కదన రంగంలో ఆట తీరు మారిపోయింది. సరిహద్దుల్లో కాలు దువ్వుతున్న శత్రువు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. హద్దు మీరితే ఇబ్బందుల్లో పడక తప్పదు. భారత వైమానిక సేనలోకి రఫేల్‌ ‌యుద్ధ విమానాల ప్రవేశంతో అటు పాకిస్తాన్‌, ఇటు చైనాకు కష్టాలు తప్పవు. చైనా దగ్గర ఉన్న జె-20 కన్నా రఫేల్‌ అత్యంత శక్తి సామర్థ్యాలున్న యుద్ధ విమానమని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. ప్రత్యర్థులపై పిడుగుల వానను కురిపిస్తూ సుదూర లక్ష్యాలను సైతం అత్యంత కచ్ఛితత్వంతో ఛేదించగల సత్తా రఫేల్‌ ‌సొంతం.

శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేలా చేసే ఐదు రఫేల్‌ ‌యుద్ధ విమానాలు జూలై 28న మన భూభాగంపై అడుగు పెట్టాయి. అంతకు రెండు రోజుల ముందు ఫ్రాన్స్‌లోని బోర్డోలో నగరం మెరిగ్నాక్‌ ‌వైమానిక స్థావరం నుంచి వాటి ప్రయాణం మొదలైంది. ఏడు వేల కిలో మీటర్ల దూరం ప్రయాణమిది. ఈ క్రమంలో రఫేల్‌ ‌యుద్ధ విమానాలు ఆకాశంలోనే ఇంధనం నింపుకోవడం ఆసక్తిని కలిగించింది.

భారత సైన్యం అమ్ములపొదిలో రఫేల్‌ ‌చేరికను 23 సంవత్సరాలలో భారత వైమానిక దళంలో చోటుచేసుకున్న అతికీలక పరిణామంగా రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. 4.5వ తరం విమానంగా పిలుస్తున్న ఈ లోహ విహంగం ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాలలో ఒకటి. ఒకే విమానంలో అనేక మిషన్లను చేపట్టగల ‘ఓమ్నిరోల్‌’ ‌విహంగంగా రక్షణశాఖ దీన్ని పరిగణిస్తోంది. ఏవియానిక్స్, ‌రాడార్‌ ‌వ్యవస్థ, ఆయుధ వ్యవస్థ పరంగా రఫేల్‌ ‌దక్షిణాసియాలోనే అత్యుత్తమ యుద్ధ విమానం అని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

రఫేల్‌ ‌విమానాల తయారీ కోసం రక్షణ మంత్రిత్వశాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ.58 వేల కోట్లు. భారత రక్షణశాఖ మొత్తం 36 రఫేల్‌ ‌యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. తాజా విమానాలతో కలిపితే ఇప్పటివరకు భారత్‌ ‌చేతికి 10 రఫేల్‌ ‌విమానాలు అందాయి. అందులో ఐదు శిక్షణ కార్యక్రమాల కోసం ఇంకా ఫ్రాన్స్‌లోనే ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారమే 2021 ముగిసేలోగా మొత్తం 36 విమానాలను డసాల్ట్ అం‌దిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి భారత వాయుసేనలో రఫేల్‌ ‌విమానాలను ప్రవేశపెట్టినప్పటికీ.. వాటికి స్వాగతం పలుకుతూ ఆగస్టు మాసంతో అధికారికంగా వేడుక నిర్వహించనున్నారు. 23 ఏళ్ల క్రితం రష్యా నుంచి సుఖోయ్‌ ‌యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన తర్వాత మళ్లీ రక్షణ రంగంలో భారత్‌ ‌చేపట్టిన అత్యంత కీలకమైన కొనుగోలు ఇదే కావడం గమనార్హం.

పాక్‌, ‌చైనాలకు దడ

రఫేల్‌ ‌యుద్ధ విమానాల్లో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్‌ ‌వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. ప్రస్తుతం మనదేశ సరిహద్దుల్లో తరచూ రెచ్చగొట్టే దుస్సాహసానికి పాల్పడుతున్న పాకిస్తాన్‌, ‌చైనా ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకోక తప్పదు. భారత్‌ అమ్ములపొదిలోకి రఫేల్‌ ‌చేరికతో వాయుసేన సామర్థ్యం మరింతగా పెరిగింది. సరిహద్దుల్లో పాక్‌, ‌చైనా ఆటలు ఇక సాగవు. రఫేల్‌ ఒక గేమ్‌ ‌చేంజర్‌ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. తాజాగా చైనాతో మనదేశానికి మాత్రమే కాకుండా యావత్‌ ‌ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్నందున రఫేల్‌ ‌రాక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

రఫేల్‌ ‌రాకతో చైనాకు చెందిన జె-20 యుద్ధ విమానాల ప్రస్తావన కూడా వస్తోంది. వాస్తవానికి రఫేల్‌ ‌ముందు జె -20 ఎందుకూ పనికి రాదు. పాకిస్తాన్‌ ‌వద్ద ఉన్న ఎఫ్‌-16 ‌కంటే కూడా రఫేల్‌ అత్యుత్తమమైనది. రఫేల్‌కు ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఆఫ్ఘానిస్తాన్‌, ‌లిబియా, మాలీలో స్పెషల్‌ ‌మిషన్ల కోసం ఫ్రెంచ్‌ ‌వైమానిక దళం ఈ యుద్ధ విమానాలను ఉపయోగించింది. అంతేకాదు, సెంట్రల్‌ ఆ‌ఫ్రికన్‌ ‌రిపబ్లిక్‌, ఇరాక్‌, ‌సిరియాలో మిషన్లకు కూడా రఫేల్‌ ‌విమానాలను వినియోగించారు. కానీ జె-20 ఎప్పుడూ ఇలాంటి ఆపరేషన్లలో పాల్గొనలేదు. రఫేల్‌.. ‌జె-20 కన్నా ఎక్కువ ఇంధనం, ఆయుధాలను మోసుకుపోగలదు. రఫేల్‌లో రెండు నెక్మా ఎం-88 ఇంజన్‌లు ఉంటాయి. జె -20లోనూ ట్విన్‌ ఇం‌జన్స్ ఉం‌టాయి. కానీ వాటి కన్నా రఫేల్‌ ఇం‌జిన్లు చాలా శక్తివంత మైనవి.

చైనా నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా రఫేల్‌ ‌యుద్ధ విమానాలు సమర్థంగా తిప్పికొట్టగలవని భారత వైమానిక దళం మాజీ ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌బీఎస్‌ ‌ధనూవా వ్యాఖ్యానించారు. గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే మీటియోర్‌ ‌క్షిపణి వ్యవస్థ, ఉపరితల లక్ష్యాలను ఛేదించగలిగిన స్కాల్ప్ ‌క్రూయిజ్‌ ‌క్షిపణి వ్యవస్థ, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్‌ ‌యుద్ధ వ్యవస్థ కలిగి ఉన్న రఫేల్‌ ‌యుద్ధ విమానం దరిదాపుల్లోకి కూడా చైనా జె-20 రాలేదని ధనూవా చెబుతున్నారు. ధనూవా సారథ్యంలో భారత వాయుసేన గతేడాది ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లో బాలాకోట్‌ ఉ‌గ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

భారత్‌కు చేరుకున్న ఐదు రఫేల్‌ ‌యుద్ధ విమానాల్లో మూడు ఒకే సీటు ఉన్న విమానాలు. మిగిలిన రెండింటిలో రెండు సీట్లున్నాయి. వీటిని భారత వైమానిక స్థావరాల్లో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అంబాలాలోని నంబర్‌-17 ‌స్క్వాడ్రన్‌లో ప్రవేశపెడతారు. ఈ స్క్వాడ్రన్‌ను ‘గోల్డెన్‌ ఆరోస్‌’ అని పిలుస్తారు. ఇది పాక్‌ ‌సరిహద్దు నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంబాలా అటు పాక్‌, ఇటు చైనా రెండింటికీ సమాన దూరంలో ఉండే వ్యూహాత్మక ప్రదేశం కావడంతో రఫేల్‌ ‌జెట్‌లను ఇక్కడ మోహరించారు. ఆ తర్వాత వీటిని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లద్ధాఖ్‌కు తరలించే అవకాశం ఉంది. తర్వాత విడతలో వచ్చే రఫేల్‌ ‌యుద్ధ విమానాలను పశ్చిమ బెంగాల్‌లోని హసిమారా వైమానిక స్థావరంలో ఉంచుతారు. ఇప్పటికే ఈ రెండు స్థావరాలను రూ.400 కోట్లతో ఐఏఎఫ్‌ ఆధునికీక రించింది. రఫేల్‌ ‌యుద్ధ విమానాలను కొనుగోలు చేసేనాటికి చైనాతో మనకు ఇప్పుడున్న స్థాయిలో వివాదాలు లేవు. ప్రధానంగా పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకునే 36 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేశారు. కానీ మారిన పరిస్థితుల్లో పాక్‌తో ఉన్న అధీన రేఖ(ఎల్‌ఓసీ)తోపాటు చైనాను ఢీ కొనడానికి ఎల్‌ఏసీ వద్ద కూడా మోహరించడం తప్పనిసరన్నది నిపుణుల భావన.

