వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ


ఆ రోజు నేను రచయిత్రిని కావాలనుకున్నాను.

అదేదో అందమైన ప్రకృతిని చూసి పులకరించి కాదు.

నేను అప్పుడు ఏడో తరగతి చదువుతున్నాను.

మాది చిన్న పల్లెటూరు మొత్తం నలభై కుటుంబాలు ఉంటాయి.

బాధతో నేను కథలు రాయాలనుకున్నాను.

మా ఊర్లో అయిదు తరగతులు మాత్రం ఉన్నాయి. అక్కడ నుండి రెండున్నర కిలోమీటర్లు నడిస్తేగాని దగ్గర ఊర్లో బడి వచ్చేది కాదు. అక్కడ కూడా పది తరగతులవరకు మాత్రమే చదువుకోవచ్చు. ఆ తర్వాత అయిదారు కిలోమీటర్ల దూరంలో చిన్న పట్నం వస్తుంది. నేను తొమ్మిదో తరగతి మధ్యలో చదువుమానేశాను. అందుకు రకరకాల కారణాలు.

————-

  1. అంతకుముందు కొన్ని సంవత్సరాల నాటి కథ ఇది. మా ఊర్లో బడిలేకపోయినా చిన్న గ్రంథాలయం ఉంది. అక్కడ నుండి కథలు, నవలలు తెచ్చుకుని చదువుకునేవాళ్లం. నాకు నలుగురు అక్కలు. ఇద్దరు అన్నయ్యలు.

నా కుటుంబ కథ చెప్పి మిమ్మల్ని విసిగించను. అప్పట్లో మధురాంతకం రాజారామ్‌గారి పుస్తకాలు దొరికాయి. అన్ని పుస్తకాలు మాకు దొరకవు. ఇంకా రచయిత్రుల పుస్తకాలు, ప్రముఖుల మరికొన్ని పుస్తకాలు మాత్రం ఉండేవి.

నాకు మధురాంతకంగారి కథలు బాగుండేవి. అందులోనూ పల్లెల్లో కనిపించే వాతావరణం, మనుషులు ఆ కథల్లో ఉండేవారు. ఆయన పేరు మాత్రం నాకు గుర్తుంది. మాది మధ్యతరగతి కుటుంబం అందుకని ఆయన కథలు అంత సహజంగా అనిపించేవి.

ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు మా మాస్టారు ఓ క్లాస్‌ ‌తీసుకున్నారు. ఆయన తొమ్మిది, పది తరగతులకు మాత్రం వెళ్లేవారు. ఆ రోజు మా మాస్టారు రాలేదు. అప్పుడు హెడ్‌ ‌మాస్టారు పంపించారు.

ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. ఇప్పటికి మా మాస్టార్‌ ‌మాటలు నాకు గుర్తున్నాయి. అతని పేరు పుండరీకాక్షయ్య తను మా అందరికీ ఓ కథ చెప్పటం మొదలుపెడుతూ అన్న తొలి మాట.

‘‘ఆడదాన్ని నమ్మకూడదు రా’’

నేను ఉలిక్కి పడ్డాను. మా క్లాస్‌లో ఉంది అబ్బాయిలు మాత్రమే కాదు. నాతో కలిసి ఎనిమిదిమంది అమ్మాయిలు! ముందు ఆ కథ గురించి చెబుతాను.

ఓ దేశానికి ఓ రాజుగారు అతను వృద్ధుడు అయ్యాడు. అయినా సరే, ఇంకో అమ్మాయిని, తనకి కూతురు వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అప్పటికే రాజుగారికి కొత్త భార్యకంటే రెండు సంవత్సరాల పెద్దవాడైన అబ్బాయి ఉన్నాడు. అందగాడు. తండ్రి తర్వాత రాజ్యాన్ని ఏలవలసినవాడు ఆ యువరాజుని కొత్త యువరాణి మోహించింది.

