పండుగల వేళ జాగ్రత్త!

తెలంగాణలో కరోనా వైరస్‌ ‌తగ్గుముఖం పట్టిందని అంతా భావిస్తున్నా.. ప్రభుత్వం కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కొవిడ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విజృంభిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కేసుల గణాంకాలను పరిశీలిస్తే గుండె గుభేల్‌మంటోంది.

రాజధాని హైదరాబాద్‌ ‌సహా నగర శివార్లలో మొదట్లో కరోనా పాజిటివ్‌ ‌కేసులు భారీగా నమోదయ్యాయి. ఆ సమయంలో జిల్లాల్లో అంతగా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాలేదు. హైదరాబాద్‌తో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. జిల్లాల్లో కూడా భారీగా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. మండల కేంద్రాలు, గ్రామాల్లోకి కూడా ఈ మహమ్మారి చొచ్చుకెళ్లింది. ఈ పరిణామం అందరినీ మరోసారి భయాందోళనలకు గురిచేస్తోంది.

తొలి లక్షకు 5 నెలలు.. మలి లక్షకు 42 రోజులు!

తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 2 లక్షలు (అక్టోబర్‌ 5 ‌నాటికి) దాటింది. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ ‌కేసు నమోదై ఏడు నెలలు గడిచింది. ఈ ఏడు నెలల్లో రెండు లక్షల మందికి అధికారికంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, ఇందులో ఆందోళన కలిగించే విషయం ఏమంటే తొలి లక్ష కేసులు నమోదైన వ్యవధికి, మలి లక్ష కేసులు నమోదైన వ్యవధికి చాలా వ్యత్యాసం ఉంది.

తొలి లక్ష పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడానికి ఐదు నెలల 19 రోజులు పడితే.. అదే రెండు లక్షల మార్క్ ‌చేరడానికి 42 రోజులు మాత్రమే పట్టింది. ఈ ఒక్క గణాంకం చాలు.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎంత ఉధృతంగా విస్తరిస్తుందో అంచనా వేయడానికి. అయితే, జనాలు భయం వదిలి రోడ్లపైకి వస్తూండటంతో రాష్ట్రమంతా కూడా కరోనా తగ్గిందనే భావన కలుగుతోంది. కానీ, వాస్తవ పరిస్థితి అనుకున్నంత సాధారణంగా లేదని మాత్రం అర్థమవుతోంది.

రోజుకు సగటున 2380 మందికి

రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ ‌కేసు మార్చి 2న నమోదయ్యింది. ఆగస్టు 21వ తేదీ నాటికి లక్ష కేసుల మార్క్ ‌చేరుకుంది. అప్పటి నుంచి అక్టోబర్‌ 5‌వ తేదీకి నాటికి రెండు లక్షలకు చేరుకుంది. కేవలం 42 రోజుల్లోనే లక్ష మందికి కరోనా సోకింది. అంటే రోజుకు సగటున 2380 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

ఈ పరిస్థితికి కారణం.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం అలసత్వమే అన్న విమర్శలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొదట్లో కరోనా నియంత్రణపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు అనిపించడంతో అసలు రాష్ట్రం నుంచే మహమ్మారి పారిపోయిందన్నట్లుగా సర్కారు వ్యవహార శైలి ఉందని, అందుకే గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో కరోనా కాటేస్తోందని అంటున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 16, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన 44 కేంద్రాల్లో ఆర్‌టీపీపీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే, 1076 కేంద్రాల్లో ర్యాపిడ్‌ ‌యాంటీజెన్‌ ‌పరీక్షలు చేపడుతున్నారు. ఆగస్టు 4వ తేదీ నాటికి మొత్తం 32 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. అంటే, ప్రతి 10 లక్షల మందిలో 86 వేల 116 మందికి పరీక్షలు చేశారు. అయితే, రాబోయే రోజుల్లో ప్రతి పది లక్షల మందిలో లక్ష మందికి టెస్టులు చేసేందుకు చర్యలు తీసుకుంటా మని ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఎప్పటినుంచి చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.

ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం కరోనా రికవరీ కేసుల శాతం 85.41 గా ఉంది. పాజిటివ్‌ ‌కేసుల్లో మరణాల సంఖ్య 0.58 శాతంగా ఉంది. ఈ లెక్కలు కాస్త ఊరటనిస్తున్నా పరీక్షల సంఖ్యలో, నివారణ చర్యలు చేపట్టడంలో మాత్రం ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది.

దసరా, దీపావళి జరుపుకునేదెలా?

తెలంగాణలో దసరా, దీపావళి అత్యంత ముఖ్యమైన పండుగలు. దసరా రాష్ట్ర పండుగ. రాష్ట్రంలోనే సామూహికంగా నిర్వహించుకునే అతిపెద్ద పండుగ. తెలంగాణ వాసులు ఎక్కడున్నా ఒక దగ్గరికి చేరి జరుపుకునే అత్యంత ప్రాధాన్యం గల పండుగ. అలాగే దీపావళి కూడా అందరూ కలసి భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కడెక్కడో స్థిరపడ్డ, దూరంగా ఉన్న కుటుంబసభ్యులు, బంధువులంతా ఒక్కచోటుకి చేరి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు.

బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ప్రత్యేక పండుగ. తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ చేసుకున్న తర్వాత మరుసటి రోజు కన్నుల పండువగా దసరాను జరుపుకుంటారు. బతుకమ్మ అంటేనే గుంపులు గుంపులుగా ఒక్కదగ్గరికి చేరి జరుపుకునే పండుగ. దీనిని సామూహికంగా వైభవోపేతంగా జరుపుకుంటారు.

అయితే కరోనా రోజురోజుకి విజృంభిస్తుండటం, దాదాపు ఎనిమిది నెలలు గడిచినా ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనకపోవడం వల్ల ఈ పండుగలను ఎలా జరుపుకోవాలన్న విషయంలో అటు జనంలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఆందోళన నెలకొంది.

ఈ క్లిష్ల సమయంలో ఒక్కొక్క పండుగ సందడి లేకుండా నిష్క్రమించడాన్ని జనం ఎక్కువ కాలం జీర్ణించుకోలేరు. ఇటీవల ఎటువంటి సందడి లేకుండా జరుపుకున్న వినాయక నిమజ్జనం అలాంటి నిరాశకే గురిచేసింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారును అప్రమత్తం చేసింది. ‘దసరా వస్తోంది.. జాగ్రత్త!’ అని హెచ్చరించింది. ఎందుకంటే కేరళలో ఇటీవల ఓనం పర్వదిన వేడుకల సందర్భంగా అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పండుగను వారు ప్రతిఏడాది చాలా ఘనంగా జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ, ఉపాధి నిమిత్తం నివసిస్తున్న వాళ్లంతా ఓనం పండుగ కోసం స్వస్థలాలకు తరలివెళ్తారు. ఈ ఏడాది కరోనా భయం వెంటాడుతున్నా.. సంప్రదాయ పండుగను సందడిగా చేసుకున్నారు. అయితే, ఓనం తర్వాత ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో.. తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల గురించి కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

బతుకమ్మ, దసరా మాత్రమే కాదు, రానున్న దీపావళి గురించీ శ్రద్ధ పెట్టాలని కేంద్రం తెలంగాణ సర్కారుకు సూచించింది. ఇటీవల వినాయక నవరాత్రోత్సవాల విషయంలో ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. బహిరంగంగా వేడుకలను జరుపుకోలేదు. కరోనా కట్టడిలో బాధ్యతాయుతంగా వ్యవహరించారు. దీంతో కేసుల తీవ్రతలో పెద్దగా మార్పు కన్పించలేదు. ఇప్పుడు బతుకమ్మ, దసరా పండుగల విషయంలోనూ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నారు.

వాస్తవానికి బతుకమ్మ, దసరా తెలంగాణ జీవనం, సంస్కృతితో ముడి వేసుకున్న పండుగలు. ఏ పండుగను నిర్లక్ష్యం చేసినా తెలంగాణలో బతుకమ్మ పండుగను జరుపుకోకుండా దాదాపు ఎవరూ ఉండరు. ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అన్ని వయసుల వాళ్లూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. కేరళలో ఓనం మాదిరిగానే తెలంగాణలో బతుకమ్మ పండుగకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తారు. సామూహిక ఉత్సవాల్లో పాల్గొంటారు. మరి ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో ఎవరికి వారే స్వీయ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండి ఈ పండుగలను జరుపుకుంటే రాష్ట్రంలో కరోనా కట్టడికి కొంత అడ్డుకట్ట వేయొచ్చు!

– సుజాత గోపగోని, 6302164068

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter
Instagram