* 370 సవరణతో కశ్మీర్‌ ‌సమస్యకు శాశ్వత పరిష్కారం

* ఆ పదం ఉన్నా, లేకున్నా భారత్‌ ‌సెక్యులర్‌ ‌దేశమే

* ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సమయం ఆసన్నమైంది

* సాగుచట్టాలపై స్టే, నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు అర్ధం చేసుకోలేకపోతున్నా

* ఎన్నికల ప్రణాళికలలోని హామీల మీద ప్రవర్తనా

నియమావళి కావాలి

* ఇతరుల మీద జాతిద్రోహి ముద్ర వేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు


రాజ్యాంగబద్ధమైన నైతికత సహజంగా వచ్చే లక్షణం కాదు. దానిని అలవరుచుకోవాలి అంటారు డాక్టర్‌ అం‌బేడ్కర్‌. ‌రాజ్యాంగాన్ని మనం రక్షించుకుంటే, అది మనను రక్షిస్తుంది అంటారు మరొక మేధావి. ఆధునిక వ్యవస్థకీ, ఆధునిక ప్రపంచంలో నివసిస్తున్నామని చెప్పుకోవడానికీ గీటురాయి వంటి ప్రజాస్వామ్యానికీ మూలస్తంభం ఏ వ్యవస్థకైనా రాజ్యాంగమే. రాజ్యాంగం ఆధునిక ధర్మశాస్త్రం. 1950లో వచ్చిన భారత రాజ్యాంగానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో స్వరాజ్యోద్యమ స్ఫూర్తి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతీయ వ్యవస్థను ఐక్యంగా నిలిపి ఉంచింది. తరువాత… స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి పలచబడిన చేదు వాస్తవం క్రమంగా వెల్లడవుతున్న తరువాత… ఈ దేశాన్ని ఏకత్రాటి మీద నడిపిన ఘనత మన రాజ్యాంగానికే దక్కుతుంది. ఇది చాలు, భారత రాజ్యాంగం ఎంత గొప్ప పాత్రను నిర్వహించిందో చెప్పడానికి. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి సన్నగిల్లినా, స్వరాజ్య సమరయోధుల ఆకాంక్ష గెలిచి కరదీపికలా జ్వలిస్తూనే ఉందన్నమాట. డాక్టర్‌ ‌బాబూ రాజేందప్రసాద్‌, ‌డాక్టర్‌ అం‌బేడ్కర్‌ల సారథ్యంలో నెహ్రూ, పటేల్‌, ‌శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ, రాజాజీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, ‌కేఎం మున్షి, బెనెగళ్‌ ‌శివరావు వంటి ఎందరో మహనీయుల కృషితో భారత రాజ్యాంగం ఆవిర్భవించింది. అయినా ఇంత వైవిధ్యం ఉన్న భారతదేశంలో కొన్ని సవాళ్లు ఎదురుకాక తప్పడం లేదు. అందులో పాలకుల తప్పిదాలు ఉన్నాయి. పార్టీల లోపాలు ఉన్నాయి. విధానాల వైఫల్యం ఉంది. అయినా ఆ సవాళ్లను రాజ్యాంగం ఎదుర్కోగలుగుతున్నది. సామాజిక న్యాయం, రాజకీయ, ఆర్థిక న్యాయాలు అందరికీ అందిస్తున్నది. ఉగ్రవాదానికీ, వేర్పాటువాదానికీ జవాబు ఇవ్వగలుగుతున్నది. ఈ క్రమంలోనే మన రాజ్యాంగం శక్తియుక్తులను ఆవిష్కరిస్తున్నారు, వెలుగునీడలను సమీక్షిస్తున్నారు కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మన తెలుగువారు కె. పద్మనాభయ్య. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మనాభయ్యతో జాగృతి జరిపిన ముఖాముఖీ పాఠకుల కోసం.


స్వాతంత్య్రం వచ్చిన తొలి రెండు మూడు దశాబ్దాలలో ఇంత విశాల దేశం, ఇంత వైవిధ్యం కలిగిన దేశం ఐక్యంగా ఉండడానికీ, ఒకే ఆలోచనా ధోరణితో సాగడానికీ కారణం స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి అంటారు. తరువాత ఆ ఐక్యతను నిలబెడుతున్నది భారత రాజ్యాంగమని కూడా చెప్పుకుంటాం. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో రాజ్యాంగం నిర్వహించిన పాత్ర ఏమిటి?

