కాంగ్రెస్‌ ‌పార్టీ నేడున్న ఇరకాటంలో చరిత్రలో ఏనాడూ లేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక/నియామకంలోనూ అదే పితలాటకం. అంతా గందరగోళం, వాగాడంబరమే. మాటలకీ చర్యలకీ పొంతన లేకపోవడమే. ఎన్నికలలో గాని, చట్టసభలలో గాని ఆ పార్టీ ప్రదర్శిస్తున్న పేలవమైన పాత్రలో అదే ప్రతిబింబిస్తున్నది. ఒకనాటి ఆ జాతీయ పార్టీ ఇప్పుడు గుప్పెడు సీట్ల కోసం ప్రాంతీయ పార్టీల పంచన కాలం గడుపుతున్నది. లోక్‌సభలో కూడా ప్రాంతీయ పార్టీలకు వంత పాడడం తప్ప స్వతంత్రంగా వ్యవహరిస్తున్న దాఖలాలే లేవు. రాజ్యసభలో మిగిలి ఉన్న కొద్దిపాటి ఆధిక్యాన్ని బీజేపీ చేసే ప్రతి ప్రతిపాదనను విచక్షణారహితంగా తిరస్కరించడానికే ఉపయోగించుకుంటున్నది. 2014 ఎన్నికల తరువాత ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు లేడు. విపక్ష నేతగా ప్రతిష్టిద్దామని ఎంత యత్నించినా గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ నాయకత్వం అనే కాడి పడేసి కన్నుకొట్టే పనిలో కనిపించాడు. అయినా నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీకి కనిపిస్తున్న ఏకైక పెద్ద దిక్కు యాభయ్‌ ఒక్క ఏళ్ల ఈ ‘బాలుడు’. ఆయన 2019లో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చిన తరువాత ఎన్నో పరిణామాలు జరిగాయి. తమ కుటుంబీకులు, అంటే గాంధీ కుటుంబీకులు కాక బయటివారు అధ్యక్ష పదవిని అధిరోహించడం మంచిదని రాహుల్‌ ‌చాటారు. దీనితోనే ఈ ప్రతిష్టంభన. అలాంటి భీషణ ప్రతిజ్ఞ చేసినప్పటికీ, జనం దృష్టిలో చులకన అవుతామన్న ఆలోచన కూడా లేకుండా తాత్కాలిక అధ్యక్ష పదవిని కూడా ఆ కుటుంబం వదిలిపెట్టలేదు. రాహుల్‌ ‌రాజీనామా వెనక్కు తీసుకోలేదు. ఫలితం- సోనియా తాత్కాలిక అధ్యక్షురాలయ్యారు. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందని వారు అధ్యక్షులు కావాలన్న సోదరుడి అభిప్రాయాన్ని అక్షరాలా శిరసావహిస్తానని అదే కుటుంబానికి చెందిన ప్రియాంకా వాద్రా చెప్పారు. ఇదొక రాజకీయ వైచిత్రి కాదా! తాత్కాలిక అధ్యక్ష పదవిలో సోనియా తొలి వార్షికోత్సవం జరుపుకున్నారు. కొత్త అధ్యక్షుడి ఊసే లేదు. ఎన్నిక సంగతి అటుంచి, కనీసం నియామకం సూచనలు కూడా లేవు. స్వరాజ్యం వచ్చిన తరువాత ఈ ఏడు దశాబ్దాల కాలంలో వలెనే ఆ పార్టీ వ్యక్తి ఆరాధనకీ, కుటుంబ పాలనకీ కట్టుబడే ఉంది.  అధ్యక్ష ఎన్నిక పేరుతో ఈ సంవత్సర కాలంగా ఆ పార్టీలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అవి ఒక ప్రహసనానికి ఏమాత్రం తీసిపోవనే అనిపిస్తుంది.

కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తాజా/పాత ప్రకటన ఒకటి మళ్లీ పార్టీ అధ్యక్ష పదవి గురించి భారత జాతికి గుర్తుచేసింది. గడచిన సంవత్సరం తన సోదరుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయమే నా అభిప్రాయం అన్నారామె. గాంధీ కుటుంబానికి సంబంధం లేని బయటివారు పార్టీ అధ్యక్ష పదవి స్వీకరిస్తే భేషుగ్గా ఉంటుందని కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో (2019, ఆగస్ట్) ‌రాహుల్‌ ‌గర్జించారు. ఈ ఒక్కసారికేనా, లేక ఇక శాశ్వతంగా గాంధీ కుటుంబేతరులే అధ్యక్ష పదవి చేపట్టాలని ఆయన సత్సంకల్పమా అన్నదాంట్లో స్పష్టత లేదు. ఈ గాంధీ కుటుంబ సోదరసోదరీమణుల అభిప్రాయాలను అమెరికా విద్యావేత్తలు ప్రదీప్‌ ‌చిబెర్‌, ‌హర్ష్ ‌షా రాసిన పుస్తకం ‘ఇండియా టుమారో: కాన్వర్జేషన్‌ ‌విత్‌ ‌ది నెక్స్‌ట్‌ ‌జనరేషన్‌ ఆఫ్‌ ‌పొలిటికల్‌ ‌లీడర్స్’‌లో ప్రచురించారు. ఇందులో ప్రియాంక ప్రకటనకే భారతీయ మీడియాలో ఒక వర్గం పెద్ద పీట వేసింది. కానీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత ‘పదిహేను మాసాల క్రితం చేసిన వ్యాఖ్యని తీసుకుని తాజాగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలోని మాటల్లా చెబుతున్నారు’ అన్నాడని వార్త. ఆ విద్యావేత్తలిద్దరు జూలై, 2019లో ప్రియాంకను కలుసుకున్నప్పుడు చేసిన వ్యాఖ్య అట అది. అంటే దగ్గర దగ్గరగా రాహుల్‌ ‌రాజీనామా సమర్పించిన సమయం నాటిదే. ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. కాంగ్రెస్‌కు పూర్తి సమయం అధ్యక్షుడు లేడన్న విషయం పార్టీలోని పెద్దతలలకీ, పనిలో పనిగా జాతికీ గుర్తుకు తెచ్చేందుకు ఆ సదవకాశాన్ని, అమెరికా విద్యావేత్తల పుస్తకం నేపథ్యంలో ఎవరైనా వినియోగించుకోదలిచారా? కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆరాటపడుతున్న వారు ఇప్పుడు ఆ పార్టీలోనే చాలా మంది ఉన్నారు. వారే ప్రియాంక తాజా/పాత ప్రకటనతో మీడియాని పురిగొల్పారా? మే 25, 2019న జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో రాహుల్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ లేఖ ఇచ్చేశారు. రాహుల్‌ ‌చేత రాజీనామా లేఖ ఇప్పించిన సంగతి ఏదో ఈ పాటికే గుర్తుకు వచ్చి ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌ఘోర పరాజయం. 543 స్థానాల లోక్‌సభలో, రాహుల్‌ ‌నాయకత్వంలో పార్టీ బరిలోకి దిగగా, 52 మాత్రమే గెలుచుకోగలిగింది. పైగా గతంలో కంటే బీజేపీ అదనంగా స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్ని చెప్పినా ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోలేదు. దీనితో తల్లడిల్లిపోయిన కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు నిరసనలకు దిగడంతో ఆ సంవత్సరం జూలై 3న ఒక లేఖ ద్వారా రాహుల్‌ ‌మళ్లీ తన నిర్ణయం పునరుద్ఘాటించారు. ఇక్కడ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలని తప్పు పట్టలేం. రాహుల్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ బీజేపీ మీద, ప్రధాని మీద, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ఆయనే ఒక్కరే మాట్లాడు తున్నారు. అధికార ప్రతినిధులు రాహుల్‌ ‌కవి హృదయం గురించి భాష్యం చెప్పే బాధ్యతకి పరిమిత మవుతారు. కాబట్టి, ఆ విమర్శలేవో అధ్యక్ష పదవిలో ఉండి చేస్తే శోభస్కరం కదా అని సాధారణ కార్యకర్తలు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి రాహుల్‌ అధ్యక్ష పదవిలో లేకున్నా, ఉన్నా కార్యకర్తలకు ఒకటే. కారణం ఆయన నెహ్రూ-గాంధీ కుటుంబీకుడు. కాంగ్రెస్‌ ‌నాయక స్థాయిలో నిలిచి ఉండడం ఆ కుటుంబ జన్మహక్కు. పార్టీ పదవి వారికి లాంఛనం. మే 5, 2019 నాటి కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ పార్టీలో సీనియర్లని ఉతికి ఆరేశారు. నిజం చెప్పాలంటే మోదీ తన మీద గెలిచారనీ, బీజేపీతో ఒంటి చేత్తో పోరాడానని ఆయన అనుకోవడం వల్ల వచ్చిన హ్రస్వదృష్టి ఫలితమది. ఆ సీనియర్‌ ‌నేతలు వాళ్ల వాళ్ల కొడుకుల రాజకీయ భవితవ్యం కోసం పార్టీని ఫణంగా పెడుతున్నారని రాహుల్‌ ఆ‌క్రోశించారు. పార్టీ గెలుపు కంటే వాళ్ల పుత్రరత్నాలని గెలిపించుకోవడమే ప్రధానంగా భావించారంటూ దేవ రహస్యం ఒకటి బయట పెట్టారాయన. తమ తరువాత తమ కుటుంబ వారసులకి పార్టీ పదవులు కట్టబెట్టాలని అనుకుంటు న్నారని కూడా కుండబద్దలు కొట్టేశారు. కానీ ఇవన్నీ మొదట తన కుటుంబానికి, ఇంకా తనకీ వర్తిస్తాయని ఆయన ఎందుకు అనుకోవడం లేదు! గాంధీ కుటుంబానికి తప్ప అన్యులకు కాంగ్రెస్‌ ‌వారసత్వం కోసం అర్రుల చాచే హక్కు ఎక్కడిదని ఆయన ఉద్దేశం కాబోలు?

ఆ ఆమెరికా విద్యావేత్తలే రాహుల్‌తోనూ మాట్లాడారు. రాజీనామా నిర్ణయంలో మార్పు లేదని ఆ ఇద్దరికి కూడా ఆయన చెప్పారు. ప్రియాంక ప్రకటనకు ఇచ్చిన ప్రాధాన్యం రాహుల్‌ ‌ప్రకటనకి మీడియా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ‌తరఫున పోరాడతాను. ఇక్కడ నేనున్నదే అందుకు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాడాలంటే తాను ఉండాలని, పార్టీ పటిష్టంగా ఉండాలంటే తన నాయకత్వమే అనివార్యమని తాను భావించడం లేదన్నారు. ఈ అమృతవాక్కులు కూడా ఆ పుస్తకంలోనే దర్శనమిస్తున్నాయి. రాహుల్‌ అసలు ఆవేదన ఏదో రాజీనామా లేఖలో అక్షరబద్దం చేశారు. ప్రధాని మోదీ మీద జరుపుతున్న పోరాటంలో, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ప్రకటించిన యుద్ధంలోను తనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదనీ, ఒంటరి