రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సాఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నర్సాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు ‘రచ్చబండ’ పేరిట ప్రెస్‌ ‌కాన్ఫరెన్సులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీకి, నాయకులకు సున్నితంగా, సుతిమెత్తగా వాతలు పెడుతున్నారు. టీటీడీ భూముల వేలం నిర్ణయం మొదలు.. ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాసిన లేఖ వరకు.. మతం మారి క్రైస్తవం పుచ్చుకున్న వారు నకిలీ సర్టిఫికెట్లతో ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్‌ ‌తదితర సంక్షేమ ఫలాలను పొందడం, పాస్టర్లకు ప్రభుత్వం నుంచి అందిస్తున్న నజరానాల వివాదం వరకు..  ప్రతి విషయంలోనూ కృష్ణంరాజు జగన్‌ ‌మీద వరుస అస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రతిఒక్కరు రాజుగారి రచ్చబండ వెనక కథేంటి? అన్నది తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నారు. కృష్ణంరాజు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? నిత్య ప్రహసనంగా సాగిస్తున్న ఈ క్రతువు వలన ప్రయోజనం ఎవరికి? ఏదైనా ఒక విషయంలో గట్టిగా నిలబడి ఆధారాలను బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏదీ చేయకుండా గంట కొట్టే సరికి చెట్టుకింద వాలిపోయి నాలుగు ముచ్చట్లు చెప్పి వెళ్లిపోవడం వలన ఆయనకు గానీ, రాష్ట్రానికి గానీ కలిగే ప్రయోజనం ఏమిటి?

సొంత పార్టీ ఎంపీ ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఆయనపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? జగన్‌ ఎం‌దుకు పెదవి విప్పడం లేదు? నర్సాపురం నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కృష్ణంరాజు దిష్టిబొమ్మలు తగలబెట్టడంతో సరిపెట్టుకోవడం ఏమిటి? చివరకు పార్టీ ఇచ్చిన షోకాజ్‌ ‌నోటీసుని కూడా అవహేళన చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  అసలు ఇందులోని ఆంతర్యం ఏమిటి? అలాగే, ప్రభుత్వ విధానాలను అంతగా వ్యతిరేకిస్తున్న కృష్ణంరాజు ప్రత్యక్ష పోరు కాకుండా తెరచాటు రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇటు రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో విభిన్నంగా వినిపిస్తున్నాయి.

మరోవైపు రఘురామ కృష్ణంరాజు బీజేపీలో చేరుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అండ చూసుకునే ఇలా రెచ్చిపోతున్నారని, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దీర్ఘకాల వ్యూహంలో భాగంగానే కమలనాథులు కథ నడిపిస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు తమ మేధస్సునంతా వడపోసి కథనాలు వడ్డిస్తున్నారు. అయితే.. అసలు కథ అది కాదు. ఒకవేళ అదే అయితే వైసీపీ నాయకత్వం ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ ‌చేయడం లేదు. ఎంపీ చర్యల పట్ల పార్టీ అధినాయకత్వం చూసీ చూడనట్లు ఎందుకు వ్యవహర్తిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు.

నిజానికి.. రఘురామ కృష్ణంరాజును సస్పెండ్‌ ‌చేయడం వలన వైపీపీకి వచ్చే నష్టం పెద్దగా ఏమీలేదు. ఇంకా 21 మంది ఏంపీలుంటారు. అయినా జగన్మోహన్‌రెడ్డి.. కృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దు చేయమని కోరుతూ బంతిని స్పీకర్‌ ‌కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకోవడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? జగన్‌ ‌చేతిలో ఉన్న సస్పెన్షన్‌ అ‌స్త్రాన్ని సంధించకపోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి?

నిజంగా ఇవి సమాధానం లేని ప్రశ్నలా అంటే కాదు. రఘురామ కృష్ణంరాజు రాజకీయ జీవితం ‘తెరచిన’ పుస్తకం. ఆయన అతితక్కువ కాలంలో ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు పార్టీలు మారారు. చివరకు ‘రాజకీయ వ్యాపార సారూప్యం’ ఉన్న వైసీపీ గూటికి చేరారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం కృష్ణంరాజు ప్రధానంగా వ్యాపారవేత్త. వ్యాపార సామ్రాజ్య విస్తరణకు రాజకీయాలను దగ్గరి మార్గంగా, రక్షణ కవచంగా ఎంచుకున్న అనేక మంది వ్యాపార రాజకీయవేత్తలలో ఆయన కూడా ఒకరు. అంతేకాదు, జగన్మోహన్‌రెడ్డి మీద ఎలాగైతే క్విడ్‌ ‌ప్రోకో, మనీ లాండరింగ్‌ ‌వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులున్నాయో, కృష్ణంరాజుపై కూడా ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు విచారణలో ఉన్నాయి. కాబట్టి ఆయనను కేవలం రాజకీయ నాయకుడిగా చూడలేం. చూడరాదు. ఆయన వ్యాపార రాజకీయవేత్త. రాజకీయ వ్యాపారవేత్త. ఆ కోణంలోనే కృష్ణంరాజు రాజకీయ కార్యకలాపాలను చూడవలసి ఉంటుందని ఆయన రాజకీయ, వ్యాపార సంబంధా లను దగ్గరగా చూసిన కొందరు భావిస్తున్నారు. కృష్ణంరాజు, జగన్మోహన్‌రెడ్డిల మధ్య సాగుతున్న ఈ రచ్చబండ రాజకీయం ఆ ఇద్దరూ వ్యూహాత్మకంగా సిద్ధంచేసుకున్న స్క్రిప్ట్ ‌ప్రకారమే నడిపిస్తున్నారనే అనుమానాలు కూడా లేకపోలేదు.

జగన్‌ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి చాలా చక్కగా తన పనులు తాను చక్కబెట్టుకుంటున్నారు. అడిగిన వారికీ అడగని వారికీ నవరత్నాలను ఉచితంగా పంచిపెడుతున్నారు. ఇలా వరాలను వడ్డించి సంక్షేమ పునాదుల మీద రాజకీయ సౌధం నిర్మించుకుంటున్నారు. మరోవైపు ఉచిత వరాలు ఎరగా వేసి క్రైస్తవీకరణకు బాటలు వేసుకుంటారు. ఆ విధంగాను ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, అన్నిటినీ మించి అక్రమాస్తుల కేసుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు వ్యూహాత్మకంగా రఘురామ కృష్ణంరాజును శత్రుస్థానంలో నిలబెట్టి ఉత్తుత్తి యుద్ధం చేస్తున్నారా!? అన్న సందేహాలూ చాలా మందిలో ఉన్నాయి. నిజానికి జరుగుతున్నది కూడా అదే. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా ప్రతిపక్షాల కంటే కూడా కృష్ణంరాజు ఎక్కువగా ప్రతిపక్షం పాత్రను పోషించడం పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్‌ ‘‌ప్రణాళిక’లో భాగంగానే రఘురామ కృష్ణంరాజు రచ్చబండ రాజకీయం సాగుతోందన్న అనుమానాలకు ఇది మరింత ఆస్కారం కల్పిస్తోంది. మీడియా సహకారంతో అధికార, ప్రతిపక్ష పాత్రలను పంచుకొని ఆ ఇద్దరు కథ నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదీ తెరవెనక అసలు రహస్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.

– రాజనాల బాలకృష్ణ,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE