఫోటనాలు చేస్తున్నారు. క్వారీలు తవ్వుతున్నారు. రోడ్ల నిర్మాణం పేరుతో చెట్లు కొడుతున్నారు. ఈ అనంత ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక మూల జరుగుతున్న ఈ పనులు చాలా చిన్నవి. అవి జరుగుతున్న రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ విధ్వంసం గురించి తెలియకపోవచ్చు. కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం ప్రపంచ వార్త అయిపోతుంది. దేవభూమిలో సంభవించిన తాజా జల విలయంతో రెండు జలవిద్యుత్‌ ‌ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. వందలమంది కొట్టుకుపోయారు.

ఉత్తరాఖండ్‌ ‌జల వెల్లువ తరువాత ప్రశ్నలు కూడా దానితో పోటీ పడ్డాయి. ఆర్థిక ప్రగతి పేరుతో మనం పర్యావరణ సమతౌల్యాన్ని పట్టించుకోవడం లేదా? పర్యావరణాన్ని పాడుచేసుకుని మనం బావుకునేదేమిటి? స్థానికుల మనోభావాలే కాదు, ప్రకృతి గురించీ, నదుల గురించీ, హిమాలయాల గురించీ మనదైన పరంపర చెబుతున్న ధార్మిక పాఠాలను మనం నిజంగా గౌరవిస్తున్నామా? హిమాలయాలలో మంచు కరిగిపోయేటంతగా భూతాపాలు పెరిగిపోతున్నాయన్న శాస్త్రవేత్తల మాటలు చెవికి ఎక్కడం లేదా? ఇలాంటివే ఇంకా ఎన్నో ప్రశ్నలు.

పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో, ప్రకృతి ఎంత క్రూరంగా పరిహసిస్తుందో చెప్పడానికి ఫిబ్రవరి ఏడో తేదీన చమోలీ జిల్లాలో జరిగిన జలవిలయం నిలువెత్తు నిదర్శనం. ప్రకృతే కన్నెర్ర చేస్తే దాని ముందు మనిషి ఎంత అల్పజీవిగా మిగిలిపోతాడో కూడా ఆ మహోత్పాతం చెంప చెళ్లుమనిపించేలా చెప్పింది. ఆ ఉత్పాతం మిగిల్చిన బురదలో మనిషి అక్షరాలా దిక్కుతోచక కొట్టుకుంటున్నాడు. దాదాపు 170 మంది గల్లంతయ్యారు. ఫిబ్రవరి 15 నాటికి 51 మంది విగతజీవులయ్యారు.  ఇప్పటికీ సహాయక చర్యలు కొలిక్కి రాలేదు. ఏకంగా ఓ జల విద్యుత్‌ ‌కేంద్రం కొట్టుకుపోగా, మరొకటి తీవ్రంగా దెబ్బతిన్నది.

కొంప ముంచిన హిమానీనదం

చమోలీ జిల్లా జోషీమఠ్‌ ‌సమీపంలో లక్షల టన్నుల బరువైన నందాదేవి హిమానీనదంలో ఒక భాగం పడడంతోనే ఆకస్మికంగా భారీ వరదలు వచ్చాయి. అలకనంద, థౌలీగంగ, రుషిగంగ నదుల మధ్య ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన జలవిలయాన్ని సృష్టించింది. రుషిగంగ నది థౌలీ గంగలో కలుస్తుంది. తరవాత ఈ రెండూ అలకనందలో కలుస్తాయి. ఇవన్నీ గంగా నదికి ఉపనదులే. నది ఒడ్డున తపోవన్‌ – ‌రేణి వద్ద ఎన్టీపీసీ (నేషనల్‌ ‌థర్మల్‌ ‌పవర్‌ ‌కార్పొరేషన్‌) ఆధ్వర్యంలోని 480 మెగావాట్ల జలవిద్యుత్‌ ‌కేంద్రం ఉంది. దీనిలోకి నీరు చేరడంతో ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. విద్యుత్‌ ‌కేంద్రానికి సంబంధించిన సొరంగం పనులు చేస్తుండగా ఒక్కసారిగా నీరు ప్రవేశించడంతో కార్మికులు కకావికలమయ్యారు. థౌలీగంగ వరదలతో సమీపంలోని రుషిగంగలోనూ వరదనీటి ప్రవాహం పెరిగింది. దీంతో సమీపంలోని 12.5 మెగావాట్ల సామర్థ్యం గల చిన్నతరహా జలవిద్యుత్‌ ‌కేంద్రం నామారూపాలు లేకుండా పోయింది. ఇక్కడే రుషిగంగ, థౌలీగంగ కలుస్తాయి. ఇక్కడి కీలకమైన వంతెన సైతం పూర్తిగా దెబ్బతిన్నది. చైనా సరిహద్దుల్లోని పోస్టులకు ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ ‌బోర్డర్‌ ‌పోలీసు) బలగాలు వెళ్లేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుంది. 2013 వరదల తరవాత చోటుచేసుకున్న అతి పెద్ద విలయమిదే. వానా కాలంలో కొండ చరియలు విరిగిపడటం సహజమే. అయితే శీతాకాలంలో, అది కూడా ఈ కాలం ముగింపులో ఇలా మంచుచరియలు విరిగి పడటం వంటి ఉత్పతాలు  అసాధారణం. భూతాపం కారణంగా హిమాలయ హిమానీనదాలు నానాటికీ కొడిగడుతున్నాయని 2019లో ఓ అధ్యయనం పేర్కొంది. ఇక్కడ ఇంకొక మహానుభావుడు చెప్పిన సంగతి గుర్తు చేసుకుందాం. ఇంకొక దఫా వరదలు సృష్టించకుండా భగవంతుడిని నిరోధించేది ఏమైనా ఉన్నదీ అంటే, మొదటి దఫా వరదలు నిష్ప్రయోజనం కాలేదన్న భావనే నట. అంటే ఒక వరద ఉత్పాతం నుంచి మనిషి గుణపాఠం నేర్చుకుని తీరాలి. లేదంటే కోలుకోవడం సాధ్యంకాని దెబ్బ సిద్ధంగా ఉంటుంది. దేవభూమి చూసిన 2013 నాటి పెను ముప్పునకూ, తాజా ఉత్పాతానికీ మధ్య ఉన్న బంధం ఇదేనని నిష్కర్షగా చెప్పవచ్చు.  తాజా ఉత్పాతంతో మొదట అలకనంద ఎగువన నిర్మించిన జల విద్యుత్‌ ‌ప్రాజెక్ట్ ‌ధ్వంసమైంది. దీనినే రుషిగంగ ప్రాజెక్ట్ (13.2 ‌మెగావాట్లు) అంటారు. దీని శకలాలు తపోవన్‌ (520 ‌మెగావాట్లు), పీపల్‌కోట (4×111 మెగా వాట్లు) ప్రాజెక్టుల మీద, ప్రైవేట్‌ ‌భాగస్వామ్యంలోని విష్ణుగఢ్‌ ‌ప్రాజెక్టు మీద పడినాయి.

విపత్తులు కొత్తకాదు

ఉత్తర్‌‌ప్రదేశ్‌ను విభజించి 2000 సంవత్సరంలో అటల్‌ ‌బిహారీ వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రానికి దేవభూమిగా పేరుంది. నదులు, కొండలు, కోనలు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలతో విరాజిల్లే ఈ రాష్ట్రం అటు ఆధ్యాత్మికవేత్తలను, ఇటు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటున్నది. పవిత్ర గంగ, ఇతర నదులు ఈ రాష్ట్రం మీదుగా ప్రవహిస్తుంటాయి. చార్‌థామ్‌గా పిలిచే కేదార్‌నాథ్‌, ‌బదరీనాథ్‌, ‌గంగోత్రి, యమునోత్రి ఇక్కడే ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి- కేదార్‌నాథ్‌. ‌చార్‌థామ్‌ ‌యాత్రకు ఏటా లక్షలాది భక్తులు వస్తుంటారు. పర్యావరణ ప్రేమికుల తాకిడీ ఎక్కువే.

ఉత్తరాఖండ్‌పై ప్రకృతి పగ పట్టడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేకమార్లు రాష్ట్రం విపత్తుకు గురైంది. ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడటం, భూకంపాలు రాష్ట్రానికి సర్వసాధారణ మయ్యాయి. ఉమ్మడి ఉత్తర్‌‌ప్రదేశ్‌లో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. రెండు దశాబ్దాల క్రితం కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ పెద్దగా పురోగతి లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పితోర్‌గఢ్‌ ‌జిల్లాలో 1998లో కొండ చరియలు విరిగిపడి 255 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. 1991లో ఉత్తరకాశీ ప్రాంతం భూకంపానికి వణికి పోయింది. 768 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులయ్యారు. 1999లో చమోలీ జిల్లాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మరణించారు. పక్కనే ఉన్న రుదప్రయాగ్‌ ‌జిల్లా పైనా దీని ప్రభావం పడింది. ఇవన్నీ 2000లో కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు చోటు చేసుకున్న ఘటనలు.

కరుగుతున్న మంచు  పెరుగుతున్న ముప్పు

ఇండియన్‌ ‌స్పేస్‌ ‌రిసెర్చ్ ఆర్గనైజేషన్‌ అధ్యయనం భీతి గొలిపే విధంగా ఉంది. ఈ అధ్యయనం 2000 కిలోమీటర్ల పరిధిలోని 650 హిమానీనదాల స్థితిగతుల గురించినది. ఇదంతా హిమాలయ ప్రాంతమే. చమోలీ జిల్లా కూడా ఇందులోనే ఉంది. ఈ శతాబ్ది తొలి రెండు దశాబ్దాలలో మంచు కరగడం గతంలో కంటే రెట్టింపయింది. ఇదంతా హిమవత్పర్వతాల పాదాల దగ్గర పెట్టిన మంట కారణంగానే. ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. ఫలితంగా హిమానీనద చరియలు విరిగిపడి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శీతాకాలంలో ఇలా జరగడం అసహజ పరిణామమని వారు చెబుతున్నారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమనీనదాలు పరిపుష్ట మవుతాయి. ఈ ఏడాది పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉంది. దాని ఫలితమే ఈ ఉత్పాతమని చెబుతున్నారు. 1975-2000 సంవత్సరాల మధ్య కరిగిన మంచు కంటే ఆ తరవాత కరుగుతున్న పరిణామం బాగా ఎక్కువగా ఉంది. భూగోళం వేడెక్కుతుండటంతో హిమాలయ ప్రాంతంలో మంచు కొండలు ఏటా 0.25 మీటర్ల మేర మంచును కోల్పోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇది పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత నాలుగేళ్లలో మంచు చరియలు తమ మొత్తం పరిమాణంలో నాలుగో వంతును కోల్పోయి ఉంటాయని అంచనా.

1975- 2000 సంవత్సరాల మధ్యలో కంటే 2000-2016 సంవత్సరాల మధ్య సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్‌ ‌మేరకు పెరిగాయి. హిమానీనదాలు, మంచు ఫలకాలు ఓ రకంగా నీటిని నిల్వ చేసే ట్యాంకుల్లాంటివని చెప్పవచ్చు. ఇవి కరుగుతూ నదుల్లోకి నీటిని వదులుతుంటాయి. వాతావరణ మార్పులతో ఈ కరుగుదల వేగంగా ఉండటం వల్ల నదులు, సరసుల్లో నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంది. హిందుకుష్‌, ‌హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు కోట్ల మంది తాగు, సాగునీరు, విద్యుత్‌ అవసరాలను తీరుస్తున్నాయి. హిమానీనదాలు కరగడం వల్ల వీటికి ప్రమాదం కలుగుతుంది. నీటి లభ్యతా తగ్గిపోతుంది. ఈ కొరత 20 శాతానికి పైగా ఉండవచ్చని అంచనా. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని మరో అంచనా. ఘనీభవించిన మంచులో శీతాకాలం గతంలో మైనస్‌ 6 ‌నుంచి మైనస్‌ 20 ‌డిగ్రీల సెల్సియస్‌ ఉం‌టే, నేడది మైనస్‌ ‌రెండు డిగ్రీలకు పడిపోవడానికి భూతాపమే కారణం. దీనికి మానవ తప్పిదాలు తోడవుతున్నాయి. ఈ పరిస్థితి గురించి నిపుణులు ఏనాడో విశ్లేషించారు. పాలకులకు విలువైన సూచనలిచ్చారు. వాటిని విస్మరించడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. నానాటికీ కరిగిపోతున్న  మంచు ఫలకాలు, పెరుగుతున్న భూతాపం ఈ ఉత్పాతానికి ప్రధాన కారణాలు. కనువిందు చేసే ప్రకృతి కన్నెర్ర చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఉత్తరాఖండ్‌ ‌విలయమే తార్కాణం.

మంచుచరియలు విరిగిపడి, వరద ముంచెత్త డానికి గల కారణాలపై ఆయా రంగాల నిపుణులు లోతుగా అధ్యయంనం చేస్తున్నారు. భూతాపం, వాతావరణంలో చోటుచేసుకున్న ‘పశ్చిమ అవాంతరాలు’ (వెస్టరన్‌ ‌డిస్ట్రబెన్స్) ‌కారణమై ఉండవచ్చని కూడా వారు అభిప్రాపడుతున్నారు. వాతావరణ మార్పు వల్ల మంచు కరిగి తాజా విపత్తునకు కారణం అయి ఉండవచ్చని చెబుతున్నారు. మంచు చరియలు విరిగి పడటంపై డీఆర్‌డీవో (డిఫెన్స్ ‌రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) ‌లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. శీతాకాలంలోనూ హిమానీనదాలు కరగడానికి గల కారణాలు తెలియరాలేదు. 500-600 మీటర్ల ఎత్తు నుంచి ఒక హిమానీనద చరియలు విరిగిపడి ఉండవచ్చు. హిమపాతం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు. భూతాపం వల్ల ఈ ప్రాంతం వేడెక్కుతోంది. ఫలితంగా హిమపాతం, వర్షపాతం తీరుతెన్నుల్లోనూ మార్పు వస్తోంది.

రేడియో ధార్మిక పరికరమే కారణమా?

ఆకస్మిక వరదలకు కారణంపై సరికొత్త అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1965లో ఓ హిమానీనదంపై ఉంచిన రేడియో ధార్మిక పరికరం ఇందుకు కారణం అయి ఉండవచ్చని దిగ్గజ పర్వతా రోహకుడు కెప్టెన్‌ ఎం.ఎస్‌. ‌కోహ్లీ చెబుతున్నారు. 1964లో చైనా జిన్‌ ‌జియాంగ్‌ ‌ప్రావిన్సులో అణుబాంబును ప్రయోగించింది. దీంతో ఉలిక్కిపడిన పశ్చిమ దేశాలు చైనా అణు పరీక్షలను పసిగట్టడానికి వీలుగా 1965లో అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ- సెంట్రల్‌ ఇం‌టలిజెన్స్ ఆఫ్‌ అమెరికా), భారత ఇంటలిజెన్స్ ‌బ్యూరో, స్పెషల్‌ ‌ఫ్రాంటియర్‌ ‌ఫోర్సుతో కూడిన బృందం నందాదేవి హిమానీ నదంపై ఒక రేడియో ధార్మిక పరికరాన్ని అమర్చింది. తరువాత రోజుల్లో దాని ఆచూకీ గల్లంతైంది. నాడు ఈ పరికరాన్ని ఉంచిన బృందంలో కోహ్లీ కూడా ఒకరు. తాజా ఘటనకు ఈ రేడియో ధార్మిక పరికరం కారణం అయి ఉండవచ్చని ఆయన చెబుతున్నారు. ‘25 అడుగుల ఎత్తులో ఉన్న నందాదేవి శిఖరానికి ఈ పరికరాన్ని తీసుకెళుతుండగా వాతావరణం ప్రమాదకరంగా మారడంతో మేం ముందడుగు వేయలేకపోయాం. అదే సమయంలో పరికరాన్ని కిందకు తీసుకువచ్చే పరిస్థితీ లేదు. దీంతో చివరకు ఒక గుంత తవ్వి ఆ పరికరాన్ని అక్కడ ఉంచాం. 1966లో మళ్లీ అక్కడకు వెళ్లి చూడగా ఆ పరికరంలోని అణుశక్తి జనరేటర్‌ ‌సాధనం గల్లంతైంది. యాంటెన్నా ఇతర భాగాలు మాత్రమే ఉన్నాయి. చాలా వేడిగా ఉండే ఆ అణుశక్తి జనరేటర్‌ ‌హిమానీనద మంచును కరిగించుకుంటూ కిందికి జారిపోయి ఉండవచ్చని, దాని ఫలితమే ప్రస్తుత ఉత్పాతమని కోహ్లీ విశ్లేషిస్తున్నారు. వానాకాలంలో కొండ చరియలు విరిగి పడటం సహజం. ఈ ఏడాది వానలు తక్కువగా ఉండటంతో ఎండ వేడిమి ఎక్కువగా ఉంది. దీంతో అనూహ్యంగా మంచు కరిగింది. ఫలితంగా ఉన్నపళంగా రెండు వేల మీటర్ల ఎత్తు నుంచి మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇంత ఎత్తు నుంచి పడటం అరుదైన విషయం.

ఎవరికీ పట్టని హెచ్చరికలు, తీర్పులు

 ప్రకృతి మనిషి అవసరాలను తీర్చగలదు. కొన్ని ఆశలనూ తీర్చగలదు. కానీ మనిషి దురాశను మాత్రం తీర్చలేదు. ఈ విషయాన్ని  జాతిపిత మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. ఈ వాస్తవాన్ని విస్మరించడంతో అనేక దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. మనిషి దురాశ కారణంగా రోజురోజుకూ పెద్ద సంఖ్యలో పచ్చనిచెట్లు నేలకూలుతున్నాయి. పర్యావరణం ప్రమాదకరంగా మారుతోంది. నీటి వనరులు నిర్వీర్యమవుతున్నాయి. జంతుజాలానికి ఆహార వనరులు కొరవడుతున్నాయి. దీంతో అవి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇప్పుడు ఒక్క ఉత్తరాఖండ్‌లోనే కాక యావత్‌ ‌ప్రపంచంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లో కేవలం ఒక్క అలకనంద నదిపైనే దాదాపుగా 60 జలవిద్యుత్‌ ‌కేంద్రాల నిర్మాణం వల్ల నదీలోయ ప్రాంతంలో జీవావరణ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని పదేళ్ల క్రితమే ‘కాగ్‌’ (‌కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌) ‌నివేదిక హెచ్చరించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫలితంగా 2013లో వరదలు విలయ తాండవం చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సముద్ర మట్టానికి రెండువేల మీటర్ల ఎత్తున జల విద్యుత్‌ ‌ప్రాజెక్టు నిర్మాణం ప్రమాదకరమని హెచ్చరించింది. ఆ ప్రాతిపదికన ప్రతిపాదించిన 23 ప్రాజెక్టులను రద్దు చేయాలని సూచించింది. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద సొరంగాల తవ్వకం, వాటి ద్వారా వచ్చే మట్టిని నదుల్లో గుమ్మ రించడం, ఏకంగా నదీ ప్రవాహాల గమనాన్ని మళ్లించడం, పచ్చని చెట్ల నరికివేత వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలు తరువాత కాలంలో అనుభవ పూర్వకంగా తెలిసివచ్చాయి. ఇక పేలుడు పదార్థాలు వాడి కొండలను పిండి చేయడం, తొలిచేయడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలియనివి కావు. 2013 జూన్‌ ‌నాటి వరదలే ఇందుకు తార్కాణం. ఈ వరదల్లో దాదాపు 5,700 మంది విగత జీవులయ్యారు. వరదల ధాటికి చార్‌థామ్‌ ‌యాత్రే మార్గంలో మూడు లక్షల యాత్రికులు చిక్కుకు పోయారు. వంతెనలు, రహదారులు ధ్వంస మయ్యాయి. పవిత్ర కేదార్‌నాథ్‌ ఆలయాన్ని బండరాళ్లు, బురద కొంతవరకు దెబ్బతీశాయి. పర్యావరణ పరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతాల్లో మానవ జోక్యం పెరగడం వాతావరణ మార్పులకు కారణం అవుతోంది. వాతావరణ మార్పులు, భూతాపం నానాటికీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పౌరీ, తెహ్రీ, రుదప్రయాగ్‌, ‌హరిద్వార్‌, ‌డెహ్రాడూన్‌ ‌తదితర జిల్లాలకు భవిష్యత్తులో ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటి పరిష్కారం?

రుషిగంగ ప్రాజెక్టు వద్దని ఏనాడో చెప్పానని బీజేపీ నాయకురాలు, సాధ్వి ఉమాభారతి ప్రమాదం జరిగిన వెంటనే వ్యాఖ్యానించడాన్ని ఎవరూ తప్పు పట్టనక్కరలేదు. పశ్చిమ దేశాల అభివృద్ధి నమూనా, మన దేశానికి సరిపడకపోవచ్చు. అసలు అభివృద్ధి, అందులో స్థానికులకు ఒనగూడే ప్రయోజనాల మీద స్పష్టమైన విధానం ఉండి తీరాలి. ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూనే పర్యావరణం, నదులు, ప్రకృతికి సంబంధించి మనవైన తాత్త్విక భావనలు ఏం చెబుతున్నాయో ఆలకించి తీరాలి. ప్రకృతిని దోచుకోవడమే లక్ష్యంగా ప్రగతి పథం ఉండకూడదు. ప్రకృతిని ధ్వంసం చేసి సాధించే పురోగతి కూడా దేశానికి అనవసరం. ప్రణాళికా బద్ధంగా కొన్ని దీర్ఘకాలిక చర్యలు చేపట్టడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ముఖ్యంగా గ్రీన్‌ ‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించాలి. సంప్రదాయ జల, థర్మల్‌ ‌విద్యుత్‌ ‌బదులు పవన, సౌర వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడటం అవసరం. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని బాగా విస్తరించాలి. మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలి. 2005 నాటి స్థాయితో పోలిస్తే గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయు ఉద్గారాలను 35 శాతం తగ్గించుకునేలా కసరత్తు చేయాలి. హిమాలయ ప్రాంతాల్లో సంప్రదాయ కలప, రాతి నిర్మాణాలను తగ్గించాలి. దీనికి బదులు పర్యావరణానికి హాని కలిగించని ఇతర పద్ధతులను అన్వేషించాలి. 2004 సునామీ తరువాత ముందస్తు సునామీ హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటైంది. అదేవిధంగా హిమాలయాల ప్రాంతంలో సంభవించే విపత్తులను పసిగట్టేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిలాజ ఇంధనాలు, వంట చెరకు వాడకం ద్వారా ఆసియా దేశాలు భారీగా పొగ, మసి వదిలి పెడుతున్నాయి. దీనిని నివారించాలి.

ఇక విపత్తు వేళ పోలీసులు, సైనిక బలగాల సేవలు ప్రశంసనీయం. స్థానిక పోలీసులతోపాటు, దగ్గర్లో సరిహద్దుల వద్ద గల ఐటీబీపీ పోలీసుల సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. జవాన్లు తమను కాపాడటం ద్వారా తమకు మరో జన్మనిచ్చారని బాధితులు పేర్కొనడం ఇందుకు నిదర్శనం. పెద్ద శబ్దం, కేకలు వినపడటంతో సమీపంలోని జోషీమఠ్‌ ‌వద్ద గల ఐటీబీపీ జవాన్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. తాళ్లు, కర్రలు, కొండలు ఎక్కి దిగేందుకు ఉపయోగించే పరికరాలతో వారు వెనువెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బురదలో కూరుకుపోయిన జనాన్ని కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నాలు కొంతవరకు విజయ వంతమయ్యాయి. దీంతో కొంతమందిని కాపాడగలి గారు. ఈ సందర్భంగా జవాన్లు తమకు కొత్త జీవితాన్ని అందించారంటూ బాధితులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఐటీబీపీ పోలీసులతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (‌నేషనల్‌ ‌డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్సు) సిబ్బంది, సైనికులు సమన్వయంతో వ్యవహరించడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. వరదలు వచ్చినప్పటి నుంచి 45 ఏళ్ల ఐటీబీపీ డీఐజీ అపర్ణా కుమార్‌ ‌తపోవన్‌లోనే మకాం వేసి పనులను పర్యవేక్షించారు. ఆమె స్వస్థలం కర్ణాటక. 2002 యూపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. డిప్యూటేషన్‌పై 2018లో ఐటీబీపీ డీఐజీగా వచ్చారు. 2019లో అంటార్కిటికా ఖండానికి వెళ్లి దక్షిణ ధృవాన్ని అధిరోహించారు. మంచు పర్వతాల్లో యుద్ధాలపై ప్రత్యేక శిక్షణ పొందారు. ఏడు ఖండాల్లోని పర్వాతాలను అధిరోహించినందుకు ఆమె రాష్ట్రపతి రామనాథ్‌ ‌కొవింద్‌ ‌నుంచి అవార్డును పొందారు. ఉత్తరాఖండ్‌ ‌ఘటనల నుంచి కేవలం ఆ రాష్ట్రమే కాక యావత్‌ ‌దేశం పాఠాలను నేర్చుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా కొండ, పర్వత ప్రాంతాలు గల రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ‌కొన్ని ఈశాన్య రాష్ట్రాలు తమ అనుభవాలతో కార్యాచరణ రూపొందించుకోవాలి. నష్ట పరిహారాలు, బాధితులకు సహాయం వంటి తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇది ఏ ఒక్క రాష్ట్రప్రభుత్వ పని కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రంగాల నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలసికట్టుగా, సమన్వయంతో ముందుకు సాగాలి. నిపుణుల సలహాలు, సూచనలను తు.చ. తప్పకుండా పాటించాలి. ప్రణాళికల అమలుకు తగినన్ని నిధులు కేటాయించాలి. అప్పుడే పర్యావరణాన్ని కాపాడుకో గలం. విపత్తుల నుంచి ఉపశమనం పొందగలం. అమాయక ప్రజల మరణాలను ఆపగలం. పుడమి ప్రశాంతంగా ఉంటే ప్రజల జీవితాలూ ప్రశాంతంగా సాగగలవు. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

– ‌గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram