సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ శార్వరి పుష్య శుద్ద ద్వాదశి – 25 జనవరి 2021, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


సాంఘిక, సాహిత్య, రాజకీయరంగాలలో తెలుగువారిని వంగదేశీయులు ప్రభావితం చేయడం చరిత్ర. జాతీయవాదానికి బెంగాల్‌ ‌కొత్త ఊపును ఇచ్చింది. 1905 నాటి బెంగాల్‌ ‌విభజన, ఆ విభజన ప్రాతిపదికగా వంగదేశం చీలిపోవడం చరిత్ర. ఆ పరిణామాలు మిగిల్చిన చేదును ఇప్పటికీ దేశం మొత్తం అనుభవిస్తున్నది. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణం ముస్లిం మతోన్మాదుల వేర్పాటువాద ధోరణి. నోరు విప్పితే బెంగాల్‌ ‌ఘనతను చాటుతూ కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్‌ ‌చేయడానికి చూస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ చరిత్ర పాఠాలను, అలనాటి బెంగాలీ మహనీయుల స్ఫూర్తిని ఘోరంగా అవమానిస్తున్నారు. కేవలం పదవి కోసం మమతా మొండిగా, మూర్ఖంగా వేస్తున్న అడుగుల నిండా ఇదే కనిపిస్తున్నది. తాజా పశ్చిమ బంగ రాజకీయ పరిణామాలు అదే సూచిస్తున్నాయి.

రాజకీయాల్లో మతశక్తులను బుజ్జగిస్తే వాటిల్లే ముప్పును దేశ విభజన తరువాత కూడా కాంగ్రెస్‌ ‌గ్రహించలేదు. ముస్లిం ఓటు బ్యాంకును సొంతం చేసుకోడానికి కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ ‌కన్నా రెండాకులు ఎక్కువే చదివారన్న కీర్తి సంపాందించుకున్నారు. వీరంతా ముస్లిం మతశక్తులను భుజాన మోస్తూ, హిందూ జాతీయ చైతన్యాన్ని మతోన్మాదంగా దూషించేవారు. పశ్చిమ బంగలో పట్టు సాధించి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి అదే వ్యూహంతో ఎదిగారు. 294 శాసనసభా స్థానాలున్న పశ్చిమ బంగలో సుమారు 70 నుండి 90 స్థానాల్లో  గెలుపోటముల నిర్ణాయక శక్తిగా ముస్లింలు ఉన్నారు. మొత్తం ఓటర్లలో సుమారు 30శాతం వరకు ముస్లిల ఓట్లున్న పశ్చిమ బంగలో అధికారం అందుకోడానికి ముస్లిం సంతుష్టీకరణే శరణ్యమనే అంచనాతో మమతా బెనర్జీ రాజకీయాలు సాగాయి.

అధికారమే లక్ష్యంగా సాగించిన రాజకీయ ప్రస్థానంలో ముస్లిం సంతుష్టీకరణ విషయమై పశ్చిమ బంగలో మమత కాంగ్రెస్‌ ‌కమ్యూనిస్టులను మించిపోయారు. ముస్లింలో బంగ్లాదేశీ చొరబాటుదారులు సైతం ఆమెకు బంధువులుగానే కనిపిస్తున్నారు. ఆ విషయం దాచుకోకుండా బంగ్లా దేశీయులు నాకు సోదర సమానులు అనే వరకు వెళ్లారామె. చొరబాట్లను ప్రోత్సహించడమే కాక గ్రామ, మండల స్థాయి నాయకత్వాన్ని చొరబాటు దార్లకూ, వారి సంతానానికీ ఆమె అప్పగించారు. ఇమామ్‌లకు నెలవారీ జీతాలు, మసీదులకు నిధులు ఇప్పించారు. రాజకీయ అధికారంతో దీదీ అదించిన ప్రోత్సాహాన్ని ఇంతకాలంగా అనుభవిస్తూ వచ్చిన ముస్లిం మత పెద్దల దృష్టి రాజకీయ అధికారం మీద పడ్డది. ఇప్పుడు ఆమెతో రాజకీయ బేరసారాలకు దిగే స్థాయికి ఎదిగారు. ఇన్నాళ్లుగా ఆమె అనుసరించిన ముస్లిం సంతుష్టీకరణతో విసిగిన హిందువులు బీజేపీ వైపు చూడ్డంతో పశ్చిమ బంగలో నానాటికి ఈ పార్టీ బలం పెరుగుతోంది. ఓ వైపు హిందువుల ఓట్లు బీజేపీ  సొంతం అవుతున్నాయి. గంపగుత్తగా తనకే అనుకున్న ముస్లిం ఓట్లలో గండిపడే సూచనలు స్పష్టమైపోయాయి. దీదీ కలవరమంతా ఇందుకే.

పశ్చిమ బంగ ముస్లింలు ప్రధానంగా రెండు సంస్థల ప్రభావంలో ఉంటారు. కలకత్తా దాని చుట్టు ప్రక్కల జిల్లాల్లో గల ముస్లింలపై జమాతే ఇస్లామియా హిద్‌కు పట్టున్నది. దక్షిణ బెంగాల్‌ ‌ముస్లింలు చాలావరకు ఫుర్‌ఫురా మసీదు ప్రభావంలో, ఆ మసీదు నిర్వాహకుడు పీర్జాదా అబ్బాస్‌ ‌సిద్ధిఖీ అదుపాజ్ఞలలో ఉంటారు. 40,50 అంసెబ్లీ స్థానాల్లో ముస్లింలకు ఆయన మాటే శాసనం. ఆయనే ఇప్పుడు దీదీతో బెదిరింపు రాజకీయ బేరం ప్రారంభించారు. తాను ఏర్పాటు చేయబోయే పార్టీకి కనీసం 44 స్థానాలు కేటాయిస్తేనే మిగిలిన చోట్ల  మద్దతిస్తా, కాదంటే మీతో తెగతెంపులు చేసుకుంటా అనేది ఆయన బేరం. తన రాజకీయ మనుగడకు భస్మాసురుడిలా దాపురించిన పీర్జాదాను ఎలాగోలా ఏమార్చాలని అనుకుంటున్న మమతకు మరో ప్రమాదం దాపురిస్తోంది. బిహార్‌లో నాలుగైదు స్థానాలు గెలుచుకున్న యంఐయం దృష్టి పశ్చిమ బంగ మీద పడ్డది. మజ్లిస్‌ ‌నేత ఒవైసీ ఇటీవలే ఆకస్మికంగా కలకత్తాలోని ఫుర్‌ఫురా మసీదుకు వెళ్లారు. ఆ ప్రార్ధనా మందిరం సందర్శనానికి వెళ్లినట్లు చెపుతున్న ఆయన అక్కడి మత పెద్ద పీర్జాదా సిద్ధిఖీతో దాదాపు గంటన్నర సమావేశమయ్యారు. పశ్చిమ బంగలో కూడా పోటీ చేస్తామని మజ్లిస్‌ ఇదివరకే ప్రకటించింది. దాంతో పీర్జాదాతో ఒవైసీ సమావేశం ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇరువురు ముస్లిం నేతలు ముస్లిం ఓట్లను ఎగరేసుకుపోతే హిందూ ఓట్లను బీజేపీ కొల్లగొడితే తన గతే కాను అని మమత బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమ బంగలోని 294 స్థానాల్లో సుమారు వంద స్థానాలు వరకు బీజేపీ గెలవవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో పీర్జాదా డిమాండ్లకు తలొగ్గి నలభయి నాలుగు స్థానాలు వారికి అప్పజెప్పి అధికారం దక్కించుంకున్నా తాను వారి చేతిలో కీలుబొమ్మ కాక తప్పదని మమత భయపడుతోంది.

 తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రోత్సహించి మతోన్మాద శక్తులు రాజకీయ శక్తులుగా పరిణమించడానికి తొలుత కాంగ్రెస్‌, ఆపై తెదేపా నేతలు కారకులు కాగా, నేటి తెరాస ఆ శక్తులను మరింత బలోపేతం చేసింది. అధికారమే లక్ష్యంగా సాగుతున్న రాజకీయాల్లో భస్మాసురుని పోలిన మతశక్తులను ప్రోత్సహిస్తే వాటిల్లే ముప్పును ప్రాంతీయ పార్టీలు గ్రహించడం లేదు. పశ్చిమ బంగలో మమతను వణికిస్తున్న భస్మాసుర పాఠాలను తెలుగు పాలకులు గ్రహించాలి. మతం అనే భస్మాసుర ముప్పు ముంచుకురాకముదే వారు జాగ్రత్త పడతారని ఆశిద్దాం!

About Author

By editor

Twitter
Instagram