తన కోరికను తీర్చమని యువరాజుని ప్రాధేయ పడింది. అప్పుడతను ‘‘తల్లీ… నువ్వు నాకు మాతృ సమానురాలివి. ఇది తప్పు. మీరు ఇలాంటి కోరిక కోరటం ధర్మం కాదు. న్యాయం కాదు. నన్ను మన్నించండి’’ అని చెప్పాడు. అది అవమానంగా భావించిన యువరాణి తన భర్తతో యువరాజు తనని బలాత్కారం చేయబోయాడు అని ఏడుస్తూ చెప్పింది. మహారాజు అది నిజమా కాదా అనేది విచారించక యువరాజుని చంపించాడు.

ఇదీ కథ.

ఇది నిజంగా జరిగిందా, కట్టు కథా అనేది పక్క నుంచితే, పుండరి మాస్టారు, ఎక్కడన్నా చదివారో, విన్నారోగాని అప్పుడప్పుడే కౌమారంలోకి వస్తున్న మా పిల్లలకి చెప్పారు. అంతటితో ఆగలేదు. ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు, గద్దలకు ఆహారంగా వేయాలి కదా అన్నప్పుడు మాస్టారి కళ్లు ఎరుపుగా ఉన్నాయి.

‘అందుకే చెబుతున్నాను. ఏ ఆడదాన్నీ నమ్మకూడదు. గుర్తుంచుకోండి’ అన్నారు.

ఆ నమ్మని తనాన్ని ఆ యువరాణికి పరిమితం చేయలేదు. అప్పుడు నాకు భయం కలిగింది. బాధ కలిగింది. ఆవేశం కూడా వచ్చింది. అనుమానం వచ్చింది.

మాస్టారు మా అందరిలా అమ్మకే పుట్టారు. మాస్టారికి పెళ్లి అయింది. ఆడపిల్లలున్నారో లేదో నాకు తెలియదు. మరి ఆయన కుటుంబంలోని ఆడవారిని నమ్మ కూడదా! మాస్టారు నమ్మటం లేదా?

మా ఆడపిల్లల్ని చూశాను. మగపిల్లల్ని కూడా చూశాను. మగపిల్లలు ఆడపిల్లల వంక చూస్తుంటే వాళ్లు తలలు దించుకున్నారు.

ఇందులో తప్పు ఎవరిది? మహారాజుదా? యువరాణిదా? ఈ కథ చెప్పిన మాస్టారిదా! మొత్తంగా ఆడవాళ్లదా?

ఏది ఎంతవరకు చెప్పాలి అనే జ్ఞానంలేనివారు ఉపాధ్యాయులుగా ఎందుకు ఉంటున్నారు? నేను ఇంతకుముందు చదివిన కథలు వేరు. చూసిన మనుషులు వేరు. జీవితం ఇంత భయంకరంగా ఉంటుందా!

నేను బడి నుంచి ఇంటికి ఎలా వచ్చానో నాకు తెలియదు.

ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు.

మా అమ్మ గుర్తు వచ్చింది. అక్కలు గుర్తొచ్చారు. నా తోటి ఆడపిల్లలు గుర్తు వచ్చారు. అలాగే నాన్న- అన్నయ్యలు – మా బావలు. వీళ్లందరూ ఆడవాళ్లని నమ్మరా… అప్పుడు ఆడవారంతా ఏమైపోవాలి. భయం… భయం… ఉదయం లేచేసరికి జ్వరం వచ్చింది. నేను రెండు రోజులవరకు బడికి వెళ్లలేదు. మధ్యలో నన్ను గమనించిన మా అమ్మ అడిగింది.

‘‘దేని గురించి ఆలోచిస్తున్నావు. ఎందుకు భయపడినట్లు కనిపిస్తున్నావు’’ అని నేను ఏం లేదమ్మా అని చెప్పాను.

ఇప్పుడు కొంతమందికి అనిపించవచ్చు – ఒక్క మాటతో ఇంతగా భయపడతారా అని. అవునంటాను. కథలే కాదు ఒక్క మాటతో బతుకులే మారిపోతాయి. మాటకు అంత శక్తి ఉంది. అదేమాట మనల్ని అంతులేని ఎత్తులకు చేర్చుతుంది. అదేమాట అక్కడ నుండి అగాధాల్లోకి తోసేస్తుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా.

అసలు ఒకరి మీద ఇంకొకరికి నమ్మకం లేనప్పుడు ప్రేమ, కుటుంబం, బంధం అనే మాటలకు అర్థం ఉంటుందా? అప్పుడు మొదటిసారి బడికి వెళ్లటం మానేస్తే అనే ఆలోచన వచ్చింది. మా అక్కందరూ మూడు, అయిదు తరగతులతో ఆగిపోయారు. నాలుగవ అక్క ఏడోతరగతి చదివింది. నేనూ చదువు మానేయాలనుకున్నాను. నా స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది. ఇద్దరం రోజూ కలిసే బడికి వెళ్తాం.

ఇంకా నాకు తప్పలేదు. తను ఆరవ తరగతి. ఈ విషయం తనతో నేను మాట్లాడలేదు. బడిలో అడుగుపెడుతుంటే పుండరి మాస్టారు కనిపించారు. నాలో వణుకు మొదలయింది. ఆయన్ని మా తరగతికి పంపించకు దేవుడా అని మొక్కుకున్నాను.

————-

చిన్నన్నయ్య వేరేచోట చదువుకుంటున్నాడు. నేను తొమ్మిదో తరగతి మధ్యలో మానేశానని తెలుసుకుని ఇంటికి వచ్చాడు.

‘‘ఎందుకని చదువు మానేస్తున్నావు. మనింట్లో నువ్వన్నా బాగా చదువుకోవాలి. నువ్వు డిగ్రీ చేయాలి. ఈలోగా నీకు ఉద్యోగం వస్తుంది. నిన్ను నేను చదివిస్తాను. అంతగా అయితే నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఉద్యోగం కూడా చేయాలి. నా మాట విని నువ్వు బడికి వెళ్లు’’ అని నన్ను బతిమాలాడు.

పుండరి మాస్టారు అప్పటికి మా క్లాసుకు రావటం లేదు. కానీ ఇంకో టీచర్‌కి బదిలీ అయింది. అందుకని తను మా మాస్టారిగా వస్తారు అని తెలిసింది. నిజానికి బదిలీ కావల్సింది మా టీచర్‌ ‌సరిత కాదు పుండరిగారు. ఆయనకు అక్కడ మంచి పలుకుబడి ఉంది. అందుకని ఆపించుకున్నారు అంటున్నారు.

సరిత టీచర్‌తో నాకు మంచి స్నేహం ఉంది.

ఓ రోజు అడిగాను…

‘‘ఆడవాళ్లని మగవాళ్లు నమ్మరా టీచర్‌?’’

‘‘ఎం‌దుకలా అడిగావు. అసలు ఆ మాట ఎవరన్నారు. ఆడవాళ్లు అంటే మనుషుల్లో సగం మంది. మగవాళ్లే కాదు మనం అంటే ఆడవాళ్లం కూడా మనం నమ్మాలి.’’

అప్పటికీ నేను పుండరి గురించి టీచర్‌కి చెప్పలేదు.

‘‘ఒకప్పుడు ఆడవారికి చదువు అనవసరం అనుకున్నారు. నేను టీచర్ని అయ్యాను. ఇది చిన్న ఉద్యోగమే. అసలు మన మాజీ ప్రధాని స్త్రీనే కదా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఆడవారున్నారు. గొప్ప గాయనీమణులున్నారు. కథనాయికలున్నారు. నీకు ఇంతటి ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు ఆడవాళ్లు లేని ప్రపంచం ఉండదు.’’

అప్పుడు నేను మాస్టారి గురించి చెప్పాను.

కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు.

‘‘మనుషుల్లో రకరకాలవారున్నారు. ఆ మాస్టారికి అమ్మా- భార్య లేకపోతే అయిదు నిమిషాలు సుఖంగా ఉండలేరు. మాస్టారు ఇన్ని కోట్లమందిలో ఒకరు మాత్రమే. చదువుకుంటే చాలదు. ఏది ఎంతవరకు చెప్పాలి. అసలు ఏది పిల్లలకు చెప్పాలి అనే విచక్షణ మనుషులకి ఉండాలి. తను ఆడవాళ్లని నమ్మవద్దు అన్నారని మనం మగవాళ్లని నమ్మవద్దు అనుకుంటే లోకం ఇలా ఉండదు. ఈ ప్రపంచం మనందరిదీ. అది గుర్తుంచుకో’’ అన్నారు.

సరిత టీచర్‌ అక్కడి నుండి వెళ్లేముందు నన్ను కౌగలించుకున్నారు. ‘‘నీమీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నిన్ను భవిష్యత్తులో మంచి ఉద్యోగంలోనో, ఏదోక రంగంలోనో చూసుకోవాలి’’ అని మరీ మరీ చెప్పి వెళ్లారు.

సరిత టీచర్‌ ‌వెళ్లిపోయాక నేను ఒంటరిదాన్ని అయ్యాను. ఆమె ఆశల్ని, మా అన్నయ్య ఆరాటాన్ని కూడా నేను నిలబెట్టుకోలేకపోయాను.

నేను చదువు మానేశాను!

————-

అక్కడి నుండి నేను ‘ఇంట్రాకర్ట్’‌గా మారి పోయాను. ఇంట్లో మిగిలింది నేను. నాలుగో అక్క కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పెద్ద అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది. చిన్న అన్నయ్య ఐ.టి.ఐ.లో ఫిట్టర్‌ ‌కోర్స్ ‌చేశాడు. హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద అన్నయ్య పెళ్లి అయింది. వేరే ఊర్లో కాపురం పెట్టారు. మిగిలింది అమ్మా – నేనూ – నాన్న.

నేను మా గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివేశాను. అక్కడ ఉన్నవి తక్కువే.  కొత్త పుస్తకాలు రావటం ఆగిపోయింది.

అలాంటప్పుడు నాకో ఆలోచన వచ్చింది.

నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే!

అలాంటి ఆలోచన రావటానికి కారణం ఉంది. మా బంధువుల్లో ఇద్దరున్నారు. ఒకామె బాగా చదువుకుంది. మంచి ఉద్యోగంలో ఉంది. తను పెళ్లి చేసుకోలేదు. అమ్మా – నాన్నలు, బంధువులు ఎంతగానో చెప్పి చూశారు. అయినా అంగీకరించ లేదు. అందుకు రకరకాల కారణాలు చెప్పుకునేవారు.

ఇంకో అమ్మాయికి చదువుంది. ఉద్యోగం ఉంది. పెళ్లి చేసుకోవాలని ఉంది. అప్పటికి ఇరవై ఏడు సంవత్సరాలు. అయినా ఎవరూ తనని చేసుకోవటానికి ముందుకు రావటం లేదు.

నేను విన్న మాటల్ని బట్టి అంత చదువు చదివిన ఆడపిల్లల్ని అందరు మగవాళ్లు భరించలేరని, మొదటి వ్యక్తి ఈ మధ్యన చనిపోయారు. బతికినంత కాలం కుమారిగానే ఉన్నారు. అందుకు కారణం ఆమెతోనే సమాధి అయిపోయింది.

రెండో వ్యక్తి వయసు మళ్లిన వ్యక్తితో రాజీపడింది.

ఇలాంటి సమయంలో సరిత టీచర్‌ ‌నన్ను చూడటానికి వచ్చారు. నేను చదువు మనేశానని తెలుసుకుని చాలా బాధపడ్డారు. అప్పుడు టీచర్‌గారితో నా మనసులో మాటని చెప్పాను.

‘‘పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదా! నీకు ఎంత ఆస్తి వస్తుంది’’ అని అడిగారు. మొదటిసారి నేను నిర్ఘాంతపోయాను.

మా నలుగురి అక్కల పెళ్లిళ్లు ఎలా అయ్యాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అప్పట్లో మాకు రెండెకరాల భూమి ఉండేది అంటారు. మా నాన్న ఇంకొకరితో కలిసి చిన్న వ్యాపారం చేశారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. నాకు ఊహే తెలిసేటప్పటికి ఆ వ్యాపారం లేదు.

మా ఇద్దరక్కల పెళ్లి నాటికి నేను చిన్న పిల్లని. వారి పెళ్లికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చారంట. మూడో అక్క పెళ్లికి రెండువేలు. నాలుగో అక్క పెళ్లికి నాలుగువేలు. అప్పట్లో పొలాల ధర చాలా తక్కువ. అన్నీ గొప్ప గొప్ప సంబంధాలు కాదు. చిన్న చిన్న ఉద్యోగాలు, మూడవ బావగారు చిన్న వ్యాపారం చేస్తారు. అందరూ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. ఇంకా అర ఎకరం పొలం ఉంది. అందులో వచ్చే ధాన్యం వాడుకుంటారు.

మూడువందల గజాల స్థలంలో చిన్న రేకుల షెడ్డు. అక్కడ కూరగాయలు పండించుకుంటారు. చిన్న చిన్న పూల మొక్కలు నేను పెంచుతాను. అత్యంత సాధారణ జీవితం. నాన్నకు ఎన్ని అప్పులున్నాయో తెలియదు. ఇంకా ఆస్తి ఏమిటి? అనుకున్నాను.

‘‘రమా… నువ్వు చదువు ఎందుకు మానేశావో పూర్తిగా నాకు తెలియదు. అలాగే పెళ్లి ఎందుకు చేసుకోనంటున్నావో కూడా నాకు తెలియదు. రేపు ఎలా బతకాలనుకుంటున్నావు. చదువుకుని ఉద్యోగం చేస్తే అది వేరు. ఆస్తి ఉంటే అదో రకం. అమ్మా నాన్నల తర్వాత ఎవరి దగ్గర ఉంటావు? అన్నల దగ్గరా? వారు మాట సాయం చేస్తారు. ఆర్థికంగా కొంతవరకు చేయగలరు. తర్వాత…. ఒకరిమీద ఆధారపడాలనుకుంటున్నావా? నీకంటూ వ్యక్తిత్వం, భద్రత అవసరం లేదా? పోనీ ఇప్పటి నుండయినా చదువు మొదలుపెట్టు’’ అన్నారు.

అప్పుడు నాకు అర్థం అయింది. మనకు ఎన్ని ఆశలయినా ఉండొచ్చు ఆరాటాలు ఉండొచ్చు. మనకి ఆర్థిక స్వాతంత్య్రం లేకపోతే మాత్రం అలాంటివి నెరవేరటం కష్టం.

‘‘నేను నీకు చెప్పగలిగేది ఒకటే. మీ నాన్న గురించి నేను విన్నాను. గొప్ప వ్యక్తి. అందుకే ఇంతమందిని కన్నా అందరికీ కనీస జీవితం ఇవ్వగలిగారు. అందుకు మీ అమ్మగారి సహకారం ఉంది. మీ అమ్మా – నాన్నలే నాకు ఆదర్శం. పెళ్లికి భయపడకు. అతను నీకు తండ్రీ – అన్న- స్నేహితుడిగా మలుచుకో… నువ్వు ఎవరికీ సమస్యగా మిగలకు. కుటుంబాన్ని మించిన స్వర్గం ఇంకొకటి ఉండదు’’.

నేను చిన్నగా తలూపాను.

‘‘కుటుంబాన్ని నడపటం అంటే, అదీ యుద్ధమే. అదీ చదువే. అదీ కళే. సహనమే. ఇవేం చేయలేని వారు పెళ్లి నుండి పారిపోతారు’’ అని వెళ్లేముందు ఇంకో విషయం చెప్పారు.

‘‘పుండరీ మాస్టారి అమ్మాయి విడాకులు తీసుకుంది’’.

‘‘నిజమా టీచర్‌. ఎం‌దుకు?’’

‘‘తెలియదు. ఆ అమ్మాయిని వారి అల్లుడు నమ్మలేదో, అల్లుడ్ని అమ్మాయి నమ్మలేదో వారికే తెలియాలి. ఇంట్లో వారి అభిప్రాయాలు, ఆచరణ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి’’.

అప్పట్లో విడాకులు కేసులు చాలా తక్కువ.

————-

సరితా టీచర్‌ ‌నా మీద పెద్ద ప్రభావం చూపించారు.

నేను పెళ్లి చేసుకున్నాను. భద్రత కోసం కాదు. మా వదిన ఈ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. నవీన్‌ ‌తనకి తమ్ముడు అవుతాడు. ఇంటర్‌ ‌మీడియట్‌ ‌వరకు చదివాడు. మా పెళ్లి రోజుకి అతనికి ఉద్యోగం లేదు. వెనకాల ఎలాంటి ఆస్తి లేదు. ఆ కుటుంబం బాగా చితికిపోయింది. ఉన్న అర ఎకరం అమ్మితే ఆరువేలు వస్తుంది. అది ఇస్తాం. నవీన్‌కి ఉద్యోగం చూసుకుందాం అంది వదిన.

అప్పటికే నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. బతుకు అనే ఓ మహాయుద్ధాన్ని మొదలుపెట్టాలని మాత్రమే నాకు అర్థం అయింది. నవీన్‌కి ఉద్యోగం వస్తే ఆరువేలు పెళ్లి ఖర్చులకు కూడా చాలవని మాకు తెలుసు.

మా అమ్మా, నాన్నలను ఇబ్బంది పెట్టకూడదనే విషయం మా ఇంట్లో అందరికీ తెలుసు!

————-

ఇప్పుడు నేను మా వైవాహిక జీవితం గురించి చెప్పాలనుకోవటం లేదు. నవీన్‌కి ఉద్యోగం చూడటం ఎవరికీ సాధ్యం కాలేదు. రకరకాల ఉద్యోగాలు. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. పన్నెండు సంవత్సరాల తర్వాత కనీస జీవితం మొదలయింది.

ఈ కాలంలో మేం తగాదాలు పడలేదా! అభిప్రాయ భేదాలు రాలేదా అంటే వచ్చాయి. రాకుంటే అది సంసారం ఎలా అవుతుంది. నాలానే నవీన్‌ ‌పుస్తకాలు విపరీతంగా చదువుతాడు. మరీ ముఖ్యమైందనుకున్నప్పుడు కొంటాడు. నాలుగయిదు ఊర్లు తిరిగాం. అక్కడ మిత్రులు – గ్రంథాయాలు మాకు నేస్తాలయ్యారు.

పుండరి మాస్టారు చనిపోయారని విన్నాను. మా ఇంట్లో అందరికీ ఇళ్లు వచ్చాయి. మాకు లేదు. లేదన్న బాధ లేదు.

ఈ మధ్య కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అప్పుడే నలభై సంవత్సరాల సహజీవనం పూర్తి అయింది.

పిల్లలకు గొప్ప చదువులు చెప్పించలేదు.

అయినా పెళ్లిళ్లు చేశాం. ఇద్దరూ పక్క పక్కన ఉంటారు. నవీన్‌ది ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఓపిక ఉన్నంతవరకు పనిచేస్తాడు.

————-

ఈ కథ మొదలుపెట్టినప్పుడు…

ఆ రోజు నేను రచయిత్రిని కావాలనుకున్నాను అన్నాను. కాలేకపోయాను. బతుకంతా యుద్ధంతో సరిపోయింది. ఇది ఒంటి చేత్తో చేసిన యుద్ధం కాదు. నవీన్‌ – ‌నేను కలిసి బతుకు అనే కదనరంగంలో దూకి చేసిన యుద్ధం.

మా కళ్ల ముందు సంసారాలను కూలదోసుకున్న మగవాళ్లు, ఆడవాళ్లున్నారు. సమన్వయంతో ముందుకుపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని మార్చాలనుకున్నవారు ఎవరైనా ముందు ఒకటి చెబుతారు.

సర్వజనులూ సుఖంగా బతకాలని అందుకు ఏం చేయాలి అనే విషయం మీద ఇన్ని రకాల వాదాలు ఇన్ని చీలికలు, ఇంతమంది తమ బతుకులని అంకితం చేసుకోవటాలు.

ఈ మధ్యకాలంలో నేను చదువుకున్నాను. డిగ్రీ పూర్తి చేశాను. ప్రైవేట్‌గా. ముఖ్యంగా ఆధునిక మహిళల్ని, వారి సాహిత్యాన్ని అధ్యయనం చేశాను.

ఓ గొప్ప తృప్తితోపాటు అంతులేని బాధ కూడా నన్ను కుదిపేస్తోంది. ఇలాంటి పరిణమాలు జరుగుతాయని అప్పట్లో నేను ఊహించలేదు.

ఇప్పటి ఆడపిల్లలు నాలా, మాలా లేరు.

అంతవరకు సంతోషం.

నేను ఇప్పుడు నాణానికి రెండో పక్కన చూస్తున్నాను.

————-

అంతులేని విద్వేషం కనిపిస్తోంది.

మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదు. ప్రతిరోజూ, ప్రతి నిమిషం స్త్రీల మీద అనేక దాడులు జరుగు తున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నాయి. అందు లోనూ చిన్న పిల్లల మీద కూడా… మానవత్వం ఇంతగా పతనం అవుతున్న క్షణాల్లో అందరం ఏం చేయాలి అని తర్కించుకుంటున్న సమయంలో నాకు కొందరు స్త్రీలలో ‘పుండరి’ మాస్టారు కనిపించారు.

అవును ‘ఆడదాన్ని నమ్మవద్దు’ అన్న మాస్టారికి, మగవాళ్లంతా మృగాలు, పశువులు అని, మగవాడు మన శత్రువు అని ప్రచారం చేస్తే కొందరు ఆడవాళ్లు ఏమీ తీసిపోరు.

పుండరి మాస్టారు గత కాలపు భావాలకు ప్రతినిధి.

వీళ్లు ఆధునికులు. అయితే ఏంటి? అన్నీ ధ్వంసం చేసుకుంటూపోవటమేనా వీరి సృజన. అంతా వ్యక్తిగతమేనా? నిర్మాణం అవసరం లేదా? నిరంతరం వార్తల్లో ఉంటే చాలా! వీరు ఏం రాసినా, ఏం మాట్లాడినా అదంతా తాత్కాలిక కీర్తికా!

ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటివారి ప్రభావంలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చేసుకోబోతున్నారు! అందుకే అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తాను.

విధ్వంసం పరిష్కారం కాదు.

విధ్వంసం నుండి విధ్వంసానికి మన ప్రయాణం కాకూడదు.

స్త్రీకి – పురుషుడు ఎప్పుడూ శత్రువు కాదు.

ఏం చేసినా వ్యక్తులు మాత్రం చేస్తారు.

అది ఆడయినా, మగయినా, కులం, మతం, ప్రాంతం ఏదైనా ఈ మాత్రం అవగాహన, సహనం లేనివారు ఎల్లకాలం నాయకత్వంలో ఉండలేరు.

విధ్వంసకులుగా చరిత్రలో మిగిలిపోతారు.

————-

మళ్లీ చెబుతున్నాను.

ఈ ప్రపంచాన్ని మార్చటానికి నేను రచయిత్రిని కావటం లేదు. నన్ను నేను మార్చుకోవటానికి, నాలాంటి వారితో భావాలు పంచుకోవటానికి, ఓ చిన్న కుటుంబాన్ని కాపాడుకోవటానికి చేసే చిరు ప్రయత్నం.

ఇందులో నాలాంటి వారి పక్కన మగవాళ్లుంటారు. స్త్రీ-పురుషుల కలయికతోనే కొత్త సృష్టి.

మా ప్రయత్నం వ్యక్తిగతం-సామాజికం కూడా!

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram