– డా. కనుపూరు శ్రీనివాసులురెడ్డి

శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది


ఇంటి ముందున్న ఫౌంటైన్‌ ‌పక్కన కూర్చుని, మధ్యలో ఉన్న లక్ష్మీదేవి చేతుల్లో నుంచి తామర పూలతో నిండిన కొలనులోకి జారుతున్న నీటిని చూస్తూ లోకాన్నే మరిచిపోయింది లక్ష్మీదేవి.

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. బద్దెన, యజుర్వేదం, రామాయణంలో కూడా చెప్పారు. ఎందుకనో దీని అర్థం వెలుగులోకి రాలేదు. బహుశా పురుషాధిక్య సమాజం కాబట్టి. నిజంగా అలా ఎవ్వరైనా ఉన్నారా? తప్పక ఉంటారు. తగువులు, హక్కులు, స్వేచ్ఛ అనే అరుపులతో స్త్రీ మనఃశాంతిని, సుఖాన్ని, గౌరవాన్ని పొందగలుగుతుందా? తమ అహంకారాన్ని తృప్తి పరుచుకోవడం తప్ప. జీవితాన్ని నరకం చేసుకోవడం తప్ప.

ఉత్తమ భర్త ఎలా ఉండాలో కూడా చెప్పారు. సర్దుకుపోవాలి. మన్నించుకోవాలి. మరిచిపోవాలి. అప్పుడే సంసారం స్వర్గసీమ అవుతుంది.

కాలం మారితే నైతిక విలువలు, సంస్కృతి మారుతాయా? అర్థంగాని ప్రశ్న..

ఒకరోజు.. పిల్లలకు మంచి బట్టలు, స్కూలు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఆయన సంపాదన అంతంత మాత్రం. వాళ్లకు ఏ లోటూ లేకుండా పెంచింది కదా? భర్తకు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు తోడు నిలిచి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగించింది కదా! కొడుకు వేదకీర్తి, కూతురు తపస్విలను ఆత్మీయ, అనురాగాల విలువ; హిందూ జీవన విధాన గొప్పతనం; వివేకం, విచక్షణ తెలిసేటట్లు తీర్చిదిద్దింది. బాగా చదువుకున్నారు.

ఎంతో కాలంనుంచి ఒక ఆవును తెచ్చుకుందా మని అడుగుతూనే ఉంది. ‘‘అదొక్కటే నా కోరిక. మిమ్మల్ని ఇంకేం అడగను!’’ భర్త ససేమిరా అన్నాడు.

‘‘అందులో పుంగనూరు ఆవులు మరీ శ్రేష్టమైన వట. ఆ మాత పూజ, దర్శనం ఉదయాన్నే చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయంట.’’

మరీ గట్టిగా అడిగితే… తులసి కోట కట్టించు కున్నావుగా, చాలు!

ఈ మధ్య భర్త ప్రవర్తనలో మార్పు… మాటల్లో కసుర్లు, విసుర్లు గమనించింది.

మొదట్లో అప్పుడప్పుడు తాగి వస్తున్నట్లు అనుమానం, అడిగితే ఏదో కార్పొరేట్‌ ‌మీటింగు.. తప్పక.. మర్యాద కోసం.. కొంచెం.. అనేవాడు. అయిష్టంగా సరిపెట్టుకునేది.

ఆరోజు రాత్రంతా నిద్రలేదు. ఉదయం కూతురు, కొడుకు లేచొచ్చి కళ్లు పీల్చుకుపోయి పెద్ద జబ్బున పడిన దానిలా దిగులుతో హాల్లో ఆలోచిస్తూ కూర్చొ నున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయారు.

మెల్లగా తపస్వి దగ్గరగా వచ్చి అనునయంగా ‘‘ఏం జరిగిందమ్మా!’’ అడిగింది.

చాలాసేపటికి బిడ్డ బాధ పడుతుందని తెలిసి, ‘‘ఏం లేదమ్మా! రాత్రి సరిగ్గా నిద్రలేదు.’’ అంది.

కళ్లల్లోని తడిని చూసి అన్నాచెల్లెలు ఒకర్నొకరు చూసుకున్నారు.

‘‘మరి ఎందుకు బాధపడుతున్నావు.’’ చాలా ఆత్రుతగా అడిగిన కొడుకు వైపు చూసి ‘‘ఏం లేదులే?’’ అంది.

‘‘తప్పలేదు.’’ రాత్రి మీ నాన్న నిదురేపోలేదు. ఇలా చాలా రోజులనుంచి జరుగుతుంది. అడిగితే, గదమాయింపు. తలనొప్పి అని మాత్రలు మింగుతూనే ఉంటాడు. స్ట్రాంగ్‌ ‌టీ అర్ధరాత్రిలో కావాలంటాడు.’’ దిగులుగా అంది.

‘‘బీపీ ఎక్కువయ్యిందేమోనమ్మా! టెస్టులు చేయిస్తే సరిపోతుంది. దానికెందుకు దిగులు.’’

‘‘రాడు’’ అంది కూతుర్ని చూసి.

‘‘నేను ఒప్పిస్తాను.’’ అంది తపస్వి.

ఇంతలో, ‘‘అందరూ కలిసి ఏదో కుట్రలు పన్నుతున్నట్లుంది..’’ అంటూ దిగి వస్తున్న తండ్రి అచ్యుతరావు మాటలకు అటు చూసారు.

దిగి వస్తూ పడబోయాడు. వెళ్లి పట్టుకున్నారు.

వాళ్ల ముఖాల్లో కనిపించిన అందోళన చూసి,‘‘ఏం లేదు. రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు. అందుకని..’ అన్నాడు సర్దుకుంటూ అచ్యుతరావు.

‘‘లేదు.. హాస్పిటల్‌కి వెళదాం’’ దిగులుగా తండ్రిని చూస్తూ అంది తపస్వి.

‘‘దీనికెందుకమ్మా! ఎందుకు అంత భయపడ తావు?’’ అంటూ దగ్గరకు తీసుకోబోయాడు. అసంతృప్తిగా దూరంగా జరిగి కన్నీళ్లు పెట్టుకుంది.

భార్య వైపు, కొడుకు వైపు చూసాడు. వాళ్లూ అలాగే ఉన్నారు.

నిట్టూర్పు వదులుతూ కూతుర్ని దగ్గరకు తీసుకుని ‘‘నువ్వు నవ్వుతూ ఉంటే చాలమ్మా! తగ్గిపోతుంది. సరే! అలాగే వెళదాం’’ బుగ్గలు నిమిరాడు.

అన్నీ ముగించుకొని హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయిస్తే బి.పి., కొలెస్టరాల్‌ ఎక్కువగా ఉందని; హార్ట్‌లో, లివర్‌లో కూడా మార్పులు ఉన్నాయని, ఆత్రుతను తగ్గించుకొని కొన్ని పద్ధతలు మానుకుంటే బాగుంటుందని, మందులు రాసి పంపించారు. నూరు జాగ్రత్తలు చెప్పింది కూతురు. సరే అన్నాడు.

కొన్ని రోజులు చాలా బాగున్నాడు. తరువాత మామూలే.. అలవాట్లు మొదలు పెట్టాడు. అడిగితే అరుపులు, అవమానాలు! బ్రతిమాలుకుంటే.. ‘‘తప్పడం లేదు. మందులు వాడుతున్నాను కదా ఏం కాదు?’’ అని భార్య జాగ్రత్తను అర్థంలేనిది అన్నట్లుగా మాట్లాడి నోరు మూయించే వాడు. మనశ్శాంతి, నిద్ర పూర్తిగా దూరమయ్యాయి లక్ష్మీదేవికి.

ఒకరోజు తిట్టుకుంటూ విసుక్కుంటూ ఇంట్లోకి రావడం గమనించింది లక్ష్మీదేవి. దగ్గరగా వచ్చిన ఆమె వైపు చూసి,‘‘మీ ఆడోళ్లకు బుద్ధీ జ్ఞానం ఉండనే ఉండవు. సంసారాలు తగలపెడ తారు’’ గట్టిగా అన్నాడు.

ఏం జరిగిందో, తను ఏం చేసిందో అర్థంగాక, ‘‘ఏమ య్యిందండీ.’’ అనడిగింది లక్మీదేవి.

‘‘ఏం జరగాలి.. మన సుధాకర్‌ ‌లేడూ అతని భార్య సుభద్ర.. ఉరేసుకుంది. దరిద్రం, శని…’’ అని కోపంగా, దిగులుగా కూర్చున్నాడు.

నిర్ఘాంతపోయి గుండెలు పిండుతూ ఉంటే తట్టుకోలేక.. భర్త ఆమెను నానా మాటలు అంటూ ఉంటే సహించలేక..‘‘మీరు ఆమెనే తప్పుపడుతున్నారు. తాగొచ్చి తనను, బిడ్డల్ని కొడుతుంటే భరించలేక! బిడ్డలుండి ఆత్మహత్య చేసుకునే తల్లులపై నేను జాలి చూపను. అంతగా ఉంటే తెగతెంపులు చేసుకుని బిడ్డల కోసం బ్రతికితే మెచ్చుకుంటాను. పాపం ఆ బిడ్డలు? ఆ చండాలుడు!’’ అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.

‘‘తప్పని పరిస్థితులు కొన్ని ఉంటాయి.’’

‘‘ఏమిటవి? తాగడం మీకు ఇష్టం, సోషల్‌ ‌స్టేటస్‌. ‌నాకూ ఓ దరిద్రపు పని ఇష్టం. చెయ్య మంటారా?’’ కంగుతిన్నాడు అచ్యుతరావు. ‘‘ఇంటికొచ్చి భార్యాపిల్లలతో గడపొచ్చుగా! ఇక్కడ ఈగోలు. ఛ! పెళ్లాంతో ఏమిటి? టైం వేస్టూ.. ఆ లోకంలో అయితే? ఎన్ని విడాకులు, మానభంగాలు, ఆర్ధిక నరకాలు!! సిగ్గు, బాధ్యత గుర్తుంటే తాగరు. మరిచిపోతే సాంఘిక వ్యభిచారులు, అనైతిక వీధి కుక్కలు ఆ మగాళ్లు! ఇంటికే తెండి అందరం తాగుదాం. నా చావుకు ముహూర్తం నిర్ణయించి’’ అసహ్యంగా చూస్తూ విసురుగా లేచిపోయింది, లక్ష్మీదేవి.

చెమటలు పోశాయి అచ్యుతరావుకు. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎప్పుడూ ఇలా?

మరుసటి రోజునుంచి ఆ ఇంట్లో సంతోషం కాపురం చేసింది. అందరూ కలిసి షాపింగులకు, దేవాలయానికి వెళుతున్నారు. వారం వారం మానసిక వికలాంగుల అంతర్జాతీయ సంస్థ దగ్గరికి వెళ్లి చూసి వస్తుంది లక్ష్మీదేవి. తోచింది ఎప్పటినుంచో ఇస్తుంది.

కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెండ్లి చెయ్యాలని ఎన్నాళ్లనుంచో లక్ష్మీదేవి, అచ్యుతరావు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వేదకీర్తి దాటేస్తూ వస్తూనే ఉన్నాడు.

ఆరోజు అందరూ హల్లో మాట్లాడుకుంటున్న ప్పుడు ‘‘నేను నిర్ణయించుకున్నానమ్మా పెండ్లి చేసుకోవాలని’’ తల్లి, తండ్రిని చూసి వేదకీర్తి అన్నాడు.

లక్ష్మీదేవి, అచ్యుతరావుల ముఖాలు వెలిగిపోయాయి.

‘‘ఇంకా ఎందుకు ఆలస్యం. మొన్న చూసిన అమ్మాయి అందరికి నచ్చింది కదా! రమ్మని చెప్పండి.’’ అంది లక్ష్మీదేవి.

‘‘కాదమ్మా!’’ అని కొడుకు తటపటాయిస్తూ ఉండే సరికి లక్ష్మీదేవి ప్రశ్నార్ధకంగా భర్తను చూసింది.

తలొంచుకొనున్న కొడుకుని చూసి ‘‘ఆ అమ్మాయి నీకు కూడా నచ్చిందని చెప్పావు. మరి, వేరే ఆలోచన ఏమైనా ఉందా?’’ అని భార్య వైపు చూసాడు.

వేదకీర్తి తల్లిని చూసి ‘‘పెద మావయ్య కూతుర్ని చేసుకుంటాను.’’ అన్నాడు.

అచ్యుతరావు తృప్తిగా నవ్వుతూ,‘‘దానికెందుకు వెనకాడటం, బాగుంటుంది. మంచి అమ్మాయి. మీ అమ్మ అంటే ప్రేమ, గౌరవం’’ అని భార్య వైపు చూసాడు. నల్లబడి కాలిపోయినట్లు అనిపించింది ఆమె ముఖం. ఎందుకో అర్థంకాలేదు.

భర్త చెప్పిన మాటలు ఇష్టంలేనట్లుగా లోపలికి వెళ్లిపోయింది లక్ష్మీదేవి.

ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తండ్రి, బిడ్డలు.

తరువాత ఆ విషయం గురించి రెండు మూడుసార్లు అచ్యుతరావు ప్రస్తావించినా మౌనంగా ఉండిపోయింది. వారం పది రోజులు గడిచి పోయాయి. వేదకీర్తి తల్లి ఏ విషయమూ చెప్పడం లేదని ఆందోళనగా ఉన్నాడు. తపస్వి కూడా ఒకటి రెండు సార్లు అడిగినా సమాధానం లేదు.

ఆ రోజు ఆదివారం. అకాడెమీకి ఒంటరిగానే వెళ్లాలనుకుంది కానీ కొడుకును, కూతుర్ని పిలిచింది. కాదనలేక వెళ్లారు.

అడ్మినిస్ట్రేటర్‌ ‌లక్ష్మీదేవిని చూసి, పిల్లల వైపు తిరిగి ‘‘మీ అమ్మగారు దేవత. చూస్తే శాపగ్రస్తులు ఎంత సంతోషపడతారో?’’ అంది నవ్వుతూ.

వేదకీర్తి, తపస్వి హృదయాలు గౌరవంతో పొంగి పోయాయి. ఆ తల్లికి బిడ్డలైనందుకు గర్వపడుతూ వినయ పూర్వకంగా ఆమెకు నమస్కరించారు.

ఆ పిల్లల్ని చూసి వేదకీర్తికి, తపస్వికి తల తిరిగిపోయింది. పిచ్చి పట్టినట్లు అయిపోయారు.

ఒక్కొక్కరిని చూపిస్తూ చెప్పుకు పోతూనే ఉంది ఆమె. సంవత్సరానికి వికలాంగులుగా.. బాగు చెయ్యలేని జబ్బులతో కోటాను కోట్లు పుడుతున్నారు. కుప్పతొట్లలోనో, చెత్తకుప్పల్లోనో తేలుతున్నారు. ముఖ్యంగా దగ్గర సంబంధాలు పెండ్లి చేసుకున్న వారికి జెనిటిక్‌ ‌డిసిజ్‌ ఆర్డర్సుతో కాన్సర్‌, ‌మెంటల్‌ ‌రిటార్‌డేషన్‌, ‌సెరిబ్రల్‌ ‌పాలసీలతో పుట్టే వాళ్లు ఎక్కువ. అవి ఒక్క తరంతో ఆగవు. పుట్టి తల్లిదండ్రు లకు నిత్య నరకాన్ని ఇచ్చి పోతారు. మీరు చేసుకున్న పాపం, ప్రారబ్ధ ఖర్మ అంటారు. కాదు మన అజ్ఞానం, కాలుష్యం, నిర్ణయాలు.

మోయలేని దిగులుతో ఇంటికి వచ్చారు.

తపస్వి బాధతో పైకెళ్లిపోయింది. కొడుకు ఆలోచనలో ఉన్నట్లు గమనించింది లక్ష్మీదేవి. పైనుంచి మెయిల్‌ ‌చూసి ఎగిరి గంతులేస్తూ క్రిందకు దూకి తండ్రిని, తల్లిని, అన్నను కౌగిలించుకుని సంతోషం పట్టలేకపోయింది. ఆనందంతో పొంగి పోతున్న కూతుర్ని చూస్తూండిపోయారు.

వేదకీర్తికి చిరాకేసి ‘‘ఏంటో చెప్పక ఎందుకా కుప్పి గంతులు.’’ అని గట్టిగా కోప్పడ్డాడు.

‘‘యు.పి.ఎస్‌.‌సి. ఎగ్జామ్స్ ‌పాస్‌ అయ్యానోచ్‌! ‌డెహ్రాడూన్‌ ‌వెళ్లిపోతానోచ్‌. ఆర్మీలో చేరి పోతానోచ్‌.’’

ఆ ‌మాటలు విని అచ్యుతరావు ముఖం వెలవెలపోవడం, లక్ష్మీదేవి ముఖం వెలిగిపోవడం ఒకేసారి జరిగాయి.

‘‘ఆర్మీనా? నువ్వా! ఎప్పుడు రాసావు? ఎవరి ఆలోచన?’’

‘‘చెపుతూనే ఉన్నాను కదా! యు.పి.ఎస్‌.‌సి. పరీక్షల కోచింగ్‌కు వెళుతున్నానని.’

‘‘అది నిజమే! సెంట్రల్‌, ఐఏఎస్సో అనుకున్నాను. ఆర్మీ!?’’ దిగులుతో కూర్చున్నాడు.

తండ్రి ఆ విధంగా ఉండటం చూసి చాలా నిరాశ చెందింది తపస్వి. తల్లి దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది. అది చూసి ఆశ్చర్యపోయాడు అచ్యుతరావు. కొడుకు ఇష్టాన్ని కాదన్నది. మరి ఇది?

‘‘నాకు ఇష్టం లేదు. నువ్వు మా కళ్లముందే ఉండాలి. నీ భవిష్యత్తును గురించి ఎన్నో కలలు, ఆశలు ఉన్నాయి.’’ అంటూ కూతుర్ని కోపంగా చూసి పైకి వెళ్లిపోయాడు. అది చూసి తపస్వి ఏడుస్తూ తల్లిని పట్టుకుని ‘‘అది నా కలల పంట. జీవిత ధ్యేయం అమ్మా!’’ అంటూ కుమిలిపోయింది.

లక్ష్మీదేవి తపస్విని ఎంతో ఓదార్చి, ఎన్నో విధాల చెప్పిన తరువాత కొంచెం నెమ్మదించింది.

దేశానికి సేవ చేసే భాగ్యం. జన్మకు అంతకంటే అర్థం, పరమార్థం లేదు. భర్త మమకారం! గట్టిగా గాలి పీల్చుకుని మౌనంగా కూర్చొనున్న కొడుకుని చూసి నవ్వింది.

కొడుకు రోజు అకాడెమీకి వెళ్లడం, కూతురు ముఖం ముడుచుకొని కూర్చోవడం గమనించింది. ‘‘నీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. నీ ఆలోచన చాలా ఉదాత్తమైనది’’ అంది లక్ష్మీదేవి కూతుర్ని దగ్గరకు తీసుకొని.

‘‘మరి నాన్నో?’’

‘‘ఒప్పుకుంటాడు. నువ్వు, నేను కూర్చొని మాట్లాడుదాం. నిన్ను కాదనడు.’’

తల్లి ఇచ్చిన భరోసాతో కొంచెం మనసు స్థిమిత పడింది. ఎలాగయినా నాన్నతో ‘సరే’ అనిపించి వెళ్లాలనుకుంది.

వారం రోజులు అచ్యుతరావు ఎవరితోను మాట్లా డక కోపంగా, దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు.

బాధ్యత, క్రమశిక్షణ, ఎగుడుదిగుడు లేని జీవితం ఒక్క సైన్యంలోనే వస్తుందని రోజూ ఏదో విధంగా భర్తకు చెపుతూనే ఉంది.

దూరం, ఎక్కడెక్కడో, స్త్రీలకు కఠినమైన జీవితం, సైనికుల ప్రవర్తన అని మొండికేసాడు, విసుక్కున్నాడు, కోపడ్డాడు.

భారతీయ సైనికులు ఎప్పుడూ స్త్రీలను అవమానించరు. ఏదైనా ఉంటే చాలా కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అంతగా ఉంటే మనం వెళ్లి అక్కడే ఉందాం అని ఎంత చెప్పినా.. తరువాత అయిష్టంగానే నాకు ఇష్టం లేదు. మీ ఇష్టం అన్నాడు. తపస్వికి మనస్సు కాస్త నెమ్మదించింది.

ఇక ప్రయాణం కొద్ది రోజులు ఉందనగా అచ్యుతరావు కనిపించకుండా పోయాడు. ఎవర్ని అడిగినా, ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దిగులు పడిపోయారు లక్ష్మీదేవి, తపస్వి.

‘‘నాన్న అలా ఏం చెయ్యడమ్మా! వస్తాడు.’’ అని వేదకీర్తి ఎంత చెప్పినా మనశ్శాంతిగా ఉండలేకపోయింది. కానీ తపస్విని ప్రయాణ ప్రయత్నాలు ఆపవద్దు అంది. తండ్రి లేకుండా ఎలా వెళ్లడం అని ఒకటే ఆలోచన.

లక్ష్మీదేవి మనసులో అగ్ని పర్వతాలు ఎగుస్తున్నా కూతురు దగ్గర చూపించడం లేదు. నిద్ర లేదు, సరిగ్గా భోజనం చెయ్యడం లేదు. ముసలితనం ముంచు కొచ్చేసింది. అమ్మను చూసి వేదకీర్తి, తపస్వి దిగులు పడసాగారు.

ఆరోజు మరీ ఆందోళనగా, విరక్తిగా, భయంగా ఉంటే నిద్ర పట్టక కిందకు వచ్చి హాల్లో కూర్చుంది లక్ష్మీదేవి. పిల్లలు అదే పరిస్థితిలో ఉన్నారేమో, లేచి తల్లి కోసం వెతికి పక్కన వచ్చి కూర్చున్నారు.

వాళ్లిద్దరి వైపు ఒకసారి చూసి, వేదకీర్తి తల్లి చేతులు తన చేతిలోకి తీసుకుని ‘‘ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. నేను మావయ్య కూతుర్ని చేసుకోను.’’ ముద్దు పెట్టుకున్నాడు.

‘‘నా కోసం నువ్వు మానుకోవద్దు, త్యాగం చెయ్యొద్దు. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అది నీ జీవితం. నీ ఇష్టం’’ అంది.

‘‘లేదమ్మా! నా జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే పిల్లలతో మీతో జీవించాలని ఉంది.’’

అర్థమైంది, కొడుకు వికలాంగుల సంస్థకు ఇన్ని రోజులు ఎందుకు వెళ్లాడో. దగ్గరకు తీసుకుని నొసట ముద్దు పెట్టుకుని గర్వంగా కన్నీళ్లతో కూతురు వైపు చూసింది.

తపస్వి వ్యామోహం కంటే జీవితం విలువైనదని తెలుసుకున్న అన్నను మెచ్చుకోలుగా చూసింది.

తపస్వి.. తల్లితో తనూ తండ్రిని కష్టపెట్టదలుచుకోలేదని చెప్పాలనుకుంది. ఈ లోగా కాలింగ్‌ ‌బెల్‌ ‌మోగింది. అప్పుడే పాలు, పేపర్‌ ‌వచ్చేసాయా అనుకుంటూ తపస్వి వెళ్లి తలుపు తీసి, గావుకేక పెట్టింది.

ఏమిటన్నట్లు లక్ష్మీదేవి, వేదకీర్తి చూసి గబుక్కున లేచి పరుగెత్తారు. ఎదురుగా అచ్యుతరావు; తపస్వికి నోట మాట రాలేదు. లక్ష్మీదేవి శరీరం వణికిపోయింది. పడబోతున్న తల్లిని వేదకీర్తి పట్టుకున్నాడు.

అచ్యుతరావు ఆమెను దగ్గరకు తీసుకుని కళ్ల నీళ్లు తుడుస్తూ ‘‘కలకంటి కన్నీరొలికిన శిరి ఇంట నొల్లదు సుమతి’’ అంటూ తుడిచాడు.

వాళ్లను ఎడం చేస్తూ, వాకిలి వైపు చేయి చూపించాడు. తళతళ మెరిసిపోతూ ఉన్న పుంగనూరు ముద్దుగుమ్మ. వీళ్లందరినీ చూస్తూ ముందుకొస్తున్న గోమాతను తపస్వి, వేదకీర్తి ఆదరంతో దగ్గరకు తీసుకుని సంతోషంతో ముద్దులు పెడుతూ తండ్రిని చూసి ‘‘ఏమిస్తుంది ఇది?’’

‘‘మీ అమ్మ ఏమిస్తుందో అది.’’

‘‘అంటే!’’ సంతోషంతో పొంగిపోతూ తల్లిని చూస్తూ, మళ్లీ అడిగింది తపస్వి.

‘‘అమృతం.!’’ అని భార్యను చూసాడు అచ్యుతరావు. విరబూసిన వెన్నెలను మించి సంతోషంతో వెలిగిపోతూ మూగదయిపోయింది లక్ష్మీదేవి.

వెల కట్టలేని ప్రేమాభిమానాలతో కాళ్లకు నమస్కరించబోయిన ఆమెను అక్కున చేర్చుకున్నాడు.

About Author

By editor

Twitter
Instagram