రఫేల్‌ ‌ప్రత్యేకతలు

ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్స్ ‌రఫేల్‌ ‌విమానాలను రూపొందిస్తోంది. 1986 జూలై 4న తొలిసారి ఇది గాల్లోకి ఎగిరింది. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ ఈ ‌యుద్ధ విమానాలను వినియోగిస్తున్నాయి. ఇందులో రాఫెల్‌ ‌దీ, రాఫెల్‌ , ‌రాఫెల్‌ ‌వీ అనే మూడు రకాలు ఉంటాయి.

గంటకు 2222 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణం చేయగల సత్తా రఫేల్‌ ‌సొంతం. ఈ యుద్ధ విమానాలను అత్యాధునిక సాంకేతిక పరిజానంతో రూపొందించారు. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించ గలవు. మెటెరియోర్‌ ‌బియాండ్‌ ‌విజువల్‌ ‌రేంజ్‌ (‌బీవీఆర్‌) ఎయిర్‌ ‌టు ఎయిర్‌ ‌మిస్సైల్స్‌ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం రఫేల్‌. ‌విజువల్‌ ‌రేంజ్‌ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. సముద్ర, పర్వత ప్రాంతాల్లో కూడా దూసుకెళ్లే రఫేల్‌ ‌యుద్ధ విమానాల్లో 29 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లు అమర్చారు. 200 కి.మీ దూరంలో లక్ష్యాలను గుర్తించే రాడార్లు ఇందులో ఉన్నాయి. రాడార్‌ ‌వార్నింగ్‌ ‌రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగడతాయి. రఫేల్‌ ‌యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. బరువు 10 టన్నులు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. టేకాఫ్‌ ‌తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. రఫేల్‌ ‌యుద్ధ విమానంలో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 30 వేల అడుగుల ఎత్తున ఆకాశంలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్‌ ‌మౌంటెడ్‌ ‌డిస్‌ప్లే, ఇన్‌‌ఫ్రారెడ్‌ ‌సెర్చ్, ‌ట్రాకింగ్‌ ‌వంటి వ్యవస్థలు ఈ యుద్ధ విమానాల్లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు. ఒకేసారి 9.5 టన్నుల బరువును అవలీలగా మోయగల సత్తా రఫేల్‌ ‌యుద్ధ విమానాలకు ఉంది. నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్‌ ‌విండర్‌, అపాచి, హర్పూర్‌, అలారం, పీజీఎం 100, మేజిక్‌ అం‌డ్‌ ‌మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్త ఉన్న స్కాల్ప్ ‌మిస్సైల్స్‌ను సంధించడానికి రఫేల్‌ ‌యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగలవు.

