సంపాదకీయం
శాలివాహన 1941 శ్రీ శార్వరి మార్గశిర బహుళ త్రయోదశి
11 జనవరి 2021, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌


ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, పశువులకు సాధారణమే అయినా మనుషుల్లో మాత్రమే కొన్ని వైపరీత్యాలు చూస్తాం. నిద్రాహారాల విషయంలో జంతువులకు ఓ సమయం, పరిమితి ఉన్నాయి. భయం కూడా అంతే. పులిని చూసి పులి, సింహాన్ని చూసి సింహం, పామును చూసి పాము భయపడవు. మైథునం (సెక్స్) ‌విషయంలో జంతువులకు ఓ రుతువు, హేతువు ఉన్నాయి. సమయం, సందర్భం లేకుండా మనుషులు మాత్రమే మైథునానికి పాల్పడతారు. మైథునానంతర దుష్ఫలితాల నివారణ, సత్ఫలితాల సమీకరణ లక్ష్యంగా మానవులు ఏర్పరచుకున్న వ్యవస్థలే కుటుంబం, వివాహం. మానభంగం అని మనం చెప్పుకునే బలవంతపు మైథునం జంతువుల్లో అసలు జరగనే జరగదు. భార్యాభర్తల్లో సైతం బలవంతపు మైథునాన్ని మానభంగంగా, నేరంగా పరిగణించే విధానం జంతువుల నుండి మానవులు నేర్చిన అనేకానేక అంశాల్లో ఒకటి కావచ్చు.

వివాహాల్లో కూడా సంబంధిత కుటుంబీకులు వ్యతిరేకించినా కులాంతర, మతాంతర వివాహాలను భారతీయ సమాజం అనాదిగా ఆమోదించడం చరిత్ర. ప్రేమించుకుని పెళ్లి దాకా రాగానే మతం మారాలనడం ఇటీవల కొంతకాలంగా సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రేమకు అడ్డురాని మతం పెళ్లికి అడ్డుపడుతోందని చెప్పడం నిజమా, నాటకమా! కుల, మత, సంప్రదాయాలతో సంబంధం లేకుండా వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహాలకు చట్టబద్ధత కల్పించేదుకు స్పెషల్‌ ‌మేరేజెస్‌ ‌యాక్ట్ ఉ‌ండనే ఉంది. అయినప్పటికీ పెళ్లి చేసుకోడానికి మతం మారాల్సిందే అని షరతు విధించడం బలవంతపు మతమార్పిడి కాదా, ఇతరుల మత స్వేచ్ఛను హరించడం కాదా! ఇట్టి రాజ్యాంగ విరుద్ధ చర్యను ప్రభుత్వాలు కట్టడి చేయవద్దా!

బలవంతపు మత మార్పిడి బాధితుల రక్షణ కోసం మధ్యప్రదేశ్‌, ‌హరియాణా ప్రభుత్వాలు నండు బిగించాయి. రక్షణ చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ‌యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వం ఓ ఆర్డినెన్సు తెచ్చింది. ఈ ఆర్డినెన్సు వచ్చీ రాకముందే స్వయం ప్రకటిత మేధావులైన వందమందికిపైగా మాజీ ఐఏఎస్‌ అధికారులు సంతకాలు చేసి ప్రభుత్వానికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం తలపెట్టిన చట్టం సమాజంలో విద్వేషాన్ని, విభేదాలను రగిల్చి సామాజిక శాంతికి భంగం కలిగిస్తుందని వారు ఆక్రోశించారు. తమని తాము మేధావులమని, సామాజిక అధ్యయనకారులమని భావించుకునే ఈ పెద్దలు అభ్యంతరం వెలిబుచ్చిన నూతన చట్టం ప్రేమను, కులాంతర, మతాంతర ప్రేమలను, పెళ్లిళ్లను నిషేధించడం లేదు. పెళ్లికి ముందుగానీ, తరువాత గాని మతం మారాలని ఒత్తిడి చేయడం, బలవంతపెట్టడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పేర్కొంటున్నది.

వ్యక్తుల మత స్వేచ్ఛను కాపాడే చట్టాలను స్వాగతించాల్సిన విద్యావంతులు అభ్యంతరం చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? మరింత ఆసక్తికర అంశం ఏమంటే యోగి ప్రభుత్వం తలపెట్టిన చట్టం ‘లవ్‌ ‌జిహాద్‌’‌ను ఎదుర్కోడానికే తెచ్చినట్లు వ్యాఖ్యానించడం! గుమ్మడికాయల దొంగలు భుజాలు తడుముకుంన్నట్లు చట్టంలో లేని ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌ప్రస్తావన తెచ్చిన ఈ మేతావులు తాము లవ్‌ ‌జిహాద్‌ ‌మద్దతుదార్లమని చెప్పకనే చెప్పేశారు.

జిహాద్‌ అ‌ంటే పవిత్రయుద్ధం అని అర్థం. విరోధులైన అన్య మతస్తులపై ఇస్లాం మతస్తులు జరిపే యుద్ధాన్ని జిహాద్‌ అ‌ంటారు. మత వ్యాప్తికోసం జరిపే యుద్ధం కనుక అది పవిత్ర యుద్ధమని ముస్లింల భావన. లవ్‌ అ‌ంటే ప్రేమ. ప్రేమ, యుద్ధం పరస్పర విరుద్ధమైనవి. ప్రేమ ఉన్నచోట యుద్ధానికి, యుద్ధంలో ప్రేమకు తావు ఉండదు. మరి ఈ లవ్‌ ‌జిహాద్‌ అనే ప్రేమ యుద్ధమేమిటి? లవ్‌ ‌జిహాద్‌ అనే పదం కేరళలో తొలిసారి వార్తల్లోకి వచ్చింది. వలపు వల విసిరి ప్రేమ ముగ్గులోకి దించి, తీరా పెళ్లి దాకా వచ్చాక మతం మారాలని ఒత్తిడి తెచ్చి మతం మార్చడం లవ్‌ ‌జిహాద్‌ ‌లక్ష్యం. ముస్లిం యువతి అన్య మతస్తుడిని పెళ్లి చేసుకోవడాన్ని వారి మత నిబంధనలు అంగీకరించవు. కాబట్టి ఈ యుద్ధంలో ముస్లిం యువకులే సైనికులు కాగా ఇస్లామేతర యువతులే లవ్‌ ‌జిహాదిస్టుల లక్ష్యం అనేది సుస్పష్టం. ఈ ప్రేమ వంచనను కూడా మత యుద్ధం క్రిందకు చేర్చి వలపు వల విసిరే ముస్లిం యువకులను ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదులు ప్రోత్సహిస్తున్నారు. కేరళ, మంగుళూరు ప్రాంతాల్లో అక్టోబరు, 2009 నాటికి 4,500 మంది బాలికలను లవ్‌ ‌జిహాద్‌ ‌కోసం లక్ష్యంగా చేసుకున్నారంటూ కేరళ బిషప్‌ ‌కౌన్సిల్‌ అనే క్రైస్తవ సంస్థ బాహాటంగా ప్రకటించింది. అయినప్పటికీ మొద్దు నిద్ర వీడని మేతావులు, లౌకిక ముసుగేసుకున్న మీడియా మాత్రం లవ్‌ ‌జిహాద్‌ ‌పదానికి అర్థమే లేదని, అంది హిందూ సంస్థల సృష్టే అంటూ వితండవాదన చేస్తుండడం విడ్డూరం.

వలపు వల విసిరి అమాయకులైన ఆడపడుచుల మత స్వేచ్ఛను హరించే దుష్ట జిహాదీల పన్నాగం తెలుగు నాట పారకుండా ప్రభుత్వాలు కట్టడి చేయాలి. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం చూపిన బాటలో చట్టాలు చేసి, తెలుగు పాలకులు తెలుగు ఆడబిడ్డల మతస్వేచ్ఛను రక్షిస్తారని ఆశిద్దాం!

About Author

By editor

Twitter
Instagram