భారత్‌ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిం చింది. 5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వేలాదిమంది సనాతనుల సంకల్పసిద్ధి, అపూర్వ మైన త్యాగాలకు ఫలితంగా, గుర్తుగా నిలచే అయోధ్య రామమందిరానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ చేశారు. అనేక గొప్ప విలువలకు, గుణాలకు నిలయం శ్రీరాముని జీవితం. ఆయన ధర్మ చింతన, రుజువర్తన భారతీయులందరికి ఆదర్శప్రాయం. అపారమైన వినయగుణ సంపన్నుడైన రాముడు ఆధ్యాత్మిక, రాజకీయ విలువలతో ఆదర్శవంతమైన రాజుగా పేరు పొందాడు. భావి తరాలు అనుసరించవలసిన సద్గుణాలను ఆచరించి చూపిన వానిగా శ్రీరాముడి పేరు ఈ భువితో ముడిపడి ఉంది. క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందినది రామకథ. ఆనాటి నుండి నేటి వరకు ఈ దేశంలోని ప్రజలందరూ రాముడిని దేవుడిగా కొలుస్తూనే ఉన్నారు.

భారతదేశంలో మత సంప్రదాయాలు, సంస్కృతికి నిలయాలుగా నిలచిన దేవాలయాలపై వందల సంవత్సరాలపాటు దాడులు జరిగినా వివిధ మంత్రాలు, భజనలు, ధ్యానం, రామ చంద్రుడి ఆరాధనా సంప్రదాయాలు, పునరుజ్జీవ నోద్యమాలు ఈ దేశ ప్రజానీకంలో భక్తి భావాన్ని ఒక జ్వాలలా నిలిపి ఉంచాయి. శ్రీ రామచంద్రుని భగవంతుని అవతారంగా పూజించడం, ముస్లిం దురాక్రమణదారుల సమయంలో కూడా హిందూ రాజులు అనేక దేవాలయాలు నిర్మించడం వల్ల కూడా ఈ దేశంలో భక్తి సంప్రదాయం నిల బడింది. ప్రజలలోని ఈ అపారమైన భక్తిభావమే రామ జన్మభూమి పట్ల కూడా వ్యక్తమయింది. ఎందుకంటే రామాయణం, రాముని చరిత్ర ఈ దేశ ప్రజల నరనరాన నిండిఉంది.

రామాయణాన్ని గురించి శ్రీ అరవింద యోగి ఇలా అన్నారు – ‘భారతీయుల సాంస్క ృతిక చిత్తాన్ని తీర్చిదిద్దడంలో వాల్మీకి రచించిన రామాయణం ప్రముఖమైన పాత్ర పోషించింది. ఆదర్శంగా స్వీకరించడానికి సీతారాములను ఇచ్చింది. నైతిక విలువలు, ఆదర్శాలకు ప్రతికలుగా హనుమంతుడు, లక్ష్మణుడు, భరతులను ముందు నిలిపింది. జాతీయ అస్తిత్వంలో ఆ విలువలను పొదిగింది.’

అయోధ్య రామమందిరం పట్ల హిందువుల నిష్టను, విశ్వాసాన్ని వామపక్షీయులు ఎప్పుడూ కించపరుస్తూ, తక్కువ చేస్తూనే ఉన్నారు. అయినా హిందువులు మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ న్యాయపోరాటం చేశారు. చివరికి రామ జన్మభూమిపై హక్కులు వారివేనని న్యాయస్థానాలు తేల్చాయి. తమకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికి హిందువులు ఇతరుల మనోభావాలను గౌరవించి ఆడంబరంగా వేడుకలు, ఉత్సవాలు చేసుకోకుండా సంయమనం పాటించారు. ఈ విధంగా సుదీర్ఘంగా సాగిన రామజన్మభూమి ఉద్యమం హిందువుల సహనాన్ని, పట్టుదల, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం, అన్నింటికంటే మించి భగవాన్‌ శ్రీ‌రాముడి పట్ల అచంచలమైన భక్తిని ప్రపంచానికి చాటింది.

1947లో దేశానికి విదేశీ పాలన నుండి విముక్తి లభిస్తే ఆగస్ట్, 5, 2020‌న హిందువులకు మరో స్వాతంత్య్ర దినమని చెప్పవచ్చును. రామ జన్మభూమి కోసం హిందువులు సాగించిన శతాబ్దాల పోరాటం చివరికి ఫలించిన రోజది. ఈ చరిత్రాత్మక ఘట్టంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి తనకు అవకాశమిచ్చిన శ్రీ రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు ప్రధాని మోదీ ధన్యవాదలు తెలిపారు. ‘జై శ్రీరామ్‌’ ‌నినాదంతో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన ప్రధాని ‘కన్యాకుమారి నుంచి క్షీరభవాని వరకు, కోటేశ్వరమ్‌ ‌నుంచి కామాఖ్య వరకు, జగన్నాథ్‌ ‌నుండి కేదారనాథ్‌ ‌వరకు, సోమనాథ్‌ ‌నుండి కాశీ విశ్వనాథ్‌ ‌వరకి, బోధగయ నుండి సారనాథ్‌ ‌వరకు, అండమాన్‌ ‌నుండి ఆజ్మీర్‌ ‌వరకు, లక్షద్వీప్‌ ‌నుండి లేహ్‌ ‌వరకు ఈ దేశం మొత్తంలో రాముడు నిండిఉన్నాడు.’ అని అన్నారు.

శతాబ్దాల నిరీక్షణ నేటితో (ఆగస్ట్5) ‌ముగుస్తుండడంతో యావత్‌ ‌భారత దేశం ఎంతో భావుకతతో, సంతోషంతో నిండిపోయిందని ప్రధాని అన్నారు. తమ జీవితకాలంలో ఇలాంటి అపూర్వమైన సంఘటన చూస్తున్నామా అని చాలామంది ఇంకా ఆశ్చర్యంలోనే మునిగిఉన్నారు. ప్రార్ధనలు ఫలించాయి. పోరాటం ముగిసింది. దళితులు, వెనుకబడిన కులాలవారు, గిరిజనులతో సహా యావత్‌ ‌సమాజం గాంధీజీ వెంట నడిచినట్లే రామమందిర ఉద్యమంలో కూడా దేశప్రజానీకమంతా పాల్గొన్నారు. భగవాన్‌ ‌రాముడికి గుహుడు సహాయపడినట్లు, గోవర్ధనగిరి ఎత్తడానికి కృష్ణ భగవానుడికి యాదవులు సాయపడినట్లు రామమందిర నిర్మాణంలో అందరూ పాలుపంచుకుంటున్నారని ప్రధాని అన్నారు.

రామజన్మభూమిలో రామమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి దురాక్రమణదారులు ప్రయత్నించినా ఈ దేశ ప్రజానీకపు గుండెల్లో రాముడు కొలువై విరాజిల్లుతూనే ఉన్నాడు. ఆ విధ్వంసం ప్రజల విశ్వాసాలను నాశనం చేయలేకపోయింది. మందిరాన్ని ముష్కరులు ధ్వంసం చేయడం, హిందువులు తిరిగి కట్టుకోవడం అనే ఈ పక్రియ వందలాది ఏళ్లుగా సాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ క్రమం మందిర నిర్మాణంతో ఆగిపోతుంది. ఈ మందిరం గతాన్ని భవిష్యత్తుతో ముడివేస్తుందని అన్నారు.

‘రామ్‌ ‌సబ్‌ ‌కా హై, రామ్‌ ‌సబ్‌ ‌మే హై’ అని గుర్తుచేసిన ప్రధాని శ్రీరాముడు భారతీయులందరికి ప్రేరణనిస్తున్నడని అన్నారు. ఈ దేశ సంస్కృతి నుంచి రాముడిని విడదీయలేము. వందలాదిమంది రామభక్తుల బలిదానానికి శ్రద్ధాంజలి ఘటించిన ఆయన శ్రీ రాముని సద్గుణాలను అలవరచుకోవడం, ఆచరించాల్సిన ప్రాధాన్యతను యువతరానికి తెలియజెప్పాలని అన్నారు.

రామమందిర నిర్మాణం హిందూత్వాన్ని పునరుజ్జీవింపచేయడమే కాక బూటకపు సెక్యులర్‌ ‌వాదుల దుష్ప్రచారం, అవమానాల మూలంగా సన్నగిల్లిన హిందువుల విశ్వాసాలు, మనోబలాన్ని తిరిగి పెంచుతుంది. సనాతనధర్మాన్ని అనుసరించి, హిందూ వారసత్వం పట్ల గౌరవభావాన్ని ప్రకటించి మొదటి సారి ఒక ప్రధానమంత్రి భూమిపూజ కార్యక్రమాన్ని స్వహస్తాలతో జరపడం చాలా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాయకులంతా హిందూ వారసత్వాన్ని అలక్ష్యం చేయడం, అవమానపరచడం మాత్రమే చూశాం గానీ, గర్వించడాన్ని, గౌరవభావాన్ని ప్రకటించడం కాని చూడలేదు. తన హిందూ అస్తిత్వాన్ని ప్రకటించడంలో ఏమాత్రం సంకోచించని ప్రధాని మోదీ హిందువులందరిలో స్వాభిమానాన్ని, సంతోషాన్ని నింపారు. ‘సత్యం, అహింస, విశ్వాసం, త్యాగం’ అనే విలువైన సందేశాన్ని ప్రపంచానికి ఇస్తూ జన్మభూమిలో రామమందిరం చరిత్రలో నిలిచిపోతుంది.

– డా।। రామహరిత

About Author

By editor

Twitter
YOUTUBE