రామతీర్థం రాములోరి విగ్రహ శిరచ్ఛేదనం దుశ్చర్య, బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ ‌మాధవ్‌ అన్నట్లు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై సాగుతున్న వరుస దాడులకు పరాకాష్ట. జగన్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకు వికృత రూపం దాలుస్తూ వస్తూన్న హిందూ వ్యతిరేక ధోరణి పరాకాష్టకు చేరింది. ఇంకా ఉపేక్షిస్తే, ఏమవుతుందో.. ఎంతవరకు వెళుతుందో ఉహించడం కూడా కష్టమే. ఈ పాపానికి జగన్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న కుటుంబ మత విశ్వాసాలు మాత్రమే కాదు, చంద్రబాబు కుహనా లౌకికవాద విధానాలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ విన్యాసాలు కూడా కారణమే.


ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న హిందూ దేవాలయాల ధ్వంసకాండకు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కుటుంబ మత విశ్వాసాలకు ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నకు ఒకప్పుడు అయితే కొంచెం ఆలోచించవలసిన అవసరం వచ్చేదేమో! కానీ, రామతీర్థం, అదే క్రమంలో అందుకు ముందూ వెనకా జరిగిన, జరుగుతున్న సంఘటనలను గమనిస్తే ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వైఎస్‌ ‌కుటుంబ మత విశ్వాసాల ప్రభావ పర్యవసానంగానే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ కుటుంబ విశ్వాసాల అండగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగుతున్న క్రైస్తవీకరణ కుట్రలో భాగంగానే ఆంధప్రదేశ్‌లో మత విద్వేషాలను రెచ్చగొట్టి విధ్వంసాలకు పురిగొలిపే వాతావరణం నెలకొంది. ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి మా వాడు అన్న దురహంకారమో, మరొకటో దుండగుల చర్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి ఇంతవరకు దుండగులకు ఒక గట్టి హెచ్చరిక చేసిన పాపాన పోలేదు. జగన్‌ అధికారం లోకి వచ్చాక క్రైస్తవ మత ప్రచారం ఊపందుకుంది. మత మార్పిడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. క్రైస్తవులే లేని ఊర్లలోను చర్చిలు వెలుస్తున్నాయి. వరుసగా హిందూ వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నాయి. మత ప్రచారం చేసే పాస్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలసరి జీతాలు, చర్చిల నిర్మాణం, మరమత్తులకు నిధులు మంజూరు చేయడం వంటి ప్రభుత్వ చర్యలు, ముఖ్యమంత్రి మాటకు ముందొక సారి వెనకోసారి దేవుని దీవెనలు గుర్తుచేయడం ఇలా ఏ విధంగా చూసినా రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడుల వెనక ముఖ్యమంత్రి కుటుంబ మత విశ్వాసాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఏసు భజనలు చేయడం ప్రభుత్వ దృక్పథాన్ని తెలియచేస్తోంది. నాయకులు మాత్రమే కాదు, అధికారులు కూడా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే మంత్రం- ఏసు నామజపం అన్న నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి తమ మొర ఆలకించాలంటే ఏసు మార్గమే శరణ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సోషల్‌ ‌మీడియా తెరిస్తే ఇలాంటి భజనబృందాలు అనేకం దర్శనమిస్తున్నాయి. ఇక హైందవ ధర్మరక్షణ కోసం ఏర్పడిన టీటీడీలో, ఎస్వీబీసీలో, సప్తగిరి పత్రికలో ఏ విధంగా ప్రభు భక్తిని ప్రదర్శించుకుంటోంది వేరే చెప్పనక్కరలేదు.

చంద్రబాబు హయాంలోనూ ఇలాంటి దుర్మార్గాలు, దురాగతాలు జరిగిన మాట వాస్తవం. అయితే, కొంత వ్యత్యాసం ఉంది. చంద్రబాబు లౌకికవాదం ముసుగులో ఓటు బ్యాంకు రాజకీయా లలో భాగంగా సాగించిన బుజ్జగింపు విధానాల కారణంగా హిందువుల మనోభావాలను లెక్కచేయని మాట నిజం. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవచించిన ‘హిందూగాళ్లు.. బొందుగాళ్లు’ వంటి డైలాగు చంద్రబాబు నోటి నుంచి రాకపోవచ్చునుగానీ, ఆయన మనసులోనూ అదే భావన ఉంది. ‘హిందూ వ్యతిరేక లౌకికవాద’ దుర్మార్గ పోకడలన్నీ ఆయనలోనూ పుష్కలం. తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చడం మొదలు, విజయవాడలో దేవాలయాలను కూల్చి చెత్తబండిలో చెత్త కుప్పలకు చేర్చడం వరకు చంద్రబాబు సాగించిన నిర్వాకాలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు చాలానే ఉన్నాయి.

అధర్మ పోరాటం

అవినీతి, అక్రమాల విషయంలో చంద్రబాబు, జగన్‌ ఎలా పోటీ పడుతున్నారో  హిందూ వ్యతిరేకత విషయంలోనూ అలాగే పోటీపడుతున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ రామతీర్థం సంఘటనను ఆసరా చేసుకుని హిందుత్వ ముసుగు కప్పుకుని కొత్త బిచ్చగాడి వేషాలు ఎన్ని వేసినా ఆయన నిజరూపం దాచేస్తే దాగేది కాదు. గోద్రా నరమేధం అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగిన సందర్భంలో తాను ఎంత గొప్పగా లౌకికవాద పరిరక్షణ భూమికను పోషించిందీ, అప్పట్లో నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌పర్యటనను ఏ విధంగా అడ్డుకున్నదీ ఇప్పటికీ చంద్రబాబు కథలు కథలుగా చెప్పుకుని మురిసి పోతుంటారు. లౌకికవాద కవచ కుండలాలతో పుట్టానని సంబరపడి పోతుంటారు. అంతేకాదు, 2019 ఎన్నికలలో సైతం, అదే లౌకికవాదం ముసుగులో కాంగ్రెస్‌ ‌సారథ్యంలోని హిందుత్వ వ్యతిరేక కూటమితో చేతులు కలిపారు. గతంలో క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని, టీటీడీ చైర్మన్‌గా నియమించారు. అనేక దేవాలయాల పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం భగ్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ దుర్గ గుడిలో, తిరుమలలో క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఆయన ఇంకేమైనా కావచ్చును గానీ, హిందూ ధర్మరక్షకుడు మాత్రం కాలేరు. జగన్‌లో హిందూ వ్యతిరేక లౌకికవాద అవలక్షణాలతో పాటుగా, స్వతహాగా ఆయన, ఆయన కుటుంబం కరుడుగట్టిన క్రైస్తవ విశ్వాసకులు కావడం వలన హిందూధర్మాన్ని సమూలంగా తుడిచివేయాలన్న బైబిల్‌ ‌బోధనలను దేవుని పేరున అమలు చేస్తున్నారు.

పోటాపోటీగా పాపాల చిట్టా

 రామతీర్థం ఘటనను రాజకీయం చేయాలని వైసీపీ, టీడీపీ ప్రయత్నం చేస్తున్నాయి. ‘అమ్మను తిడతావురా’ అన్న సామెతను గుర్తుకు తెస్తూ హిందూ దేవాలయాలను, హిందూ ధర్మాన్ని, విశ్వాసాలను ఎవరు ఎంతలా దెబ్బతీసింది దెప్పి పొడుచు కుంటున్నారు. ఒకరి పాపాల చిట్టా మరొకరు విప్పుకుంటున్నారు. ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి విజయసాయి పోటాపోటీగా రామతీర్థం యాత్రలు చేసి, అసలు సమస్యను పక్కకు నెట్టి రాజకీయ సమస్యగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నట్లుగా ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. పురాతనమైన, పవిత్రమైన హిందూ ఆలయంలో  ఇలాంటి దుశ్చర్య జరగడం అసహనానికి పరాకాష్ట. ఆంధ్రా భదాద్రి రామ తీర్థంలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనేది నిజం. కాబట్టి ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, హిందూ సమాజం కళ్లు తెరిచి ధర్మ పోరాటానికి సిద్ధం కాకపోతే రేపు ఏమి జరుగుతుందో! ఏకంగా తిరుమల వెంకన్నకు..  రామతీర్థం రామన్నకు జరిగిన అవమానమే జరుగుతుందేమో. హిందువుల గుండెల్లో మరెన్ని గునపాలు గుచ్చుకుంటాయో. తలచుకుంటేనే భయం, బాధతో కూడిన ఆగ్రహం, ఆవేదన కమ్ముకొస్తున్నాయి. సోషల్‌ ‌మీడియాలో వెల్లువెత్తుతున్న ఇలాంటి అభిప్రాయాలు ఆంధప్రదేశ్‌లో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేవే.

ఏమిటీ వరస దాడులు?

రాష్ట్రంలో మత మార్పిడులను ఏమాత్రం సహించబోమని భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి హెచ్చరించింది.  ప్రభుత్వం అలసత్వం వల్లే ఆలయాలపై వరుసగా దాడులు జరుగు తున్నాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ ‌దేవధర్‌ ఆరోపించారు. హిందూ సంప్రదా యాలపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కుటుంబ వారసత్వ రాజకీయ పార్టీలను బీజేపీ వ్యతిరేకి స్తోందని, ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తాయని ఆరోపించారు. అన్ని మతాలకు సమన్యాయం చేయడమే తమ సిద్ధాంత మని తెలిపారు. నిందితులను శిక్షించే వరకు పోరాడతామని సునీల్‌ ‌దేవధర్‌ ‌చెప్పారు.

పాక్‌తో పోలిక

రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని లౌకికవాద దుండగులు ధ్వంసం చేశారు. రాముని విగ్రహం తలను నరికి, కోనేరులో పారేసి పోయారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో మరొక ఘటన జరిగింది. పాక్‌ ఇస్లామిక్‌ ‌దేశం. అక్కడ హిందువులు మైనారిటీలు. వీరి మీద దాడులు, మతమార్పిడులు, దేవాలయాల విధ్వంసం తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న మత మార్పిడులు, దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం వంటి పరిణామాలు, ఆంధప్రదేశ్‌లో హిందువుల దయనీయ స్థితిని పాక్‌తో పోల్చుకునే దౌర్భాగ్యస్థితికి చేర్చాయి. అక్కడ ఇస్లాం, ఇక్కడ క్రైస్తవం హిందూధర్మం, హిందూ సమాజంపై యుద్ధం ప్రకటించాయి. విచిత్రం, విషాదం ఏమంటే, లౌకికవాద ముసుగు కప్పుకున్న క్రైస్తవ ముఖ్యమంత్రి పాలనలో, హిందువులకే కాదు హిందూ దేవుళ్లకు కూడా పాక్‌లో ఉన్నపాటి రక్షణ లేకుండా పోయింది. ఇందుకు ఇదొక ఉదాహరణ.

పొరుగు దేశం పాకిస్తాన్‌లో కైబర్‌ ‌పక్తూన్క్వా రాష్ట్రంలో తేరి గ్రామంలోని శ్రీ పరమహంసజీ మహరాజ్‌ ‌సమాధిని, కృష్ణ ద్వార మందిరాన్ని స్థానిక ముస్లింలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై మానవ హక్కుల సంఘాలు, హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అనూహ్యంగా కైబర్‌ ‌పక్తూన్క్వా రాష్ట్ర ముఖ్యమంత్రి మహ్మద్‌ఖాన్‌ ‌సానుకూలంగా స్పందించారు. దేవాలయాన్ని తిరిగి అక్కడే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తామని మాట ఇచ్చారు. దేవాలయం కూల్చివేతకు బాధ్యులైన వారిని రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే, నిజంగానే, ఆలయాన్ని తిరిగి నిర్మిస్తారా, దోషులను శిక్షిస్తారా అనేది వేరే విషయం. కానీ, కనీసం కంటి తుడుపు చర్యగా అయినా ఇస్లామిక్‌ ‌ప్రభుత్వం స్పందించింది. కానీ, క్రైస్తవ ముఖ్యమంత్రి, క్రైస్తవ కుటుంబం పాలిస్తున్న ఆంధప్రదేశ్‌లో మాత్రం కంటితుడుపు చర్యలు అయినా కనిపించడం లేదు. పైగా చిలకలూరిపేటలో క్రైస్తవుల సమాధులను ఎవరో ధ్వంసం చేస్తే, రాష్ట్ర హోం మంత్రి వెళ్లి క్షమాపణలు చెప్పి వచ్చారు. హిందూ దేవాలయాల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఆమె ఏనాడు హిందువులకు క్షమాపణలు చెప్పలేదు.

బైబిల్‌ ‌బోధనల పర్యవసానం?

జగన్మోహన్‌రెడ్డి మాతృమూర్తి విజయమ్మగారు ఒక క్షణం కూడా విడిచి ఉండని, ఉండలేని బ్రదర్‌ (ఇన్‌-‌లా) అనిల్‌ ‌నిత్యం బోధించే బైబిల్‌లోని ఈ ఒక్క వాక్యం చూస్తే మేరీమాత పుత్ర పాలనలో ఎందుకిలా విగ్రహాల ధ్వంస రచన నిత్యకృత్యంగా జరుగుతుందో అర్థమవుతుంది. ‘నిర్గమ కాండము 23, 24: వారి దేవతలకు సాగిలపడకుము, వాటిని పూజింపకుము, వారి క్రియల వంటి క్రియలు చేయక, వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను’ వంటి పరమ పవిత్ర సూక్తులు, సువార్తలు అనేకం ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే, ఆ బోధనలను పల్లె పల్లెకు పట్టుకుపోయేందుకు, క్రైస్తవుల మనసులో చొప్పించేందుకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో మరెక్కడా లేని విధంగా పాస్టర్లను నియమించింది. వీరంతా ఊరూరా ఇదే బోధిస్తున్నారు. ఇది ఆరోపణ కాదు, నిజం. ఒక్కొక్క దాడికి, ఒక్కొక్క విగ్రహ ధ్వంసానికి, వేలు కాదు లక్షల్లో నజరానాలు ముడుతున్నాయని సోషల్‌ ‌మీడియాలో వినిపిస్తోంది. ఇందులో నిజానిజాలు తేలాలంటే కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది.

విధ్వంసపు ఆనవాళ్లు

2019 నుండి హిందూ దేవాలయలపై దాడుల కొన్ని వివరాలు…

గుంటూరు దుర్గమ్మవారి గుడి (14 నవంబర్‌ 2019), ‌పిఠాపురం ఆంజనేయస్వామి గుడి 23 విగ్రహాలు (21 జనవరి 2020), రొంపిచెర్ల వేణుగోపాలస్వామి గుడి విగ్రహాలు (11 ఫిబ్రవరి 2020), ఉండ్రాజవరం మండలం సూర్యారావు పాలెం అమ్మవారి గుడి ముఖద్వారం (13 ఫిబ్రవరి 2020), నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్ధం (14 ఫిబ్రవరి 2020), అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం (6 సెప్టెంబర్‌ 2020), ‌విజయవాడ దుర్గ గుడి థం వెండి సింహాల అపహరణ (13 సెప్టెంబర్‌ 2020), ‌కృష్ణా జిల్లా నిడమానూరులో సాయిబాబా విగ్రహాలు (15 సెప్టెంబర్‌ 2020), ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయస్వామి విగ్రహం (16 సెప్టెంబర్‌ 2020), ‌గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం (16 సెప్టెంబర్‌ 2020), ‌కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు, నంది విగ్రహం (17 సెప్టెంబర్‌ 2020), ‌విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకలమామిడి వీధి శివారులో శివాలయంలో విగ్రహాలు (19 సెప్టెంబర్‌ 2020), ‌పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు -నరసాపురం వెళ్లే రోడ్‌ ‌మార్గంలో ఉన్న అయ్యప్పస్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు, విగ్రహం ధ్వంసం (20 సెప్టెంబర్‌ 2020), ‌కర్నూల్‌ ‌జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్‌ ‌యార్డ్ ‌సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం (23  సెప్టెంబర్‌ 2020), ‌నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం (25 సెప్టెంబర్‌ 2020), ‌కర్నూల్‌ ‌జిల్లా మంత్రాలయం మండలం వుగురుకి 2 కి.మీ. దూరంలో ఉన్న సుగని జలాశయం దగ్గర ఉన్న శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో స్వామివారి శేషపడగలు (5 అక్టోబర్‌ 2020), ‌కర్నూల్‌ ‌జిల్లా ఆదోనిలో ఓవర్‌ ‌బ్రిడ్జి కింద ఉన్న ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం (6 అక్టోబర్‌ 2020), ‌గుంటూరు జిల్లా నరసారావుపేట శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం (6 అక్టోబర్‌ 2020), ‌తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం (17 అక్టోబర్‌ 2020), ‌యానాం బైపాస్‌, ‌లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లాలో ఆంజనేయస్వామి వారి విగ్రహం (20 అక్టోబర్‌ 2020), ‌విజయవాడ మొగల్‌ ‌రాజపురంలో శివగిరి కొండ మీద ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం ధ్వంసం (4నవంబర్‌ 2020), ‌రామతీర్థంలోని శ్రీరాముని విగ్రహం (29 డిసెంబర్‌ 2020), ‌రాజమహేంద్ర వరంలోని శ్రీసంకటహర వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి వారి దేవాలయంలోని శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం (31 డిసెంబర్‌ 2020), ‌విజయవాడలో ఆర్టీసీ బస్టాండ్‌ ‌దగ్గర సీతమ్మ విగ్రహం (జనవరి 3, 2021). ఇంకా ఎన్నో…

About Author

By editor

Twitter
Instagram