స్వరాజ్యం సాధించుకున్న తరువాత ఆ తొలి రెండు మూడు దశాబ్దాలలో కనిపించే పెద్ద వాస్తవం అదే. నాడు దేశానికి సుస్థిరతనూ, ఐక్యతనూ ఇచ్చింది అప్పుడు వెల్లివిరిసిన ఆ స్ఫూర్తేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దానితో పాటు ఇందుకు దోహదం చేసిన ఇతర వాస్తవాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ మీద, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకత్వంలో 1996 వరకు సాగిన సంకీర్ణం మీద (జనతా పార్టీ ప్రభుత్వం, వీపీ సింగ్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన కొద్దికాలం మినహా) ప్రజలు పెట్టుకున్న విశ్వాసం కూడా కారణం. ఈ రెండు సందర్భాలలో రెండు తీవ్ర తప్పిదాల కారణంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. మొదటిసారి ఓడిన సందర్భం, అత్యవసర పరిస్థితి విధింపు (1975-1977), ఆ కాలంలో జరిగిన అత్యాచారాలు. రెండోసారి ఓటమికి కారణం- బొఫోర్స్ ఒప్పందంలో జరిగిన అవినీతి. కాంగ్రెస్‌ ‌హయాంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంది. వయోజన ఓటింగ్‌ ‌విధానం పటిష్టమైంది. తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలలో పోలింగ్‌ ‌బూత్‌ల ఆక్రమణ వంటి ఘటనలను మినహాయిస్తే దేశంలో చాలావరకు నిష్పాక్షికంగానే ఎన్నికలు జరిగాయి. వివిధ వర్ణాలతో, రకరకాల జాతులకు చెందిన పూల గుచ్ఛం వంటి భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రోత్సాహం లభించింది. ప్రజానీకం కూడా ఈ తాత్త్వికతను స్వాగతించింది. చట్టం ముందు అంతా సమానులే అనే చట్టబద్ధ వ్యవస్థ క్రమంగా బలపడింది. రాజ్యాంగ, చట్టబద్ధ వ్యవస్థలు ఆ సమయంలోనే ఎక్కువగా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే పటిష్టమైన ప్రభుత్వ శాఖలు కూడా దేశ ఐక్యతను పరిరక్షించడంలో తమవంతు సాయపడినాయి. ఆ విధంగా ఆ కాలంలో దేశ సుస్థిరత, ఐక్యతలను నిలబెట్టడానికి ఉపకరించిన వాటిలో మన రాజ్యాంగం కూడా ఒకటిగా నిలిచింది.

అదే సమయంలో దీనికి విరుద్ధమైన వాస్తవం కనిపిస్తుంది. అది- 352 అధికరణం (అత్యవసర పరిస్థితి ప్రకటన), 356 అధికరణాల(అధ్యక్ష పాలన విధింపు) దుర్వినియోగం. ఇందులో రెండో అధికరణం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఉపయోగించారు. వాస్తవం ఏమిటంటే, ఎవరో కొద్దిమంది మేధావులను మినహాయిస్తే, అధిక సంఖ్యాకులకు రాజ్యాంగం, అందులోని నియమ నిబంధనల గురించి తెలియదు. అలాగే రాజ్యాంగం మీద జరగవలసినంతగా బహిరంగ చర్చ కూడా జరగలేదు.

ఈనాడు భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని కొన్ని సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలతో తలెత్తిన కొన్ని సంక్లిష్ట పరిస్థితులను అదుపు చేయడంలో లేదా నిర్మూలించే విషయంలో, ప్రత్యక్ష పరోక్ష వేర్పాటువాదాలకు సమాధానం చెప్పడంలో రాజ్యాంగం ఎలాంటి పాత్రను నిర్వహిస్తున్నది?

వేర్పాటువాద ధోరణులకు సంబంధించి చూస్తే, గణతంత్ర భారతదేశం అవతరించిన సమయంలోనే, అంటే స్వాతంత్య్రం సాధించుకున్న నాటి నుంచి 60వ దశకం ఆరంభం వరకు కూడా ద్రవిడ వేర్పాటు వాదాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. 1963 సంవత్సరంలో 19వ అధికరణం, దానికి సంబంధించిన ఇతర నియమ నిబంధనలను (16వ రాజ్యాంగ సవరణ) సవరించారు. భారత సమైక్యత, సార్వభౌమత్వాల పరిరక్షణ కోసం భావ ప్రకటనా స్వేచ్ఛ మీద అంక్షలు విధించడానికి ఉపకరించే ఎలాంటి చట్టమైనా తీసుకువచ్చే అధికారం ఆ సవరణతోనే రాజ్యానికి దఖలు పడింది. ఈ సవరణ తరువాత చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధులంతా కూడా దేశ సమైక్యత, సార్వభౌమాధికారాలను నిలబెడతామని ప్రమాణం తీసుకోవడం అనివార్య మైంది. ద్రవిడ ఉద్యమాన్ని నిలువరించడానికి ఇదే తోడ్పడింది. పంజాబ్‌లో ఖలిస్తాన్‌ ఉద్యమం 1980 నుంచి తారస్థాయికి చేరుకోవడం మొదలయింది. 1983లో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు. దశాబ్దకాలం రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా పటిష్టంగా అమలైన పోలీసు చర్య, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యమం మద్దతు కోల్పోవడం, కొన్ని రాజకీయ సర్దుబాట్లు కారణంగాను ఖలిస్తాన్‌ ‌వేర్పాటు ఉద్యమం అదుపులోకి వచ్చింది. మరొక గట్టి వేర్పాటువాద ఉద్యమం మిజోరంలో జరిగింది. అక్కడ వైమానిక దళాన్ని ఉపయోగించవలసి వచ్చింది. రాజ్యాంగ సవరణ ద్వారా 1986లో  మిజో ఒప్పందం చేసుకుని, మిజోరంకు రాష్ట్ర హోదా కల్పించారు. అస్సాం ఉద్యమ నేతలతో 1985లో కేంద్రం ఒప్పందం చేసుకుంది. దానితో కొన్నేళ్ల పాటు రాష్ట్రంలో శాంతి నెలకొంది. అయితే ఆ ఒప్పందం మేరకు అందులోని కొన్ని అంశాలను అమలు చేయకపోవడంతో మళ్లీ అస్సాంలో అశాంతి రగుల్కొనడం వేరే విషయం.

ఇక జమ్ముకశ్మీర్‌ అం‌శం. ఏడేళ్ల పాటు రాష్ట్రపతి పాలన విధించడం, ఆ కాలమంతా ఉగ్రవాద వ్యతిరేక చర్యలను చేపట్టడం కనపిస్తుంది. కానీ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు సరిహద్దు అవతల నుంచి మద్దతు ఉండడం వల్ల ఆ చర్యలు పరిమితంగానే ఉపకరించాయి. తాత్కాలిక ప్రాతిపదిక మీద భారత రాజ్యాంగంలో పొంది పరిచిన నిబంధన (370 అధికరణం) కారణంగా కేంద్రానికి పరిమిత అధికారాలే ఉన్నాయి. దీనితో వేర్పాటువాద, ఉగ్రవాద కార్యకలాపాలన అరికట్టడంలో వైఫల్యం కనిపిస్తుంది. వివిధ ఆర్థిక పథకాలతో కశ్మీరీల మనసులు గెలుచుకోవడానికి కేంద్రం యత్నించినప్పటికి ఈ వైఫల్యం తప్పలేదనిపిస్తుంది. ఆగస్ట్ 2018‌లో పాత 370 అధికరణాన్ని సవరించి కొత్త 370 అధికరణాన్ని రూపొందించడంతో తన చట్టాలను అమలు చేయడానికి కేంద్రం తీసుకున్న ఆ చర్య సరైన దిశగా పడిన అడుగే. భవిష్యత్తులో జమ్ము కశ్మీర్‌ ‌సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడానికి కూడా ఈ అడుగే నిశ్చయంగా దోహదం చేస్తుంది.

నక్సలిజం సమస్య పరిష్కారానికి రెండు పార్శ్వాలు ఉండాలి. ఒకటి- చిరకాలంగా అభివృద్ధికి దూరంగా ఉండిపోయి, నక్సలిజం మనుగడ సాగించడానికి ఆస్కారం కల్పిస్తున్న ప్రాంతాలను ముందుగా అభివృద్ధి చేయడం. రెండు- ఈ బెడదను నివారించడానికి పటిష్టమైన పోలీసు చర్య తీసుకోవడం, నక్సల్స్‌కు అక్రమ ఆయుధాలు అందే మార్గాలను మూసివేయడం. ఈ రెండు చర్యలు కూడా జోడుగుర్రాల మాదిరిగా పనిచేయాలి. ఇందుకు ప్రభుత్వ ఆమోదం ఉన్నప్పటికీ అమలులో చాలా చిక్కులు ఉన్నాయి. చెట్టు ముందా విత్తు ముందా అన్న చందాన ఉంటుంది. శాంతి లేకుండా తీసుకురావలసిన అభివృద్ధిని తీసుకురావడం సాధ్యం కాదు. ఈ ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరిగితే తప్ప ఇక్కడ శాంతి నెలకొనదు. ఇక్కడ పటిష్టమైన రీతిలో స్థానిక, జిల్లా స్థాయి వ్యవస్థల మధ్య అధికార వికేంద్రీకరణ జరగాలి. ఇందులో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాలలో కొన్ని కొన్ని విజయాలు ఉన్నప్పటికీ ఇంకా సాధించడానికి అవి పోటీ పడవలసిన అవసరం ఉంది.

 పీఠికలో పొందుపరిచిన విధంగా పౌరులందరికీ సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం అందించడానికి రాజ్యాంగంలో పుష్కలంగా నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగంలోని పదహారవ భాగంలో (330 అధికరణం నుంచి 342 వరకు) షెడ్యూల్డ్ ‌కులాలకు, తెగలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే నిబంధనలు ఉన్నాయి. ఇది రాజ్యాంగం అమలులోకి వచ్చిన కాలం నుంచి ఉన్నదే కూడా. అలాగే 15, 16 అధికరణాలు కూడా. 1951లో రాజ్యాంగంలో చేర్చిన ఈ అధికరణాలతో ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల అభ్యున్నతిని, సామాజికంగా, విద్యలో వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వోద్యోగాల కల్పనకు ఆస్కారం కల్పిస్తున్నాయి. 2019 సంవత్సరంలో రాజ్యాంగం ద్వారా (103వ రాజ్యాంగ సవరణ చట్టం) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్‌ ‌సౌకర్యం అందించారు. 2018 సంవత్సరంలో చేసిన చట్ట సవరణ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదాకు అవకాశం ఇచ్చింది. అంటే ఎస్‌సి జాతీయ కమిషన్‌, ఎస్‌టి జాతీయ కమిషన్‌లకు ఇచ్చినట్టుగానే బీసీ కమిషన్‌కు కూడా హోదా ఇచ్చారు. 104 చట్ట సవరణ 2020తో ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్‌ ‌సౌకర్యం 2030 వరకు పెంచారు. ఈ చర్యలన్నీ ఆ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను పెంపొందించి, వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి చేపట్టినవే.

అభివృద్ధిలో భారీ ప్రాంతీయ వ్యత్యాసాలు, అధికార వికేంద్రీకరణ, ఇప్పుడు బలమైన ఉద్యమం ఏదీ లేకున్నా చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్న రాజకీయ అభిలాష కూడా ఉన్నాయి. స్వాతంత్య్రం సాధించుకున్న అనతి కాలంలోనే జరిగిన రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ, తరువాత జరిగిన ఈశాన్య రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణ, గోవా, సిక్కిం వంటి రాష్ట్రాల ఏర్పాటు అలాంటి రాజకీయ అభిలాషలు నెరవేరినట్టు చెప్పడానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. రాజ్యాంగ సవరణతో చేపట్టి ఎంతో సరళంగా పూర్తయిన చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ‌జార్ఖండ్‌ ‌రాష్ట్రాల ఏర్పాటు పక్రియ మన రాజకీయ విజ్ఞతకీ, రాజ్యాంగ నిబంధనల అమలుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే అవే రాజ్యాంగ నిబంధనలతో నే అయినా ఇందుకు కొంచెం భిన్నంగా ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రెండు రాష్ట్రాలయింది. అయితే తాత్కాలికంగా కొంత చేదును మిగిల్చింది.