ఫ్రాన్స్‌తో ఒప్పందం

అయిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించినప్పుడు రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం ఆ దేశ ప్రభుత్వంతో అవగాహన కుదిరింది. అనంతరం 2016 సెప్టెంబర్‌లో ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం రూ. 59 వేల కోట్లతో భారత్‌ 36 ‌రఫేల్‌ ‌యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రెండేళ్లలో.. అంటే 2017లో ఈ యుద్ధ విమానాలను మన దేశానికి అందిస్తామని ఫ్రాన్స్ ‌హామీ ఇచ్చింది. అయితే ఒప్పందం ఖరారులో జరిగిన జాప్యం వల్ల మరో మూడేళ్ల సమయం తీసుకుని తొలి విడతగా అయిదు విమానాలను మనకు అందజేశారు. ఈ యుద్ధ విమానాల కోసం మనదేశం జరుపుతున్న అన్వేషణకు రెండు దశాబ్దాల చరిత్ర ఉంది. చైనా, పాకిస్తాన్‌ల నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా మనకు అత్యాధునిక యుద్ధ విమానాలు అవసరం అని వైమానిక దళం 2000 సంవత్సరం నుంచే చెబుతూ వస్తోంది. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో మనకు విజయాలు సాధించిపెట్టిన మిగ్‌-21 ‌బైసన్‌, ‌జాగ్వార్‌ ‌విమానాలు పాతవైపోయి తరచూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో హఠాత్తుగా యుద్ధం వస్తే ఎలా అనే ఆందోళన వ్యక్తమైంది. చివరకు 2004లో 4.5 జనరేషన్‌ ‌బహువిధ యుద్ధ విమానాలు అత్యవసరమని తుది నిర్ణయానికి వచ్చింది భారత వైమానిక దళం. ఎలాంటి విమానాలు కొనాలి అనే అన్వేషణ మొదలైంది. అమెరికా తయారీ ఎఫ్‌/ఏ-18, ఎఫ్‌-16, ‌రష్యా మిగ్‌-35, ‌స్వీడన్‌ ‌తయారీ గ్రిపెన్‌ ‌తదితర విమానాల సామర్థ్యాన్ని పరీక్షించారు. మన అవసరాలకు అనుగుణంగా లేవన్న కారణంతో తిరస్కరించారు. చివరకు రఫేల్‌తో పాటు బ్రిటన్‌, ‌జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ దేశాల కన్షార్షియం ఉత్పత్తి చేసే టైఫూన్లు మిగిలాయి. ఈ రెండింటిలో రఫేల్‌ అన్నివిధాలా మెరుగైనదని తేల్చారు. రూ. 54,000 కోట్ల వ్యయం కాగల ఆ ఒప్పందం ప్రకారం డసాల్ట్ ‌సంస్థ 126 రఫేల్‌ ‌యుద్ధ విమానాలను సమకూర్చాలి. మూడేళ్లలో 18 విమానాలు అందజేయడంతో పాటు మిగిలిన 108 యుద్ధ విమానాలనూ హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ (‌హెచ్‌ఏఎల్‌)‌లో ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తానని చెప్పింది.. ఈ విమానాలను తయారు చేసే డసాల్ట్ ‌కంపెనీతో సాంకేతిక పరిజ్ఞానం బదిలీ విషయంలో పేచీ కారణంగా అది కాస్తా మూలన బడింది. చివరకు పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం ఖరారయింది.

రాహుల్‌ ఆరోపణలు..  సుప్రీం క్లీన్‌చిట్‌

‌రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం యూపీఏ ప్రభుత్వ హయంలో అన్వేషణ మొదలైనా, ఒప్పందం కుదరడంలో అంతులేని జాప్యం జరిగింది. ఇందుకు కారణాలు అందరికీ తెలిసినవే.. గతంలో రక్షణరంగ కోనుగోళ్లు అంటే పెద్ద ముడుపుల వ్యవహారం. రఫేల్‌ ‌యుద్ద విమానాల కోనుగోళ్ల విషయంలో కూడా కాంగ్రెస్‌ ‌నేతృత్యంలోని యూపీఏ ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. ఈలోగా 2014లో మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వం ఓడిపోయి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ఈ యుద్ధ విమానాల కొనుగోళ్ల కోసం ఒప్పదం కుదుర్చుకుంది. ఎంతో పారదర్శకంగా సాగిన రఫేల్‌ ఒప్పందానికి అవినీతి రంగు పులిమేందుకు కాంగ్రెస్‌ ‌విశ్వ ప్రయత్నాలు చేసింది. రఫేల్‌ ‌యుద్ద విమానాల కొనుగోళ్ల విషయంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నానా యాగీ చేశారు. సుప్రీంకోర్టులో అనేక వ్యాజ్యాలు కూడా దాఖ లయ్యాయి. ఈ కేసులను అన్ని రకాలుగా విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రఫేల్‌ ‌కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టంగా తీర్పు చెప్పింది. అయినా రాహుల్‌ అవకాశం వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలను మానుకోలేదు. తన ప్రవర్తననూ మార్చుకోలేదు. తాజాగా రఫేల్‌ ‌యుద్ధ విమానాలు మనదేశానికి చేరిన సందర్భంగా మరోసారి ఆయన తన సంకుచిత వైఖరిని బయట పెట్టుకున్నారు. భారత వాయుసేనకి అభినందనలు తెలియజేస్తూనే ‘ఒక్కో యుద్ధ విమానంపై రూ.526 కోట్లకు బదులుగా రూ.1670 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది?’ అని ప్రశ్నించారు. దీనికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌ట్విటర్‌ ‌ద్వారా బదులిచ్చారు. రఫేల్‌ ‌యుద్ధ విమానాలు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఫ్రాన్స్ ‌నుంచి వాటిని కొనుగోలు చేశామని, ఇప్పటికే ఈ విషయంలో అన్ని సందేహాలకు సమాధానాలు ఇచ్చామని రాజ్‌నాథ్‌ ‌స్పష్టం చేశారు.

స్వదేశీ యుద్ధ విమానాల మాటేమిటి?

రఫేల్‌ ‌యుద్ధ విమానాలు చర్చకు వచ్చినప్పుడు లేదా మనదేశం విదేశాల నుంచి యుద్ధ విమానాలు దిగుమతి చేసుకున్న సందర్భంలో స్వదేశీ యుద్ధ విమానాల విషయం చర్చకు వస్తూ ఉంటుంది. మనం ఎంతకాలం ఇలా విదేశాలపై ఆధారపడాలి? స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేయలేమా? అనే ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. రక్షణ ఆయుధ వ్యవస్థల్లో కీలకమైన క్షిపణుల అభివృద్ధిలో భారత్‌ ఇప్పటికే కీలక పురోగతి సాధించింది. రష్యా, ఇజ్రాయెల్‌ ‌వంటి దేశాలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఆయుధ వ్యవస్థలూ ఉన్నాయి. క్షిపణుల్లో స్వయం సమృద్ధి సాధించిన భారత్‌.. ‌యుద్ధవిమానాల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. డీఆర్‌డీవో సహా వేర్వేరు ఏజెన్సీలు దీనిపై పనిచేస్తున్నాయి.

ఐదో తరం యుద్ధ విమానాల అభివృద్ధికి రష్యాతో కలిసి పనిచేయాలని భారత్‌ ‌తొలుత భావించినా 2017లో ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టేసింది. ‘మేకిన్‌ ఇం‌డియా’ నినాదంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటి అభివృద్ధిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. భారత్‌ ‌వాయుసేన (ఐఏఎఫ్‌), ‌హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ (‌హెచ్‌ఏఎల్‌), ‌డీఆర్‌డీవోకు చెందిన ఏరోనాటికల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఏజెన్సీతో కలిసి అత్యాధునిక, బహుళ ప్రయోజన యుద్ధ విమానాల (ఏఎంసీఏ- అడ్వాన్డస్ ‌మల్టీరోల్‌ ‌కాంబాట్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్) అభివృద్ధిపై పనిచేయడం మొదలెట్టారు. రఫేల్‌ ‌వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు తయారు చేయాలంటే దశాబ్దకాలం పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పరిశోధనలు మొదలయ్యాయని.. పక్రియను వేగవంతం చేశామని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రొటోటైప్‌ ‌రూపకల్పన దశలోనే ప్రస్తుత పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సైతం ఏ దేశం కూడా తన ‘స్టీల్త్ ‌టెక్నాలజీ’ని భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా లేదని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అంటున్నారు. రాడార్‌కు విమానం కన్పించకుండా చేయడమే స్టీల్త్ ‌టెక్నాలజీ. ఇలా పలు సవాళ్లను అధిగ మించాల్సి ఉంది. రఫేల్‌ ‌మాదిరి రెండు ఇంజిన్లు, ఒక పైలట్‌తో నడిచే యుద్ధ విమానం డిజైన్‌ ‌కూడా ఖరారు చేశారు. తొలి విమానం 2024-25 నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని.. తర్వాత సన్నాహకాలు, పరీక్షలు వంటివి విజయవంతంగా అధిగమిస్తే 2029లో ఉత్పత్తి మొదలవుతుందని భారత వాయుసేన అంచనా వేస్తోంది.

మరికొన్ని యుద్ధ విమానాలు

రఫేల్‌ ‌యుద్ద విమానాల రాకతో వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. వీటి కంటే ముందు కూడా మన దేశం విదేశాల నుంచి కొన్ని యుద్ధ విమానాలను సమకూర్చుకుంది. వాటిలో ముఖ్యమైనవి.

మిరాజ్‌-2000

‌భారత వాయుసేన వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో మిరాజ్‌-2000 ‌కూడా కీలకమైనది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌ అభివృద్ధి చేసిన ఈ యుద్ధ విమానం 1985లో భారత అమ్ములపొదిలో చేరింది. ఇది సింగిల్‌ ‌సీటర్‌, ‌సింగిల్‌ ఇం‌జిన్‌ ‌విమానం. గరిష్టంగా గంటకు 2,495 కిలోమీటర్ల వేగాన్ని అందు కుంటుంది. ఇందులో రెండు 30 ఎంఎం ఫిరంగులు ఉంటాయి. క్షిపణులనూ మోసుకెళ్లగలదు.

సుఖోయ్‌-30 ఎం‌కెఐ

రష్యా నుంచి 2002లో మనం సముపార్జించు కున్న యుద్ధ విమానాలు సుఖోయ్‌-30 ఎం‌కెఐ. గాల్లో నుంచి గాల్లోకి, గాల్లో నుంచి భూ ఉపరితలం పైకి దాడి చేయగలవు. వీటిలో రెండు ఇంజిన్లు, రెండు సీట్లు ఉంటాయి. 8 వేల కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలవు. గరిష్టంంగా గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

మిగ్‌-27

‌సోవియట్‌ ‌యూనియన్‌(‌రష్యా)కు చెందిన మికొయాన్‌-‌గురెవిచ్‌ ‌డిజైన్‌ ‌బ్యూరో మిగ్‌-27 ‌రూపొందించింది. హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌వీటిని ఉత్పత్తి చేసింది. ఇది సింగిల్‌ ‌సీటర్‌, ‌సింగిల్‌ ఇం‌జిన్‌ ‌విమానం. వ్యూహాత్మక దాడుల్లో కీలకంగా పనిచేస్తుంది. గంటకు 1,700 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు. నాలుగు వేల కిలోల ఆయుధ సామగ్రిని మోసుకెళ్లగలదు.

మిగ్‌-29

అమెరికాకు చెందిన ఎఫ్‌-15, ఎఫ్‌-16 ‌వంటి ఎఫ్‌-‌సిరీస్‌ ‌విమానాలకు దీటుగా వీటిని సోవియట్‌ ‌రూపొందింది. భారత వైమానిక దళంలో ఈ యుద్ధ విమానాల సేవలు 1985లో ప్రారంభమయ్యాయి. సుఖోయ్‌ 30 ఎం‌కెఐ విమానాల తర్వాత రెండో వరుస రక్షణగా వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో ఒక సీటు, రెండు ఇంజిన్లు ఉంటాయి. గంటకు 2,445 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించ గలవు. ఈ యుద్ధ విమానాల్లో 30 ఎంఎం ఫిరంగి ఉంటుంది. క్షిపణులనూ తీసుకెళ్లగలదు.

జాగ్వార్‌

‌బ్రిటిష్‌ ‌రాయల్‌ ఎయిర్‌ఫోర్స్, ‌ఫ్రెంచ్‌ ఎయిర్‌ఫోర్స్ ‌సంయుక్తంగా జాగ్వార్‌ను అభివృద్ధి చేశాయి. గంటకు 1,350 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. సింగిల్‌ ‌సీటర్‌ ‌విమానం. రెండు ఇంజిన్లుంటాయి. శత్రువుల భూభాగాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయగలదు. ఇందులో రెండు 30 ఎంఎం తుపాకు లుంటాయి. 4,750 కిలోల వరకు బాంబులు, ఇంధనాన్ని మోసుకెళ్లడం దీని ప్రత్యేకత.

మిగ్‌-21 ‌బైసన్‌

‌మికొయాన్‌-‌గురెవిచ్‌ ‌డిజైన్‌ ‌బ్యూరో తయారుచేసిన ఈ యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం 1961లో ఎంచుకుంది. సింగిల్‌ ‌సీటర్‌, ‌సింగిల్‌ ఇం‌జిన్‌ ‌విమానం. భారత వాయుసేనకు ఇది వెన్నెముక వంటిది. గంటకు గరిష్టంగా 2,230 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో 23 ఎంఎం ట్విన్‌ ‌బ్యారల్‌ ‌ఫిరంగి ఉంటుంది.

 ‌- క్రాంతిదేవ్‌ ‌మిత్ర : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE