అంతర్జాతీయ సమాజంలో వివిధ దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు, విధివిధానాలు ఉంటాయి. వీటినే దౌత్య మర్యాదలు అని వ్యవహరిస్తుంటారు. సాధారణ పార్టీల నాయకులకు ఈ విషయాలు తెలిసినా, తెలియక పోయినా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ ప్రధానమంత్రి, దేశాధ్యక్షులు, విదేశాంగ మంత్రులకు ఈ విషయాలు కచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే పదవి చేపట్టిన తరువాతైనా తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేకపోతే అంతర్జాతీయంగా నవ్వులపాలవుతారు. అంతేకాక అంతిమంగా వారు ప్రాతినిథ్యం వహించే దేశాలు అభాసుపాలవుతాయి.


సంపన్న దేశాల్లో ఒకటిగా అంతర్జాతీయ సమాజం పరిగణించే కెనడా ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం స్వయంగా ఆ దేశ ప్రధానే కావడం ఆందోళన కలిగించే అంశం. 2015లో ప్రధానిగా ఎన్నికైన జస్టిన్‌ ‌పీర్రె జేమ్స్ ‌ట్రుడో చేసిన అనాలోచిత వ్యాఖ్యలే ఈ పరిస్థితికి కారణమని చెప్పకతప్పదు. ఇటీవల కెనడాలో జరిగిన సిక్కుల గురువు గురునానక్‌ 551‌వ జయంతికి హాజరైన జస్టిన్‌ ‌ట్రుడో భారత్‌లో రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ఎవరు చేసే ఉద్యమానికైనా, ఎలాంటి ఉద్యమానికైనా కెనడా మద్దతు ఉంటుందని అంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గత కొంత కాలంగా రైతులు చేస్తున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని జస్టిన్‌ ‌ట్రుడో పై విధంగా స్పందించారు. ఏ విధంగా చూసినా ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక దేశ ప్రధానిగా ప్రజల ఆందోళనలపై ఆయన బాధ్యతాయుతంగా, సంయమనంగా, ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను విస్మరించి ఒక సగటు రాజకీయ నాయకుడి మాదిరిగా స్పందించడం ప్రధాని స్థాయికి తగినది కానేకాదు. దౌత్య మర్యాదలకు, సంప్రదా యాలకు పూర్తిగా విరుద్ధమని ప్రత్యేకంగా చెప్పనక్క ర్లేదు. రైతుల ఉద్యమానికి మద్దతు తెలియజేసేందుకు, వారి పట్ల సానుభూతి చూపేందుకు, ఉదారంగా స్పందించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటన్నింటిని విస్మరించి ఏకపక్షంగా, బహిరంగంగా మాట్లాడటం ద్వారా జస్టిన్‌ ‌ట్రుడో దౌత్య మర్యాదలను పూర్తిగా తుంగలో తొక్కారు.

 కెనడా ప్రధాని వ్యాఖ్యలు ఉభయ దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. నరేంద్రమోదీ నాయకత్వంలోని భారత సర్కారు ట్రుడో వ్యాఖ్యలను తీవ్రంగానే తీసుకుంది. అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఢిల్లీలోని కెనడా హైకమిషనర్‌ ‌నాదిర్‌ ‌పటేల్‌ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరికీ మంచివి కావని, సంయమనం పాటించాలని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ ‌శ్రీవాస్తవ విస్పష్టంగా వ్యాఖ్యానించారు. మున్ముందు కెనడా అధినేత నుంచి సంయమనాన్ని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదన్నది అంతర్జాతీయంగా నెలకొన్న దౌత్య సంప్రదాయం. ఇది అలిఖితమైనప్పటికీ అన్ని దేశాలు పాటిస్తుంటాయి. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే ఆ దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే అవుతుంది. దీనిని ఏ దేశమైనప్పటికీ, ఎంత చిన్న దేశమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. తగిన చర్యలు తీసుకుంటుంది. సంబంధిత దేశాన్ని హెచ్చరిస్తుంది, తన నిరసనను తెలియజేస్తుంది. ఇది కెనడాకు, ఆ దేశ ప్రధాని జస్టిస్‌ ‌ట్రుడోకు తెలియదని అనుకోలేం. కావాలనే, ఉద్దేశ పూర్వకంగానే ఆయన ఇలా వ్యాఖ్యానించారన్న అభిప్రాయం దౌత్య వర్గాల్లో వ్యక్తమవుతోంది.

 జస్టిన్‌ ‌ట్రుడో వ్యాఖ్యల వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కెనడాలో సిక్కులు గణనీయంగా ఉన్నారు. దేశ జనాభాలో వారు దాదాపు రెండు శాతం ఉన్నట్లు అంచనా. ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకు, వారిని తమ ఓటు బ్యాంకుగా మలచుకునే ఉద్దేశంతోనే జస్టిన్‌ ‌ట్రుడో ఈ ప్రతికూల వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం న్యూఢిల్లీ, అట్టావా దౌత్య వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తం 338 మంది హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్‌లో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు అధికార లిబరల్‌ ‌పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. 18 మంది ఎంపీల్లో లిబరల్‌ ‌పార్టీకి చెందినవారు 13 మంది, కన్సర్వేటీవ్‌ ‌పార్టీకి చెందిన నలుగురు ఎంపీలున్నారు. న్యూ డెమొక్రటిక్‌ ‌పార్టీ (ఎన్‌డీపీ)కి చెందిన ఒక ఎంపీ ఉన్నారు. వీరిలో పదిమంది ఒంటారియో, నలుగురు బ్రిటీష్‌ ‌కొలంబియా నుంచి అల్‌ ‌బెర్టా నుంచి ఒకరు, క్యూబెక్‌ ‌నుంచి ఒకరు ఎన్నికయ్యారు. కెనడా మంత్రివర్గంలో నలుగురు భారతీయ మూలాలున్న నాయకులు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిలో హరిజిత్‌ ‌సజ్జన్‌, ‌నవదీప్‌ ‌బెయిన్స్, ‌బార్డిష్‌ ‌ఛగ్గర్‌ ‌సిక్కు మతస్తులే కావడం విశేషం. మరో మంత్రి అనితా ఆనంద్‌ ‌హిందూ మతానికి చెందినవారు. వీరిలో హిరిజత్‌ ‌సజ్జన్‌ అత్యంత కీలకమైన రక్షణ మంత్రిగా పనిచేస్తున్నారు. 2015 నాటి జస్టిన్‌ ‌ట్రుడో తొలి మంత్రివర్గంలోనూ నలుగురు సిక్కులు మంత్రులుగా పనిచేశారు. హరిజిత్‌ ‌సజ్జన్‌ అప్పట్లోనూ రక్షణశాఖను నిర్వహించడం విశేషం. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సిక్కులు కీలకంగా ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు జస్టిన్‌ ‌ట్రునో ఇలా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ జనాభాలో సిక్కులు దాదాపు ఏడు లక్షలకు పైగా ఉంటారని అంచనా. అందువల్లే ట్రుడో తొందరపాటు వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం కూడా ఉంది. భారత్‌ ‌కన్నా కెనడాలోనే తమ మతస్తులు ఎక్కువగా ఉన్నారని కొంతమంది సిక్కు నాయకులు చెబుతుంటారు. కెనడాలో 18 మంది సిక్కు ఎంపీలు ఉండగా భారత్‌లో తమ ఎంపీల సంఖ్య పదిమందేనని వారు చెబుతున్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పటికీ సిక్కు ఎంపీలు పది మందే. వీరు కాక పంజాబ్‌ ‌వెలుపల మరో ముగ్గురు సిక్కు ఎంపీలు ఉన్నారు. వారిలో కేంద్రమంత్రి మేనకా గాంధీ (పిలిభిత్‌- ఉత్తర్‌‌ప్రదేశ్‌), ఎస్‌.ఎస్‌. అహ్లూవాలియా (పశ్చిమ బెంగాల్‌), ‌మరో ఎంపీ ఉన్నారు. కెనడా సమాజంలో సిక్కులు ఎక్కువగా ఉండటం, రాజకీయంగా, ఆర్థికంగా కీలకంగా, ప్రభావవంతంగా ఉండటంతో జస్టిన్‌ ‌ట్రుడో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. 2019 అక్టోబరులో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ట్రుడో పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. మొత్తం 338 స్థానాలకు ఆయన ఆధ్వర్యంలోని లిబరల్‌ ‌పార్టీ 157 స్థానాలే సాధించింది. మెజార్టీకి మరో 14 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆయన ఇతర పార్టీల మద్దతుతో గద్దెనెక్కారు. వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారని, అందులో భాగమే సిక్కులను మచ్చిక చేసుకునే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కెనడాలో సిక్కుల ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోయాయి. గంపగుత్తగా లిబరల్‌ ‌పార్టీకి ఓట్లు పడే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులు అన్నింటినీ బేరీజు వేసుకునే, ఉద్దేశ పూర్వకంగానే సిక్కులను ఆకట్టుకునేందుకు భారత్‌ ‌రైతుల అందోళన గురించి జస్టిన్‌ ‌ట్రుడో మాట్లాడరన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 జస్టిన్‌ ‌ట్రుడో వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. రైతుల ఆందోళనలపై ఆయన అంతగా స్పందిం చాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం రైతు నాయకులతో ఇప్పటికే అనేకమార్లు చర్చిందింది. వారి డిమాండ్లను సానుభూతితో ఆలకిస్తోంది. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధంగా ఉంది. మూడు కొత్త చట్టాల వల్ల మేలే తప్ప ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టంచేసింది. కనీస మద్దతు ధరపైనా సానుకూలంగా స్పందించింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు పని చేస్తుండగా అందుకు విరుద్ధంగా విపక్షాలు పని చేస్తున్నాయి. విపక్షాలతోపాటు కొన్ని స్వార్థపూరిత శక్తులు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ఆరోపణలను తోసిపుచ్చలేం. హింసకు పురిగొల్పి రైతులకు చెడ్డపేరు తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పని చేస్తున్నాయన్న వాదనను కొట్టి పారేయలేం. పంజాబ్‌, ‌హర్యానాల్లో రిలయన్స్ ‌సంస్థకు చెందిన ఆస్తులు విధ్వంసానికి గురి కావడమే ఇందుకు నిదర్శనం. కేంద్ర మంత్రులు తోమర్‌, ‌పీయూష్‌ ‌గోయల్‌, ‌పంజాబ్‌కే చెందిన సోం ప్రకాశ్‌ ‌రైతు నేతలతో ఎల్ల వేళలా చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఆందోళన చేస్తున్న రైతు నాయకులకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధానికి వచ్చే రోడ్లపై రైతు నాయకులు బైఠాయించినప్పటికీ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తూ సహనంగా ఉంటూ వారికి సహకరిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం రైతుల డిమాండ్లపై సానుకూలంగా, సానుభూతితో ఉంది. ఆందోళన చేస్తున్నవారంతా సిక్కు రైతులేనని అనుకోవడం పొరపాటు. వారిలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. అనేక ప్రాంతాలకు చెందినవారున్నారు. ఈ విషయాలన్నీ జస్టిన్‌ ‌ట్రుడోకు తెలియవని అనుకోలేం. కెనడాలోని కొందరు సిక్కు నేతలు ఆయనకు అవాస్తవాలు నూరిపోస్తున్నారు. వీరిలో ఖలిస్తాన్‌వాదులు లేకపోలేదు. నిబద్ధతగల ప్రజాస్వామ్యం, మైనార్టీల హక్కుల పరిరక్షణకు పట్టం కట్టే, స్వతంత్ర న్యాయవ్యవస్థ గల భారత్‌ ‌చరిత్ర అంతర్జాతీయ సమాజానికి కరతలామలకం. జస్టిన్‌ ‌ట్రుడో గతంలో కూడా ఇలానే బాధ్యతారహితంగా వ్యవహరించి నవ్వులపాలయ్యారు. 2018లో భారత్‌ ‌పర్యటన సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

 భారతీయ మూలాలు గల ప్రజలు అనేక దేశాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అంతమాత్రాన ఆయా దేశాల్లోని తమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, చేసే ఆందోళనలు, ఉద్యమాల పట్ల ఏనాడూ ఢిల్లీ నాయకత్వం సంయమనాన్ని కోల్పోలేదు. ఆయా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి దూరంగా ఉండేది. పొరుగున ఉన్న శ్రీలంక, నేపాల్‌లో భారతీయ మూలాలు గల ప్రజలు సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు. శ్రీలంక తమిళుల విషయంలోనూ భారత్‌ ఏకపక్షంగా వ్యవహరించలేదు. బిహార్‌, ‌యూపీకి చెందిన ప్రజలు దశాబ్దాల క్రితమే నేపాల్‌ ‌వెళ్లి స్థిరపడ్డారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరిని మథేశీలని వ్యవహరిస్తారు. వీరికి ప్రాతినిథ్యం వహించే పార్టీలు ఆ దేశంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్ర నాయకత్వం ఆచితూచే అడుగు వేస్తుంది. తాజాగా హిమాలయ పర్వత రాజ్యంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పటికీ అది వారి అంతర్గత వ్యవహారమని చెప్పి దూరంగా ఉంది. అదే సమయంలో మరో పొరుగు దేశమైన చైనా అక్కడి రాజకీయాల్లో తలదూర్చింది. ఖాట్మాండులోని చైనా రాయబారి స్థానిక పార్టీల నేతల మధ్య సంధికి ప్రయత్నించారు. ఇది ఫలించకపోవడంతో బీజింగ్‌ ‌నాయకత్వం ఏకంగా ఒక బృందాన్నే పంపింది. ఇదీ భారత్‌కు, ఇతర దేశాలకు గల తేడా. ఈ విషయాన్ని కెనడా అధినేత ఎప్పుడు గ్రహిస్తారో?

– ‌రాజేంద్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram