తన శరీరంలో నుంచి వచ్చే పదార్థంతోనే అయినా, గూడు కట్టడానికి అనేక తంటాలు పడి, చివరికి అల్లిన సాలీడును చూసి, కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధించుకున్నాడు ఒక రాజు. ఇది కథే. కానీ ఎక్కడో ఆగిపోయిన తన వికాసానికి మళ్లీ ఆయువు పోసిన ఘట్టంగా దానిని ఆ రాజు భావించాడు. ఇలాంటి కథలు మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో! అందుకే పిల్లలకు కథలు చెప్పండి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సెప్టెంబర్‌ ఆఖరి ఆదివారంలో ఆయన మన్‌ ‌కి బాత్‌లో ఇచ్చిన సందేశం ఇదే. పిల్లలకు కథలు చెప్పవలసిన అవసరాన్ని గుర్తించి పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీవిద్య వీరరాఘవన్‌ ‌కృషిని మోదీ జాతి ముందు ఉంచడం సమయోచితంగా ఉంది. పిల్లలకు కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమని ఆయన గుర్తు చేయడం వాస్తవం. జిజాబాయి చెప్పిన కథలు గాథలు విన్న శివాజీ జీవితంలో సాధించినది తక్కువేమీ కాదు. సాధకులకు ఆయనో కొండగుర్తు. శివాజీ చరిత్రకు ఎక్కాడు. చరిత్రకు ఎక్కని సాధకులు లక్షలలో ఉంటారు. అందుకే కథ జీవనంలో అంతర్వాహిని కావాలి.

‘అనగా అనగా…’ అంటూ మొదలవుతాయి తెలుగువారి పిల్లల కథలు.

అనగా అనగా.. ఒక రాజ్యం ఉండేది. దానికి ఒక రాజు ఉండేవాడు. అనగా అనగా ఒక అడవి ఉంది. అనగా అనగా ఒక సింహం ఉంది. అనగా అనగా.. ఒక పండితుడు ఉండేవాడు.. ఇలా ఆరంభమవుతాయి పిల్లల కథలు.

మొహమాటం లేకుండా ఒకమాట చెప్పుకోవాలంటే- ‘అనగా అనగా ఒక కథ ఉండేది..’ అని ఇప్పుడు తెలుగువాళ్లు చెప్పుకోవలసిన కాలం వచ్చేసింది. పిల్లల కథను అలాంటి దుస్థితికి మనమే తెచ్చుకున్నాం.

అనగా అనగా ఒక రాజు, ఆయనకి ఏడుగురు కొడుకులు, ఏడుగురు వేటకు వెళ్లి ఏడు చేపలు తేవడం, అవి ఎందుకు ఎండలేదంటూ ప్రశ్నలతో సాగే ఆ కథకి ఎంత విస్తృతి ఉందో గమనిస్తే విస్తుపోతాం. మనిషికి ఉండే ఏ అవసరమైనా తీరాలంటే, దాని వెనుక ఎన్ని చేతులు శ్రమించాలో అది చెప్పడం లేదా! దీనితో ప్రశ్నించడం కూడా నేర్పుతోంది మరి!

ఇవాళ్టి వ్యాపార ప్రకటనలకి ముందు వచ్చే జింగిల్స్ ‌వంటిదే, నాటి కథకు ఆ ‘అనగా అనగా…’ అనే ఆరంభం. ఆ పదాన్ని పిల్లలకు ఏనాడో దూరం చేసేశాం. ఆ పదాలు పెద్దవాళ్ల నోటి నుంచి రాగానే ఇంతలేసి కళ్లు చేసుకుని, చెవులు రిక్కించి ఆలకించే పిల్లలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవలసిందే.

పిల్లలో సృజనాత్మక శక్తిని తట్టి లేపే తొలి కోడికూత – ఆ అనగా అనగా కథే. వాళ్ల ఊహలకు రెక్కలు ఉన్న సంగతిని మొదటిగా గుర్తు చేస్తుంది.

ఆ కథలు రేపటి పౌరులకి మన పురాణాలను సులభ శైలిలో పరిచయం చేస్తాయి. అజరామరమైన ఆ పురాణ పాత్రలతో మాట్లాడిస్తాయి. భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని ఆ చిన్నారుల చూపులకు దగ్గరగా తెస్తాయి. మన సముద్రాలను, వాటి లోతులను అందమైన మాటలతోనే కొలిచి చూపిస్తాయి. మన పర్వతాలను అధిరోహింప చేస్తాయి. అడవులను కళ్లకు కడతాయి. ఎదుగుతున్న పిల్లల బుర్రలలో కొత్త కొత్త పదాలను, భావాలను ప్రవేశపెడతాయి.

ఇంతేనా! మనతో పాటే ఈ నేల మీద పుట్టి పెరిగే సకల జీవరాశిని కథలు వర్ణించి చెబుతాయి. పిల్లలు కదా! వారితో సమంగా మాట్లాడేందుకు కథ ఆ జంతుజాలానికి మానవ భాషను నేర్పింది కూడా.

మానవ భాషతో జంతువులు మనుషులకు నీతి చెప్పడం నిజంగానే ఓ అద్భుత పక్రియ.

 మన కంటికి కనపడని జీవరాశి సంగతి సరే, ఎంతో చిన్నదైన చీమ, తన సమూహంతో ఎంత బలమైన పాముని అయినా కదలకుండా చేయగలిగే కథ నుంచి పిల్లలు ఎంత నేర్చుకోగలుగుతారో కదా! ఎంతో శక్తి, ఎంతో శౌర్యం కలిగిన మృగరాజు సింహం వలలో చిక్కుకుంటే ఒక ఎలుక సాయంతో బయటపడిన సంగతిని ఆ కథ ఎంత అద్భుతంగా చెబుతుందో!

ఎక్కడ ఐక్యత గెలుస్తుంది! సన్నజీవులు ఎక్కడ ఐక్యం కాగలిగినా విజయం సాధిస్తాయి! చీమ, నల్లి, ఈగ – ఈ సృష్టిలోనే చిరుప్రాణులు. కానీ పిల్లల కథలు వాటిని గొప్ప కథానాయకులుగా చిత్రిస్తాయి. సాహసాలు చేయిస్తాయి. గొప్ప గొప్ప పనులు చేసి, పెద్ద పెద్ద ఫలితాలను సాధించగలిగిన వీరత్వం వాటికి ఇస్తాయి. మంచిని పెంచడానికి పెద్ద పెద్ద జంతువు లతో పోరాడేటట్టు చేస్తాయి. ఇది చాలు, పిల్లలలో ఊహ రెక్కలు విప్పుకోవడానికి! ‘సాధించాలి’ అన్న చిరుబీజం వారి మనసులలో పడితే చాలదా!

నీళ్లు, నిప్పు, మట్టి, ఆకాశం, గాలి, మేఘం, వెన్నెల, వర్షం, ఉరుము, ఎడారి పిల్లల కథలలో కనిపిస్తాయి. సమస్త ప్రకృతిని ఆ చిట్టి మనసులకి అందిస్తూ చెప్పే అందాల మాటల మూటలు మన కథలు. చెట్టు, నది, చేను, ఆ చేనులో మంచె, ఆ మంచె మీద ఉండే మనిషి చేతిలోని ఒడిశెల..ఎన్నో, కథలతోనే వాళ్ల మనసులలోకి ప్రవేశిస్తాయి. రేపటి వాళ్ల జీవితానికి మెట్లు నిర్మిస్తాయి ఆ చిట్టి కథలు.

పిల్లల కథలకు నిజంగా పెద్ద దిక్కు-పేదరాశి పెద్దమ్మ.

ఆమె ఎన్ని కథలు చెప్పింది! ఎంత లోకజ్ఞానం కూర్చి పెట్టింది!

ఆంజనేయుడి ప్రతి అడుగు మనకు కథే కదా!

సీతాన్వేషణకు మారుతి సముద్రాన్ని లంఘించే క్షణం ఎలా ఉందో చెప్పే కథ ఏ బాలుడైనా, బాలిక అయినా మరచిపోగలదా? మనిషిలోని శక్తిని వెలికి తీసే మహా శాస్త్రం ఆ ఒక్క వర్ణన నిండా పరుచుకుని ఉంటుంది. కానీ ఈ లక్ష్యం గురించి ఏ కథలోను ఉండదు. ఇదే దీని ఫలశ్రుతి అని చెప్పరు. అలా చెప్పేస్తే బాలల ఊహాశక్తికి ఎప్పుడు కదలిక!

పంచతంత్రం కథలు అణిముత్యాల రాశులే. ఒక మనిషి మాట్లాడితే వింత కాదు. కానీ మనిషి చెప్పవలసిన నీతిని ఒక జంతువు చెబితే! అది ప్రత్యేక ఆకర్షణ. కోతి, మొసలి, నక్క, కప్ప, పులి, ఆవు, ఎద్దు, ఎలుగు, కొంగ, తోడేలు, ఉడత, చేప, చిలుక… ఎన్నో ఆ కథలలో పాత్రలు. పంచతంత్రంలో మూడు చేపల కథ గుర్తుందా! ఏ జీవికైనా ముందు జాగ్రత్త ఎంత అవసరమో చక్కగా చెబుతాయి, వలలో చిక్కుకున్న ఆ మూడు చేపలు. చిత్రంగా వీటిలో చాలా జంతువులని వాటి పేర్లతో పిలవరు. చేప, కోతి, నక్క అంటూ. వాటికి కూడా చక్కని పేర్లు పెట్టారు.

మనిషికి ఆశ ఉండకూడదు. ఏదీ ఎవరూ ఉచితంగా ఇవ్వరు. అలా ఇస్తున్నారంటే, వెనుక ఏదో ఉద్దేశం ఉంటుంది. చాలాసార్లు అది దురుద్దేశం కూడా కావచ్చు.

వయసు మీదపడిన ఒక పులి దారిన పోయే వారికి బంగారు కంకణం ఆశ చూపించి బురద నీటిలోకి వెళ్లేటట్టు చేసి చంపే కథ పంచతంత్రంలో ఉంది. అత్యాశకు ఎంత పెద్ద శిక్ష వేశారో కదా!

తెలివైన కుందేలు, మృగరాజును పాడుబడ్డ బావిలోకి ఎలా దూకేటట్టు చేసిందో వింటే ఎంత తమాషాగా ఉంటుంది!

ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కడ బడితే అక్కడ నోరు విప్పకూడదు. ఏదో చెప్పదలిచినా సమయం, సందర్భం ఉండాలి. ఈ గొప్ప సంగతిని మాటలతో చెప్పేస్తే అందం చందం ఉండదు కదా! ఈ విషయాన్ని రెండు కొంగలు, తాబేలు కథలో ఎంత గొప్పగా చెప్పారు! మరొక ప్రాంతానికి వెళ్లదలిచిన ఒక తాబేలుకు రెండు కొంగలు సాయం చేయాలని అనుకుంటాయి. ఒక చితుకపుల్ల తెచ్చి మధ్యలో నోటితో కరిచి పట్టుకోమన్నాయి. ఎట్టి పరిస్థితులలోను నోరు విప్పద్దని చెప్పాయి. ఆ కర్రను ఆ కొంగలు వాటి ముక్కలతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాయి. అంత ఎత్తుకు చేరినందుకు మురిసిపోతూ, ఆ సంగతి చెప్పడానికి నోరు తెరిచింది తాబేలు. ఏమౌతుంది!

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటారు. ఈ నీతిని ఒక కథలా, కొన్ని పాత్రలతో చెబితే ఎంత రమ్యంగా ఉంటుంది! మనసును నాటుకుంటుంది. అదికూడా, పేదరాశి పెద్దమ్మ చెబితే! ఇంకా బాగుంటుంది. ఒకసారి ఒక రాజు వేటాడుతూ అడవిలో తప్పిపోయాడు. ఎండ మండిపోతోంది. ఎంత నడిచినా ఎవరూ కనపడడం లేదు. పైన ఎండ, నడకతో శ్రమ. ఇక దారుణంగా ఆకలేసింది. అప్పుడే పర్ణశాల వంటి పేదరాశి పెద్దమ్మ ఇల్లు కనిపించింది. రాజు అని ఆమెకు తెలియదు.ఆకలితో ఉన్నాడు పాపం అని, అన్నం ఒండి పెట్టింది. ఒక పచ్చడి వేసిందట, అన్నంలో. అంత రుచిగా పచ్చడి రాజు కూడా ఏనాడు తినలేదట. అందుకే పెద్దమ్మకు చక్కని బహుమానం ఇచ్చాడు. తరువాత సైనికులు వెతుక్కుంటూ వచ్చి రాజుగారిని తీసుకువెళ్లారు.

రాజభవనంలో అన్నీ వేళకు అమరుస్తారు. మూడు పూటలా వడ్డిస్తారు. ఒకరోజు భోజనం చేస్తున్న రాజు, వంట మనిషి మీద విరుచుకు పడ్డాడు. అసలు ఏమీ బాగాలేదని రాజుగారి ఆరోపణ. కానీ అన్నీ బాగానే చేశాడతడు. నీవు ఆ పెద్దమ్మలా వండలేవా! ఆ పచ్చడి ఎంత రుచిగా ఉంది? అన్నాడట. వంటమనిషి ఒకరోజు ఆ అడవికి వెళ్లి, పెద్దమ్మను కలిశాడు. పెద్దమ్మా! ఆ రోజు రాజుగారికి వేసిన ఆ పచ్చడి ఏమిటి? ఎలా చేయాలి? అని అడిగాడట. ఓ అదా, అది గడ్డి పచ్చడి. ఏమీ లేక ఆ గడ్డి తెచ్చి పచ్చడి చేసి పెట్టాను అందట. కానీ ఆనాటి రాజు ఆకలి వేరు. అంతఃపురంలో ఉంటే ఆకలి స్థాయి వేరు. అదే అర్థమైంది వంటమనిషికి. ఆకలి రుచి ఎరుగదు. ఎంత చక్కని పదార్థాలు ఎదురుగా ఉన్నా, ఆకలి లేకుంటే ప్రయోజనమే లేదు అంటుందీ కథ. ఎంత వాస్తవం! ఎంతటి జీవన సత్యం! చరిత్ర పురుషులనే పాత్రలుగా చేసుకుని తమాషాగా ఉండే కథలు ఎన్నో సృష్టించారు మనవారు, పిల్లల కోసం.

తెనాలి రామలింగడి కథలు, అక్బర్‌-‌బీర్బల్‌ ‌కథలు, మౌల్వీ నసీరుద్దీన్‌ ‌కథలు అలాంటివే.

మనవారు పిల్లల కథల గురించి ఎంత తపన పడ్డారో చెప్పే ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. చందమామ అనే పిల్లల కథల పుస్తకం బాల సాహిత్యానికి చేసిన సేవ అమోఘం కదా! అసలు పిల్లల కథల పుస్తకానికి ‘చందమామ’ అన్న పేరు పెట్టడంలోనే మనవారి గొప్పతనం తెలియడం లేదా?

ఈసారి మన్‌ ‌కి బాత్‌లో మోదీ పిల్లల కథల గురించి చెప్పడం, పిల్లలకి కథలు చెప్పమని దేశ ప్రజలకు పిలుపునివ్వడం ఎంతో గర్వించదగిన అంశం. నిజమే, దేశంలో బాలలకి చాలా అందించ లేకపోతున్నాం. కనీసం కథలు చెప్పి వారి మనో వికాసానికి, మానసిక ఆనందానికైనా సాయపడాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram