గణతంత్ర దినోత్సవం సందర్భంగా

స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మిన సాహసి నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌. ‌స్వరాజ్య సమరంలో 11సార్లు జైలు శిక్ష అనుభవించిన దేశభక్తి తత్పరుడు. ఒళ్లు గగుర్పొడిచే ఆయన వాగ్ధాటి, ఉత్తేకరంగా ఉండే ఆయన అడుగులు విస్మయం గొలుపుతాయి. అలాంటి జీవితం, అలాంటి వ్యక్తి ఆశయం, వ్యక్తిత్వం, నినాదం, త్యాగమయ జీవితం కవులను ఆకర్షించకుండా ఉండడం అసాధ్యం. నేతాజీ పోరాట పటిమ, జైహింద్‌ ‌నినాదం, ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లను ప్రశంసిస్తూ ఆధునిక కవులు జాషువా, కరుణశ్రీ, తుమ్మలవంటివారు గొప్పగా కవిత్వీకరించారు. జాలాది, అశోక్‌తే వంటి సినీ కవులు ఉదాత్తంగా అభినుతించారు. కొందరు కవుల వర్ణనల్లో నేతాజీ వ్యక్తిత్వాన్ని వివరించడమే ప్రస్తుత వ్యాస ముఖ్యోద్దేశం.


మహాకవి జాషువ ‘నేతాజీ’ చారిత్రక కావ్యం రచించారు. గాంధీజీతో విభేదించి సాయుధ పోరే శరణ్యమన్న బోస్‌ ‌భావాన్ని జాషువ కవిత్వీకరిస్తూ-

‘‘కత్తుల బట్టక స్వేచ్ఛరాదెపుడు చర్ఖా పద్ధతుల్‌ ‌పూర్తిగా

 చితైపోవునటంచు గాంధీముని సిద్ధాంతమున్‌ ‌జేసి భూ

భృత్తుల్‌ ‌తెల్లని చక్రవర్తులు భయాప్తిన్‌ ‌క్రుంగి కంగారుగా

నెత్తించెన్‌ ‌యెవరెస్ట్ ‌నెత్తములై హిందూ రణస్తంభమున్‌’’ అన్నారు. కత్తులు పట్టి పోరాడనిదే స్వాతంత్య్రం రాదని తెల్లదొరలు భయాందోళనతో క్రుంగిపోయే విధంగా ఎవరెస్ట్ ‌శిఖరంపై నేతాజీ హిందూ సమర స్థంభాన్ని నాటాడన్న వర్ణన సముచితంగా ఉంది.

భరతమాత బోసుబాబుకు సాక్షాత్కారించి తన గత వైభవాన్ని తలపోసుకొని వర్తమాన దుస్థితికి దిగులుతో కుమిలిపోతుందన్న స్థితిని వర్ణిస్తూ –

‘‘పిదికితి రత్నరాసుల నవీనములెల్ల నదీనదాలలో

బ్రదికితి సాటి భూతల పురంధ్రులకు, దలమానికంబుగా

యవను తొలంగనీక మధురాన్నపు రాసుల పంట పండితిన్‌

‌చిదికి పరాయి భూపతుల చేతికి చిక్కితి చిక్కిపోయితిన్‌’’

‌భరతభూమికి నదీనదాలతో విలువైన రత్నరాసుల సౌభాగ్యానిచ్చింది భరతమాత. సాటి భూమాతల్లో మేటిగా విలసిల్లిన ఆమె నేడు పరాయి పాలకుల  చేతికి చిక్కి దిగులుతో చిక్కిపోయానని అలమటించిం దన్న వర్ణన దేశభక్తుల హృదయాల్లో ఆలోచన రేకెత్తిస్తుంది.

అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌ఘనతను వర్ణిస్తూ, భరత మాత బానిస బంధాలు తొలగించి స్వాతంత్య్రం సాధన కోసం అజాదు హిందూ సైనికులను నేతాజీ సుశిక్షితులుగా తీర్చిదిద్దాడు. అజాద్‌ ‌జెండా ఆకాశవీధుల్లో నేతాజీ కీర్తిపతాకలాగా రెపరెప లాడుతుందని కవి చెప్పాడు. భారతదేశంలో పుణ్యనదుల, భూదేవతల చలువ వల్ల సుభాసుబోసు సింగంలా మరలా వచ్చి దర్శనమివ్వాలన్న కాంక్షతో ‘నేతాజీ’ కావ్యాన్ని ముగించడం ఔచిత్యంగా ఉంది.

ఉదయశ్రీ రెండో భాగంలో మహాకవి కరుణశ్రీ ‘నేతాజీ’ ఖండికలో భరతమాత దాస్యశృంఖలాలను ఛేదించేందుకు జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలిగా, నెత్తుటిధారలతో పారతంత్య్ర కళంకాన్ని పోగొట్టిన దేశభక్తుడిగా నేతాజీని ప్రశంసించాడు. బోసు సాహసం, త్యాగం, వ్యూహం వంటి గొప్ప లక్షణాలు బాపూజీకి, పటేల్‌కు పనికిరానందున అవి కరిగి స్వాతంత్య్ర జలధిలో కలసి ఒక తరంగంగా భరతమాత పాదాలను ప్రక్షాళించాయని ఉత్ప్రేక్షించి వర్ణించాడు. అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజు అధ్యక్షుడిగా ఆయన ఖ్యాతిని కీర్తిస్తూ –

‘‘ఆజాద్‌ ‌హిందు మహా ప్రభుత్వమున అధ్యక్షుండవై యే మహా

రాజుల్‌ ‌గాంచని కీర్తిగాంచి పరిపూర్ణ స్వేచ్ఛకై జీవితం

బా జన్మాంత మఖండ యజ్ఞమున స్వాహా చేసి పూజ్య

నేతాజీ వై దిశలన్‌ ‌వెలార్చితి స్వాతంత్య్ర ప్రభాత ప్రభల్‌’’

అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ అధ్యక్షుడిగా మహారాజులు సైతం పొందని కీర్తి మాన్యుడు నేతాజీ. భారతదేశ సంపూర్ణ స్వాతంత్య్రానికి ఆజన్మాంత యజ్ఞంలో జీవితాన్ని అర్పించి దిక్కులన్నింటిలో స్వాతంత్య్ర కాంతులు ప్రకాశింపజేసిన ధన్యుడని కరుణశ్రీ ఉదాత్తంగా అభివర్ణించాడు. ఆయన ప్రవేశపెట్టిన జైహింద్‌ ‌నినాదం ప్రజా స్వాతంత్య్రమంత్రంగా పనిచేసింద న్నాడు. స్వతంత్ర భారతీయ హృదయాల్లో ఆచంద్ర తారార్కంగా జైహింద్‌ ‌నినాద ధారా తరంగాలు పవిత్రమైన భరతమాత పాద పద్మాలను స్పృశిస్తాయని ఉదాత్తంగా వర్ణించాడు. బోసుబాబు మరణం వివాదాస్పదమైంది. ఆయన మరణంతో భారతీయుల గుండెల్లో పొంగి పొరలిన కవోష్ణ రక్తధారలతో చెంగలువలు గులాబీలుగా మారి భారత భాగ్యవిధాత భరతమాత పాదార్చనకు పుష్పాలయ్యాయని ఉత్ప్రేక్షించి వర్ణించాడు. కరుణశ్రీ వర్ణనా చమత్కారం రమణీయంగా పాఠకులను అలరిస్తుంది. బోసు దివ్య చరిత్ర ఖండ ఖండాంతరాల్లో ప్రశంసలందు కొంటుందని వర్ణిస్తూ

‘‘నీ తేజో మహిమంబు మా హృదయమునందే కాక విశ్వప్రభా

చేతో వీధుల కాంతి రేఖల వెలార్చెన్‌; ‌ఖండ ఖండాంతర

ఖ్యాతంబుల్‌ ‌భవదీయ పౌరుష యశోగాధల్‌ ‌లిఖింపబడున్‌

‌స్వాతంత్య్రోజ్జ్వల వీర భారతా కృతిని సౌవర్ణ వర్ణాలతో’’

బోస్‌ ‌పరాక్రమ ప్రాభవం భారతీయుల హృదయాల్లోనే కాక, ప్రపంచ ప్రజల మనోవీధుల్లో కాంతి రేఖలను ప్రసరిస్తుందన్నాడు. ఆయన పౌరుష యశో గాథలు స్వాతంత్య్రోజ్జ్వల వీరభారతంలో సువర్ణాక్షరాలతో లిఖితమవుతాయని  ఔచిత్యంగా ప్రస్తుతించాడు.

‘గాంధీ ఆస్థానకవి’, అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి నేతాజీ వ్యక్తిత్వాన్ని, పోరాటపటిమను, ఆజాద్‌ ‌హిందూ ఫౌజు విశిష్టతను ముచ్చటగా ముత్యాల సరాల్లో వర్ణించడం విశేషం.

‘‘బానిసమ్మున గ్రుళ్ళి కుమిలిన

బ్రతుకుకంటెను చావు మేలని

షానవాజు థిల్లాను సేగాల్‌ ‌సేన గూర్చితివా?’’

– నేతాజీ బానిస బంధాల్లో కుమిలిపోవడం కంటే మరణమే మేలు. ప్రాణత్యాగానికి సిద్ధమై అజాద్‌ ‌హిందూఫౌజు సేనను ఏర్పాటుచేసి షానవాజు, ‘సేగాల్‌’‌ల ఆధ్వర్యంలో నడిపించారు. యుగ యుగాలుగా పొగలి సెగలతో చెలరేగుతున్న హిందూ ముస్లింల మత సంఘర్షణలను రూపుమాపి హిందూ ముస్లింల సమైక్యతను సాధించిన నేతాజీ వ్యక్తిత్వాన్ని తుమ్మలవారు ప్రశంసించారు. ఆయన ‘జైహింద్‌ ‌నినాదం’ స్వాతంత్య్ర సాధనకు తారకమంత్రమై ప్రజలను ప్రేరేపించింది.

‘‘ఆ విషయాన్నిఁ తారకంబై మమ్ము లేపెను

తారకము జై హిందు నాదము

ఘోర విక్రమముని ఢిల్లీ కోట గెల్తుమికన్‌’’

– ‌జైహిందు నినాదం ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించి ఢిల్లీ కోట గెల్వగలమన్న ఆశావహ దృక్పథాన్ని నింపిందని ప్రశంసించారు.

భవ్య భారత మధురమూర్తిగా, దివ్య భారత సవ్యసాచిగా, నవ్య భారత చక్రవర్తిగా నేతాజీని అభినుతించాడు.

స్వతంత్ర పోరాటంలోనే తాజా కీర్తి స్వచ్చ •మైందని ఖండఖండాలకు ఆయన కీర్తి పాల సంద్రపు నురుగులా విశ్వవ్యాప్తమైందని వినుతించాడు. ఆయన అజ్ఞాతవాసం నుండి కదన కేళి రుద్రమూర్తిలా కదిలిరావాలని కాంక్షించాడు.

ప్రముఖ సినీ కవి ‘జాలాది’ మేజరు చంద్రకాంత్‌ ‌చిత్రంలో ‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’- పాటలో దేశం కోసం త్యాగం చేసిన యోధులను స్మరిస్తూ నేతాజీని గూర్చి –

‘‘అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజి

అఖండ భరతజాతి కన్న మరో శివాజి

సాయుధ సంగ్రామమే న్యాయమని

స్వతంత్ర భారతావనియే స్వర్గమని

ప్రతి మనషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యండి

హిందూ ఫౌజు జైహింద్‌ అని గడిపాడు

గగన సిగల కెగసి కనుమరుగైపోయాడు

జోహార్‌ ‌జోహార్‌ ‌సుభాష్‌చంద్రబోస్‌’’

‌నేతాజీని భరతమాత కన్న మరో శివాజీగా అభివర్ణించడం సమంజసంగా ఉంది. అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో ప్రతిమనిషోక సైనికుడై ప్రాణాలర్పించాలని నేతాజీ ప్రబోధించాడు. ఆయన అర్థాంతరంగా విమాన ప్రమాదంలో మరణించి అంతర్ధానమైన విషయాన్ని ‘‘గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు’’- అనే పాదంలో సరళమైన తెలుగు పదాల్లో ఆయన మరణానికి సానుభూతితో జోహారులర్పించాడు కవి. నేతాజీని గూర్చి జాలాది రాజు ఈ పాటలో ప్రయోగించిన పదాలు సినీ ప్రేక్షకుల గుండెల్లో నాటుకున్నాయి.

‘సుభాష్‌ ‌చంద్రబోస్‌’ ‌సినిమాలో సుద్దాల అశోక్‌తేజ నేతాజీ ఆశయాలను, జైహింద్‌ ‌నినాదాన్ని గొప్పగా కవిత్వీకరించాడు –

‘‘జై హింద్‌, ‌జై హింద్‌- ‌జైహింద్‌

‌సుభాష్‌చందు అణువణువునందు

అడుగడుగునందు – జై హింద్‌

‌స్వేచ్ఛనే పొందు పోరాటమందు

మనమంతా ముందు జైహింద్‌

‌తెల్ల రాబందు మన దేశమందు

ఉండొద్దు – ఉండొద్దు – జైహింద్‌

‌దోపిళ్ళబందు దొరతనము బందు

తొడగొట్టుముందూ – వందేమాతరం

పిడికిళ్ళు అగ్గిపిడుగుల్ని చేసి కురిపించండి 

కన్నీటిధార కావాలి ఖడ్గధార జైహింద్‌

‌గాయాలలోన ధ్యేయాన్ని చూసి కదలండి అంది జైహింద్‌

‌రక్తాల చిందు త్యాగాల విందు

అజాద్‌ ‌హిందూ- వందేమాతరం

స్వారాజ్యమింక మన జన్మహక్కు అంటుంది ।।జైహింద్‌’’

‌నలభై కోట్ల జనమంతా ఇంక కట్టాలి జట్టు

మన భరతమాత పాదాల మట్టి బొట్టుపెట్టి

తల తెగినగాని తలవంచబోడు మన తెలుగువాడు

ఒక్కసారి కాదు వెయ్యిసార్లు మళ్ళీ పుడతాడు

ద్రోహులను చీల్చి చెండాడు సింహమై పుడతాడు ।।వందేమాతరం।।

అణువణువునా అడుగడుగునా జైహింద్‌ ‌నినాదంతో స్వేచ్ఛా పోరాటాన్ని సాగించిన గొప్ప దేశభక్తి తత్పరుడిగా నేతాజీని అశోక్‌ ‌తేజ కీర్తించాడు.

దోపిడీ లక్ష్యంగా మన దేశాన్ని దోచుకున్న తెల్ల రాబందులు మన దేశంలో ఉండొద్దని తొడగొట్టి తరిమికొట్టాలని ప్రబోధించాడు. పిడికిళ్లు అగ్గిపిడుగు లుగా చేసి కన్నీళ్లధారను, ఖడ్గాలధారగా చేసి అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజు సైనికులు రక్తాలు చిందించి త్యాగాల విందుగా భావించి స్వాతంత్య్రాన్ని సాధించాలన్న నేతాజీ ఆశయాన్ని సముచితంగా కవిత్వీకరించాడు. అప్పటి భారతదేశ జనాభా నలభై కోట్లు. ప్రజలంతా సమైక్యంగా జట్టుకట్టి భరతమాత పాదాల మట్టి బొట్టుగా పెట్టి దీక్షగా పోరాడి స్వాతంత్య్రాన్ని సాధించాలన్నాడు. సుభాష్‌ ‌చంద్రబోసు  ద్రోహులను చీల్చిచెండాడే సింహమై వెయ్యిసార్లు పుడతాడన్న ఆశావహ దృక్పథంతో ముగించడం ఔచిత్యంగా ఉంది. సుభాష్‌చంద్రబోస్‌ ‌వ్యక్తిత్వాన్ని, అజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజు విశిష్టతను, జైహింద్‌ ‌నినాదాన్ని సముచితంగా కవులంతా అభినుతించారు. భారతదేశ స్వాతంత్య్రో ద్యమ చరిత్రలో సుభాష్‌చంద్రబోసు చిరస్మరణీయుడు. ఆయన నినాదం జైహింద్‌ అజరామరమైనది.

–  డా।। పి.వి.సుబ్బారావు 9849177594

రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి,

సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
Instagram