ఎడారిలో వికసించిన పచ్చదనం

ఇసుకలో ఉద్భవించిన నీటి చెలమ

ఒంటెల సవారీ వయ్యారం

పగిడీలు చుట్టే పనితనం

మీసం మెలేసే రాజసం

రాణాప్రతాప్‌ ‌వారసత్వం

ఇదీ… ఉదయ్‌పూర్‌ ‌గొప్పతనం

ఉదయ్‌పూర్‌ ‌టూర్‌ అం‌టే మహారాణా ప్రతాప్‌సింగ్‌ ‌గుర్తుకు వస్తాడు. రాణాప్రతాప్‌ ‌పేరు వినగానే ఉదయ్‌పూర్‌ ‌నగరం గుర్తుకు వస్తుంది. చరిత్ర విద్యార్థులకు మేవార్‌ ‌రాజ్యం కళ్ల ముందు మెదలుతుంది, అక్బర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిన మహానాయకుని పరాక్రమం పలకరిస్తుంది. అక్బర్‌ ‌తల్లి గర్భంతో ఉన్నప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చింది రాజపుత్రులు. అక్బర్‌ ‌రాజ్య విస్తరణలో జీవితాలను ధారపోసింది రాజపుత్రులు. బంధుత్వా లతో కొందరు, మొఘలులతో యుద్ధాల కారణంగా జరిగే ప్రాణనష్టానికి వెరసి మరికొందరు రాజపుత్రులు అక్బర్‌కు సామంతులుగా మారిపోయారు.

రాజపుత్రుల వీరత్వం, శౌర్యం, పరాక్రమం… అన్నీ మొఘల్‌ ‌సామ్రాజ్య విస్తరణ కోసమే అన్నట్లున్న సమయంలో వినిపించిన ఒక ప్రతిఘటన స్వరమే మహారాణా ప్రతాప్‌.  అక్బర్‌కు అది ఊహించని శరాఘాతం. యుద్ధం చేసి రాణాప్రతాప్‌ని గెలవాలను కున్నాడు అక్బర్‌. ‌రాణాప్రతాప్‌ను సామంత రాజుగా చేసుకుంటే ఇక ఆర్యావర్తమంతా మొఘలుల వశమే. రాజపుత్రులందరూ తనకు సామంతులే అనుకున్నాడు అక్బర్‌. అయితే… ‘తాను ఎప్పటికీ మొఘలులకు సామంతుడిని కాను, స్వతంత్రుడినే’ అని నిరూపించిన వీరుడు రాణాప్రతాప్‌. ‌రాజపుత్ర వీరుల గౌరవాన్ని నిలిపిన మెరుపు వీచిక అతడు.

రాణాప్రతాప్‌ ‌జీవితంలో ప్రతి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి ఉదయ్‌పూర్‌. ఆ ‌చారిత్రక నగరంలో అడుగు పెట్టిన క్షణం నుంచి అడుగడుగునా మేవార్‌ ‌పౌరుషం కనిపిస్తుంది. ట్యాక్సీ డ్రైవర్‌ల నుంచి ఒంటె సవారీ చేయించి జీవనం సాగించే వాళ్లు కూడా మీసాలు మెలి తిప్పి ‘ఇది వీరుల గడ్డ. రాజపుత్రుల శౌర్యానికి వారసులం’ అని గర్వంగా చెబుతారు. రాణాప్రతాప్‌ ‌గురించి ఒక్క ప్రశ్న అడిగితే చాలు… పది సమాధానాలు చెబుతారు. చెప్పేటప్పుడు వాళ్ల ఛాతీ గర్వంగా ఉప్పొంగినంత సంతోషం వాళ్ల ముఖంలో ప్రతిఫలిస్తుంటుంది. రాణాప్రతాప్‌ అమరుడై నాలుగు వందల ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ వాళ్ల జ్ఞాపకాల్లో జీవించే ఉన్నాడు.

సరస్సుల నగరం

రాజస్థాన్‌ ‌రాజ్యంలో ఉదయ్‌పూర్‌ ఓ ‌నగరం. జిల్లా కేంద్రం మాత్రమే. కానీ చారిత్రక ప్రాధాన్యం ఉన్న నగరం కావడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువ. టూరిజం ఆధారిత వ్యాపార విస్తరణ కూడా ఎక్కువే. విమానాశ్రయంలో విమానం ల్యాండ్‌ అయ్యే లోపు ‘మహారాణా ప్రతాప్‌ ఎయిర్‌ ‌పోర్టు’ అనే పెద్ద బోర్డు పర్యాటకులను టూర్‌ ‌పట్ల మినిమమ్‌ ‌గ్యారంటీకి హామీనిస్తుంది. ఈ నగరాన్ని ‘సిటీ ఆఫ్‌ ‌లేక్స్’ అం‌టారు. కానీ సిటీ ఆఫ్‌ ‌హిల్స్ అని కూడా అనవచ్చు. చారిత్రక నగరంలో ప్రయాణిస్తుంటే ఒకవైపు కొండ అయినా కనిపిస్తుంటుంది లేదా సరస్సు అయినా ఉంటుంది. ఆరావళి పర్వతాల మధ్య నిర్మించిన నగరం ఇది.

శత్రువుల నుంచి రక్షణ కోసం సిసోడియా రాజవంశానికి చెందిన రాజు రెండవ ఉదయ్‌ ‌సింగ్‌ ఈ ‌నగరాన్ని నిర్మించాడు. ఆ ఉదయ్‌ ‌సింగ్‌ ‌కొడుకే రాణాప్రతాప్‌. ఈ ‌నగర నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తే ఉదయ్‌ ‌సింగ్‌ ‌ముందు చూపుతోపాటు ప్రకృతి సౌందర్యారాధన కూడా కనిపిస్తుంది. ఫతే సాగర్‌, ‌పిచోలా, దూద్‌ ‌తలాయ్‌, ఉదయ్‌ ‌సాగర్‌, ‌స్వరూహ్ ‌సాగర్‌, ‌రంగ్‌ ‌సాగర్‌లు ఉదయ్‌పూర్‌లో పెద్ద సరస్సులు. ఫతే సాగర్‌ ‌నిండినప్పుడు అదనపు నీరు బయటకు వెళ్లడానికి కూడా చక్కటి ప్రణాళిక ఉంది. కలర్‌ఫుల్‌ ‌లైటింగ్‌తో వాటర్‌ అవుట్‌లెట్‌ని పర్యాటక ఆకర్షణగా డెవలప్‌ ‌చేశారు. ఉదయ్‌పూర్‌లో చాలా హోటళ్లు ఏదో ఒక సరస్సు ఒడ్డునే ఉంటాయి. పర్యాటకులు కూడా లేక్‌ ‌వ్యూ గదులకే తొలి ప్రాధాన్యం ఇస్తారు.

నగరంలోని పర్యాటక ప్రదేశాలలో ఎక్కువ భాగం కొండ మీద, సరస్సులో, సరస్సు చుట్టూ ఉన్నాయి. ఇన్ని సరస్సులు, నీటి ప్రణాళిక ఉండడంతో కావచ్చు లేదా ఆరావళి పర్వత శ్రేణుల కారణంగా కావచ్చు ఇక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. రాజస్థాన్‌ అనగానే గుర్తొచ్చే ఇసుక ఎడారులు ఇక్కడ కనిపించవు. నగరం పచ్చగా ఉంటుంది.

రాణాను శ్వాసిస్తోంది

ఉదయ్‌పూర్‌ ‌నగరం రాణాప్రతాప్‌ ‌జ్ఞాపకాలతో జీవించడమే కాదు శ్వాసిస్తోంది కూడా. ప్రధాన కూడళ్లలో కూడా నాటి ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. రాణాప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం చేతక్‌. ఆ ‌గుర్రానికి కూడా ఎంతో గౌరవం అక్కడ. ఒక కూడలికి ‘చేతక్‌ ‌సర్కిల్‌’ అని పేరు. ఆ కూడలిలో తెల్లటి గుర్రం ఠీవిగా ఉంటుంది. ఎడమకాలు పైకి లేపి ఉంటుంది చేతక్‌. ‌యుద్ధంలో గాయపడి మరణించిందని చెప్పడానికి ప్రతీక ఆ భంగిమ.

మనకు ‘చేతక్‌’ అనే పేరుని బజాజ్‌ ‌కంపెనీ పరిచయం చేసింది. స్కూటర్‌లలో ఒక మోడల్‌కి చేతక్‌ ‌పేరు పెట్టింది. ఉదయ్‌పూర్‌లో చిన్న చిన్న ఆటోమొబైల్‌ ‌దుకాణాలు ‘చేతక్‌’ ‌పేరుతో ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేం. చేతక్‌ను చూడాల్సిన మరో ప్రదేశం మోతీ మగ్రీ. ఇది రాణా ప్రతాప్‌ ‌మెమోరియల్‌. ఇక్కడ గుర్రాన్ని అధిరోహించిన రాణా కాంస్య విగ్రహం ఉంది. చేతక్‌ ‌ధరించిన ఇనుప కవచం సిటీ ప్యాలెస్‌లో ఉంది. ఆ కవచాన్ని ప్రదర్శించడానికి కచ్చితంగా చేతక్‌ ‌పరిమాణంలో తెల్లటి గుర్రం నమూనాను చేసి, ఆ గుర్రం బొమ్మకు కవచం తొడిగారు. దాంతో మనకు ఆ గుర్రం అసలు ఎత్తు, దారుఢ్యం అర్థమవుతాయి.

అందమైన ప్యాలెస్‌లు

ఉదయ్‌పూర్‌లో గైడ్‌లు ప్యాలెస్‌ల విశిష్టత వివరించడం రాణాప్రతాప్‌కి ముందు, రాణాప్రతాప్‌ ‌తర్వాత అన్నట్లే ఉంటుంది. మేవార్‌ను పాలించిన సిసోడియా రాజవంశంలో 13వ రాజు రాణా ప్రతాప్‌. ఆ ‌రాజ వంశంలో 77వ వారసుడు లక్ష్యరాజ్‌ ‌సింగ్‌ ‌ప్రస్తుత యువరాజు. సిటీ ప్యాలెస్‌లో కొంత భాగం రాజకుటుంబీకుల నివాసం, కొంత భాగంలో పర్యాటకులను అనుమతిస్తారు. రాజు మహల్‌, ‌రాణి మహల్‌ ‌రాజరిక వైభవానికి ప్రతీకలు. రాణి మహల్‌ ‌వరండాలో ఒక చోట రాజు కూర్చునే ప్రదేశం ఉంది. రాణి అలంకరణ పూర్తయ్యే వరకు రాజు ఎదురు చూసే చోటు అది. అలాగే దివాన్‌ ఇ ఆమ్‌, ‌దివాన్‌ ఇ ‌ఖాజ్‌, ‌హోలీ వేడుక మండపం, రాణి శీతాకాల మందిరం శీష్‌మహల్‌ ‌ప్రధానంగా చూడాల్సినవి.

హోలీ వేడుక జరిగే గార్డెన్‌, ‌సిటీ ప్యాలెస్‌ ‌నాలుగో అంతస్థులో ఉంది. అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే… అక్కడ వందల ఏళ్ల మహావృక్షాలున్నాయి. ప్యాలెస్‌ ‌బయటి నుంచి ఫొటోల్లో చూసినప్పుడు అంత పెద్ద చెట్లు అంత ఎత్తులో ఎలా ఉన్నాయో అర్థం కాదు. నిర్మాణాన్ని పరిశీలిస్తే కొండను కొంత భాగం చెక్కి ప్యాలెస్‌ ‌నిర్మించి, ఈ గార్డెన్‌ ఉన్న ప్రదేశాన్ని మొక్కల కోసం అలాగే ఉంచేశారు. నిర్మాణంలో గొప్ప ఆర్కిటెక్చురల్‌ ‌స్కిల్‌ ఉం‌టుంది.

ప్యాలెస్‌లో జరిగే వేడుకలను రాణివాసపు స్త్రీలు చూడడానికి వీలుగా గవాక్షాలున్నాయి. ఆ గవాక్షాల నుంచి నగరం వ్యూ చాలా అందంగా ఉంటుంది. ఈ ప్యాలెస్‌లో ఏనుగు పోటీల గోడ ఉంది. గోడకు ఇవతల ఒక ఏనుగు, ఆవల ఒక ఏనుగు ఉంటాయి. రెండూ తొండాలను మెలి వేసుకుని ఒకదాన్ని మరొకటి లాగుతాయి. గోడకు తగిలిన ఏనుగు ఓడిపోయినట్లు. అప్పట్లో ఏనుగుల పోటీ జరిగే తీరును వర్ణించే చిత్రపటాలు కూడా ఉన్నాయి.

నమూనా కోటలు

మోతీమగ్రీ చిన్న గుట్ట. ముత్యాల గుట్ట అని అర్థం. ఇందులోని రాణాప్రతాప్‌ ‌మెమోరియల్‌లో రాణాప్రతాప్‌ ‌వాడినవి మాత్రమే కాక, సిసోడియా రాజవంశస్తుల చిత్రపటాలు, వాళ్లు ఉపయోగించిన ఆయుధాలు ప్రదర్శనలో ఉన్నాయి. వీటికంటే ఎక్కువగా ఆకట్టుకునేవి కోటల నమూనాలు. చిత్తోర్‌గడ్‌ ‌కోట, కుంభాల్‌గడ్‌ ‌కోటలతోపాటు హల్దీఘాట్‌ ‌యుద్ధరంగం నమూనా కూడా ఉంది. కోటలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు, ప్యాలెస్‌లను ప్లాస్టర్‌ ఆఫ్‌ ‌పారిస్‌తో చేసి గాజుపెట్టెలో అమర్చారు. కోట గోడ, ద్వారాల నుంచి లోపల ఉండే ఆలయాలు, నదులు, పచ్చిక బయళ్లకు కూడా చక్కగా రూపకల్పన చేశారు. గాజు పెట్టెపై నుంచి చూడడంతో ఆ ప్రదేశాలను ఏరియల్‌ ‌వ్యూలో చూస్తున్నట్లు ఉంటుంది.

రాణి గారి తోట

రాణి ఉద్యానవనం పేరు ‘సహేలియోంకి బరీ’ ఇందులో ఒక రెస్ట్ ‌హౌస్‌, ‌దానికి రెండు వైపులా రెండు తోటలున్నాయి. ఒకటి సమ్మర్‌ ‌గార్డెన్‌, ‌మరొకటి వింటర్‌ ‌గార్డెన్‌. ఎం‌డకాలంలో వేడి లేకుండా చల్లగా ఉండేటట్లు వాటర్‌ ‌ఫౌంటెయిన్‌లున్నాయి. అప్పటి నిర్మాణశైలి, నాణ్యతకు చేతులెత్తి మొక్కాల్సిందే. ఫౌంటెయిన్‌లకు, రెస్ట్ ‌రూమ్‌లో ఉన్న స్విమ్మింగ్‌పూల్‌కు నీటి సరఫరాకు కరెంట్‌ ‌వాడరు. ప్రెషర్‌తో నీరు చేరుతుంది. వాటిని నిర్మించినప్పటి నుంచి ఆ పరికరాలన్నీ ఇప్పటికీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. ఇక నగరంలో గులాబ్‌భాగ్‌, ‌దీన్‌దయాళ్‌ ‌పార్క్, ‌జగదీశ్‌ ఆలయం మఖ్యమైనవి. గులాబ్‌భాగ్‌ ‌నగరం మధ్యలో ఉన్న విశాలమైన తోట. దీన్‌దయాళ్‌ ‌పార్క్‌లో దీనదయాళ్‌ ‌విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఒక్కటే కాదు, ఉదయ్‌పూర్‌లో ఆధునిక కాలంలో రూపుదిద్దుకున్న అనేక శిల్పాల ముఖాల్లో పసితనం కనిపిస్తుంది. విగ్రహంలో దేహభాగాల పరిమాణం నిష్పత్తిలో పరిణతి లోపించినట్లు కూడా అనిపిస్తుంది.

హల్దీఘాట్‌ ‌మ్యూజియం

హల్దీఘాట్‌లో నిర్మించిన రాణాప్రతాప్‌ ‌మ్యూజియం ఇది. ఈ మ్యూజియం రాణాప్రతాప్‌ ‌జీవిత ఘటనల మాలిక. యుద్ధాలతోపాటు అనేక ఘట్టాలను మట్టిలోనే మలిచారు. పర్యాటకులు ఒక్కో ఘట్టం ముందుకు రాగానే సెన్సార్‌ ‌లైట్లు వెలుగుతాయి. ఆడియో సిస్టమ్‌ ‌నుంచి వివరాలు వినిపిస్తాయి. గైడ్‌ ‌మరికొంత విపులీకరిస్తాడు. మోతీమగ్రీలో మ్యూజియం రాణాప్రతాప్‌ ‌జీవితాన్ని పెయింటింగ్స్‌లో ప్రతిబింబిస్తుంది. హల్దీఘాట్‌ ‌మ్యూజియం సెట్టింగులతో కళ్లకు కడుతుంది. ఈ మహా మ్యూజియం ఉదయ్‌పూర్‌కు సుమారు యాభై కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది అక్బర్‌ ‌ప్రతినిధి మాన్‌సింగ్‌తో రాణాప్రతాప్‌ ‌యుద్ధం చేసి మొఘలులను ఓడించిన ప్రదేశం. చేతక్‌ ‌గాయ పడింది ఈ యుద్ధంలోనే. ఈ యుద్ధంలో రాణా ప్రతాప్‌ ‌కూడా గాయపడతాడు. సైన్యాధ్యక్షుడికి తన శిరస్త్రాణాన్ని పెట్టి యుద్ధాన్ని కొనసాగించవలసిందిగా చెబుతాడు. యజమాని గాయపడిన సంగతి తెలుసు కున్న చేతక్‌, అతడిని కాపాడడానికి యుద్ధరంగం నుంచి ఒక్క ఉదుటున దౌడు తీస్తుంది. అప్పటికే యుద్ధంలో చేతక్‌ ఒక కాలు గాయపడి ఉంటుంది. అలాగే పరుగెత్తుతూ బాణాస్‌ ‌నదిని దాటుతూ పొట్టకు గాయమై కూలిపోతుంది. చేతక్‌ ‌ప్రాణం పోయిన స్థలంలో రాణాప్రతాప్‌ ‌చేతక్‌ ‌స్మారక్‌ను నిర్మించాడు. అది హల్దీఘాట్‌ ‌మ్యూజియానికి కొద్ది దూరంలో ఉంది.

మాకు మేమే పాలకులం

ఉదయ్‌పూర్‌ ‌టూర్‌లో ప్యాలెస్‌లు, మ్యూజియా లను తిలకించడంతోపాటు మేవారీ సంప్రదాయ భోజనం చేయడం, కామెల్‌ ‌రైడ్‌, ఎడారిలో సూర్యాస్తమయాన్ని చూడడం బోనస్‌ ఆనందాలు. చారిత్రక సౌందర్యాన్ని కాపాడుకుంటూనే అభివ ృద్ధి పథంలో సాగడం ఉదయ్‌పూర్‌ ‌ప్రత్యేకత. కర్మిదేవి ఆలయం నుంచి చూస్తే ఉదయ్‌పూర్‌ ‌విస్తరించిన కొత్త నగరం కనిపిస్తుంది. ఇప్పటికీ చారిత్రక ఉదయ్‌పూర్‌ ‌వీథుల్లో సంప్రదాయ బిద్రీ, పపెట్‌తో పాటు అనేక హస్తకళలు సజీవంగా ఉన్నాయి. ప్రతి ఇంటిముందు వరండాలో వాళ్లు చేసిన కళాకృతులు డిస్‌ప్లేలో ఉంటాయి. ఉదయ్‌పూర్‌ ‌వాసుల్లో కనిపించే ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. ‘మీ రాజస్థానీ భాషకీ హిందీకి ఎక్కువ తేడా ఉంటుందా?’ అని అడిగితే ‘మాది మేవారీ భాష’ అంటారు. రాజస్థాన్‌తో ఐడింటిఫై అవడానికి కూడా ఇష్టపడరు. ‘మొఘలుల కాలంలో సామంతులుగా అయినా సరే సొంతంగా పాలించుకున్న మిగిలిన రాజస్థాన్‌.. అనంతర కాలంలో బ్రిటిష్‌ ‌పాలనలోకి వెళ్లింది. మా మేవాడ్‌ ‌రాజ్యం మాత్రం మొఘలుల పాలనలోకి పోలేదు. బ్రిటిష్‌ ‌హయాంలో కూడా ఇక్కడ మా రాజుల పాలనే’ అని గర్వంగా చెప్పుకుంటారు.

————–

ఏడు ద్వారాలు

రాణాప్రతాప్‌ ‌తండ్రి రెండవ ఉదయ్‌ ‌సింగ్‌ 16‌వ శతాబ్దంలో ఈ నగరాన్ని నిర్మించాడు. శత్రువుల బారి నుంచి నగరాన్ని కాపాడుకోవడానికి కొండలు, సరస్సులనే ఆసరా చేసుకుని ప్యాలెస్‌లు నిర్మించాడు. నగరం చుట్టూ రక్షణకోసం శత్రుదుర్భేద్యమైన గోడను కట్టి ఏడు ద్వారాలను ఏర్పాటు చేశాడు. అప్పట్లో రాకపోకలన్నీ ఆ ద్వారాల దగ్గర పహరా కాస్తున్న రాజోద్యోగుల దగ్గర అనుమతి పొందిన తరవాతనే సాగేవి. ఉదయ్‌పూర్‌లో పర్యటిస్తుంటే సూరజ్‌పోల్‌, అం‌బాపోల్‌, ‌బ్రహ్మపోల్‌, ‌చాంద్‌పోల్‌, ఉదయ్‌పోల్‌, ‌హాథీపోల్‌ ‌ద్వారాలు కనిపిస్తాయి. ఏడవది ఎక్కడ ఉందో, పేరేమిటో కూడా అక్కడి వాళ్లు కూడా స్పష్టంగా చెప్పలేరు.

కొలువుదీరిన కళాత్మకత

సిసోడియా రాజులు సూర్యవంశరాజులు. ప్యాలెస్‌లో ఎటుచూసినా సూర్యుని ప్రతిమలుంటాయి. ఈ రాజులందరూ సూర్యుని పూజించిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకునేవారు. శీతాకాలంలో సూర్యుడు కనిపించని రోజుల్లో సూర్యుని ప్రతిమకు పూజ చేసేవారు. సూర్యకిరణాలు మబ్బుల మాటున ఒక మోస్తరు వెలుతురును ప్రసరించేటప్పుడు… ఆ కొద్దిపాటి కాంతికేఈ లోహపు ప్రతిమలు వెలుగుతుంటాయి. ఆ వెలుగును బట్టి సమయాన్ని అంచనా వేసేవారు. గోడల మీద చేసిన పెయింటింగ్‌లు, మిర్రర్‌వర్క్ అప్పటి హస్తకళల కళాత్మకతను, కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. మిర్రర్‌వర్క్ ‌కళాఖండాల ముందు నిలబడితే అద్దాల్లో మనల్ని మనం చూసుకుంటూ అద్దాలను లెక్కపెట్టడంలో మునిగిపోతాం. ఫతేప్రకాశ్‌ ‌ప్యాలెస్‌లో క్రిస్టల్‌ ‌గ్యాలరీ గురించి ఏకంగా పుస్తకమే రాయవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. పర్యాటకులకు ప్రతి ఒక్కరికీ ఒక ఆడియో సిస్టమ్‌, ‌హెడ్‌ఫోన్స్ ఇస్తారు. ఏ గదిలోకి వెళ్లినప్పుడు ఆ నంబరు నొక్కితే ఆ గదిలో ఉన్న కళాక ృతుల  వివరాలు వినిపిస్తాయి. కప్పులు, స్పూన్ల నుంచి సోఫాలు, మంచాలు కూడా క్రిస్టల్‌వే. లోపల అడుగుపెట్టే వరకు అన్ని ఉంటాయని ఊహించం. ఇంటర్నెట్‌లో కూడా క్రిస్టల్‌ ‌గ్యాలరీ ఫొటోలు పెద్దగా కనిపించవు. రాజుల చిత్రపటాలు, షాండ్లియర్‌లు ఉన్న ప్రధాన దర్బారు హాలు మాత్రమే కనిపిస్తుంది. అసలైన గదులు కనిపించవు. ఫొటోగ్రఫీకి అనుమతి కూడా లేదు. కెమెరాలే కాదు కెమెరా ఉన్న ఫోన్‌లను కూడా అనుమతించరు. పర్యాటకులకు ఆడియో సిస్టమ్‌ ఇచ్చే కౌంటర్‌లో కెమెరాలు, సెల్‌ఫోన్‌లను తీసుకుంటారు. గ్యాలరీలోకి ఎంట్రీ టికెట్‌ ఏడు వందల రూపాయలంటే మనసు మూలుగుతుంది. కానీ మొత్తం చూసిన తర్వాత మనం ఎక్కువ డబ్బు ఇచ్చామనే అసంతృప్తి ఏ మాత్రం ఉండదు. చూడకపోతే చాలా మిస్సయ్యేవాళ్లం అని కూడా అనిపిస్తుంది.

 

కుటుంబ రాజకీయం

రాణాప్రతాప్‌ 1540, ‌మే 9న కుంభాల్‌గడ్‌ ‌కోటలో పుట్టాడు. రాణాప్రతాప్‌ ‌తండ్రి ఉదయ్‌ ‌సింగ్‌ ‌పట్టాభిషిక్తుడైంది కూడా అదే ఏడాది, అదే కోటలో. ఉదయ్‌సింగ్‌ ‌మరణానంతరం రాణాప్రతాప్‌ 32 ఏళ్ల వయసులో 1572లో మేవార్‌ ‌రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. రాణాప్రతాప్‌ ‌తల్లి జైవంత్‌ ‌బాయ్‌ ఉదయ్‌ ‌సింగ్‌ ‌పెద్ద భార్య. ఉదయ్‌సింగ్‌కు ఇష్టమైన భార్య ధీరూబాయ్‌ ‌భట్టియాని. రాణాప్రతాప్‌కు బదులు తన కొడుకు జగ్‌మల్‌ను రాజును చేయాలని పట్టుపట్టింది. కానీ మంత్రివర్గంతోపాటు ఇతర రాజ దర్బార్‌ ‌ప్రముఖులందరూ రాణాప్రతాప్‌కు మాత్రమే రాజయ్యే అర్హత అని తీర్మానించడంతో ఆ వివాదం అప్పటికి సద్దుమణిగింది. కానీ జగ్‌మల్‌ని ఇప్పటికీ ఉదయ్‌పూర్‌ ‌వాసులు ఒక విలన్‌గానే చూస్తున్నారు.

ప్యాలెస్‌ ‌వెనుక పిచోలా!

పిచోలా సరస్సు సిటీ ప్యాలెస్‌కు వెనుక వైపు ఉంది. వెనుక ఉంది కాబట్టి ఆ సరస్సుకు పిచోలా అనే పేరు వచ్చింది. ఈ సరస్సు మధ్యలో జగ్‌మోహన్‌ ‌ప్యాలెస్‌, ‌జగ్‌మందిర్‌ ఉన్నాయి. ఒబెరాయ్‌ ‌వాళ్ల హోటల్‌ ఉదయ్‌విలాస్‌ ‌కూడా ఈ లేక్‌ ఒడ్డునే ఉంది. జగ్‌మోహన్‌ ‌ప్యాలెస్‌ను ఇప్పుడు తాజ్‌ ‌లేక్‌ ‌ప్యాలెస్‌ ‌పేరుతో తాజ్‌ ‌గ్రూప్‌ ‌నిర్వహిస్తోంది. పిచోలా లేక్‌లో పడవ ప్రయాణం ఉల్లాసభరితంగా ఉంటుంది. జగ్‌మోహన్‌ ‌ప్యాలెస్‌, ‌జగ్‌మందిర్‌ల సమీపం నుంచి చుట్టి రావచ్చు. పడవలో వెళ్లినప్పుడు జగ్‌మోహన్‌ ‌ప్యాలెస్‌ ఎత్తయిన పునాది తప్ప అసలు ప్యాలెస్‌ ‌పూర్తి వ్యూ కనిపించదు. సిటీప్యాలెస్‌ ‌నుంచి చూస్తేనే జగ్‌మోహన్‌ ‌ప్యాలెస్‌ ‌వ్యూ బాగుంటుంది. పిచోలా సరస్సు తీరాన ‘బాగోర్‌కీ హవేలీ’ ఉంది. ఇది సాంస్కృతిక కళలను ప్రదర్శించే ప్రదేశం. ఇక్కడి మ్యూజియంలో పప్పెట్స్‌తో దర్బార్‌ ‌హాల్‌ ఉం‌ది. రాజస్థానీ సంప్రదాయ వివాహ వేడుక ఘట్టాల శిల్పరీతులున్నాయి. ఇప్పుడు సంపన్న వర్గాలు అనుసరిస్తున్న సంగీత్‌, ‌మెహందీ వేడుకలు రాజపుత్రుల సంప్రదాయాలే.

రాణి కర్నావతి మనుమడు

మేవార్‌ ‌రాజ్యానికి తొలి రాజధాని చిత్తోర్‌గడ్‌•. అక్కడి నుంచి పరిపాలించిన రాణా సంగా (సంగ్రామ్‌సింగ్‌) – ‌రాణి కర్నావతిల మనుమడు మహారాణా ప్రతాప్‌. ‌రాణాప్రతాప్‌ ‌పుట్టేనాటికే చిత్తోర్‌గడ్‌ ‌మేవార్‌ ‌రాజుల చేజారిపోయింది. ప్రతాప్‌ ‌సింగ్‌ ‌తండ్రి ఉదయ్‌ ‌సింగ్‌ ‌చిత్తోర్‌గడ్‌లో పుట్టాడు. ఉదయ్‌ ‌సింగ్‌ ‌చంటి బిడ్డగా ఉన్నప్పుడే కోట యుద్ధాలు, రాజకీయ క్లిష్టతలో మునిగిపోయి ఉంది. అప్పుడు దాది తన బిడ్డకు ఉదయ్‌సింగ్‌ ‌దుస్తులు వేసి ఉయ్యాలలో పెట్టి, ఉదయ్‌సింగ్‌ను రహస్యంగా కుంభాల్‌గడ్‌ ‌కోటకు చేర్చింది (శత్రువుల చేతిలో దాది బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు). ఆ కుంభాల్‌ ‌గడ్‌లోనే రాణాప్రతాప్‌ ‌కూడా పుట్టాడు. రాజ్యం రాణాప్రతాప్‌ ‌చేతికి వచ్చేనాటికే కుంభాల్‌గడ్‌ ‌కూడా చేజారిపోయింది.

హల్దీఘాట్‌ ‌యుద్ధం

హల్దీఘాట్‌ అక్బర్‌ ‌సైన్యానికి – రాణాప్రతాప్‌ ‌సైన్యానికి జరిగిన యుద్ధమే. కానీ చరిత్రకారులకు పరీక్ష పెట్టిన యుద్ధం ఇది. వ్యూహాత్మకంగా చరిత్ర వక్రీకరణకు గురైన యుద్ధం కూడా. రాజస్థాన్‌ ‌ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకుని పదవ తరగతి చరిత్ర పాఠాలను కొత్తగా రాసుకున్న యుద్ధం. ఈ హల్దీఘాట్‌ ‌యుద్ధక్షేత్రం ఉదయ్‌పూర్‌ ‌నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది.

1576, జూన్‌ 18 ‌న అక్బర్‌ ‌సైన్యానికి- రాణాప్రతాప్‌కి యుద్ధం జరిగింది. మూడు వేల అశ్విక దళం, నాలుగు వందల మంది భిల్లులు మాత్రమే. అక్బర్‌ ‌ప్రతినిధిగా వచ్చిన మాన్‌సింగ్‌ ‌దగ్గర ఐదు వేల అశ్వికదళం, ఇతర దళాలన్నీ కలిపి పదివేల సైన్యం ఉంది. మొఘలులు సైన్యంతో మేవార్‌ ‌రాజ్యం మీద దండెత్తుతున్న విషయాన్ని అడవుల్లో నివసించే ఆదివాసీ భిల్లులు గమనించి రాణాప్రతాప్‌కి చేరవేశారు. దాంతో మొఘల్‌ ‌సైన్యం నగరంలోకి ప్రవేశించడానికి ముందే హల్దీఘాట్‌ ‌దగ్గరే ఎదుర్కొంది మేవార్‌ ‌సైన్యం. ఆ యుద్ధంలో మేవార్‌ ‌సైన్యం వీరోచితంగా పోరాడింది. మాన్‌సింగ్‌ ఏనుగు మీద ఉన్నాడు. రాణాప్రతాప్‌ ‌గుర్రానికి ఏనుగు తొండం ధరింపచేసి ఏనుగు అనే భ్రమ కల్పించారు. ఎదురుగా ఉన్నది గుర్రం అని తెలిస్తే ప్రత్యర్థి గుర్రం వేగాన్ని అంచనా వేయగలుగుతాడు. ఏనుగు అని భ్రమపడితే ఏనుగు మందగమనాన్నే ఊహిస్తాడు. ఆ రణనీతిని ప్రదర్శించాడు రాణాప్రతాప్‌. ఆ ‌యుద్ధంలో మొఘలులు మేవార్‌ ‌రాజధాని నగరం ఉదయ్‌పూర్‌లో అడుగు పెట్టనేలేదు. రాణాప్రతాప్‌ను బంధీని చేయలేదు. మేవార్‌ ‌రాజ్యంలో మొఘలుల పాలనకు బీజం పడనేలేదు. మొఘలు సైన్యం హల్దీఘాట్‌ ‌నుంచే వెనుదిరిగి వెళ్లిపోయింది. రాజపుత్రుల విజయాన్ని, మొఘలుల పరాజయాన్ని జీర్ణించుకోలేని కొందరు చరిత్ర కారులు ఈ యుద్ధాన్ని అసంపూర్తిగా ఆగిపోయిన యుద్ధంగా వర్ణించారు. రాజ్యపాలన రాణాప్రతాప్‌ ‌చేతిలోనే ఉన్నప్పుడు అది రాణాప్రతాప్‌ ‌గెలుపు కాకుండా మరేమవుతుందనేది ఆ తర్వాత చరిత్రను అధ్యయనం చేసిన కొత్త తరం చరిత్రకారుల వాదన. ఆ యుద్ధం తర్వాత కూడా అక్బర్‌ ‌మళ్లీ మేవార్‌ ‌మీద ఎప్పుడు దాడి చేయాలా అని వ్యూహాలు పన్నుతూనే గడిపినట్లు అక్బర్‌ ‌కోర్టులోని అబుల్‌ ‌ఫజల్‌ ‌వంటి వారి రచనలు చెప్తున్నాయి.

1579 తర్వాత బెంగాల్‌, ‌బీహారుల్లో సామంత రాజులు తిరుగుబాటు చేయడంతో అక్బర్‌ ‌దృష్టి అటు మళ్లింది. పంజాబ్‌లోనూ కొంత అనిశ్చితి రావడంతో ఇక మేవార్‌ ‌మీద ఆశ వదులుకున్నాడు అక్బర్‌. ‌రాణాప్రతాప్‌ ‌మాత్రం హల్దీఘాట్‌ ‌యుద్ధం తర్వాత ఇరవై ఏళ్ల పాటు రాజ్యపాలన చేశాడు. తాను పుట్టిన కుంభాల్‌గడ్‌ ‌కోటను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.

1585లో చవంద్‌ అనే ప్రదేశంలో కొత్త రాజధానిని కట్టాడు. అక్కడి నుంచే రాజ్యపాలన చేశాడు. తనకు ఇష్టమైన, విశ్వాసపాత్రతతో తనకు అండగా నిలిచిన భిల్లుల కోసం ఇక్కడ అనేక నిర్మాణాలు చేశాడు. భిల్లులతో కలిసి వేటకు వెళ్లడం రాణాకు ఇష్టమైన వ్యాపకం. అలా వేటకు వెళ్లినప్పుడు జరిగిన ప్రమాదంలో (1597, జనవరి 29) తుది శ్వాస వదిలాడు.

మొత్తానికి హల్దీఘాట్‌ ‌యుద్ధం రాణాప్రతాప్‌ను వీరుడిగా నిలబెట్టింది. అయితే ఆ యుద్ధం చేసిన గాయం అతడిని చివరివరకు ఇబ్బంది పెట్టిందని, చేతక్‌ ‌మరణం అతడిని మానసికంగా బాగా కుంగదీసిందని చెబుతారు మేవార్‌ ‌ప్రజలు.

  • మంజరి

About Author

By editor

Twitter
Instagram