‘ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదు. అసలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగానే గుర్తించడానికి వారు ఇష్టపడడం లేదు’- ఇది బీజేపీ నాయకుడో, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ విశ్లేషకుడో చెప్పినమాట కాదు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు కపిల్‌ ‌సిబల్‌ ‌వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇప్పటికైనా ఆత్మశోధన చేసుకోండని కూడా ఆయన వేడుకున్నారు.

మా తాతలు నేతులు తాగారు.. చూడండి వంటి మాటలు వాదనకు నిలవవు. రాజకీయాల్లో నిత్య నూతనం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారు. కొత్తతరం ఓటర్లు నూతన నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే వాస్తవాన్ని వారసత్వ రాజకీయ పార్టీలు గుర్తించడం లేదు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి ఇదే. దేశ రాజకీయాల్లో ఆ పార్టీ ప్రాభవం శరవేగంగా కొడిగడుతోంది. ప్రాంతీయ పార్టీలతో బేరమాడే పరిస్థితిని కూడా కోల్పోయింది. సిబల్‌తో పాటు కార్తి చిదంబరం, తారిక్‌ అన్వర్‌ ‌కూడా ఇదే మాట అంటున్నారు.

134 ఏళ్ల చరిత్ర గల భారత జాతీయ కాంగ్రెస్‌ అవసాన దశకు చేరిందా? రాజకీయ పార్టీ అన్న తరువాత గడ్డురోజులూ తిరిగి పుంజుకోవడం సహజం. కానీ బీజేపీ దేశమంతటా విస్తరిస్తుంటే, కాంగ్రెస్‌ ‌పట్టు కోల్పోతోంది. చివరకు మిత్రపక్షాలతో బేరమాడే స్థితి నుంచి వెనక్కి తగ్గుతున్నది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఉన్న స్థానం ఏమిటో చాటి చెప్పాయి.

కరోనా వైరస్‌ ‌తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దేశ ప్రజల్లో ఆగ్రహం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. పని చేయని ప్రభుత్వాలు అధికారంలో ఉంటే ఇది సహజం. కరోనా అంతర్జాతీయ అంశం. అమెరికా, యూరోప్‌ ‌దేశాలతో పోలిస్తే దేశ జనాభా రీత్యా విశ్లేషిస్తే భారత్‌లో మహమ్మారి ప్రభావం తక్కువే అని చెప్పక తప్పదు. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచీ దేశ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఆరంభంలో చేపట్టిన లాక్‌డౌన్‌ ‌చాలా మేరకు సత్ఫలితాలని ఇచ్చింది. దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది నిజం. దాన్ని మోదీ వైఫల్యంగా భావించలేం.

సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్‌ ‌పార్టీ బోల్తాపడింది. కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ వైఫల్యం చెందారని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపణలు గుప్పించారు ఆ పార్టీ నేతలు. ఈ విషయంలో రాహుల్‌ ‌గాంధీ శ్రుతిమించిపోయారు. సరిహద్దుల్లో చైనా చొరబాటును భారత సైన్యం దీటుగా ఎదుర్కొన్నా, దీన్ని మోదీ అసమర్ధతంగా చాటే ప్రయత్నం చేశారు. ఈ మాటలను ప్రజలు నమ్మ లేదని, మోదీపై సంపూర్ణ విశ్వాసం చూపించారని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి.

పాలిటిక్స్ ఆఫ్‌ ‌విశ్వాస్‌

‌కరోనా కారణంగా వచ్చిన కష్టాలు బిహార్‌ ‌రాష్ట్రాన్ని అత్యధికంగా ప్రభావితం చేశాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బిహార్‌కే వలసలు అధికం. అయినప్పటికీ బిహార్‌ ‌ప్రజలు ఎన్డీఏకే తిరిగి పట్టంగట్టారు. ఆశ్చర్యకరంగా కూటమిలో జేడీయూకి 43 సీట్లు వస్తే, బీజేపీకి 74 సీట్లు లభించాయి. అయినా ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి నితీశ్‌ ‌కుమార్‌ ‌ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహాఘట్‌ ‌బంధన్‌లో ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌ ‌మీద ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్‌ 70 ‌సీట్లకు పోటీ చేసింది. గెలిచింది 19 మాత్రమే. 2015లో 41 సీట్లకు పోటీ చేసి 27 గెలిచింది. ఫలితం ఆర్జేడీ 75 సీట్లు గెలిచినా అధికారానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 19 గెలవడంతో శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీని సాధించింది. గుజరాత్‌,ఉత్తరప్రదేశ్‌, ‌కర్ణాటక, తెలంగాణ(దుబ్బాక) ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా బీజేపీ సత్తా చాటింది.

ఈ ఎన్నికల్లో గతంలో కన్నా బీజేపీ ప్రాభవం పెరగడానికి కారణం ఏమిటి? ‘పాలిటిక్స్ ఆఫ్‌ ‌విశ్వాస్‌’ అం‌టున్నారు ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త నీలాంజన్‌ ‌సర్కార్‌. ‌నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల ప్రజలకున్న నమ్మకమే ఎన్నికల్లో ప్రభావం చూపిందని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నిలల్లో బీజేపీ విజయ పతాకం ఎగురేసిందంటే ప్రజలు లాక్‌డౌన్‌ ‌సందర్భంగా ఎదురైన కష్టాలకు అటు ప్రధాని నరేంద్రమోదీని, బీజేపీగానీ బాధ్యులను చేయదల్చుకోలేదని స్పష్టం అవుతోంది.

ప్రధాని మోదీ తన తొలి దఫా పాలనలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రతిపక్షాలతో పాటు మేధావులంతా ఇలాగే గోల చేశారు. కొన్ని తాత్కాలిక కష్టాలు ఎదురైనా దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదు. అదేవిధంగా జీఎస్టీ విషయంలో కూడా ప్రతికూల ప్రచారం జరిగింది. దేశ ప్రజలు మోదీపై పెట్టుకున్న విశ్వాసాన్ని 2019 ఎన్నికలు చాటిచెప్పాయి. అవినీతి రహిత, సమర్థ పాలనకే ప్రజలు ఓటు వేశారు. తాజా ఎన్నికలు మోదీపై దేశప్రజల విశ్వాసం ఏమాత్రం చెక్కు చెదరలేదని స్పష్టం చేస్తున్నాయి.

బేరమాడే శక్తి కోల్పోయింది

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌ ‌లాంటి కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఏనాడో ఉనికిని కోల్పోయింది. తాజాగా ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ, ఒడిశాల్లో అదే దుస్థితికి వచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. దీంతో ఉనికి కోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తు తప్పనిసరి. బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ తాజా నిర్వాకంతో ప్రాంతీయ పార్టీలతో సీట్ల కోసం బేరమాడే స్థాయినీ కోల్పోయినట్టే.

కాంగ్రెస్‌ ‌బలం ఏ పాటిదో బిహార్‌ ఎన్నికలు బయటపెట్టడంతో ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకొని 105 సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్‌ ‌కేవలం ఏడు సీట్లలో విజయం సాధించింది. దీంతో రాబోయే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ ‌చేతులు దులిపేసుకున్నారు. మాయావతి బీఎస్పీ కాంగ్రెస్‌కు ముందు నుంచి దూరమే.

2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ, డీఎంకే నాయకత్వంలో కూటమిలో 41 సీట్లకు పోటీ చేసి 8 మాత్రమే గెలిచింది. డీఎంకే 98 సీట్లు గెలిచి అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఓటుబ్యాంకు లేని కాంగ్రెస్‌తో కలవడమే ఓటమికి కారణమని డీఎంకే భావిస్తోంది. డీఎంకే విజయావ కాశాలు కాంగ్రెస్‌ ‌పార్టీతోనే ఎగిరిపోయాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి పరిమితంగానే సీట్లు కేటాయించాలని స్టాలిన్‌ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు.

2016 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ 92 ‌సీట్లకు పోటీ చేసి 44 సీట్లను గెలుచుకుంది. సీపీఏం 148 సీట్లకు పోటీచేసి 26 సీట్లను గెలుచుకుంది. తాజాగా అధికార టీఎంసీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ ‌భావిస్తోంది. కానీ బిహార్‌ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత మమతా బెనర్జీ ఆ పార్టీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు.

కనుమరుగవుతున్న పార్టీ

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ‌పతనం మొదలు కావడం స్పష్టంగా గమనించవచ్చు. బీజేపీ అనుసరిస్తున్న ‘కాంగ్రెస్‌ ‌ముక్త భారత్‌’ ‌వ్యూహం ఫలిస్తోంది. కాంగ్రెస్‌ ‌ప్రధాన ప్రతిపక్షంగా విఫలం అవుతోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటాలు ప్రజల్లోనే కాకుండా సొంత పార్టీలోనే విశ్వాసం నింపలేకపోతున్నాయని ఇటీవల సీనియర్ల లేఖాస్త్రం స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన 37 ఎన్నికల్లో 30 ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించడం కాంగ్రెస్‌ ‌దుస్థితికి అద్దం పడుతోంది. గెలిచిన చోటా ప్రభుత్వాలను నిలపుకోకపోతోందని చెప్పడానికి మధ్యప్రదేశ్‌ ఒక ఉదాహరణ. మేఘాలయ, గోవా, మణిపూర్‌, అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాల ముందు ఆ పార్టీ చిత్తయి పోయింది. మధ్యప్రదేశ్‌ ‌దెబ్బ తర్వాత చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు రాజస్తాన్‌ని నిలుపుకో గలిగింది. మహారాష్ట్రలో శివసేనతో కలసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. రాజస్తాన్‌, ‌పంజాబ్‌, ‌జార్ఘండ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌పుదుచ్చేరిలో మాత్రమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఉన్నాయి.

లేఖాస్త్రంతో వణుకు

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కాంగ్రెస్‌లో అసమ్మతి గళానికి బలం పెరిగింది. రాహుల్‌ ‌నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గాంధీ- నెహ్రూ కుటుంబాలకు బయటి వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవాలని ఉచిత సలహా కూడా పడేశారు. రాహుల్‌ ‌స్థానంలో సోనియాని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అదో పెద్ద నాటకమని దేశ ప్రజలకు అర్థమైపోయింది. నాయకత్వం వద్దు కానీ పెత్తనం కావాలి- అదీ రాహుల్‌ ‌ధోరణి. సోనియా, రాహుల్‌ ‌తీరు పార్టీ సీనియర్లకు కొంత అసహనం తెచ్చిపెట్టింది. దీంతో లేఖాస్త్రం వదిలారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ చుక్కాని లేని నావలా తయారై, యువత సహా అన్ని వర్గాలకూ దూరమై, పాతాళానికి దిగజారిపోతోందని, దీన్ని ఆపేందుకు సమగ్ర, సమూల, సంస్కరణలు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు- అధినేత సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. ఈ పరిణామాలు పార్టీని నిలువునా చీల్చాయి. ఒక వర్గం- రాహుల్‌ ‌గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టాలని కోరుతుండగా, రెండో వర్గం దాన్ని వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌ ‌పాలిత ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, ఇతర నేతలు సోనియాకు, రాహుల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై చర్చకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో ఈ లేఖ రాసినందుకు సీనియర్ల మీద రాహుల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కుమ్మయ్యారని నిందించడంతో గులాంనబీ ఆజాద్‌, ‌కపిల్‌ ‌సిబల్‌ ‌నొచ్చుకున్నారు. వారు రాజీనామాకు సిద్ధపడగా, ఇతర నేతలు సర్దిచెప్పడంతో సంక్షోభం తాత్కాలికంగా సమసిపోయింది.

బలమూ, బలహీనతా ఆ కుటుంబమే

దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఎదుర్కొంటున్న దుస్థితికి వంశ పారంపర్య రాజకీయమే ప్రధాన కారణం. ఆ పార్టీకి బలమూ, బలహీనత కూడా గాంధీ-నెహ్రూ కుటుంబమే. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ ‌కాలం నుంచి పార్టీపై కొనసాగుతున్న ఆ కుటుంబ ఉడుముపట్టు సోనియా గాంధీ కాలంలో పరాకాష్టకు చేరింది. మన్మోహన్‌ ‌సింగ్‌ను డమ్మీ ప్రధానిగా కొనసాగిస్తున్న సమయం లోనే రాహుల్‌ ‌గాంధీకి అధ్యక్ష పగ్గాలు అప్పగించా లని ఆమె చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. తన శక్తి సామర్ధ్యాలు ఏమిటో తెలుసు కాబట్టి చాలాకాలం తప్పించుకు తిరిగారు. సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అధ్యక్ష పదవి స్వీకరించక తప్పలేదు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ ‌సత్తా ఏమిటో తేలిపోవడంతో కాంగ్రెస్‌ ‌పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. రాహుల్‌ ‌యువనాయకత్వం గురించి మాట్లాడుతున్నా వారికి బాధ్యతలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని మధ్యప్రదేశ్‌, ‌రాజస్తాన్‌ ‌పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీలో బయటి వ్యక్తుల నాయకత్వం బలపడకూడదన్న భావనే ఇందుకు కారణం. కాంగ్రెస్‌ ‌పార్టీలో చీలికలు కొత్తేమీ కాదు. నెహ్రూ మొదలు సోనియా కాలం వరకూ చాలా చీలికలు వచ్చాయి. వీటిలో ఎన్సీపీ, వైసీపీ లాంటి పార్టీలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను కోలుకోని దెబ్బతీశాయి.

ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీని శాసిస్తున్న కురువృద్ధ నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని దశాబ్దాలు దాటింది. ఏకే ఆంటోనీ, మోతీలాల్‌ ‌వోరా, అహ్మద్‌పటేల్‌ ‌వంటి వృద్ధనేతలను ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నుకొని దశాబ్దాలు దాటింది. యువ నాయకుల గురించి చెప్పుకున్నా, చాలామంది కాంగ్రెస్‌ను వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. రాజస్తాన్‌లో సచిన్‌ ‌పైలట్‌, ‌గుజరాత్‌లో జిగ్నేష్‌ ‌మేవాని, హార్థిక్‌ ‌పటేల్‌, ‌మహారాష్ట్రలో మిలింద్‌ ‌దేవ్‌రా, ప్రియాదత్‌, ‌తెలంగాణలో రేవంత్‌రెడ్డి వంటి యువ నాయకులు ఉన్నారు. కానీ, ఈ యువ నేతలు ఉత్సాహంగా పనిచేయడంలో వృద్ధనేతలు అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్న పరిస్థితిని చక్కదిద్దాలంటే పూర్తి స్థాయిలో కాయకల్ప చికిత్స జరగాలి. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. గాంధీ-నెహ్రూ కుటుంబ బయటి నాయకత్వం బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. ఒక వేళ చేపడితే పీవీ నరసింహారావు, సీతారాం కేసరిలకు ఎదురైన పరాభవం తప్పదు.. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు జరిగినా పార్టీలో వర్గ పోరు తప్పదు.

కాంగ్రెస్‌ ‌శ్రేణులు గాంధీ కుటుంబానికి బయటి వ్యక్తులు నాయకత్వం వహించడాన్ని ఒప్పుకోవు. తిరిగి ఆ పరివారమే పార్టీని నడపాలని చిత్ర విచిత్ర ప్రదర్శనలు చేసి రక్తికట్టిస్తున్నాయి. సోనియా, రాహుల్‌ ‌చరిష్మా కోల్పోవడంతో ప్రియాంకను తెచ్చేప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఆమె సత్తా ఏపాటిదో ఇప్పటికే తేలిపోయింది.. ఇప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ సోనియా చరిష్మా మీదే ఆధారపడుతోంది.. కానీ ఆమె అనారోగ్యం కారణంగా ఎక్కువగా పర్యటనలు చేపట్టే స్థితిలో లేదు.. మొత్తానికి కాంగ్రెస్‌ ‌పార్టీ అంతరిస్తున్న పార్టీల జాబితాలో చేరిపోయింది. భవిష్యతులో ఆ పార్టీ గురుంచి చరిత్ర పుస్తకాల్లోనే చూడాలేమో!

About Author

By editor

Twitter
Instagram