భారత రాజ్యాంగం సమున్నతమైనదే. కానీ కాలక్రమేణా రాజ్యాంగ సుస్థిరత, అమలులో చిత్తశుద్ధి లోపించడం గురించి ఆదిలోనే డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌వంటివారు ఊహించిన మాట నిజం. నాటి రాజ్యాంగకర్తలు ఊహించినదే ఇప్పుడు భారతీ యులు చూస్తున్నారని అనుకోవచ్చా?

ఇప్పటిదాకా చెప్పుకున్న ఉదాహరణలను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగం అమలును ఏవిధంగా చేస్తుందన్నది చాలా ముఖ్యమైన విషయమని అర్ధమవుతోంది. డా. బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు ఎంత వివరణాత్మకంగా ఉన్నాయన్నది కాక ఆ నిబంధనలను ప్రభుత్వాలు ఎంత సక్రమంగా అమలు చేస్తున్నాయన్నదానిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని అమలుపరచే వారి నైతికత, ఉద్దేశాలు, చిత్తశుద్ధి పైనే ఆ అమలు ఆధారపడి ఉంటుంది. కేవలం రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు గతంలో అన్యాయంగా అత్యవసర పరిస్థితిని విధించ డానికి కొందరు ఇదే రాజ్యాంగాన్ని ఉపయోగించు కోవడం చూశాం. ఇలాంటి రాజ్యాంగ దుర్వినియోగం గతంలోనూ జరిగింది, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని నిబంధనలు ఉన్నా, నివారణ చర్యలు తీసుకున్నా రాజకీయాల్లో నైతిక స్థాయిని బట్టే ఆ దుర్వినియోగాన్ని అరికట్టగలమా, లేదా అన్నది నిర్ధారణ అవుతుంది. పౌరులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండడమే దీనికి ఏకైక మార్గం. రాజ్యాంగ సంస్థల అధిపతులను, సభ్యులను ఎన్నుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ సంస్థల పనిలో అనవసర జోక్యం కల్పించుకోకుండా ఉండాలి. వివిధ ప్రభుత్వాల హయాంలలో ఇలా అనవసరంగా జోక్యం చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఆ జోక్యం మోతాదు మారుతూ ఉంటుంది.

1976 సవరణ ప్రకారం రాజ్యాంగంలో చేరిన సెక్యులరిజం అన్న పదాన్ని తొలగించాలని డాక్టర్‌ ‌సుబ్రమణియన్‌ ‌స్వామి కోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అంశాలు చర్చకు రావడం వెనుక ఎలాంటి వాస్తవాలు ఉన్నాయని అనుకోవచ్చు?

రాజ్యాంగపు పీఠికలో ఉన్న ‘సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌’ అనే మాటలకు 1976లో ‘సోషలిస్ట్, ‌సెక్యులర్‌’ అనే రెండు మాటలు జోడించారు. ఈ ‘సెక్యులర్‌’ అనే పదం వాటి రాజ్యాంగాల్లో లేకపోయినా అనేక దేశాలు ‘సెక్యులర్‌ ‌దేశాలుగా’నే పేరు పడ్డాయి, అలాగే చలామణి అవుతున్నాయి. భారత్‌లో అమలవుతున్న ‘సెక్యులరిజానికి’ ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరప్‌, అమెరికాల్లో ‘సెక్యులరిజానికి’ తేడా ఉంది. పాశ్చాత్య దేశాల్లో సెక్యులరిజం అంటే రాజ్యం, మతం వేరువేరు అని ప్రకటించడం, చెప్పడం. ఒకప్పుడు చర్చి రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నప్పుడు ఈ భావన ప్రచారంలోకి వచ్చింది. భారత్‌లో సెక్యులరిజం అంటే రాజ్యం, మతం వేరు అనే భావన కాదు. రాజ్యం దృష్టిలో అన్ని మతాలు సమానం (సర్వధర్మ సమభావన) అని అర్ధం. అంటే రాజ్యం మతం ఆధారంగా ఎవరిపట్ల వివక్ష చూపదు అని అర్ధం.

రాజ్యాంగ పీఠికలో, లేదా ఇంకెక్కడైనా కూడా ‘సెక్యులర్‌’ అనే పదం ఉన్నా, లేకపోయినా సరే, భారత్‌ ‌సెక్యులర్‌ ‌దేశమేనని నా అభిప్రాయం. అయినా 1976 నుంచి ఇది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పదాన్ని తొలగించాలనుకోవడం వల్ల అనవసరమైన వివాదామే తప్ప ఉపయోగం లేదు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో నిర్దేశించిన ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నది నా అభిప్రాయం. అందుకు సమయం కూడా ఆసన్నమయింది.

మారుతున్న ఆకాంక్షలు, పెరుగుతున్న అవసరాల వంటి వాటి కారణంగా తలెత్తుతున్న సమస్యలను రాజ్యాంగం పరిష్కరిస్తున్న తీరు ఎలా ఉంది? ఉదా।। నిరుద్యోగం, అస్తిత్వవాదం బలపడిన తరువాత పరిస్థితులను రాజ్యాంగం ఏ విధంగా పరిగణిస్తున్నది?

ఆహార హక్కు, విద్యాహక్కు, వైద్య హక్కు, పని హక్కు, శుభ్రమైన గాలి, నీరు పొందే హక్కులను రాజ్యాంగం ప్రతి పౌరుడికి కలిగించింది. రాజ్యం వీటిని పౌరులకు అందించాలని నిర్దేశించింది. ఈ సదుపాయాలు కల్పించేందుకు సమయోచితంగా, ప్రభావవంతమైన చట్టాలు కూడా అమలయ్యాయి. విద్యాహక్కు చట్టం(2010), ఆహార భద్రత చట్టం(2013), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(2005), అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం(2008) వంటివి ఇలాంటి చట్టాలే. అలాగే 2011లో నగర ప్రాంతాల్లో ఉపాధి విస్తరణ, హామీ చట్టం వంటివి కూడా అమలులోకి వచ్చాయి.

పని హక్కు, విద్యాహక్కు, నిరుద్యోగులకు ప్రభుత్వ సహకార హక్కు, వృద్ధాప్యంలో, అనారోగ్యంలో సహాయం పొందే హక్కు మొదలైనవాటిని 41 అధికరణ కల్పిస్తోంది. పదేళ్ల కాలంలో ఈ హక్కులను తీర్చడానికి అనేక ప్రభుత్వ పధకాలు అమలయ్యాయి.

వ్యవసాయ, పారిశ్రామిక లేదా ఇతర రంగాలకు చెందిన పనివారికి జీతాలు, మెరుగైన జీవన స్థాయి, సామాజిక, సాంస్క ృతిక అవకాశాల వంటి హక్కులు 43 అధికరణ కల్పిస్తోంది. అధికరణలు 41,43లు ఆదేశికసూత్రాల్లో భాగమైనా, అవి దేశ పరిపాలనలో ప్రాథమికమైనవి. చట్టాలు చేసేప్పుడు రాజ్యం వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే.

నక్సల్బరీ, ఈశాన్య భారతంలో వేర్పాటువాదం నేపథ్యంలో మానవ హక్కులకు నిర్వచనాలు మారిపోయాయి. అసలు దాదాపు యాభయ్‌ ఏళ్లుగా నలుగుతున్న ఆ సమస్యల విషయంలో, వాటి తాత్వికతతో రూపుదిద్దుకుంటున్న హక్కులను భారత రాజ్యాంగం ఎలా చూస్తుంది?

ఈశాన్య ప్రాంతంలో అనేక తీవ్రవాద, వేర్పాటువాద సంస్థలు పుట్టుకురావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదన్న ఆవేదనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురికావడమే. నిజానికి ఇటీవలి కాలం వరకు కేంద్ర ప్రభుత్వంగాని, ఇతర రాష్ట్రాలుగాని అలాంటి ప్రాంతాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నది నిజం. దట్టమైన అడవులు, పర్వతాలతో నిండి తక్కువ జనాభాతో దూరంగా ఉండే ఈశాన్య ప్రాంతాన్ని చికెన్‌ ‌నెక్‌ అనే సన్నని భూభాగం పశ్చిమ బెంగాల్‌, అస్సాంలతో కలుపుతోంది. ఈ ఏడు రాష్ట్రాల్లో అక్రమ ఆయుధ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ ఉన్నది ప్రధానంగా శాంతిభద్రతల సమస్య అని భావించే కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో సాయుధ బలగాలను మోహరించింది. ఈ బలగాలు కూడా సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం, 1958 కింద పనిచేస్తాయి. వేర్పాటువాదులు, సాయుధ బలగాల మధ్య ఘర్షణల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన వంటి ఆరోపణలు, విమర్శలు వస్తుంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ ఆరోపణలు ఏకంగా అంతర్జాతీయ వేదికలనే ఎంచుకుంటూ ఉంటాయి.

జీవితం, స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తిగత గౌరవం వంటి రాజ్యాంగం హామీ ఇచ్చిన వాటిని మానవ హక్కులు అంటున్నారు. కాబట్టి పౌరులతోపాటు తీవ్రవాదానికి పాల్పడుతున్నవారి మానవహక్కులను కూడా పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. అయితే ‘మానవహక్కుల పరిరక్షణ చట్టం’ (1993) ప్రకారం జాతీయ/రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లు ప్రభుత్వోద్యోగుల ద్వారా జరిగిన మానవహక్కుల ఉల్లంఘనను మాత్రమే విచారిస్తాయి. అందువల్ల తీవ్రవాదులు /ఖైదీలు పాల్పడే మానవ హక్కుల ఉల్లంఘనను విచారించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీని మూలంగా సమతౌల్యం దెబ్బతింది. అయితే తీవ్రవాద కార్యకలాపాల్లో జరిగే మానవహక్కుల ఉల్లంఘనను పరిశీలించి తగిన నివారణ చర్యలు సూచించడానికి జాతీయ/రాష్ట్ర మననవహక్కుల కమిషన్‌ ‌లకు చట్టం వీలు కల్పించింది. కానీ ఈ కమిషన్‌లకు తీవ్రవాదుల పైన, తీవ్రవాద కార్యకలాపాలపై నివారణ మీద ఎలాంటి నియంత్రణ లేని కారణంగా అవి మానవ హక్కుల ఉల్లంఘనను అడ్డుకోలేకపోతున్నాయి. నక్సలైట్లు, ఇతర తీవ్రవాదులతో వ్యవహరించేటప్పుడు పోలీసులు కూడా ఇలాంటి పరిమితులు, అవరోధాలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనాలి.

ప్రాంతీయ పార్టీలు బలపడడం, చతికిల పడడం రెండూ జరుగుతున్నాయి. అవి బలంగా ఉన్న సమయంలో కేంద్రంలో ఉన్న పార్టీని బట్టి ఫెడరల్‌ ‌వ్యవస్థకు కొన్ని సవాళ్లు విసురుతున్నాయి. ఫెడరల్‌ ‌వ్యవస్థ రక్షణలో రాజ్యాంగం నిర్వహించిన పాత్ర ఏమిటి?

జనాభాపరంగా చూస్తే, ప్రపంచలోనే రెండవ పెద్ద దేశం భారత్‌. ‌విస్తీర్ణపరంగా చూస్తే 7వ పెద్ద దేశం. మనదేశంలో ఎంతో వైవిధ్యం ఉంది. ప్రకృతి వనరుల లభ్యత, జనాభా, అభివృద్ధి, భాషా సంస్కృతులు వంటి ప్రతి అంశంలోనూ ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మధ్య ఎందులోనూ సారూప్యత ఉండదు. ప్రాంతాల మధ్య అసమానతలు, తేడాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి. పాలనాపరంగా ఆలోచించినప్పుడు అలాంటి పరిస్థితులలో ఒక ఫెడరేషన్‌ ‌తరహా వ్యవస్థలోనే సుపరిపాలనను అందించటం సాధ్యమవుతుంది. భారత రాజ్యాం గాన్ని ఒక బలమైన కేంద్రంతో ఉన్న ఫెడరేషన్‌గా అనేకమంది అభివర్ణిస్తుంటారు. ఫెడరల్‌ ‌రాజ్యాంగం మనుగడను రక్షించటానికి రాజ్యాంగంలో అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రతిస్థాయిలోనూ ఉన్న ప్రభుత్వాలు ఏయే అంశాలపై చట్టాలు చేసే అధికారాలు కలిగి ఉన్నాయో స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగంలో 11వ భాగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను నిర్వచించారు. రాష్ట్రాలకు ఏయే సందర్భాలలో కేంద్రం ఆదేశాలు ఇవ్వవచ్చు, ఎలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు రాష్ట్రపతి పాలన విధించవచ్చు వంటి అంశాలను స్పష్టంగా నిర్వచించారు. ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కౌన్సిల్‌ను తరుచుగా సమావేశపర్చటం లేదు. పదేళ్ల తర్వాత 2016లో ఈ సమావేశం తిరిగి జరిగింది. చివరిసారిగా నవంబర్‌ 2017‌లో ఈ సమావేశాన్ని జరిపారు. 1983లో సర్కారియా కమిషన్‌, 2007‌లో పూంఛీ కమిషన్‌ ‌కేంద్ర-రాష్ట్ర సంబంధాలను మెరుగు పర్చటానికి విలువైన అనేక సూచనలు చేశాయి. ఆ సిఫారసులలో అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రతి ఐదేళ్లకొకసారి ఒక ఫైనాన్స్ ‌కమిషన్‌ ‌నియమించే ఏర్పాటు రాజ్యాంగం చేసింది. పన్నుల రాబడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాను నిర్ధారించే తీరు తెన్నులను ఈ కమిషన్‌ ‌ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి సమీక్షించి, తగిన సిఫారసులు చేస్తుంది.

అయితే కొన్ని అంశాలకు సంబంధించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు అప్పుడప్పుడు దెబ్బ తింటున్నాయి. గవర్నర్ల నియామకం, రాష్ట్రపతి పాలన విధింపు, పన్నుల రాబడిలో వాటాల నిర్ణయం, నిధుల పంపిణీ వంటి అంశాలకు సంబంధించి వివాదాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రాల అధికార పరిధిలోని అంశాలపై- వ్యవసాయం, ఆరోగ్యం, భూములకు సంబంధించి- కేంద్రం చట్టాలు చేస్తున్నదని, తమ అధికార పరిధిలోకి కేంద్రం తరుచుగా జోక్యం చేసుకుంటున్నాదని రాష్ట్రాలు అంటున్నాయి. కనుక సహకార ఫెడరల్‌ ‌స్ఫూర్తిని ఆచరణలో చూపించటం చాలా అవసరం. అలాగే అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ను తరచుగా సమావేశపరచి, వివాదాలను పరిష్కరించుకోవటం కూడా అవసరం.

దేశంలోని వైవిధ్యాన్ని, ప్రాంతీయ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు, ప్రాంతీయ పార్టీలక• కీలకమైన పాత్ర ఉంది. రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం ఉన్నప్పటికి, పన్నుల రాబడిలో అధిక శాతం కేంద్రం విధించే పన్నుల ద్వారానే దేశానికి లభిస్తున్నది. అందువల్ల ఆర్థిక వనరుల మీద కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షంతో స్నేహసంబంధాలు నెరపటానికి కొన్ని ప్రాంతీయ పార్టీలు పోటీ పడుతుంటాయి. కేంద్రంతో సత్సంబంధాలు నెరపటం ద్వారా తమ ప్రాంతాలకు కావలసిన నిధులను తేలికగా పొందవచ్చునన్నదే ప్రాంతీయ పార్టీల ఆశ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ఆ ప్రభుత్వాలను నడిపే పాలకపక్షాల మధ్య సత్సంబంధాలు, పరస్పర గౌరవం, సహకారం దేశంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా పరిఢవిల్లటానికి అవసరం.

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులు చేస్తున్న ఆందోళన, కేంద్రం, రైతులు కూడా వెనక్కి తగ్గకపోవడం, సుప్రీంకోర్టు జోక్యం – ఈ పరిణామాలతో న్యాయ, శాసన వ్యవస్థల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందా?

దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల నాకు ఎనలేని గౌరవం ఉంది. వ్యాజ్యాల పరిష్కార దిశగా దానికి ఉన్న స్వేచ్ఛనూ నేను గౌరవిస్తాను. అయితే మూడు సాగు చట్టాల వివాద పరిష్కార కోసం సాగు చట్టాల అమలు నిలిపి వేస్తూ ఉత్తర్వులు ఇవ్వటాన్ని, నలుగురు నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. న్యాయస్థానం లక్ష్యం ఉదాత్తమైనప్పటికీ, న్యాయస్థానం తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించలేకపోతున్నాను. రైతులు కాని, ప్రభుత్వం కాని సంప్రదింపుల కోసం నిపుణుల కమిటీని నియమించమని అడగలేదు. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వానికి చెందిన చట్టం పరిధిలోని అంశంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవటమేనని నేను అభిప్రాయపడుతున్నాను.
అంతకుమించి న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వును తప్పుపట్టలేం. గతంలో కూడా అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం రాజీ పరిష్కారం కోసం ఒక కమిటీని నియమించింది. అప్పుడు ఎవ్వరూ దానికి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు కూడా న్యాయస్థానాన్ని విమర్శించే అధికారం ఎవరికీ లేదు. ఇదొక ప్రత్యేక పరిస్థితి. అయినప్పటికి ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలను ఈ ఉత్తర్వు చెడగొడుతుందని నేను అనుకోవటం లేదు. గతంలో కూడా అనేక ప్రాథమిక అంశాలపై న్యాయస్థానం, ప్రభుత్వం విభేదించిన సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై ఇచ్చిన తీర్పు, ఇటీవల కాలంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ ఏర్పాటుపై ఇచ్చిన తీర్పు రెండు ఉదాహరణలు మాత్రమే. అయితే వాటి వలన కార్యనిర్వాహక వ్యవస్థకూ, న్యాయ వ్యవస్థకూ మధ్య సంబంధాలు ఏమాత్రం క్షీణించలేదు.

అంతర్జాతీయ పరిణామాలు భారత్‌ ‌మీద పడుతున్నాయి. కొత్త నినాదాలు వస్తున్నాయి. జాతీయ భావాలకు, జాతీయ భావాల పట్ల వ్యతిరేకతకు మధ్య విభజన నానాటికీ బలపడు తున్నది. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ఇరుగు పొరుగు దేశాల ధోరణులను సమర్థించే విధంగా వ్యాఖ్యలు చేయడం కనిపిస్తున్నది. న్యాయమూర్తుల మీద, కోర్టుల మీద విమర్శలు వస్తున్నాయి. మీడియా కూడా భారీగా అపకీర్తిని మూటగట్టుకుంటున్నది. కొన్ని పార్టీల నాయకుల సొంత అజెండాలే ఆయా పార్టీల సిద్ధాంతాలవుతున్నాయి. ప్రజాధనంతో రేపటి ఎన్నికలలో ఓట్లు సంపాదించి పెట్టే జనాకర్షక పథకాలు అమలవుతున్నాయి. ‘రాజ్యాంగం కుప్పకూలుతోంది’ అన్న మాట పలు సందర్భాలలో వినిపిస్తున్నది కూడా. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ఇప్పుడు రాజ్యాంగానికి ఉందని భావించగలమా?

దేశభక్తిగాని, జాతీయత కాని మన చొక్కా మీద పెట్టుకొనే చిహ్నం వంటిది కాదు. నినాదాలతో ఎవరినీ దేశభక్తుడిగా గాని, జాతీయవాదిగా గాని రూపొందిచలేం. ఒక నిజాయితీగల ఉపాధ్యాయుడు, ఒక నర్సు, ఒక సైనికుడు, ఒక ఇంజనీరు, ఒక రైతు, ఒక రెవెన్యూ అధికారి కూడా; ఒక పెద్ద శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు వలే దేశ నిర్మాణంలో పాలు పంచుకొంటున్నారు. వారు జాతికి అందిస్తున్న సేవలకు గాను వారిని గౌరవించాలి. దానర్థం జాతీయపతాకాన్ని, లేక జాతీయగీతాన్ని కావాలని అవమాన పరిచేవారిని వదిలివేయమని కాదు. ప్రభుత్వ విధానాలను గట్టిగా విమర్శించే వ్యక్తిని దేశద్రోహి అని ముద్రవేయకూడదు. హింసాత్మక చర్యలకు ఆ వ్యక్తి ప్రేరేపించనంత వరకు, ఆ వ్యక్తిని జాతిద్రోహిగా పరిగణించకూడదు. విమర్శించటం మన హక్కు కూడా. కువిమర్శలు చేసి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని పట్టుకొనటానికి పోలీసు వ్యవస్థ ఉంది. దాని పని దానిని చెయ్యనివ్వాలి. ఇతరుల మీద జాతి ద్రోహులుగా ముద్రవేసి, పౌరులే చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోకూడదు. అధికారంలో ఉన్నవాళ్లు వివిధ వర్గాల వారి అభిప్రాయాలను వినాలి. అప్పుడు విధాన నిర్మాణంలో భాగస్వామ్యం పెరుగుతుంది. అలాంటి విధానాల అమలు కూడా సులభమవుతుంది. ఆశించిన ఫలితాలు ఒనగూరుతాయి.

కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రణాళికలలో జనాకర్షక ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తున్నాయి. అందరికీ పింఛన్లు, ఉచితంగా చీరెలు, టెలివిజన్‌ ‌సెట్లు ఇస్తామని హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల ప్రణాళికలలో అటువంటి హామీలు గుప్పించకుండా నిరోధించటం సాధ్యమయ్యే పనికాదు. కాని ఒక ప్రవర్తనా నియమవాళిని తీసుకొని రావలసిన అవసరం ఎంతైనా ఉంది. అవి అధికారంలోకి వస్తే ప్రతిపాదిత సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఎంత శాతం నిధులు కేటాయించనున్నాయో ప్రతి రాజకీయ పక్షమూ వాటి ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనాలి. అలాగే అధికారంలో తమ తమ ఎన్నికల ప్రణాళికలలో పేర్కొన్న విధంగా వివిధ పథకాలను అమలు చేసే బాధ్యతను సైతం రాజకీయ పార్టీల మీదే పెట్టాలి. ఈ మధ్యకాలంలో తమ వ్యక్తిగత ఎజెండాలను పార్టీల జెండాలుగా మారుస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అటువంటి యత్నాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించి, వాటిని అడ్డుకోవాలి. అట్టివారిపై చట్టం ప్రకారం చర్యలకు ఉపక్రమించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరంతర జాగరూకతే అన్ని సమస్యలకు అంతిమంగా పరిష్కారం అవుతుంది. కనుక ప్రజలను చైతన్య వంతులను చేసి, వారి పాత్రను వారు సమర్ధంగా పోషించేటట్టుగా సాధికారులను చెయ్యాలి.

ఒకప్పుడు నిష్పాక్షిక వార్తలకు, వ్యాఖ్యలకు పేరెన్నికగన్న మన ప్రతికా రంగం ఇప్పుడు పక్షపాతంతో వ్యవహరిస్తున్నది. టీవీ జర్నలిజం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. నిష్పాక్షిక వార్తలు, వ్యాఖ్యలను అందించే పత్రికల కోసం వెతుక్కోవలసి వస్తున్నది.

కేంద్ర హోంశాఖ వంటి కీలక విభాగంలో పనిచేసిన అధికారిగా రాజ్యాంగం గురించీ, ఆ సమున్నత చట్ట సముదాయం గురించీ మీ అనుభవం ఏమిటి?

నేను కేంద్ర అంతరంగిక మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు దేశం అనేక ముఖ్య సమస్యలను ఎదుర్కొంటున్నది. జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రంలో ఉగ్రవాదం పెచ్చుపెరిగి, హింసోన్మాదం పరాకాష్టకు చేరుకున్న సమయమది. ఈశాన్య భారతంలో నాగాల తిరుగుబాట్లు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తు న్నాయి. ఉగ్రవాదులను, తిరుగుబాటుదారులను సమర్థంగా అరికట్టేందుకు కఠినమైన చట్టాలు – టి.ఎ.డి.ఎ., పి.ఒ.టి.ఎ. – వంటివి చేశారు. వాటి అమలులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఫిర్యాదులు పంజాబు, ఈశాన్య భారతం నుండి లెక్కకు మించి వస్తున్నాయి. మూడు కొత్త రాష్ట్రాలు – ఉత్తరాఖండ్‌, ‌చత్తీస్‌గఢ్‌, ‌జార్ఖండ్‌లు ఏర్పడ్డాయి. జమ్ము-కశ్మీర్‌లో ప్రతి ప్రభుత్వ సంస్థను ఉగ్రవాదులు బలవంతంగా మూసివేయించారు. పరిపాలనా వ్యవస్థ పనిచేయలేని స్థితిలో ఉంది.ప్రజలు నిరంతరం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితులలో రాజకీయ పక్రియను పునరుద్ధరించి, 9 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిపించటం పెద్ద సవాలు. ఆ సవాలును సమర్థంగా, విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాం. మానవ హక్కుల ఉల్లంఘన సమస్య మరో పెద్ద సవాలుగా నిలిచింది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేశాం.

ఒకదాని వెంట మరొకటిగా కొత్త విధానాలను ప్రకటిస్తూ వెళ్లటం వలన ప్రయోజనం ఉండదు. ప్రకటించిన విధానాలను సమర్థంగా అమలు చెయ్యకలిగినప్పుడే వాటికి సార్థకత లభిస్తుంది. పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ పథకాల వలన ఆశిస్తున్న ఫలితాలు చేరవలసిన వారికి చేరేలా చేయటం మీద దృష్టి నిలపాలి.

చట్టబద్ధమైన పాలన రాజ్యాంగానికి మూలస్తంభం. చట్టబద్ధమైన పాలనకు అందరూ బద్దులై ఉండాలి. అది ప్రతి పౌరుడి విధి. గొప్ప వాడైనా, లేనివాడైనా పలుకుబడి ఉన్నా, లేకున్నా, అధికారంలో ఉన్నా, లేకున్నా, చట్టబద్ధ పాలనకు బద్ధులమై మెలిగినంత కాలమే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది. లేకుంటే ప్రజాస్వామ్యం కేవలం మాటలకే పరిమితం అవుతుంది.

About Author

By editor

Twitter
Instagram