పోరాటమే శరణ్యమైందనీ ఆయన కుమిలిపోతున్నారట. నేను వారితో వ్యక్తిగతంగా పోరాడానని కూడా ఆయన చెప్పుకున్నారు. ఎందుకు అంటే, తనకు భారత్‌ అం‌టే చాలా ప్రేమ కాబట్టి అని వివరించుకున్నారు. తన సీనియర్లు గొంతు కలపకపోయినా, తానొక్కడే పోరాటం చేసినందుకు గర్వంగానే ఉందని తనకు తాను ప్రశంసాపత్రం ఇచ్చుకున్నారాయన, లేఖలో. కొన్ని కొత్త విషయాలు కూడా పేర్కొన్నారాయన. జవాబుదారీతనం అనే సంస్కృతిని పెంచుకోవలసిన అవసరమేమిటో కాంగ్రెస్‌ ‌పార్టీ గుర్తించాలన్న మహదాశయంతోనే రాజీనామా చేశారట. ఇలాంటి సంస్కృతి ప్రస్తుతం కాంగ్రెస్‌లో బొత్తిగా కరవైపోయిందని పార్టీ పెద్దలకి గుర్తు చేయవలసి వచ్చింది. ఇక్కడ ఓ ప్రశ్న- 2014 నాటి సాధారణ ఎన్నికలలోను పార్టీ మట్టి కరిచింది. అప్పుడు సోనియా అధ్యక్షురాలు. ఆమెకి సైతం జవాబుదారీతనం లేదనే రాహుల్‌ అభిప్రాయమా? లేక ఇలాంటివన్ని గాంధీ కుటుంబానికి కాకుండా, బయటివారికే వర్తిస్తాయా? ఈ తరహా ఆణిముత్యాలు ఎన్నో ఆ అమెరికా విద్యావేత్తలకి వివరించారు రాహుల్‌. ఇం‌కొక మాటలో చెప్పాలంటే అమెరికా వాళ్లు డంగైపోయే భారీ సంగతులు చాలానే చెప్పారు. గాంధీ కుటుంబానికి చెందని వారు అధ్యక్ష పదవి స్వీకరిస్తే బాగుంటుందన్న అంశం ‘ఆ (రాజీనామా) లేఖలో లేకపోవచ్చు. కానీ ఆయన (రాహుల్‌) అక్కడా ఇక్కడా మాట్లాడినప్పుడు ఈ విషయమే చెప్పారు. ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను’ అంటున్నారు అపూర్వ సహోదరి ప్రియాంక. ఇది కూడా ఆ విద్యావేత్తలే నమోదు చేశారు. ఇంత చెబుతున్నారు కదా, ప్రియాంక అధ్యక్ష పదవి ఎందుకు చేపట్టకూడదు? ఇది కూడా చాలామంది నేతలకు వచ్చిన ఆలోచనే. రాహుల్‌ ‌కూడా అమెరికా విద్యా వేత్తలతో తన సోదరి చాలా సమర్ధ రాజకీయవేత్త అని కితాబిచ్చారు.

ఆగస్ట్ 1, 2019‌న కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఆగస్ట్ 20‌న జరిగే రాజీవ్‌ ‌గాంధీ జయంతి కార్యక్రమం గురించి చర్చించడం దాని ఉద్దేశం. అందుకే రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జులు కూడా దయచేశారు. ప్రియాంక పార్టీ అధ్యక్షురాలైతే బాగుంటుందన్న అభిప్రాయం అప్పుడే వెల్లడైంది. పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌, ‌తిరువనంతపురం ఎంపి, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ‌కూడా ఈ ప్రతిపాదనను మెచ్చారు. కానీ, నన్ను అందులోకి లాగొద్దు మహాప్రభో అని ఆమె మొగ్గలోనే తుంచేశారు. ఆమె మాటనుబట్టి, రాహుల్‌ ‌కఠోర వ్రత దీక్షను బట్టి రొటీనుకు భిన్నంగా ఎవరో సీనియర్‌ ‌నాయకుడికి పార్టీ అధ్యక్షుడయ్యే మహాయోగం పట్టబోతున్నదని, చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నదని కొందరు ఊహాగానాలు చేశారు. అయితే ఈ ఊహాగానాల మీద నీళ్లు కుమ్మరిస్తూ, మళ్లీ రాహుల్‌నే పడదీసి అధ్యక్ష పీఠం మీద కూర్చోపెట్టాలన్నంత ఉత్సాహం కాంగ్రెస్‌లో పెల్లుబికింది. ఇందుకు కూడా శశిథరూర్‌ ‌మద్దతు ఇచ్చారు. మనీష్‌ ‌తివారీ అనే అధికార ప్రతినిధి కూడా సమర్థించాడు. నిరుడు ఆగస్ట్ 10 ‌సమావేశం ఇంకొక విధంగా కూడా చరిత్రాత్మకమే. ముకుల్‌ ‌వాస్నిక్‌ అనే సీనియర్‌ ‌నేతను అధ్యక్షునిగా నియమిస్తారన్న మాట వచ్చింది. ఆ మాట ఎంత వేగంగా వచ్చిందో, అంత వేగంగాను అతీగతీ లేకుండా పోయింది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మరొకరి పేరు అప్పుడు బయటకు వచ్చింది. ఆమె హరియాణా దళిత నేత సెల్జా కుమారి. రాబోయే రోజులలో, అధ్యక్ష ఎన్నికకు సంబంధించి పార్టీ తన నిబంధనావళిని పాటిస్తుందని ఆమె ప్రకటించారు. జరిగింది ఏమిటీ? 2017లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సోనియాజీకి తప్పలేదు. కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ విన్నపం మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. పార్టీ పూర్తి సమయం అధ్యక్షుని ఎన్నుకునే వరకు మాత్రమే పదవిలో ఉంటానని సోనియా జాతి ఎదుట తన నిజాయితీని, నిబద్ధతని ఒలకబోశారు. నాడు ప్రధాని పదవిని ‘త్యాగం’ చేయడం కంటే ఇది గొప్పదనిపించేటట్టు చేసి, త్యాగంలో తన రికార్డును తానే బద్దలుకొట్టుకునే యత్నం చేశారు. ఇదేకాదు, ఇప్పుడు సోనియాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుల చరిత్రలోనే రికార్డు సృష్టించిన వారవుతున్నారు. 1885లో ఆ సంస్థ ఏర్పడినప్పటి నుంచి అధ్యక్ష పదవిని చేపట్టిన 82 మందిలో సోనియాదే అగ్రస్థానం. బయటివారినే కాదు, మోతీలాల్‌, ‌జవాహర్‌లాల్‌, ఇం‌దిర, రాజీవ్‌, ‌రాహుల్‌ ‌వంటి కుటుంబ సభ్యులు యావన్మందిని తలదన్ని 19 ఏళ్లు ఆ పదవిలో కొనసాగిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ ఆగస్ట్ 10‌తో తాత్కాలిక అధ్యక్ష పదవిలో ఉంటూ తొలి వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇది కూడా రికార్డుగా ఎక్కడైనా నమోదు కావడానికి అవకాశం ఉందేమో చూడాలి. ఆ మరునాడే శశిథరూర్‌ అధ్యక్ష పదవి ఎన్నిక ప్రస్తావన చేశారు. ఎంతో ఆలోచించదగిన ఒక వ్యాఖ్య అదే సమయంలో రాహుల్‌ ‌నోటి నుంచి వచ్చింది. జమ్ముకశ్మీర్‌, ‌లద్ధాఖ్‌లో హింసాత్మక సంఘటనలు పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక పక్రియను కల్లోల పరుస్తున్నాయని అన్నారాయన. తరువాతి అధ్యక్షుడు తమ కుటుంబం నుంచి రారు అని కరాకండీగా చెప్పారు రాహుల్‌. ‌కానీ ఆ పదవిలోకి సోనియా వచ్చారు. అంటే ఇక్కడ రాహుల్‌ ‌హృదయం అర్థం చేసుకోవాలి. ఆయన అన్నది శాశ్వత అధ్యక్ష స్థానం గురించి. తాత్కాలిక ప్రాతిపదిక కాబట్టి సోనియా పదవిని చేపట్టి ఉండవచ్చు.

శశిథరూర్‌

పూర్తికాలం అధ్యక్ష వ్యవహారం ఏదో ఒకటి తేల్చాలి అంటూ కొందరు పార్టీ ఎంపీలు సహా, నాయకులు సోనియాను వేడుకుంటూనే ఉన్నారు. కానీ రాహుల్‌ ‌దిగిపోయిన తరువాత ఒక సమస్య వచ్చింది. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అంటూ శిబిరాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించినవారు గులాం నబీ ఆజాద్‌. ‌రాహుల్‌ ‌వైఖరి సీనియర్లకు రుచిస్తుందని అనుకోలేం. అయినా రాహుల్‌ ‌మనసు మార్చి తీరాలన్న పట్టుదలతో కొందరు ఉన్నారు. ఇదే అసలు ఇరకాటం. తనయుడేమో గాంధీ కుటుంబీకులు అధ్యక్ష స్థానం స్వీకరించరాదన్నదే అభిమతమని అంటున్నారు. సోనియా నోటి నుంచి ఈ మాట రాదు. కార్యకర్తలేమో రాహుల్‌ ‌మాత్రమే కాంగ్రెస్‌కు దిక్కు అంటున్నారు. ప్రియాంక సోదరుడి మాటని సమర్ధిస్తున్నారు. కానీ అందుకు దోహదపడే ఒక్క అడుగు కూడా పడడం లేదు. ఇవి ఇలా ఉండగానే పార్టీకి పిడుగుపాటు వంటి ఘాతం తగిలిందని కొందరు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాహుల్‌ ‌మళ్లీ స్వీకరించాలన్న నినాదం పదునెక్కుతున్న కాలంలో ప్రియాంక వ్యాఖ్య బయటకు రావడం ఏమిటి అన్నదే వారి బాధ. శశిథరూర్‌, ‌మనీష్‌ ‌తివారీల మాట మరీ ముచ్చటగా ఉంది. అదేమిటి అంటే, రాహుల్‌ ‌రాజీనామాను వెనక్కి తీసుకోకపోతే, అంతర్గత ఎన్నిక ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలట. ఇది దురాశ అనుకోవచ్చా? లేకపోతే శతాధిక సంవత్సరాల పార్టీలో ప్రజాస్వామ్యం నవనవలాడుతూనే ఉందని నమ్మించడానికి చెబుతున్న మాటా? ఇంతలోనే ‘స్టేట్స్‌మన్‌’ ‌వంటి జాతీయ పత్రికలు ‘తాత్కాలిక అధ్యక్షులే శాశ్వతం కాబోలు’ అంటూ చురకలు తగిలించాయి. తాత్కాలిక అధ్యక్షురాలి తొలి వార్షికోత్సవం నేపథ్యంలోనే ఈ ఆగస్టులో పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడి గొడవ మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలంటూ దాదాపు వంద మంది నేతలు, ఎంపీలు సోనియాకు లేఖ రాశారని పార్టీ నుంచి సస్పెండయిన సంజయ్‌ ‌ఝా బయటపెట్టారు. ఈ జూన్‌ 20‌న సస్పెండైన ఈ నాయకుడు చేసిన తప్పిదం ఒక్కటే. కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యవహారాలు మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఒక పత్రికలో రాయడమే. పార్టీ పరువు మాటెలా ఉన్నా గాంధీ కుటుంబం ఎట్టి పరిస్థితులలోను బజారున పడకుండా కాపాడేందుకు సర్వం ఒడ్డే అధికార ప్రతినిధులు ఆ పార్టీకి ఉన్నారు. అలాంటి లేఖ ఏదీ లేదని, ఇదంతా బీజేపీ ప్రచారమని రణదీప్‌ ‌సూర్జేవాలా కొట్టి పారేశారు. లేఖ రాసినట్టు సంజయ్‌ ‌ఝా ఆగస్ట్ 17‌న వెల్లడించారు. అసలు ఇలాంటి ఒక లేఖ ద్వారా సోనియాను అభ్యర్థించాలని కొందరు నేతలు భావిస్తున్నట్టు జూలై 29న ఐఏఎన్‌ఎస్‌ ‌వార్తా సంస్థ కూడా రాసింది. అధికార ప్రతినిధి ఆ లేఖే అభూత కల్పన అంటున్నారు. ఏది నిజం? లేఖల సంగతెలా ఉన్నా, పూర్తి స్థాయి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇంకా ఆలస్యం కాకూడదన్న విషయంలో కొంత తెగింపు ఆ పార్టీలో ఊపందుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ ఆగస్ట్ 28‌న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌వెబ్‌సైట్‌ ‌వెలువరించిన ఒక వార్త దీనిని రుజువు చేసేదే. పార్టీలో సమూల మార్పులు అవసరమంటూ తాత్కాలిక మూలవిరాట్‌కు 28 మంది సీనియర్‌ ‌నాయకులు ఒక లేఖాస్త్రం సంధించారన్నదే ఆ వార్త సారాంశం. ఈ లేఖ ఇచ్చి రెండు వారాలవుతోందని కూడా వెల్లడించింది. అంతేకాదు, 24న కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశం కూడా ఉందని మరొక ప్రముఖ వార్తా చానల్‌ ఆరోజే వెల్లడించింది. ఆ 23 మందిలో సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రులు, చాలామంది కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సభ్యులు, ప్రస్తుత లోక్‌సభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రులు కూడా ఉన్నారని ఎక్స్‌ప్రెస్‌ ‌కథనం చెబుతోంది. మట్టి కరిచిన ఆరేళ్ల తరువాత మార్పు కోసం జరుగుతున్న పెద్ద ప్రయత్నమని కూడా వ్యాఖ్యానించింది. దేశంలోని యువతరమంతా మోదీకి ఓటు వేస్తున్నారని, అంటే కాంగ్రెస్‌కు ఉన్న క్షేత్రస్థాయి పునాదులు కదిలినట్టేనని, ఇది కలవరం కలిగించే అంశమని వారంతా ఆ లేఖలో పేర్కొన్నారని తెలుస్తున్నది. పార్టీలో సమూల మార్పులు అంటే పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎంపిక, ఆ అధ్యక్షుడు క్షేత్రస్థాయిలో కూడా చురుకుగా పనిచేసే నాయకుడు కావాలిని ఆ 23 మంది కోరుతున్నారు. ఇంకా కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీకి ఎన్నికలు, పార్టీ పునరుద్ధరణకు అవసరమయ్యే వ్యవస్థను నడిపే నాయకులను తయారు చేసుకోవడం వంటి చర్యలు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా తీసుకోమని కోరుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ ‌వెబ్‌సైట్‌ ‌కథనం ప్రకారం ఆ లేఖలో సంతకం చేసిన వారిలో రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ ‌కూడా ఒకరు. ఇంకా ఆనంద్‌ ‌శర్మ, కపిల్‌ ‌సిబల్‌, ‌మనీష్‌ ‌తివారీ, ముకుల్‌ ‌వాస్నిక్‌, ‌జతిన్‌ ‌ప్రసాద్‌, ‌వీరప్ప మొయిలీ, రేణుకా చౌదరి, పృథ్వీరాజ్‌ ‌చౌహాన్‌, ‌రాజ్‌ ‌బబ్బర్‌ ‌వంటివారు ఉన్నారు. ప్రజాస్వామ్య మౌలిక ఆరోగ్యం కోసం కాంగ్రెస్‌ను పునరుద్ధరించడం జాతీయ అవసరమని ఆ నాయకులు చెప్పిన మాటను అంతా అంగీకరించవలసిందే. కానీ, ఈ 23 మంది నేతలు కోరుతున్న సమూల మార్పులలో కొత్తదనం ఏమీ లేదనే అనిపిస్తుంది. వారు సోనియా, రాహుల్‌ ‌పార్టీకి అందించిన సేవలను వేనోళ్ల కొనియాడారు. నెహ్రూ-గాంధీ కుటుంబం కాంగ్రెస్‌ ‌సమష్టి నాయకత్వంలో ఎల్లప్పటికీ అంతర్భాగమేనని సవినయంగా మనవి చేసుకున్నారు. అంటే నెహ్రూ-గాంధీ కుటుంబానికే తమ ఓటు అని పరోక్షంగా చెప్పేశారన్నమాట.

ఏ విధంగా చూసినా కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్తి సమయం అధ్యక్షుని ఎంపిక, నెహ్రూ-గాంధీ కుటుంబం బయట నుంచి ఎంపిక అనేవి భిన్నధ్రువాలు. ఈ రెండూ కలిస్తే స్వరాజ్య భారత కాంగ్రెస్‌ ‌చరిత్రలో మైలురాయి అవుతుంది. కొన్ని జాతీయ పత్రికలు ఈ మధ్య కాంగ్రెస్‌ ‌మనగలుగుతుందా? అన్న ప్రశ్నను సంధిస్తున్నాయి. వారందరికీ కాంగ్రెస్‌ ‌మీద ప్రేమ కాదు. ఈ దేశంలో ఇప్పుడు రెండే జాతీయ పార్టీలు – బీజేపీ, కాంగ్రెస్‌. ‌మనది ప్రజాస్వామ్యం. కాబట్టి రెండు జాతీయ పార్టీలలో ఒకటి చచ్చుపడిపోవడం వాంఛనీయం కాదు. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. బీజేపీనీ, సంఘ్‌ ‌పరివార్‌నీ దుమ్మెత్తి పోస్తూ, మిగిలిన మైనారిటీల ఓట్లనయినా కాపాడుకుందా మనుకుంటూ కాలం గడిపేస్తోన్న పార్టీ కాంగ్రెస్‌. ‌సైనికుల వ్యవహార సరళని ఎద్దేవా చేస్తూ మరింత బలహీపడింది. దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్న ఆ పార్టీ కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో, లాక్‌డౌన్‌లో ఆ స్థాయికి తగ్గట్టు బాధితులను ఆదుకున్నదా? జమ్ముకశ్మీర్‌, ‌లద్ధాఖ్‌, ‌పాకిస్తాన్‌ ‌దాడులు, చైనా దురాక్రమణ, ఢిల్లీ అల్లర్లు, షాహిన్‌బాగ్‌.. ఏ ఒక్క విషయంలో అయినా కాంగ్రెస్‌ ఒక జాతీయ పార్టీ స్థాయిలో స్పందించిందా? పైగా వీటిలో కొన్ని అంశాలలో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు రావడం నిజం కాదా?

కాంగ్రెస్‌ ‌బలహీనపడుతున్న కొద్దీ ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. కానీ కాంగ్రెస్‌ ‌మీద తిరుగుబాటు పేరుతో ఆరంభమైన ప్రాంతీయ పార్టీలు కూడా యథాతథంగా ఆ పార్టీ సంస్కృతినే అమలు పరుస్తూ ఉండడం నేటి నిజం. అదే నియంతృత్వం, అదే కుటుంబ పాలన. ఇంతకీ కాంగ్రెస్‌ ‌పూర్తి సమయం అధ్యక్షునిగా గాంధీ కుటుంబానికి చెందని వారిని నియమించేటంత ఔదార్యం, లేదా ఎన్నుకునేటంత దూరదృష్టి, రాజకీయ సంకల్పం ఇవాళ ఆ పార్టీలో నిజంగానే ఉన్నాయా ? నిరంతరం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి గురించి ఊకదంపుడు చేసే ఆ పార్టీ ఇప్పుడు అధ్యక్ష స్థానం వారికి ఇస్తారా? బుజ్జగింపుతో మోసపోయి దశాబ్దాల తరబడి అధికారం కట్టబెట్టిన ముస్లింలకు ఆ అవకాశం ఇస్తారా? ఇవన్నీ అవసరం. కాంగ్రెస్‌ ‌పార్టీ నెహ్రూ-గాంధీ కుటుంబం ధ్రుతరాష్ట్ర కౌగిలి నుంచి తప్పించుకోగలదా? ఇవన్నీ ఎలా ఉన్నా నెహ్రూ-గాంధీ కుటుంబం బయట నుంచో, లోపలి నుంచో ఒక అధ్యక్షుడిని ఎంపిక చేసుకునేటంత జీవం ఆ పార్టీలో ఇప్పుడుందా?

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram