‌భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్య్రం, విభేదించడం, వ్యతిరేకించడం, చర్చించడం, విమర్శ, ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటివి. ఇవి లేని ప్రజాస్వామ్యం నేతి బీరకాయ చందాన్ని తలపిస్తుంది. సద్విమర్శను ప్రోత్సహించడం, ఇతరుల అభిప్రాయాలను గుర్తించడం, గౌరవించడం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణాలు. వారి అభిప్రాయాలతో ఏకీభవించకపోతే, దానిని ఖండించడం, తమ అభ్యంతరాలను బలంగా వినిపించడం, వీలైతే ఒప్పించడం చేయాలి. తమ అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు ప్రజస్వామ్య పద్ధతిలో విభేదించే హక్కు ఎవరికైనా ఉంటుంది. అంతేతప్ప ఏకంగా దాడులకు దిగడం, విధ్వంసాలకు పాల్పడటం ఎంతమాత్రం ఆమోద యోగ్యం కావు. వాటిని ప్రతి ఒక్కరూ ఖండించి తీరాల్సిందే. లేనట్లయితే యావత్‌ ‌సమాజం మళ్లీ మధ్యయుగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.


మొత్తం ఐరోపా సమాజం మొదటినుంచి ప్రజాస్వామ్య పంథాలోనే ప్రయాణిస్తోంది. ఈ సమాజంలో కీలక శక్తి అయిన ఫ్రాన్స్ ‌ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం గల ఫ్రాన్స్ ‌ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయంగా హుందాగా, వివాదరహితంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కాలంలో ఆ దేశంలో చోటుచేసుకున్న ఘటనలు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా రాడికల్‌ ఇస్లామిజం కారణంగా ఫ్రాన్స్ ‌చికాకులు ఎదుర్కొంటోంది. గత నెలలో ఇస్లామిక్‌ ‌తీవ్రవాదుల బీభత్సం కారణంగా జరిగిన అవాంఛనీయ ఘటనలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. దీనిపై కొన్ని ఇస్లామిక్‌ ‌దేశాల స్పందనలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన దేశాలు, సంకుచిత ధోరణితో ప్రతిస్పందించడంతో సమస్య మరింత తీవ్రమైంది. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన వివాదం చివరికి చిలికి చిలికి గాలివానగా మారి ఫ్రాన్స్‌కు, ఇస్లామిక్‌ ‌దేశాల వైరంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారి మూలాల్లోకి వెళితే అవాంఛనీయ ఘటనలకు సంబంధించి ఫ్రాన్స్ ఎం‌త ఉదారంగా వ్యవహరించిందో అర్థమవుతుంది.

 దేశ రాజధాని పారిస్‌కు 25 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో ఉన్న ఓ పాఠశాలలో ఆక్టోబరు 16న శామ్యూల్‌ ‌పాటీ (47) అనే చరిత్ర ఉపాధ్యాయుడు వ్యంగ్య పత్రిక ‘చార్లీ హెబ్డో’ ప్రచు రించిన కార్టూన్లను తన విద్యార్థులకు వివరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో లౌకిక భావనలకు గల ఫ్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌ ‌స్వాతంత్యంలో భాగంగా మహమ్మద్‌ ‌ప్రవక్తకు సంబంధించిన అంశాలను ఆయన విద్యార్థులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా వచ్చిన ఓ యువకుడు అతని తలను అత్యంత పాశవికంగా నరికివేశాడు. 18 సంవత్సరాలు కలిగిన ఈ యువకుడిని చెచెన్‌ ‌శరణార్థిగా గుర్తించారు. హంతకుడు లొంగిపోవడానికి నిరాకరించడంతో జరిపిన పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటనను యావత్‌ ‌దేశం తీవ్రంగా ఖండించింది. దేశంలోని ముస్లిం సమాజం కూడా తప్పుపట్టింది. అంతర్జాతీయంగా కొన్ని ఇస్లామిక్‌ ‌దేశాలూ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. అనంతరం అక్టోబరు నెలాఖరున నైస్‌ ‌నగరంలోని చర్చి వద్ద జరిగిన దాడి ఘటన దేశాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ముందస్తు ప్రణాళికతో వచ్చిన ఓ యువకుడు మహిళతోపాటు మరో ఇద్దరిని పాశవికంగా హతమార్చారు. అల్లాహో అక్బర్‌ అం‌టూ నినాదాలు చేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నైస్‌ ‌దేశంలోని అయిదో అతిపెద్ద నగరం. దక్షిణ ప్రాంతంలోని తీరప్రాంత నగరం. నగరంలోని నోట్రే డేమ్‌ ‌చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2015 జనవరిలో దేశంలో జరిగిన ఉగ్రవాద ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ ప్రారంభ మవుతున్న తరుణంలో తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ ‌మాక్రాన్‌ ‌తీవ్రంగా స్పందించారు. పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తి లేదని ఉద్ఘాటించారు. అదే సమయంలో దేశంలో అల్లర్లకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని విస్పష్టంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం పెద్దయెత్తున బలగాలను మోహరించింది. కొందరు వ్యక్తుల అనాలోచిత విధానాలు, వైఖరుల కారణంగా ఇస్లాం సంక్షోభంలో పడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. అంతే తప్ప మతాన్ని గురించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. వ్యంగ్య కార్టూన్‌లకు బాధ్యత ప్రభుత్వానిది కాదన్న విషయాన్ని గుర్తించా లని, దానిని పత్రికా స్వేచ్ఛలో భాగంగా గుర్తించాలని అరబ్‌ ‌టీవీ ఛానెల్‌ ‘అల్‌ ‌జజీరా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని స్పష్టం చేశారు.

ఈ ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఫ్రాన్స్‌కు సంఘీభావం ప్రకటించాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, కొన్ని ఇస్లామిక్‌ ‌దేశాలు దాడిని ఖండిస్తూ ఫ్రాన్స్‌కు మద్దతు ప్రకటించాయి. పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ‌కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. ఏ మతంలోనూ హింసకు చోటులేదని, ప్రతి ఒక్కరూ శాంతి సద్భావనతో మెలగాలని సూచించారు. ప్రధాని ప్రకటనపై కొన్ని ఇస్లామిక్‌ ‌దేశాలు ప్రతికూల ధోరణితో ప్రతి స్పందించాయి. ముఖ్యంగా టర్కీ ఒకింత ముందుకు వెళ్లి ఫ్రాన్స్ ‌వస్తువులను బహిష్కరించాలని పిలుపిచ్చింది. ఆ దేశ ప్రధాని రెసెపె తయ్యిప్‌ ఎర్డగాన్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యావత్‌ ఇస్లామిక్‌ ‌ప్రపంచానికి తానే ప్రతినిధి అన్న ధోరణితో ఎర్డగాన్‌ ‌మాట్లాడారు. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ‌లిబియా, బహ్రెయిన్‌, ‌సిరియా వంటి దేశాలు కూడా ఎర్డగాన్‌కు వంతపాడాయి. మలేసియా మాజీ ప్రధాని మహతీర్‌ ‌మహమ్మద్‌ ‌సైతం తీవ్రంగా స్పందించారు. ఫ్రాన్స్ ‌ముస్లింలపై యుద్ధం ప్రకటించిందని అనాలోచితంగా మాట్లాడారు. టర్కీ అధినేత ఎర్డగాన్‌ ‌తీవ్ర వ్యాఖ్యలకు నిరసనగా ఆ దేశం నుంచి నుంచి తమ రాయబారిని ఫ్రాన్స్ ఉపసంహరించుకుంది.

ఐరోపా సమాజంలో అత్యధిక ముస్లిం జనాభా గల దేశం ఫ్రాన్స్. ఆరు కోట్లకు పైగా జనాభా గల దేశంలో ముస్లింల సంఖ్య 66 లక్షల పైమాటే. క్రైస్తవ సమాజం తరవాత దేశంలో అత్యధిక జనాభా ముస్లింలదే. ఏటా ముస్లింల జనాభా పెరుగుతూనే ఉంది. 1900 సంవత్సరంలో వీరి జనాభా వెయ్యి మందికి లోపే. తరవాత 1950లో లక్షకు పైగా చేరింది. 1970లో రెండు లక్షలకు పెరిగింది. 1980లో రెండున్నర లక్షలకు చేరుకుంది. యూదులు 0.5 శాతం, బౌద్ధులు 0.46 శాతం కాగా హిందువులు సంఖ్య 1.21 లక్షలే కావడం గమనార్హం. అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూనే, లౌకికవాదానికి పట్టం కడుతూనే మతాలపై సహేతుక ఆంక్షలను ప్రభుత్వం విధించింది. 2004లో ముస్లిం మహిళలు తలమీద కప్పుకునే వస్త్రాలను నిషేధించింది. పాఠశాలల్లో మత చిహ్నాలు కనిపించ రాదని పేర్కొంది. 2011 నాటి చట్టం బురఖాలను నిషేధించింది. ఈ సహేతుక విధానాలను ముస్లిం సమాజం సరిగా అర్థం చేసుకోలేకపోయింది. అనవసరమైన అపోహలకు లోనైంది. తమను అణచి వేస్తుందని భావించింది. కొంతమంది అతివాదులు దీనిని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రస్తుత అవాంఛనీయ పరిస్థితులకు ఇదే కారణం.

ఫ్రాన్స్ ‌నిజంగా వివక్ష కనబరిచినట్లయితే దేశంలో రెండో అతిపెద్ద సమాజంగా ముస్లింలు ఉండేవారు కారు. ఇంతమంది ఈ దేశానికి వలస వచ్చేవారు కాదు. సమభావం కారణంగానే ఇతర ఐరోపా దేశాల కన్నా ఇక్కడ ఎక్కువమంది ముస్లింలు స్థిరపడ్డారు. అల్జీరియా, ట్యూనిషియా, మొరాకో వంటి పూర్వపు వలస దేశాల నుంచి అత్యధికంగా ఇక్కడకు వలస వచ్చారు. వలస యుగం అంతరించాక ఫ్రాన్స్ ‌లోని కర్మాగారాల్లో పనిచేసేందుకు వీరు వచ్చారు. పారిశ్రామిక యుగం అనంతరం సాంకేతిక రంగం అభివృద్ధి చెందాక ఉద్యోగ అవకాశాలు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో వారిలో నిరుద్యోగ సమస్య పెరిగింది. నిరుద్యోగ సమస్య ఒక్క ముస్లిం సమాజానికే పరిమితం కాలేదు. యావద్దేశం దీనిని ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించాలి. 2008 ఆర్థిక సంక్షోభం తరవాత శ్వేత జాతీయులూ నిరుద్యోగంతో సతమత మవుతున్నారు. వారికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడుతున్నాయి. ఇటీవలి కోవిడ్‌ ‌సమస్య కూడా అగ్నికి ఆజ్యం పోసింది. దీంతో ఉన్న కొద్దిపాటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కనుమరుగవు తున్నాయి. ఇది ఒక్క ఫ్రాన్స్ ‌సమస్య మాత్రమే కాదు. యావత్‌ ‌ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. మరోపక్క అంతర్జాతీయ సమాజం కరోనాతో కుదేలైంది. ఈ చేదు నిజాలను దేశంలోని ముస్లిం సమాజం కానీ, ప్రపంచవ్యాప్తంగా గల ముస్లిం దేశాలు కానీ గుర్తించడం లేదు. ఫ్రాన్స్ ‌ప్రభుత్వం ముస్లింల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని అపోహపడు తున్నాయి. ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న తరుణంలో ఫ్రాన్స్ ‌కూడా ఈ సమస్యను అధిగమించగలదన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. మతానికి తావు ఇవ్వని ప్రభుత్వ విధానాల కారణంగానే దేశం లౌకిక రాజ్యంగా ఇప్పటికీ తన ప్రతిష్ఠను కాపాడుకుంటోంది. ఇవన్నీ ఎవరికీ తెలియని విషయాలు కావు. బహిరంగ రహస్యాలే. అంతర్జాతీయ సమాజానికి ఎరుకైన అంశాలే. లౌకిక వాదానికి పట్టం కట్టనట్లయితే దేశంలో ముస్లిం జనాభా పెరగగలదా అన్న ప్రశ్న ప్రభుత్వం నుంచి వస్తుంది. దీనిని తోసిపుచ్చడం కూడా కష్టమే. తమ విధానమైన సర్వమత సమభావనను సరిగా అర్థం చేసుకోలేక, దేశంలోని కొన్ని ముస్లిం సంస్థలు యువతను రెచ్చగొడు తున్నాయని, వారిని పెడదోవ పట్టిస్తున్నాయని పారిస్‌ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవాలను విస్మరించి అంతర్జాతీయంగా గల కొన్ని ఇస్లామిక్‌ ‌దేశాలు అపోహలతో స్థానిక ముస్లింలలో వేర్పాటు వాదన భావనను ప్రోత్సహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వేర్పాటు వాదాన్ని అణచివేసేందుకు, లౌకిక తత్వాన్ని పరిరక్షించేందుకు కొత్త చట్టం తీసుకురానున్నట్లు ఇమ్మాన్యుయేల్‌ ‌ప్రకటించారు. వాస్తవానికి మతాల స్థానంలో లౌకికతత్వం పరిఢవిల్లేందుకు 1905నాటి చట్టం ఇప్పటికే ఉంది. దీనిని సవరించి ఇప్పుడు కొత్త చట్టం తీసుకరానున్నారు. దీని ప్రకారం తమకు నచ్చిన మతాన్ని అవలంబించేందుకు ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే సమయంలో మతానికి, రాజ్య వ్యవస్థకు మధ్య స్పష్టమైన విభజన రేఖ గీయనుంది.

ఆస్ట్రియా రాజధాని వియన్నాలోనూ ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడటం ఆందోళన కలిగించింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో నలుగురు మరణించగా 14 మంది గాయపడ్డారు. ముష్కరుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇతన్ని 20 సంవత్సరాల వయసుగల ఐస్‌ఐస్‌ (ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా) తీవ్రవాదిగా గుర్తించారు. ఇతను ఆస్ట్రియా, నార్త్ ‌మెసిడోనియాకు చెందిన ద్వంద్వ సభ్యత్వం గల పౌరుడు. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు. భారత్‌ ‌గత కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కుంటున్నాయి. దీనిని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌ ‌పూర్తిగా ఈ స•మస్యపైనే పని చేస్తున్నారు. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఏ- ‌జాతీయ దర్యాప్తు సంస్థ) ఉగ్రవాద కార్యకలాపాలపై కన్ను వేసి ఉంచింది. ఎనభయ్‌ ‌దశకంలో పంజాబ్‌ ‌ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదం కారణంగా ఉక్కిరిబిక్కిరి అయింది. ప్రత్యేక ఖలిస్తాన్‌ ‌పేరుతో సాగించిన పోరాటాన్ని భారత్‌ ఉక్కుపాదంతో అణచివేసింది. ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదానికి పాకిస్తాన్‌ ‌ప్రోత్సాహం ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాశ్ఛాత్య దేశాలు కూడా ఉగ్రవాదం బారిన పడుతున్నాయి. ముఖ్యంగా అనేక పాశ్ఛాత్య దేశాలు ఈ సమస్యతో సతమతమవు తున్నాయి. అందువల్ల ఇది అంతర్జాతీయ సమస్య. దీన్ని ఎదుర్కోవడానికి యావత్‌ ‌ప్రపంచం ఒక్క తాటిపైకి రావాలి. ఈ దిశగా సమష్టిగా కార్యాచరణ రూపొందించుకోవడం నేటి తక్షణ అవసరం.

– విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram