ఆచార్య ఆత్రేయ సినీకవిగా సుప్రసిద్ధులు. ఆయన కేవలం వెండితెర కవి కాదు. ‘మనసుకవి’గా, ప్రేక్షకుల గుండె తెరకవిగా సుస్థిర స్థానాన్ని పొందిన ‘సుకవి’. సినీ కవి కంటే ముందు ప్రయోగాత్మక నాటకకర్త. నాటక రచయిత కంటే ముందు గొప్ప నటుడు. సమకాలీన సామాజిక సమస్యలను నాటకాలుగా మలిచిన రచనా శిల్పి. స్వాతంత్య్ర సమరయోధుడు. కవిసమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ మెచ్చుకునేంత గొప్పగా ఆత్మకథను పద్యాల్లో రచించిన పద్యకవి.బహుముఖ ప్రజ్ఞాశాలి. అసలు పేరు కిళాంబి వేంకటనరసింహాచార్యులు. నరసింహాచార్యులులోని ఆచార్యకు, గోత్రనామం ఆత్రేయను చేర్చి ఆచార్య ఆత్రేయ అయ్యారు.

ఆత్రేయ (మే7,1921-సెప్టెంబర్‌ 13,1989) ‌నెల్లూరు జిల్లా సూళ్లురుపేట తాలూకా మంగళం పాడులో జన్మించారు. తల్లిదండ్రులు సీతమ్మ, కృష్ణమాచార్యులు. స్వగ్రామం సూళ్లురుపేట తాలూకా ఉచ్ఛూరు. తండ్రి ఆదికేశవస్వామి ఆలయంలో అర్చకులు. ఆత్రేయ బాల్యంలోనే తల్లి సీతమ్మ దాయాదుల విషప్రయోగంతో చనిపోయింది. ఆ పసి హృదయం గాయపడి సొంతూరి మీద విరక్తి పెంచుకుంది. ఆర్థిక దుస్థితివల్ల ఆత్రేయ బాల్యంలో చిత్తూరులో మెజిస్ట్రేట్‌గా పనిచేసే మేనమామ ఈయుణ్ణి జగన్నాథాచార్యులు ఇంట్లో ఉండి పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశాడు. మేనమామ కళాభిమానం గల సహృదయ నటులు. బళ్లారి రాఘవ, చిత్తూరు నాగయ్య వంటి ప్రముఖ నటులు ఆయన సహనటులు. మేనమామ ప్రభావం ఆ ఇంటి వాతావరణం విద్యార్థి దశలోనే నరసింహాచార్యులుకు నాటకాల పట్ల అభిరుచి కలిగించింది. పాఠశాల స్థాయిలోనే ఉబుసుపోక కవితలు రాసేవాడు. ఒక స్నేహితుడు రెచ్చగొట్టడంతో ఒక్క రాత్రిలో పద్యం రాసి ప్రతిభను నిరూపించుకున్నాడు.

పద్యం కంటే నాటకమే ప్రజలను బాగా ప్రభావితం చేస్తుందన్న సత్యాన్ని ఆత్రేయ గ్రహించాడు. సాధారణ విద్యార్థి ఆత్రేయ ఇంటర్మీడియట్‌ ‌రెండుసార్లు తప్పాడు. రాయవెల్లూరు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ‌చదివే రోజుల్లో కళాశాల వార్షికోత్సవంలో షేక్‌స్పియర్‌ ఒధెల్లో ఏకపాత్రను అభినయించి బళ్లారి రాఘవ అభినందనలు అందుకున్నాడు. నాటకాభిలాష పెరిగింది. ఇంటర్మీడియట్‌ ‌పూర్తి చేయకుండా టీచర్స్ ‌ట్రైనింగ్‌ ‌చేశాడు. జీవిక కోసం ఎన్నో ఉద్యోగాలు చేశాడు. నెల్లూరు జిల్లా కోర్టులో నకలు లేఖకుడిగా, కొన్నాళ్లు తిరుత్తణిలో సెటిల్‌మెంట్‌ ఆఫీసులో గుమస్తాగా చేశాడు. ‘జమీన్‌ ‌రైతు’ పత్రికలో సహాయ సంపాదకుడిగా కొన్నాళ్లు బాధ్యతలు నిర్వహించాడు. ఎక్కడా స్థిరంగా నిలవలేకపోయాడు.

ప్రయోగాత్మక నాటక రచయిత

గురజాడ ‘కన్యాశుల్కం’, కాళ్లకూరి నారాయణ రావు ‘వరవిక్రయం’, ‘చింతామణి’, ‘మధుసేవ’ వంటి నాటకాలేవీ ఆత్రేయ చూడలేదు. బళ్లారి రాఘవ ‘రామదాసు’ నాటకం ఆయనను ప్రభావితం చేసింది. కర్ణాటక కన్నయ్య కంపెనీ నాటకాలు చూశాడు. నాటకాలు రచించి, ప్రదర్శించాలన్న అభిలాష అంకు రించింది. తొలిరోజుల్లో రచించిన ‘పిచ్చాసుపత్రి’, ‘బెంగాలు కరువు’, ‘ఉత్త అనుమానం’ వంటి నాటకాలను చిత్తూరు ఆర్యవైశ్య యువజన సంఘం చేత ఆత్రేయ ప్రదర్శింపజేశారు. ఏ పాశ్చాత్య నాటక ప్రభావం లేకుండా ఆత్రేయ వాస్తవికతకు అద్దం పట్టే ప్రయోగాలు తన ప్రతిభతో చేశాడు.

ఆత్రేయ ప్రయోగాలు ఛాయా రూపకాలు (Shade plays), ఆశురూపకాలు (Extempore plays). ప్రత్యేకించి ఆశురూపకాల్లో అయిదారు సమస్యలు చీటి మీద రాసి లాటరీ పద్ధతిలో తీసి ఆ సమస్య మీద అయిదారు నిమిషాల్లో ఇతివృత్తం, పాత్రలు అనుకొని ఆహార్యం లేకుండానే ప్రదర్శించడం ఈ పద్ధతిలో విశిష్టత. ఆంధ్ర నాటక కళాపరిషత్‌ 1940‌లో మద్రాసు సెయింట్‌ ‌మేరీస్‌ ‌హాలులో తొలిసారి ఔత్సాహిక నాటక సమాజాల కోసం పోటీలు నిర్వహించింది. ఆత్రేయ ‘శాంతి’ నాటకాన్ని ప్రదర్శించాడు. బహుమతి రాలేదు. దీనితో అశాంతి, ఆశాభంగం కలిగాయి. రాసిన నాటకాలన్నీ చించి పారవేశాడు. అయితే శాంతి ప్రదర్శనలోని సాంకేతిక విలువలను వెంకటగిరి అమెచ్యూర్‌ ‌సంస్థవారు మెచ్చుకున్నారు. ఆ పరిచయంతో ఆత్రేయ చిత్తూరు వదిలి వెంకటగిరి చేరాడు. ఆ సమయంలో వెంకట గిరి అమెచ్యూర్‌ ‌సంస్థ వారు వజ్జల శ్రీకృష్ణమూర్తి రచించిన ‘రషీదా’ నాటకాన్ని రిహార్సల్స్ ‌చేస్తున్నారు. సంస్థ సభ్యుల కోరిక మేరకు ఆత్రేయ ఆ నాటకాన్ని ‘హిందూ ముస్లిం సమైక్యత’ ప్రధాన ఇతివృత్తంగా సవరించి దర్శకత్వం వహించాడు. ఎన్నో బహుమతులు వచ్చాయి. అయినా ఆర్థిక దుస్థితితో ఆత్రేయ వెంకటగిరి నుండి నెల్లూరు చేరుకున్నాడు. అక్కడ లలిత కళానిలయం ఆయనను ఆదుకొనేది. ప్రసిద్ధ చలనచిత్ర నటులు రాజనాల, నాగభూషణం, విద్వాన్‌ ‌కణ్వశ్రీ వంటి రచయితలు లలిత కళానిలయం సభ్యులు. ప్రభుత్వం 1943లో జాతీయ యుద్ధ సమితిని ఏర్పాటు చేసింది. ఆ సమితి అప్పట్లో యుద్ధ ప్రచారోద్యోగిగా నెల్లూరులో ఉన్న జాషువ చేత ‘దేశముక్తి’ నాటకం రాయించింది. ఆ నాటకంలో ఆత్రేయ ‘టోజో’ పాత్రను ధరించేవాడు. ఆత్రేయను ఎంతమంది మిత్రులు ఆదుకున్నా పస్తులున్న రోజులు ఎన్నో! ఆయన మాటల్లో అవన్నీ ‘కవిసార్వభౌముడి చరమ దశలోని కడగళ్లను గుర్తుకు తెస్తాయి’.

ఆంధ్రనాటక కళాపరిషత్తు ఆదరణ

ఆంధ్ర నాటక కళాపరిషత్‌ 1944‌లో గుడివాడలో ఎం.ఆర్‌. అప్పారావు అధ్యక్షతన నాటక పోటీలు నిర్వహించింది. కొండముది గోపాల రాయశర్మ ‘ఎదురీత’ నాటకాన్ని కుదించి సముచితమైన పాటలతో ఆత్రేయ ప్రదర్శింపజేశాడు. సహాయ నటుడి పాత్రల్లో కూడా నటించాడు. కులాంతర వివాహం ఇతివృత్తంగా ప్రదర్శితమైన ‘ఎదురీత’ నాటకానికి ఆ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచనతోపాటు ఆత్రేయకు ఉత్తమ ప్రయోక్తగా, ఉత్తమ నటుడిగా బహుమతులు లభించాయి. ఆత్రేయకు మంచి గుర్తింపు లభించింది. ఎర్రోజు మాధవాచార్యులు కార్యదర్శిగా, చలనచిత్ర నిర్మాత దుక్కాపాటి మధుసూదనరావు సహాయ కార్యదర్శిగా ఉన్న ఆంధ్ర నాటక కళాపరిషత్‌కు ఆత్రేయను నెలకు రూ.50/లు వేతనంతో కార్యదర్శిగా నియమించారు.

నాటకాల పరిశీలన

ఆత్రేయ పాశ్చాత్య ప్రభావం లేకుండా ఎన్నో స్వతంత్ర నాటక ప్రయోగాలు చేశాడు! ప్రస్తుతం పది రచనలు లభ్యమవుతున్నాయి. 1. పరివర్తన, 2. ఎన్‌.‌జీ.ఓ, 3. ఈనాడు, 4. విశ్వశాంతి, 5. కప్పలు, 6. భయం, 7. తిరుపతి (మనసూ- వయసూ), 8. వాస్తవం, 9. గౌతమ బుద్ధ, 10. అశోక సమ్రాట్‌. ‌వీటిలో సామాజిక సమస్యల నాటకీకరణలే ఎక్కువ.
ఆత్రేయ 1945లో పరివర్తన నాటకాన్ని మూడురోజుల్లో రాశాడు. పెట్టుబడిదారులు శ్రామిక శక్తితోపాటు మేధాశక్తిని ఏ విధంగా దోచుకుంటున్నారో ఇందులో చిత్రించాడు. ఆంధ్ర నాటక కళాపరిషత్‌ ‌పోటీల్లో ఎన్నో బహుమతులు గెల్చుకున్న ఈ నాటకం మంచి గుర్తింపు తెచ్చింది. అభ్యుదయ రచయితల చతుర్థ మహాసభల సందర్భంగా పరివర్తన నాటకం చూసి కన్యాశుల్కం తర్వాత మళ్లీ మంచి నాటకం చూశానని ఆరుద్ర మెచ్చుకున్నాడు!

ఆత్రేయకు మంచి పేరు తెచ్చిన మరొక నాటకం ‘ఎన్‌.‌జి.ఓ.’ సమాజంలో సాంఘిక, ఆర్థిక వ్యత్యాసాలు, మధ్యతరగతి ప్రజల మనుగడను ఎంత విషాద భరితంగా మారుస్తున్నాయో ఈ నాటకంలో ఆత్రేయ వాస్తవిక దృష్టితో చిత్రించాడు. ఇది ఎన్నో బహుమతులు గెలుచుకుంది. అప్పటి సమాజంలో మధ్యతరగతి ఉద్యోగుల బాధలూ, చాలీచాలని జీతాలతో ఇరుకైన ఇళ్లలో పడే ఇబ్బందులూ, అనవసరమైన భేషజాలతో మధ్యతరగతి యువకుల్లో పెరుగుతున్న నిరాశా నిస్పృహాలు అసహనం మొదలైన సమస్యలన్నింటినీ ఎన్‌.‌జీ.ఓలో ప్రతిబింబించాడు. అందువల్ల ఈ నాటకం మధ్యతరగతి ప్రేక్షకులకు దగ్గరకు ఎక్కువగా చేరుకోగలిగింది. దీనికే అద్దెకొంప, గుమస్తా అని పేర్లు. నాటక రంగ పరిశోధకుడు డా।।పి.వి.రమణ ‘ఎన్‌.‌జి.ఓ.’ తెలుగు నాటక రంగంలో ఒక మైలురాయి’ అని ప్రశంసించాడు. మరో నాటక రంగ పరిశోధకుడు గుండవరపు సుబ్బరామిరెడ్డి ‘ప్రజా సమస్యలను స్వాభావికంగా ప్రతిబింబించే ఆత్రేయ రచనా విధానం సామాన్య ప్రేక్షకులు మొదలు మేధావి వర్గంవరకు అమితంగా ఆకర్షించింది. వాస్తవిక జీవిత చిత్రణతో కూడిన ఈ కొత్త తరహా నాటకాన్ని చూసి ఎందరో రచయితలు తమ ఆలోచనా విధానాన్ని మార్చు కున్నారు. రచయితలకు, ప్రయోక్తులకు, నటులకు ఆత్రేయ మార్గదర్శకులయ్యారు’ అన్నారు.

గాంధీజీ మత సామరస్య సిద్ధాంతం పట్ల అభిమానంతో ఆత్రేయ ‘ఈనాడు’ రాశారు. మత సంఘర్షణలకు కారకులైన మతోన్మాదుల నైజాన్ని చిత్రించాడు. స్వాతంత్య్రానంతర భారతదేశంలో చెలరేగిన మతకలహాలను నిరసించాడు. ఇరుగు పొరుగున ఎంతో సఖ్యతతో నివసించే రెండు హిందూ ముస్లిం కుటుంబాలు స్నేహాలు మరచి మత వైరుధ్యాలకు బలైన పరిస్థితి ఇందులో ఇతివృత్తం. 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా అక్బర్‌ అనే ముస్లిం ఇంట్లో స్వాతంత్య్రోత్స వాలు జరుపుకోవటంతో నాటకం ప్రారంభమవు తుంది. అప్పుడు చెలరేగిన మతకలహాల ప్రభావం హిందూ ముస్లిం కుటుంబాల మీద పడుతుంది.అక్బర్‌, ‌పురుషోత్తంల పిల్లలు రహీం, రామ్‌; అక్బర్‌ ‌కూతురు నసీంలు. హిందూ యువతి వత్సల నసీం స్నేహితురాలు. మత వైరుధ్యాలతో బాల్య స్నేహితులైన రామ్‌, ‌రహీం మాట్లాడు కోవటం మానేస్తారు. ఒకప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య స్నేహానికి గుర్తుగా ఎప్పుడూ తెరిచి ఉండే ఆ రెండిళ్ల మధ్య తలపులు మూతపడ్డాయి. మతకలహాల్లో ‘వత్సల’ను చేరదీసి ఆదరించినందుకు అక్బర్‌ ‌కుటుంబానికీ, ఆపదలో నీళ్లిచ్చి ఒక ముసల్మాన్‌ ‌కుటుంబాన్ని ఆదరించి నందుకు పురుషోత్తం కుటుంబానికీ మతోన్మాదులు హాని తలపెడతారు. వాళ్ల ఒత్తిళ్ళకు లొంగ కుండా అక్బర్‌ ‌కుటుంబం, పురుషోత్తం కుటుంబం నిబ్బరంగా నిలబడతాయి. ఈ విషాదాంత నాటకంలో రచయిత హిందూ ముస్లిం సమైక్యతే సందేశంగా ఆవిష్కరించాడు.

ఆత్రేయ నాటకాల్లో ప్రసిద్ధమైన వాటిలో పేర్కొనదగింది ‘విశ్వశాంతి’ (1951). రెండో ప్రపంచ యుద్ధానంతర బీభత్స వాతావరణాన్ని పోగొట్టి ప్రశాంతతను నెలకొల్పాలన్న లక్ష్యంగా ఈ నాటకాన్ని ప్రయోగాత్మకంగా రచించాడు. ఆత్రేయ 1954లో సుమతీశతకర్త చెప్పిన ‘‘తెప్పలుగ చెరువు నిండిన/ కప్పలు పదివేలు జేరు’’ అనే పద్యసూక్తిని ఆధారంగా చేసుకొని ‘కప్పలు’ నాటకాన్ని రాశాడు. అవకాశ వాదులైన బంధువులు, స్వార్థపరులైన మిత్రులు డబ్బున్నవారి చుట్టూ చేరి తమ పబ్బం గడుపుకొనే నైజాన్ని బట్ట బయలుచేసి అధిక్షేపించాడు.

ఆత్రేయ మనస్తత్వ శాస్త్ర విశ్లేషణతో రాసిన విలక్షణ నాటకం ‘భయం’ (1959). మనిషికి మనిషంటే భయం. మనసంటే మనసుకు భయం. సత్యమంటే చచ్చే భయం. చచ్చేంతవరకు చావంటే భయం. మనిషిలో అంతర్లీనంగా ఉన్న భయాన్ని గూర్చి గొప్పగా నాటకీకరించాడు. యజమానులతో కార్మికులు, మధ్యతరగతి గుమస్తాల మధ్య ఘర్షణను – వైరుధ్యాలను వాస్తవిక దృష్టితో చిత్రించాడు.
ఆత్రేయ 1963లో ‘తిరుపతి’ (మనసూ – వయసూ) నాటకాన్ని సమకాలీన సాంఘిక సమస్యల ప్రస్తావన లేకుండా వ్యక్తిగత సమస్యల ప్రస్తావనతో

సాగిన నాటక రచన. భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన తర్వాత తెలుగునాటకరంగ స్థితి ఆశాజనకంగా లేదు.
ఆత్రేయ రాసిన ‘వాస్తవం’ నాటకం (1950) స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల్లో పెచ్చు పెరిగిన ‘స్వార్థం, అవినీతి’ ఇతివృత్తంగా సాగిన అధిక్షేపాత్మక నాటకం. అధికారం కోసం అర్రులు సాచే రాజకీయ నాయకులు అసలైన స్వతంత్ర పోరాట యోధులను ఏ విధంగా అవమానించి బాధించేవారో వ్యంగ్య ధోరణిలో చిత్రించాడు. గౌతమబుద్ధ నాటకం (1942) ఆయన నెల్లూరు జిల్లా కోర్టులో నకలు లేఖకుడిగా ఉన్నప్పుడు వీధి దీపం కింద కూర్చొని పెన్సిల్‌తో రాశాడు. నాటక కథా నిర్మాణంలో ప్రతీక ధోరణిని ప్రవేశపెట్టాడు. ప్రజా జీవనంలో బుద్ధుని అవతరణ, చిమ్మ చీకట్లు నుండి పరిపూర్ణమైన వెలుగులోకి వచ్చిన విధానాన్ని ఆత్రేయ ప్రేక్షకుల కళ్లకు కట్టేలా చిత్రించాడు.

నాటికలు

ఆత్రేయ నాటికలు 15 లభ్యమవుతున్నాయి. 1. ఎవరు దొంగ, 2. అంత్యార్పణం, 3. తెరిచిన కళ్లు, 4. కళకోసం, 5. చస్తే పిండి, 6. ప్రగతి, 7. మాయ, 8. వరప్రసాదం, 9. అంతర్యుద్ధం 10. కాపలావాని దీపం, 11. ఒక్కరూపాయి, 12. ఓటు నీకే, 13. చావకూడదు, 14. అశ్వఘోషుడు వంటి వాటిలో ప్రసిద్ధమైన కొన్ని నాటికలను పరిశీలిద్దాం.

ఎవరు దొంగ ? : స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక అసమానతలు, అవినీతి, అవకాశవాదం అంతరించి మానులంతా ఒక్కటిగా ఉన్నప్పుడే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆత్రేయ విశ్వాసం. సమాజంలో అణువణువునా జీర్ణించుకున్న స్వార్థాన్ని, అవినీతిని చీల్చి చెండాడే లక్ష్యంతో ఆత్రేయ ఎవరు దొంగ? రాశాడు. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలన్న అప్పటి పరిషత్‌ల నియమాలను అనుసరించి ఈ నాటికను ఒకే ఒక్క స్త్రీ పాత్రతో రాశాడు. స్వాతంత్య్రం సిద్ధించాక అవినీతి, చీకటి బజారుల కుంభకోణాలు పెచ్చుపెరిగాయి. విధిలేని పరిస్థితుల్లో భార్యాపిల్లలు ఆకలి తీర్చడం కోసం ఒక అభ్యాగుడు పిడికెడు అన్నం కోసం దొంగగా మారతాడు. బియ్యపు మిల్లు యజమాని అక్రమంగా బియ్యం నిలువచేసి అధికార్లకు లంచమిచ్చి ఆహార ధాన్యాల కొరత సృష్టించి వ్యాపారం సాగిస్తుంటాడు. హాస్టల్‌ ‌విద్యార్థులకు కొనుగోలు చేసే బియ్యంలో ప్రతి నెలా కమీషన్‌ ‌తీసుకుంటాడు. యస్‌.ఐ. ‌మిల్లు యజమానిని లంచంతో అతన్ని రక్షిస్తున్న అధికారిని అరెస్టు చేస్తాడు. భార్యా పిల్లల ఆకలి తీర్చడం కోసం హాస్టల్‌లో అన్నం దొంగిలించిన వ్యక్తి, అతని భార్యా పిల్లలు బావిలోకి దూకి చనిపోతారు. అతడు తానే దొంగనని, దొంగిలించిన అన్నాన్ని విసిరి కొడతాడు. యస్‌.ఐ. ‌పిస్టలు తీసుకొని కాల్చుకుంటాడు. తానే దొంగనని ప్రకటిస్తాడు. యస్‌.ఐ. ‌నిజాయితీతో మానవతా దృష్టితో దొంగను తానని ప్రకటించిన వ్యక్తిని, ‘తమ్ముడూ! నీవు దొంగవు కాదు. అవినీతి పరులైన అసలు దొంగలను అరెస్టు చేసి జైలుకు పంపుతా’నంటాడు. అంతలో కానిస్టేబుల్‌ ‌యస్‌.ఐ.‌కి ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ ‌తెచ్చిస్తాడు. అవినీతిపరులైన అసలు దొంగలు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతారు.

అంత్యార్పణం : స్వాతంత్య్ర సాధనలో త్యాగధనులు కొందరే. వారి త్యాగఫలాన్ని స్వార్థానికీ, స్వప్రయోజనాలకీ వాడుకున్న స్వార్థపరులే ఎక్కువమంది. గాంధేయ సిద్ధాంతానికి కట్టుబడి నిరాడంబరంగా జీవించే తల్లికీ, మంత్రి పదవిని నిర్వహిస్తూ పెట్టుబడిదారులకు అండగా నిలిచే తనయుడికీ మధ్య జరిగిన సంఘర్షణ ఇతివృత్తంగా రచించిన నాటిక అంత్యార్పణం (1955). ప్రజా సమస్యలను గాలికి వదిలి ధనికుల ప్రయోజనాలు పరిరక్షించే కొడుకుతో వాగ్వివాదం జరిపి చివరకు కత్తిపీటతో ప్రజాకంటకుడైన కన్న కొడుకుని అంతం చేసిందా తల్లి. రాజకీయ పరిస్థితుల్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయడానికి ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారానికి రాసిందే ఈ నాటిక. ఆత్రేయ తనదైన శైలిలో తల్లి చేత చెట్టుపేరు చెప్పి కాయలమ్ముతున్న కొడుకుతో ‘‘ఇంకా ఎక్కడుందిరా- ఖద్దరు ముసుగులో దొంగలు జొరబడ్డారురా’’- వంటి పదునైన సంభాషణలు రాశాడు. ఈ నాటిక 1955లో ఎన్నికల ప్రచారంలో బాగా ప్రసిద్ధి పొందింది.

ప్రగతి : ఆత్రేయ శాస్త్ర పరిశోధనల పేరుతో మానవత్వాన్ని నిర్లక్ష్యంగా చేయడం తగదని ప్రబోధించే ఇతివృత్తంతో ఈ నాటికను (1950) రచించాడు. శాస్త్ర పరిశోధనలు ‘మానవ కల్యాణం కోసమేగాని మారణహోమం కోసం కాదు’ అనే సందేశంతో ఈ నాటిక ద్వారా ప్రేక్షకుల్లో చైతన్యాన్ని కలిగించాడు.
కాపలావాని దీపం : ఈ నాటిక హరీంద్రనాథ్‌ ‌ఛటోపాధ్యాయ బెంగాలీ నాటకానికి అనుసరణ. ఒక జైలు గదిలో ఒక బూర్జువా, వర్తకుడు, కవి ఉంటారు. ఆ ముగ్గురినీ తెల్లవారితే ఊరితీస్తారు. చివరికి రాత్రి ఆ మూడు వర్గాలవారి మనస్తత్వాలను ఆత్రేయ ఆవిష్కరించి ప్రజలను చైతన్యవంతులను చేస్తాడు.

‘తెరిచిన కళ్లు’ : సుదర్శనం అనే నేత్ర వైద్యుడి దగ్గర సత్యం అనే సహాయకుడు ఉంటాడు. సత్యం తనకు కంటి ఆపరేషన్లు చేయడం నేర్పమని డాక్టర్‌ని అడుగుతాడు. సుదర్శనం స్వార్థంతో అతడి కోరికను తిరస్కరిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సుదర్శనానికి చూపు పోతుంది. అందుబాటులో ఆపరేషన్‌ ‌చేసేవాళ్లు లేరని బాధపడుతుంటాడు. అసిస్టెంట్‌ ‌సత్యం తన తెలివితేటలతో ప్రతిభతో ఆపరేషన్‌ ‌చేసి డాక్టర్‌కి చూపు వచ్చేట్లు చేస్తాడు. డాక్టర్‌ ఆశ్చర్యంతో నీవు ఎలా నేర్చుకున్నావని ప్రశ్నిస్తాడు? మీరు కాదన్నా, మీకు తెలియకుండా మీరు చేసే ఆపరేషన్లు గమనించి నేర్చుకున్నానంటాడు. సుదర్శనంకు కనువిప్పు కలుగుతుంది. తెరచిన కళ్లు శీర్షిక ఔచిత్యంగా ఉంది.
ఆత్రేయ నాటికలన్నీ సందేశాత్మకాలు. ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రయోజనాత్మకాలు. కె.యస్‌. ‌ప్రకాశరావుగారి దీక్ష (1951) చిత్రంతో ఆత్రేయ సినీ రంగ ప్రవేశం చేశాడు. దాదాపు నాలుగు వందల చిత్రాల్లో భక్తి, శృంగార, కరుణరసాత్మక వైవిధ్యభరితమైన 1600 గీతాలు రాశారని డా।।పైడిపాల అంచనా.

‘శిలలపై శిల్పాలు చెక్కినారు / మన వాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు’ (మంచి మనసులు – 1962) ఇందులో భారతీయ శిల్పి సంపద వైభవాన్ని శిల్పవంతంగా చిత్రించాడు. ‘మూగ మనసులు’ చిత్రలో (1963) ప్రతి పాట ప్రేక్షకుల గుండెల్లో ‘హత్తుకొనేట్లు రాశారు. ‘‘ముద్దబంతి పూవులో / మూగకళ్ల ఊసులో’’ – పామరుల సైతం జానపద బాణీలు అలరించింది. ‘‘మనసు గతి ఇంతే – మనిషి బతుకింతే’’ ప్రేమనగర్‌ (1971) ‌భగ్న ప్రేమకుల హృదయాల్లో వైరాగ్య భావాన్ని రేకెత్తిస్తాడు. పాపం పసివాడు సినిమాలో (1972) ‘‘అమ్మా! నిన్ను చూడాలి! నిన్నూ నాన్నను చూడాలి’’ అంటూ పసిబాలుడు చేత పాడించిన కరుణ రసాత్మక గీతం ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. తాత్త్విక గీతాలు తనకు తానే సాటి అనే విధంగా రచించాడు. జీవన తరంగాలు (1973) చిత్రంలో ‘‘ఈ జీవన తరంగాలలో / ఆ దేవుని చదరంగంలో’’ అనే గీతం ప్రేక్షకుల చేత విరక్తితో కంట తడిపెట్టిస్తుంది. ‘‘వైవిధ్యభరితమైన వందలాది సినీ గీతాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ఆత్రేయ చిరస్మరణీయులు. నాటక కర్తగా, నటుడిగా, దర్శకుడిగా ప్రసిద్ధమైన ప్రయోగాత్మక నాటకాలతో నాటకప్రియులను రంజింపజేసిన నాటక కర్తగా, సినీ కవిగా తెలుగు సాహిత్యంలో ఆత్రేయ చిరంజీవి.

1.ఆత్రేయ నాటకాలు పూర్వాపరాలు- డా।।పైడిపాల.
2. ఆధునిక తెలుగు నాటకం – డా।। గండవరపు సుబ్బరామిరెడ్డి.

– డా।। పి.వి.సుబ్బారావు, అసోసియేట్‌ ‌ప్రొఫెసర్‌

About Author

By editor

Twitter
Instagram