మేడి పట్టి పొలం దున్నుతున్న సేద్యగాడు భారతదేశానికి ప్రతీక. భారత్‌ ఇప్పటికీ వ్యవసాయిక దేశమే. కానీ కర్షకుడు మాత్రం ఎవరికీ పట్టనివాడిగానే మిగిలిపోతున్నాడు. మరీ ముఖ్యంగా ప్రపంచీకరణ, లేదంటే పారిశ్రామికీ కరణ వంటి పరిణామాల తరువాత భారత దేశంలో కర్షకుడి పరిస్థితి జాతి తలదించు కోవలసిన తీరులోనే కనిపిస్తున్నది. వారి బలవన్మరణాలు కలచివేస్తున్నాయి. 2016-2020 (ఇంతవరకు అందిన సమాచారం మేరకు) 70 వేల నుంచి 75 వేల మంది సేద్యగాళ్లు బలవన్మరణాలకు పాల్పడ్డారని లెక్కలు చెబుతున్నాయి. 1995 తరువాత పాతిక సంవత్సరాల కాలంలో ఉసురు తీసుకున్న రైతుల సంఖ్య నాలుగు లక్షలు. ఇవన్నీ జాతీయ నేరాల నమోదు బ్యూరో ఇచ్చిన వివరాలే. ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణలలో కూడా ఈ దుర్ఘటనలు తక్కువేమీ కాదు. ఏపీలో 2014-2019 మధ్య బలవన్మరణాలకు పాల్పడిన సేద్యగాళ్ల సంఖ్య 1518. అలాగే 2018లో తెలంగాణలో నమోదైన కర్షకుల బలవన్మరణాలు 908. మహారాష్ట్రలో ఆ సంఖ్య చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఈ చేదునిజాలు రాష్ట్రాలలోను, నివేదికలలోను, సర్వేలలోను పుంఖాను పుంఖాలుగా పోగుపడుతున్నాయి. వాటి నిండా రుణాలు, గిట్టుబాటు ధర, నకిలీ విత్తనాలు వంటి అంశాలదే పెద్ద పీట. అంటే అదంతా సామాజిక, ఆర్థిక చరిత్ర రచనలో భాగం. ఒక సమూహం క్షోభనూ, దుస్థితినీ చరిత్ర ఇంతవరకే చెబుతుంది. కానీ బలవన్మరణానికి గురయ్యే ముందు కర్షకుడు పడిన మానసిక సంఘర్షణనీ, తన దుస్థితికి తానే నిందించుకున్న తీరునీ, ఆధునికత సాక్షిగా భంగపడుతున్న తన ఆత్మగౌరవాన్ని చూసుకుని విచలితుడైన ఆ అంతిమ క్షణం గురించీ, ఉరితాడో పురుగుమందు డబ్బానో చేతులోకి తీసుకుంటున్నప్పుడు అతడి గుండెలో పెల్లుబికిన కల్లోలాన్నీ నమోదు చేయవలసింది ఎవరు? సృజనాత్మక రచయితలే. రైతును భారత జాతీయతకు ప్రతీకగా నిలబెట్టుకున్న మన సమాజంలో ఆ పని కనీసంగా జరిగిందా? కన్నెర్ర చేసే ప్రకృతీ, నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాల వైఖరీ జమిలి శాపాలై రైతాంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్న వర్తమానంలో వారి స్థితిగతులను నిజాయితీగా పట్టించుకున్న కలాలు నిజంగా ఎన్ని? ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. ఆ ప్రయత్నమే చేశారు డాక్టర్‌ ‌పీవీ సుబ్బారావు, తన పరిశోధన ‘తెలుగు కథానిక :రైతు జీవిత చిత్రణ’లో. ఇది యూజీసీ మేజర్‌ ‌రిసెర్చ్ ‌ప్రాజెక్టు.
ఈ పరిశోధక వ్యాసం ఆధునిక తెలుగు కథలో రైతు ఉనికికే చెబుతున్నది. ‘మన ప్రాచీన తెలుగు సాహిత్యంలో రైతుల ప్రస్తావన చాలా తక్కువ’ అంటారు ఈ పరిశోధనకు సంచాలకులుగా వ్యవహరించిన ఆచార్య రాచపాళెం. భారత, భాగవతాలలో కర్షకుని ప్రస్తావన ఉన్నది. అలాగే ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యం, శ్రీకాళహస్తి మాహాత్మ్యం, వసుచరిత్ర వంటి ప్రబంధాలలో కూడా ఉంది. సుమతీ శతకంలో గొప్ప పద్యమే ఉంది. ఇక ఆధునిక తెలుగు సాహిత్యంలో సీఆర్‌ ‌రెడ్డి ‘ముసలమ్మ మరణం’, దువ్వూరి రామిరెడ్డి ‘కృషీవలుడు’, తుమ్మల సీతారామమూర్తి ‘పరిగ పంట’ వంటి ఆధునిక కావ్యాలు రైతును పలికరించినవే. ఉన్నవ ‘మాలపల్లి’లో రైతు జీవితం కొంచెం లోతుగానే కనిపిస్తుంది. రంగస్థలం మీద ‘మా భూమి’ (వాసిరెడ్డి సుంకర’), ‘వెంకన్న కాపురం’ (ముదిగొండ లింగమూర్తి), ‘మండువా లోగిలి’ (పూసల) వంటివి రైతు జీవిత ఘట్టాలను చూపించాయి. కానీ ఆధునిక కథ చాలా ప్రాచుర్యం పొందింది. అందుకే ఈ పక్రియలో రైతు ఎక్కడ ఉన్నాడన్నది తెలుసుకోవాలి.
‘మమకారం’ (1941, త్రిపురనేని గోపీచంద్‌) ‌తొలి తెలుగు రైతు కథగా విమర్శకులు చిరకాలం భావించారు. తరువాత, ‘రావులయ్య కథ’ (1924, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి) తొలి తెలుగు రైతు కథగా తెర మీదకు వచ్చింది. అయితే, ఈ పరిశోధకుడు ఈ వాదనలను పూర్వపక్షం చేసి ఎవరికీ’ (1912, మాడపాటి హనుమంతరావు) కథను తొలి తెలుగు రైతు కథగా ఆవిష్కరించారు. ఇది పరిశోధకుని లక్షణమనిపించుకుంటుంది. ఈ వాదనతో ఏది తొలి తెలుగు రైతు కథ అన్న అంశం నిర్ధారణ కావడమే కాకుండా, ఆధునిక తెలుగు కథ ఆరంభం నుంచి రైతు ఉన్నాడన్న విషయం వెల్లడయింది. నిజానికి ఆ ముగ్గురూ కూడా మహోన్నత రచయితలు. 1902లో తొలి తెలుగు కథ వెలువడిందని విమర్శకుల అభిప్రాయం. అయితే 1910 నాటి ‘దిద్దుబాటు’ (గురజాడ)తో తెలుగు కథ పూర్తి ఆధునికతను సంతరించుకుందని నిర్ణయించారు. 1910-2010 మధ్య, అంటే వందేళ్ల కథా సాహిత్యంలో రైతు జాడను ఈ పరిశోధకుడు గుర్తు పట్టారు. ఈ శోధనలో 319 కథలపై పరామర్శ ఉంది. కోస్తా, రాయలసీమ, తెలంగాణలకు చెందిన కథలే ఇవన్నీ. కానీ పరిశోధకుడు తీసుకున్న కొన్ని కథలను గమనిస్తే, రైతాంగ ప్రస్తావన, సేద్యం ప్రస్తావన ఉన్నా పరిశోధనకు తీసుకున్నారని అనిపిస్తుంది. ఉదాహరణకి చాసో కుంకుడాకు కథ.
వేలూరి శివరామశాస్త్రి, కవికొండల వేంకటరావు, మాధవపెద్ది గోఖలే, అడవి బాపిరాజు, సురవరం ప్రతాపరెడ్డి, గోపీచంద్‌, ‌జీవీ కృష్ణారావు, నార్ల చిరంజీవి, కొకు, రావూరి భరద్వాజ,చాసో, అమరేంద్ర, రంధి సోమరాజు, చెన్నమనేని రాజేశ్వరరావు, కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి, రావిశాస్త్రి, తాళ్లూరి నాగేశ్వరరావు, కారా, పోలవరపు కోటేశ్వరరావు, కల్యాణ సుందరీ జగన్నాథ్‌, ఇనాక్‌, ‌రెంటాల నాగేశ్వరరావు, కేశవరెడ్డి, జాతశ్రీ, కె.సభా, మధురాంతకం రాజారాం, సింగమనేని, ఐతా చంద్రయ్య, తుమ్మేటి, గంటేడ గౌర్నాయుడు, అట్టాడ అప్పల్నాయుడు, పాపినేని శివశంకర్‌, ‌వి. ప్రతిమ, కె. వరలక్ష్మి, అన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, పెద్దింటి అశోక్‌ ‌కుమార్‌, ‌పూడూరి రాజిరెడ్డి, రామాచంద్రమౌళి, బండి నారాయణ స్వామి, సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి వంటి రచయితలు తమ తమ కథలలో రైతు జీవితాన్ని చిత్రించారు. వీరందరి కథలను పరిశోధకుడు విశ్లేషించారు. కానీ రైతుల బలవన్మరణాలు లేని కాలంలో ఎంతమంది రచయితలు రైతు జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారో, సేద్యం ఘోరమైన సంక్షోభంలో చిక్కుకుని వారి బలవన్మరణాలు లక్షలకు చేరుకున్న క్రమంలో కొంచెం తక్కువగా కథలు రావడం చిత్రమే. మంచికో చెడుకో ప్రపంచీకరణ పెనుమార్పులనే తెచ్చింది. జీవితం విస్తరించింది. రైతు కుటుంబం విస్పోటనం చెందింది. రైతు కొడుకు రైతు కావడానికి వెనుకంజ వేస్తున్న కాలం వచ్చింది. ఇందుకు రైతులను తప్పు పట్టడం లేదు. అలాంటి పరిస్థితులను సృష్టించి పెట్టారు. ఈ వాస్తవాలను రచయితలు ఇంకాస్త లోతుగా స్వీకరించవలసి ఉందనిపిస్తుంది.
ఈ పరిశోధక వ్యాసం ఆరుభాగాలుగా నిర్మితమైంది. మొదటి అధ్యాయం సేద్యం నేపథ్యం చెబుతుంది. చారిత్రక, భౌగోళిక స్వరూపాలు, స్థితిగతులు, నీటి వనరులు, సమస్యలు, రైతాంగ పోరాటాలు కూడా ఇందులోనే చర్చించారు. రెండో అధ్యాయం 1910-1956 మధ్య మూడు తెలుగు ప్రాంతాలలోను వచ్చిన కథల పరిచయం ఉంది. మూడో అధ్యాయం 1956-1990 మధ్య వచ్చిన కథలు, నాలుగో అధ్యాయంలో 1991-2010 మధ్య వచ్చిన కథలలో రైతు ఉనికి ఉంది. అంటే ప్రపంచీకరణ ప్రభావానికి గురైన రైతాంగం ఇందులో కనిపిస్తుంది. ఐదో అధ్యాయం గ్రామీణ జీవితంలో సేద్యానికీ, మిగిలిన వృత్తులకీ ఉన్న అనుబంధం గురించి చెప్పడం బాగుంది. చివరి అధ్యాయంలో ఈ కథల శిల్పాన్ని చర్చించడం కూడా అంతే చక్కగా ఉంది. కాబట్టి పరిశోధక గ్రంథం అన్న దృష్టితో ఈ పుస్తకాన్ని చూడడం సరికాదు. డాక్టర్‌ ‌సుబ్బారావుగారి ఈ పరిశోధన కర్షకుడి కన్నీటినీ, పంట చేను నవ్వునీ ఏకకాలంలో చూసిస్తుందనే అనిపిస్తుంది.

తెలుగు కథానిక
రైతు జీవితచిత్రణ (పరిశోధక గ్రంథం)
పరిశోధకుడు : డాక్టర్‌ ‌పీవీ సుబ్బారావు
పుటలు : 447, వెల : రూ.300/-
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

– శ్రీరామ్‌

About Author

By editor

Twitter
Instagram