‘పశ్చిమబెంగాల్‌ ‌బాంబుల తయారీ కేంద్రంగా మారింది. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు, పోలీసుల వైఫల్యానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు.’  ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షమో, ఇతర పార్టీల నేతలో చేసినవి అనుకుంటే పొరపాటే.  స్వయంగా ఆ రాష్ట్ర ప్రథమ పౌరుడు, గవర్నర్‌ ‌జగదీప్‌ ‌ధంకర్‌ అన్న మాటలివి. గవర్నర్‌ ‌వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తు తున్నట్లు కనపడవచ్చు. కానీ నిశితంగా గమనిస్తే ఆ మాటల్లో అంతులేని ఆవేదన, బాధ, రాష్ట్ర పరిస్థితి పట్ల ఆందోళన స్పష్టంగా అర్థమవుతుంది. విపక్ష కాంగ్రెస్‌, ‌సీపీఎం, సీపీఐ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి. గడచిన సెప్టెంబర్‌ ‌మూడోవారంలో రాష్ట్రంలో అల్‌ఖైదా కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) భగ్నంచేసి ఉగ్రవాదులను అరెస్టు చేసిన తరువాత వ్యక్తమైన అభిప్రాయాలివి. ధంకర్‌ ఆం‌దోళన, ఆవేదనను రాజకీయ కోణంలో చూడటం సరికాదు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల గల ఆందోళనకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఈ మాత్రం చిత్తశుద్ధి అధికార తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ (‌టీఎంసీ) అధినేత్రి, ముఖ్య మంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని సర్కారుకు లేకపోవడం గమనార్హం.

 నిఘావర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ముర్షీదాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో ఆరుగురు ఉగ్రవాదులు- నజ్మస్‌ ‌షకీబ్‌, అబూ సుఫియాన్‌, ‌మైసూల్‌ ‌మండల్‌, అహ్మద్‌, అల్‌ ‌మమూన్‌ ‌కమాల్‌, ‌రెహమన్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. వీరితోపాటు కేరళలోని ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులు- ముర్షిద్‌ ‌హసన్‌, ‌యాకూబ్‌ ‌బిశ్వాస్‌, ‌ముస్ఫర్‌ ‌హుస్సేన్‌లను అదుపులోనికి తీసుకున్నారు. వీరి నుంచి దేశవాళీ ఆయుధాలు, ఎలక్ట్రానిక్‌ ‌పరికరాలు, బాంబుల తయారీకి సంబంధించిన పుస్తకాలు, జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ ప్రముఖులను హత మార్చేందుకు, దేశంలోని కీలక ప్రాంతాల్లో విధ్వంసానికి పాల్పడేందుకు వీరు పథకం రచించారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరం, కీలక రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు కుట్ర పన్నారు. అంతేకాక భారీఎత్తున పేలుడు పదార్థాల తయారీకి సన్నాహాలు మొదలుపెట్టారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సకాలంలో స్పందించి కుట్రను ఛేదించడం వల్ల పెను ప్రమాదమే తప్పింది. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం సెప్టెంబర్‌ ‌మొదటి వారంలోనే అందింది. అప్పటి నుంచి వారిపై నిఘాపెట్టారు. చివరికి విజయవంతంగా వారి ఆట కట్టించారు.

 లష్కర్‌-ఎ-‌తొయీబా, అల్‌ఖైదా, జమాత్‌, ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా) వంటి ఉగ్రవాద సంస్థలు మొదటి నుంచి భారత్‌లో కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. వీటికి పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి సంస్థ ఐ.ఎస్‌.ఐ. (ఇం‌టర్‌ ‌సర్వీసెస్‌ ఇం‌టలిజెన్స్), ‌సైన్యం సహాయ సహకారాలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. బంగ్లాదేశ్‌లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా వీరికి అండగా ఉన్నాయి. పేద, మధ్యతరగతి యువకులను చేరదీసి, వారిలో భారత వ్యతిరేకతను నూరిపోయడం, జిహాదీ పేరుతో వారిని ప్రేరేపించడం ఈ సంస్థల ప్రధాన లక్ష్యాలు. అరెస్టయిన తొమ్మది మంది ఉగ్రవాదులకు నాయకుడు ముర్షిద్‌ ‌హసన్‌. అల్‌ఖైదా కోసం భారత్‌లో నిధులు సేకరించడంలో ఇతనిది కీలక పాత్ర. పాకిస్తాన్‌లోని అల్‌ఖైదా ఉగ్రవాది హమ్‌జాతో హసన్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. హమ్‌జా సూచన మేరకు ఆయుధాల కోసం వీరంతా తొలుత జమ్ముకశ్మీర్‌ ‌వెళ్లాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్‌ ‌కారణంగా వెళ్లలేకపోయారు. ఈలోపే వీరిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అరెస్టయిన మరో ఉగ్రవాది ముస్ఫర్‌ ‌హుస్సేన్‌ ‌బంగ్లాదేశ్‌ ‌నుంచి ఆయుధాలు కొనుగోలు చేశాడు. ఇతర ఆయుధాల కోసం బేరసారాలు జరుపుతున్న సమయంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఇతన్ని అదుపులోకి తీసుకుంది. ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే అహ్మద్‌ ‌నుంచి పిస్టల్‌, ‌బుల్లెట్‌‌ప్రూఫ్‌ ‌జాకెట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన షకీల్‌ ఆయుధ కొనుగోళ్లలో కీలకపాత్ర పోషించేవాడు. బిశ్వాస్‌ ‌వస్త్ర దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. షకీల్‌ ‌కూడా ఆయుధాల కోసం నిధుల వేటలో ఉన్నాడు. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో ఇతనిది కీలకపాత్ర. అబూ సుఫియాన్‌, ‌రెహమన్‌లకు పేలుడు పదార్థాల తయారీలో నిపుణులన్న పేరుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో కీలకంగా వ్యవహరిస్తూ భారత్‌ను దెబ్బతీసేందుకు, అస్థిర పరిచేందుకు, యువతను పెడదోవ పట్టించేందుకు ప్రయత్నించేవారు. వీరి మాటలకు ప్రభావితమై అనేకమంది యువకులు ఉగ్రవాదంవైపు ఆకర్షితులయ్యేవారు. ఫలితంగా విలువైన జీవితాన్ని కోల్పోయేవారు. తమను కన్నవారికి, కట్టుకున్న వారికి, తాము కన్నవారికి దూరమవుతూ వారి జీవితాల్లో చీకట్లు నింపేవారు. చివరికి ఎప్పుడో ఒకప్పుడు పోలీసులకు చిక్కడమో, లేదా ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుండేది. అంతిమంగా దేశానికి, తమ కుటుంబానికి నష్టం కలిగించేవారు.

పశ్చిమబెంగాల్‌లో మొదటినుంచి ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువే. ఇందుకు కారణాలనేకం. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ‌నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు ఇందుకు ప్రధాన కారణం. పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల కూడా ఇక్కడ ఉగ్రవాదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉండేది. బంగ్లాదేశ్‌తో భారత్‌కు దాదాపు 4,096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇందులో ఒక్క పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రమే సుమారు 2,216 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఇందులో చాలావరకు సరిహద్దు ప్రాంతాల్లో కంచె లేదు. ఉన్నచోట్ల కూడా నిర్వహణ పకడ్బందీగా ఉండదు. దీనికితోడు సరిహద్దుల్లోని కొంతమంది భద్రతా సిబ్బంది ఉదాసీనత కారణంగా నిత్యం బంగ్లాదేశ్‌ ‌నుంచి అక్రమ చొరబాట్లు జరుగుతుంటాయి. పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోతారు. భారతీయ పౌరులుగా గుర్తింపు పొందుతూ ఆ మేరకు ఓటరు కార్డ్, ఆధార్‌, ‌పాన్‌, ‌డ్రైవింగ్‌ ‌లైసెన్సు వంటి గుర్తింపు పత్రాలు సంపాదించి భారతీయ పౌరులుగా చెలామణి అవుతారు. 34 ఏళ్ల సీపీఎం పాలన వారికి స్వర్గధామంగా ఉండేది. ఓట్లను దృష్టిలో పెట్టుకుని వామపక్ష ప్రభుత్వం వారి అవాంఛనీయ కార్యకలాపాల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించేది. ఇదే అదునుగా వారు మరింత రెచ్చిపోయేవారు. కాలక్రమంలో వారిలో కొందరు ఉగ్రవాదులుగా మారిపోయారు. తరచూ అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా పాలకులు వారి జోలికి పోయేవారు కాదు. అంతేకాదు, కొందరు అధికార పార్టీలో చేరి స్థానిక ప్రజాప్రతినిధులుగా కూడా చెలామణి అయ్యారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి బెంగాల్‌ ‌పరిస్థితుల గురించి తెలియకపోలేదు. కానీ ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించేది. దీంతో 2011 వరకు అక్రమ చొరబాటుదారులు ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది.

అరెస్టయిన ఉగ్రవాదులు వరుసగా అహ్మద్‌, ‌ముర్షిద్‌ ‌హసన్‌, ‌ముస్ఫర్‌ ‌హుస్సేన్‌, అబూ సుఫియాన్‌

రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్‌ ‌నుంచి అక్రమ వలసల కారణంగా ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. 1951లో రాష్ట్రంలో ముస్లిం జనాభా 19.88 శాతం కాగా 2011 నాటికి 27 శాతానికి చేరడం గమనార్హం. 2018 నాటికి 32 శాతానికి పెరిగినట్లు అంచనా. సరిహద్దుల్లోని జాంగీపూర్‌ ‌నియోజకవర్గంలో ముస్లింల జనాభా దాదాపు 70 శాతంగా ఉంది. ముఖ్యంగా ముర్షీదాబాద్‌, ఉత్తర 24 పరగణ, దక్షిణ 24 పరగణ, మాల్దా వంటి సరిహద్దు జిల్లాల్లో చొరబాటుదారులు స్థానిక రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నారు. ముర్షీదాబాద్‌లో 66 శాతం, ఉత్తర దినాజ్‌పూర్‌లో 50 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది. మాల్దా నియోజకవర్గం నుంచి 1980 నుంచి 2004 వరకు మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్‌ ‌ఘనీఖాన్‌ ‌చౌదురి ఎంపీగా ఇక్కడ చక్రం తిప్పాడు. ఇందుకు బంగ్లాదేశ్‌ ‌నుంచి వచ్చి స్థిరపడిన వలసదారులే కాణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2006లో ఘనీఖాన్‌ ‌మరణంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు అబ్దుల్‌ ‌హసీంఖాన్‌ ‌చౌదురి విజయంలోనూ వలస ఓట్లే కీలకంగా నిలిచాయి. మాల్దాలో 60 శాతంపైగా ముస్లిం మైనార్టీలే. కోల్‌కతాకు 347 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్‌ ‌సరిహద్దులో మాల్దా నియోజక వర్గం విస్తరించి ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్‌ ‌వ్యవస్థీకరణలో భాగంగా మాల్దా నియోజక వర్గాన్ని ఉత్తర మల్దా, దక్షిణ మాల్దగా విభజించారు. ప్రస్తుతం ఉత్తర మాల్దా ఎంపీగా అబ్దుల్‌ ‌హసీంఖాన్‌ ‌చౌదురి ఉన్నారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 42 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్‌ ‌గెలిచింది రెండే సీట్లు. వాటిలో ఉత్తర మాల్దా ఒకటి కాగా రెండోది బరహంపూర్‌. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ ‌లోక్‌సభ ఫక్ష నేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదురి ప్రాతినిథ్యం వహిస్తుండటం గమనార్హం. దీనిని బట్టి బంగ్లాదేశ్‌ ‌వలసదారుల ఓట్లపై కాంగ్రెస్‌ ఎం‌తగా ఆధారపడిందో అర్థమవుతుంది. సీపీఎం నేతలు సైతం వలసదారుల ఓటుబ్యాంకును ఉపయోగించుకుని రాజకీయంగా గణనీయంగా లబ్ధి పొందారు. బెంగాల్‌ ‌నుంచి ఆ పార్టీ నాయకులు ఎంతోమంది పార్లమెంటులోకి ప్రవేశించారు.

2011లో మమతా బెనర్జీ అధికారం చేపట్టిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ఇంకా దిగజారిందనే చెప్పాలి. మమత హయాంలో మదర్సాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇమాంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీదీ కూడా వలసదారుల ఓటుబ్యాంకు మీద ఆధారపడి రాజకీయాలు చేయడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), జాతీయ పౌర పట్టిక (నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్)‌లను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగానే మమత వ్యతిరేకించారు. మయన్మార్‌ ‌రోహింగ్యాల విషయంలోనూ ఆమె మద్దతుగా నిలవడానికి ఓటుబ్యాంకు రాజకీయాలే కారణం. అక్రమ వలసదారుల ఓట్ల కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో మమత నాయకత్వంలోని టీఎంసీ గణనీయంగా 34 సీట్లను గెలుచుకుంది. భాజపా రెండు, సీపీఎం రెండు, హస్తం పార్టీ నాలుగు సీట్లు సాధించాయి. అప్పటి నుంచి కమలం పార్టీ అక్రమ వలసదారుల అంశంపై బలంగా గళమెత్తింది. ప్రజల్లో చైతన్యం, అవగాహన కలిగించింది. సీపీఎం, టీఎంసీ, కాంగ్రెస్‌ ‌పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలను ఎండగట్టింది. ఈ అంశాలను బలంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. ఫలితంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 42 సీట్లకు గాను 18 స్థానాల్లో గెలుపొంది ఓటుబ్యాంకు రాజకీయాలకు అడ్డుకట్ట వేసింది. మొదటినుంచీ అక్రమ వలసదారులపై ఆధారపడిన సీపీఎంకు అసలు ప్రాతినిథ్యమే లేకుండా చేసింది. హస్తం పార్టీని రెండు, టీఎంసీని 22 స్థానాలకు పరిమితం చేయడంలో కమలం పార్టీ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మమతకు గట్టి సవాల్‌ ‌విసరబోతోంది.

ఉగ్రవాదుల అరెస్టులను బలంగా ఎత్తిచూపింది ఒక్క కమలం పార్టీనే కావడం గమనార్హం. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని మెదినీపూర్‌ ఎం‌పీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ఘోష్‌, ‌కేంద్రమంత్రి బాబుల్‌ ‌సుప్రియో ధ్వజమెత్తారు. అధికార టీఎంసీ, కాంగ్రెస్‌, ‌సీపీఎంలు ఈ ఘటనను గట్టిగా ఖండించ లేదు. సీఎం మమతా బెనర్జీ ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై మౌనం దాల్చారు. ఆ పార్టీ ఎంపీ సౌగత్‌రాయ్‌ ‌సరిహద్దుల్లో సరైన నిఘా లేకపోవడమే ఇందుకు కారణమని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేశారు. సీపీఎం శాసనసభా పక్షనేత సుజన్‌ ‌చక్రవర్తి దీనిని మతకోణంలో చూడరాదంటూ ఘటన తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నంచేశారు. సీపీఎం పాలనలోని కేరళలోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు అక్కడి పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని చెప్పకతప్పదు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష ప్రభుత్వాలు ముస్లింల పట్ల ఉదారంగా వ్యవహరించాయన్నది బహిరంగ రహస్యం. కేవలం ఆ వర్గం వారిని సంతృప్తి పరిచేందుకే మలప్పురం జిల్లాను ఏర్పాటు చేసిన విషయం  తెలిసిందే.

ఇటువంటి బుజ్జగింపు రాజకీయాలు దేశహితానికి చెరుపు చేస్తాయి. ఓటుబ్యాంకు ప్రాతిపదికన కాకుండా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలు చేయడం నేటి అవసరం. అదే సమయంలో ఉగ్రవాదం పట్ల ఒకే గొంతుతో మాట్లాడటం కూడా ఎంతో ముఖ్యం. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వ పరిరక్షణలో సంకుచిత రాజకీయాలకు చోటు ఉండరాదు.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram