– ఎస్‌. ‌గురుమూర్తి

కొవిడ్‌ ‌సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచ స్థూల ఉత్పత్తి 2020లో 3.5శాతం పడిపోయింది. కొవిడ్‌ ‌ముందు పరిస్థితితో పోలిస్తే వస్తువుల కొనుగోళ్లు అమెరికాలో 20శాతం, జర్మనీలో 97శాతం పడిపోయాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రపంచ పర్యాటక రంగం 2025 నాటికిగానీ మళ్లీ మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదు. పాశ్చాత్యదేశాలు కొవిడ్‌ ‌ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడలేదు.

భారత్‌ ‌వైపు చూస్తున్న ప్రపంచం

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (×వీఖీ) వివిధ దేశాల అభివృద్ధి సూచీలను అంచనా వేసింది. భారత్‌ (11.5‌శాతం), చైనా(8.2శాతం), అమెరికా (5.1శాతం) అభివృద్ధే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకునేట్లు చేస్తుందని పేర్కొంది. భారత ఆర్థిక సర్వే ప్రకారం దేశం 14 ఆపైన సాధారణ వృద్ధి రేటును, 11శాతం యథార్థ వృద్ధి రేటు సాధి స్తుంది. కొవిడ్‌ ‌సవాలును సమర్థంగా ఎదుర్కొనడమే కాక భారత్‌ ‌సొంతంగా వ్యాక్సిన్‌లు తయారుచేసి వాటి ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించే స్థితిని చేరుకుంది. ఇప్పటివరకు చైనా ఆధిపత్యం వహించిన ప్రపంచ వస్తు పంపిణీ వ్యవస్థలో భారత్‌కు చోటివ్వడానికి ప్రపంచ దేశాలు సిద్ధపడుతున్నాయి. భారత్‌ ‌కొత్త భౌగోళిక రాజకీయ హోదాను పొందాలని దేశాలన్నీ భావిస్తున్నాయి. ఇలాంటి భారత్‌ అభివృద్ధిని సాధిస్తే మహమ్మారి పరిస్థితుల నుంచి కోలుకోవడమేకాక, ప్రపంచం కూడా కోలుకునేందుకు దోహదం చేస్తుంది. ఇప్పుడు తడబడితే అపారమైన పెట్టుబడులు వృధా కావడమేకాక ప్రపంచానికి నిరాశ ఎదురవుతుంది.

ప్రాథమిక అంశాలు

బడ్జెట్‌లో అంతా బాగానే ఉన్నా, బయటి నుండి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే భారత ఆర్థిక వ్యవస్థ అనుసరించే ప్రాథమిక అంశాలు పాశ్చాత్య అంశాల కంటే భిన్నమైనవి. భారత్‌లో కుటుంబానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటే పాశ్చాత్య ప్రపంచంలో వ్యక్తులకే ప్రాధాన్యం. ఈ ముఖ్యమైన తేడా వల్ల వ్యయం, పెట్టుబడి, పొదుపు వంటి విషయాలు కూడా మారిపోతాయి.

ఆంగ్లో-సాక్సన్‌ ఆర్థిక వ్యవస్థల్లో పొదుపు అంటే- షేర్‌ ‌మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టడమే. కానీ భారత్‌లో షేర్‌ ‌మార్కెట్‌ ‌వైపు చాలా తక్కువమంది చూస్తారు. సురక్షితమైన, భద్రమైన పెట్టుబడులకే భారతీయ కుటుంబాలు ప్రాధాన్యమిస్తాయి. ఎందు కంటే కుటుంబం ద్వారా పెద్దల సంరక్షణ, నిరుద్యో గుల పోషణ వంటివి నిర్వహించవలసి వస్తుంది. ఇతర దేశాల్లో ఈ భారాన్ని ప్రభుత్వాలే వహిస్తాయి. అందుకనే అక్కడ వ్యక్తులకు షేర్‌ ‌మార్కెట్‌ ‌వంటి ప్రమాద భూయిష్టమైన రంగంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి, ఆడంబరంగా ఖర్చు పెట్టడానికి వీలు కలుగుతుంది. సంప్రదాయ భారతీయ కుటుంబాలు చేసే పొదుపు చాలా ఎక్కువ. అది జాతీయ పొదుపు మొత్తంలో ఐదు వంతులు ఉంటుంది.

ఈ పొదుపు చేసే పద్ధతులు కూడా చాలా సురక్షితమైనవి. భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) తాజా లెక్కల ప్రకారం పొదుపు మొత్తాల్లో బ్యాంకు డిపాజిట్లు 51.5శాతం ఉంటే, ప్రావిడెంట్‌ ‌ఫండ్‌, ‌పెన్షన్‌ ‌ఫండ్‌లు 26.2శాతం, బీమా 17.14శాతం, సురక్షితమైన పెట్టుబడులు 94.8శాతం ఉన్నాయి. ఇక ప్రమాదభయం కలిగిన షేర్‌ ‌మార్కెట్‌ ‌పెట్టు బడులు 5.2శాతం మాత్రమే. కోటి 80 లక్షల మంది భారతీయులు మాత్రమే షేర్‌ ‌మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. అదే అమెరికాలో వీరి సంఖ్య 55శాతం ఉంటుంది. దీనికి కారణం ఏమిటి? అమెరికాలో ప్రభుత్వం ఉచితంగా అందించే జీవన భద్రత సదుపాయాల వల్ల ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమకు కావలసిన పద్ధతిలో ఖర్చు పెట్టు కునేందుకు, షేర్‌ ‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు వీలు కలుగుతోంది. కానీ అక్కడ జనాభా తక్కువ కాబట్టి ప్రభుత్వం అలాంటి సదుపాయాలు ఉచితంగా అందించగలుగుతోంది. జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడానికి కూడా వీలులేదు. అలా చేస్తే దివాళా తీయడం తప్ప మరొకటి జరగదు.

సెన్సెక్స్, ‌నిఫ్టీలలో అధిక వృద్ధి ప్రపంచంలో ఖర్చుపెట్టే పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. భారత్‌లో పొదుపు మొత్తం బ్యాంకులకే చేరుతోంది కాబట్టి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బ్యాంకులపై ఎక్కువ ఆధారపడింది. ప్రజలను షేర్‌ ‌మార్కెట్‌ ‌వైపు తరలించాలన్న 1990ల నాటి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. సంప్రదాయ కుటుంబ విలువలు ఇక్కడ ఉన్నంతకాలం భారత్‌ ఆర్థికవ్యవస్థ బ్యాంకుల ఆధారంగానే నడు స్తుంది. అలాగే బ్యాంకులపై ఆధారపడిన అలాంటి వ్యవస్థ వల్ల నష్టం ఏమీలేదు. అదేమీ అవమానకరమైన విషయం కాదు కూడా. ఆర్థిక వెనుకబాటుతనం అంతకంటేకాదు. 2008కి ముందు అమెరికా ఈ విషయం లోనే జపాన్‌ను తరచూ హేళన చేస్తూ ఉండేది. భారతీయుల మాదిరిగానే జపాన్‌ ‌ప్రజలు కూడా తమ పొదుపు మొత్తంలో 10శాతం కంటే తక్కువ షేర్‌ ‌మార్కెట్‌లలో పెట్టుబడి పెడతారు. జర్మనీలో ప్రతి ఏడుగురిలో ఒక్కరు మాత్రమే షేర్‌ ‌మార్కెట్‌ ‌వైపు చూస్తారు.

రఘురాం రాజన్‌ ఆగస్ట్ 2012 ‌నుంచి సెప్టెంబర్‌ 2013 ‌వరకు యుపియే 2 ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా, సెప్టెంబర్‌ 2013 ‌నుంచి సెప్టెంబర్‌ 2016 ‌వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. గవర్నర్‌గా నిరర్ధక ఆస్తుల (చీ)ను మోదీ ప్రభుత్వపు మొదటి హయాం నెత్తిన రుద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. నిజానికి 2006-08 మధ్య కాలంలో బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన మొండిబాకీల సమస్యకు యూపీయే ప్రభుత్వమే కారణమని స్వయంగా చెప్పారు (the print. in 11.9.2018)

రుణ పథకాలను తరచూ సవరించడం ద్వారా నిరర్ధక ఆస్తుల సమస్యను పరిష్కరించాలన్న ప్రయత్నం తన హయాంలోనే జరిగిందన్న సంగతి రాజన్‌ ‌నిరాకరించలేరు. 2012 నుంచి 2016 వరకు సాగిన ఈ ప్రయత్నానికి ఆయన ఆమోదముద్ర వేశారు. యూపీ•యే2 సలహాదారుగా ఉన్న రాజన్‌ 2012- 13 ఆర్ధిక సర్వేను రూపొందిస్తూ ‘కొన్ని రంగాలు’ నిరర్ధక ఆస్తుల సమస్యను ఎదుర్కొనడానికి కారణం ఆర్థిక గతి సన్నగిల్లడమని, నిరర్ధక ఆస్తులు పెరగడం సాంకేతికపరమైన అంశమని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పుంజుకుంటే నిరర్ధక ఆస్తుల సమస్య తీరుతుంది అని అన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంవత్సరానికే సెప్టెంబర్‌ 15, 2014‌న జరిగిన ఫికి, బ్యాంకర్స్ అసోసియేషన్‌ ‌సమావేశంలో ఆయన ‘నిరర్ధక ఆస్తులు పెరిగాయి’ అని ప్రకటించారు. సెప్టెంబర్‌ 2014‌లో విడుదల చేసిన ఆర్‌బీఐ నివేదికలో ‘అభివృద్ధి తగ్గుముఖం పట్టడం వల్ల నిరర్ధక ఆస్తులు పెరిగాయి. కానీ వాటి వృద్ధిని అరికట్టగలిగాం’ అంటూ ప్రకటించారు. అయితే ‘సమస్య పూర్తిగా మటుమాయం కాలేదు’ అని తగిన జాగ్రత్త వహించాలని హెచ్చరించారు కూడా. ఆగస్ట్ 2015 ఆర్‌బీఐ నివేదికలో కూడా నిరర్ధక ఆస్తుల గురించి ప్రస్తావించిన రాజన్‌ 2010‌లో 2.2శాతం ఉంటే 2015నాటికి 4.7 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఈ వివరాలు చాలు, నిరర్ధక ఆస్తుల సంగతి తెలియడానికి.

2008కు ముందునుంచే నిరర్ధక ఆస్తుల గురించి తెలిసిన రాజన్‌ 2012‌లో యూపీ•యే ప్రధాన ఆర్థిక సలహాదారుగా, 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాతగాని ఎప్పుడు ప్రస్తావించలేదు. సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టలేదు. ఒక పక్క నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నా దేశ ఆర్ధికాభివృద్ధి బాగా సాగింది. 2013-14లో 6శాతం ఉన్న స్థూల జాతీయోత్పత్తి 2014-15కు 8శాతం, 2015-16 కి 8.2శాతం పెరిగింది. అయిన 2016 మధ్యలో హఠాత్తుగా నిరర్ధక ఆస్తులపై దృష్టి సారించిన రాజన్‌ ‌వాటి లెక్క తేల్చాల్సిందే నంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీచేశారు. దీనితో అటు బ్యాంకింగ్‌ ‌రంగం, ఇటు మొత్తంగా ఆర్ధిక వ్యవస్థ గందరగోళంలో, నిరాశలో పడ్డాయి.

2016లో నిరర్ధక ఆస్తులపై వేటు – కూలిన జీడీపీ

నిరర్ధక ఆస్తుల లెక్క తేల్చాలన్న రాజన్‌ ఆదేశాలతో 2014-15లో 5శాతం ఉన్న ఈ ఆస్తులు 2015-16కు 9.3శాతం, 2016-17కు 11.7శాతం, 2017-18కి 14.6శాతానికి చేరాయి. ఈ లెక్కల మూలంగా ఆర్థిక వ్యవస్థపై అందరూ ఊహించినట్లుగానే ప్రతికూల ప్రభావం పడింది. బ్యాంకుల మూలధనం తరిగిపోయి అవి సంక్షోభంలో పడ్డాయి. ఇది ప్రభుత్వపు ఆర్థికబలాన్ని దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

పారిశ్రామిక రంగానికి రుణ సదుపాయం తగ్గిపోయింది. అది నవంబర్‌ 2020‌లో అయిదేళ్ల నాటి తక్కువ స్థాయికి పడిపోయింది. అలాగే సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రుణాలు అయిదేళ్లనాటి కంటే దిగువకు పడిపోయాయి. స్థూల జాతీయోత్పత్తి (GDP) 2013-14లో 6శాతం నుంచి 2015-16కు అత్యధికంగా 8.2శాతం, 2016-17కు 7.2శాతానికి చేరుకుని 2019-20కి ఏకంగా 5శాతానికి పడిపోయింది. 2014-15, 2016-17 మధ్యలో ఏం జరిగిందో దీనితో పోల్చి చూడండి. 2006-08నాటి నిరర్ధక ఆస్తులు 2016లో కూడా ఉన్నాయి. కానీ రుణ మంజూరులో తేడాలు లేకపోవడంలో అభివృద్ధి కొనసాగింది. కానీ ఎప్పుడైతే రాజన్‌ ‌రుణమంజూరుపై ఆంక్షలు విధించారో అప్పుడు ఆర్థికాభివృద్ధి తీవ్రంగా కుంటుబడింది.

అదే పునరావృతమవుతుందా?

ఆర్‌బీఐ తాజా అంచనా ప్రకారం 13.5శాతం ఉన్న నిరర్ధక ఆస్తులు 2021 సెప్టంబర్‌ ‌నాటికి 14.8శాతానికి చేరుతాయి. అంటే 2017-18 నాటి స్థితి (14.6శాతం) అన్నమాట. అయితే 2016లో రాజన్‌ ‌చేసినట్లు ఇప్పుడు కూడా నిరర్ధక ఆస్తులపై కొరడా ఝుళిపిస్తారా అన్నదే ప్రశ్న. అదే జరిగితే 2021 కలల బడ్జెట్‌ను రూపొందించాలన్న ప్రభుత్వం ఆశలు నెరవేరవు. అలాగే బ్యాంకులు నిరర్ధక ఆస్తులను తగ్గించుకునేందుకు సవరణలు చేసుకోవడం తప్పనిసరి కావడంతో వాటి మూలధనం మరింత తగ్గిపోతుంది. దీంతో బ్యాంకులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం మళ్లీ ఆర్థిక ఆసరా ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి 2016 నాటి కఠిన చర్యలు పునరావృతమైతే అవి బడ్జెట్‌ను, ఆర్థిక వ్యవస్థను ముంచడం ఖాయం.

2016లో రాజన్‌ ‌బ్యాంకులపై నిరర్ధక ఆస్తుల విషయంలో కొరడా ఝుళిపించిన నాటికి వాటి దగ్గర అదనపు నిధులు ఏవి లేవు. కానీ పెద్ద నోట్ల రద్దు  (demonitisation) మూలంగా ఇప్పుడు బ్యాంకులకు అదనపు నిధులు చేకూరాయి. ఇటీవల కాలంలో రుణాలు తీసుకునేవారు లేక బ్యాంకుల వద్ద జనవరి 2021నాటికి అదనంగా 6.72 లక్షల కోట్ల ధనం పేరుకుపోయింది. దీనిని బ్యాంకులు 3.35శాతం వడ్డీకి ఆర్‌బీఐ వద్ద దాచాయి. రుణాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నది రాజుగారి ‘దేవతా వస్త్రాల’ మాట వంటిది. నిజానికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రుణాలు తీసుకునేందుకు అనర్హులు, పన్ను ఎగవేతదారులు అని ప్రకటించడంతో ఆయా పరిశ్రమలు రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల రుణాలు తీసుకునేవారు లేకుండాపోయారు.

బ్యాంకులు రాత్రికిరాత్రి నిధులు సృష్టించగలవు కానీ, రుణ గ్రహీతలను మాత్రం తయారుచేయలేవు. నిజానికి రుణగ్రహీతలే బ్యాంకుల ఆస్తి. వాళ్లు లేకపోతే బ్యాంకులు రుణాలు ఎవరికిస్తాయి? అలాగే తమ నిధులను 3.35శాతం అతి తక్కువ వడ్డీకి ఎంత కాలం అవి ఆర్‌బీఐ దగ్గర పెట్టుకోగలవు? రుణాలు ఇచ్చి వాటిపై వచ్చే వడ్డీల పైనే బ్యాంకులు లాభాలు గడిస్తాయి. రుణాలు ఇవ్వకపోతే వాటికి లాభాలు ఉండవు. యూపీ•యే హయాంలో విచక్షణారహితంగా రుణాలు ఇచ్చేసి సంక్షోభంలో పడ్డ బ్యాంకులు ఇప్పుడు రుణాలు అసలు ఇవ్వకుండా మరో సమస్యలో పడుతు న్నాయి. ఒకపక్క కొవిడ్‌ ‌సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ఆర్‌బీఐ బ్యాంకులన్నింటికి ప్రోత్సాహక నిధులను అందిస్తుంటే మరోపక్క రుణాలు ఇవ్వకపోవడంవల్ల పేరుకుపోయిన నిధులను బ్యాంకులు తిరిగి అదే ఆర్‌బీఐలో దాచుకుంటున్నాయి.

జపాన్‌ అనుభవం నుంచి నేర్చుకోవాలి

ఇక్కడ జపాన్‌ అనుభవం భారత్‌కు బాగా ఉపయోగపడుతుంది. 1990వ దశకంలో జపాన్‌ ‌బ్యాంకులు నిరర్ధక ఆస్తుల కోసం మూలధనాన్ని వెచ్చించాయి. దాని వల్ల ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రతికూల ప్రభావం మూలంగా జపాన్‌ ‌ప్రభుత్వానికి ట్రిలియన్‌ ‌డాలర్ల నష్టం వచ్చింది. జపాన్‌ ‌కూడా మనం అమలు చేసిన దివాళా చట్టం వంటిదే తెచ్చింది. జపాన్‌ ‌విధానంపై అధ్యయనం చేసిన రికార్డో కూ మసాయ ససకి నిరర్ధక ఆస్తులను తొలగించడం కోసం అత్యవసర చర్యలు చేపట్టవలసిన అవసరం లేదని, కేవలం దీర్ఘకాల ప్రాతిపదికపైనే వాటిని తొలగించుకునేందుకు బ్యాంకులకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కాబట్టి నిరర్ధక ఆస్తులను తొలగించుకునేందుకు బ్యాంకులకు సమయం ఇవ్వాలని జపాన్‌ అనుభవం ద్వారా మనకు తెలుస్తోంది. అంతేకానీ త్వరపడి రుణ మంజూరుపై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు.

వ్యాసకర్త : ప్రఖ్యాత కాలమిస్ట్

అను : కేశవనాథ్‌

About Author

By editor

Twitter
Instagram