– రాజనాల బాలకృష్ణ

కోటి కాకపోతే రెండు కోట్లు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నట్లుగా చనిపోయిన వారి ప్రాణాలు తెచ్చివ్వడం ఎవరికీ సాధ్యంకాదు. అలాగే, ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇలాంటి నిర్లక్ష్యంతో కూడిన మానవ తప్పిదాలు జరిగినప్పుడు పోయిన ప్రాణాలకు లెక్క కట్టి ‘నష్టపరిహారం’ ఇవ్వడం కొత్తేమీ కాదు. ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఆ పని చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎందుకో గానీ, అప్పటి పడవ ప్రమాదంలో చూపని గొప్ప ఔదార్యాన్ని విశాఖ విషాదం విషయంలో కాస్త ఎక్కువగా చూపించారు. బాధిత కుటుంబాలో, ప్రతిపక్షాలో డిమాండ్‌ ‌చేసే లోగానే, అనూహ్యంగా పోయిన ప్రతి ప్రాణానికి ‘కోటి’ రూపాయల వంతున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే ప్రమాద స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికీ నష్ట పరిహారం ప్రకటించారు. విషవాయువు కోరలలో చిక్కుకున్న గ్రామాలలోని ప్రతి ఇంటికి పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇంత గొప్ప ఔదార్యం చూపిన ముఖ్యమంత్రిని అందరూ మెచ్చుకోవలసిందే. మెచ్చుకున్నారు కూడా.

అయితే.. ఇది నష్టపరిహారంతో చాప చుట్టేసే చిన్న విషయమూ కాదు, అలాగే 12 ప్రాణాలు, పదిహేను గ్రామాలకు మాత్రమే పరిమితం అయిన సమస్యా కాదు. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న సమయంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరికీ సవాలుగా మారిన ప్రస్తుత సమయంలో ఈ ప్రమాదాన్ని చిన్నా చితక సమస్యగా చూడలేం. చూడరాదు.

ఇదొక మహా నేరం. ఈ పాపాన్ని ‘కోటి’తో కడిగేయాలనుకోవడం మహాపరాధం. 12కు పైగా నిండు ప్రాణాలను బలి తీసుకోవడంతో పాటు వందల సంఖ్యలో ప్రజల్ని తీవ్ర అస్వస్తతకు గురిచేయడం, ఇంకా ఎన్నో భవిష్యత్‌ అనర్థాలకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ ‌కంపెనీ చేసిన పాపం కోటి రూపాయలతో తొలగిపోతుందా? అటు కంపెనీ, ఇటు ప్రభుత్వం పునీతం అవుతాయా? ముఖ్యమంత్రి అలా భావిస్తున్నారా? నిజానికి ఇలాంటి సందేహమే రాకూడదు. కానీ సందేహం మొలకెత్తడం కాదు నాలుగైదు రోజుల్లోనే మహా మానైకూర్చుంది. ముఖ్యంగా సీఎం విశాఖలో విమానం దిగింది మొదలు వేగంగా మారుతూ వచ్చిన పరిణామాలు ఈ అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయి. విమానాశ్రయంలో దిగగానే సీఎం కంపెనీ యాజమాన్యంతో ప్రత్యేకంగా మంతనాలు సాగించారు. ఆ మీటింగ్‌లో ఏమి చర్చించారో ఏమో గానీ, అక్కడే ప్రభుత్వం చిత్తశుద్ధి విషయంలో అనుమాన బీజం పడింది. ఇక అక్కడి నుంచి అడుగడులో, మలుపు మలుపులో ప్రతిపక్షాల అనుమానం బలపడుతూ వచ్చింది. కంపెనీతో ముఖ్యమంత్రి డీల్‌ ‌కుదుర్చుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా సామాన్య ప్రజలకు కూడా సందేహాలు కలుగుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ప్రజా కోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా 1980లో సంభవించిన భోపాల్‌ ‌గ్యాస్‌ ‌దుర్ఘటనను గుర్తుకు తెచ్చుకుందాం. ఆ ఘటనలో నిద్రలోనే ఎందరో కార్మికులు కన్ను మూశారు. అప్పుడు అమెరికాకు చెందిన యూనియన్‌ ‌కార్బైడ్‌ ‌కంపెనీ నుంచి ఇదే విధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మిథైల్‌ ఐసో సైనైడ్‌ ‌గ్యాస్‌ ‌లీక్‌ అయింది. కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది. ఇప్పటికీ ఆ పీడ కల చాలామందిని వెంటాడుతూనే ఉంది. అమెరికా కంపెనీ పాక్షిక (రూ.715 కోట్లు) నష్టపరిహారంతో చేతులు కడిగేసుకుంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. అనేక దశాబ్దాల పాటు అక్కడ పుట్టిన ప్రతి బిడ్డపై కార్బైడ్‌ ‌ప్రభావం కనిపించింది. తాజాగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ‌విరజిమ్మిన విషవాయువు ప్రభావం కూడా ఇప్పట్లో పోయేది కాదని, సుదీర్ఘకాలం పాటు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోని చెరువులు, కుంటలు ఇతర జలవనరులు కలుషితం అయ్యాయని మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. పచ్చని చెట్లు మాడి మసై పోయాయి. పశువులు, పక్షులు ఇతర మూగజీవాలు పెద్దసంఖ్యలో ప్రాణాలు వదిలాయి. ఇవ్వన్నీ పాలిమర్స్ ‌విషవాయువులు పర్యావరణం మీద ఎంతటి ప్రభావం చూపాయో చెప్పకనే చెప్పాయి. అదేవిధంగా విషవాయువులు లీకైన ఐదారు రోజులకు కూడా నిపుణులు ఆహోరాత్రులు కష్టపడుతున్నా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదంటే ఎల్జీ పాలిమర్స్ ఎం‌త ప్రమాదకర పరిశ్రమో, ఆ పరిశ్రమను అక్కడే కొనసాగించాలనుకోవడం ఇంకెంత ప్రమాదకరమో వేరే చెప్పనక్కర్లేదు.

అన్ని విషయాల మాదిరిగానే ప్రభుత్వం విశాఖ విష సమస్యను కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ‌గొప్పతనం, ఘనకీర్తిని మెచ్చుకుని అదొక ‘ప్రెస్టిజియస్‌’ ‌కంపెనీ అని కితాబు ఇచ్చారు. మంత్రులు, వైసీపీ నాయకులు కూడా అదే వల్లె వేస్తున్నారు. నిజమే, కొరియా కంపెనీ ‘ఎల్జీ’ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న సంస్థ. అయితే, అదే సమయంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ ‌చరిత్ర అంతఘనంగా లేదని దుర్ఘటన అనంతరం వెలుగుచూస్తున్న విశేషాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ కంపెనీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిపిన కుమ్మక్కు వ్యవహరాల గురించి, అప్పన్న ఆలయ భూముల వ్యవహారంతో పాటు అనేక విషయాల్లో సాగించిన లోపాయికారి వ్యవహారాల గురించి వస్తున్న ఆరోపణలు, విమర్శలు కంపెనీ ఘనచరిత్రను చెప్పకనే చెపుతున్నాయి. రాజకీయ విమర్శలను, మీడియా కథనాలను పక్కన పెట్టి ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కునే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మహా దుర్ఘటన వెనక దాగున్న నిజానిజాలను నిగ్గు తేల్చవలసిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

కంపెనీ యాజమాన్యం బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఒక భయానక విషవాయువును ఉపయోగిస్తున్నామనే స్పృహ కంపెనీ యాజమాన్యానికి లేదు. ప్రమాదం సంభవించినప్పుడు కార్మికులను, సమీప నివాస ప్రాంతాల ప్రజలను హెచ్చరించేందుకు, అప్రమత్తం చేసేందుకు ఉండవలసిన సైరన్‌ ‌వ్యవస్థ కూడా లేదంటే ఆ కంపెనీ భద్రతా ప్రమాణాలను ఎంత చక్కగా విస్మరించిందో వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఇక అలాంటి కంపెనీలో లీక్‌ అయిన విషవాయువుల ప్రభావాన్ని నిర్వీర్యం చేసే రసాయన సాధనాల గురించి ఆలోచించడమే అమాయకత్వం అనిపించుకుంటుంది. అలాంటివీ ఏవీ లేకనే కేంద్ర ప్రభుత్వం, స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగి ఆగమేఘాల మీద గుజరాత్‌ ‌నుంచి అవసరమైన ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. ద్రవరూపంలో ట్యాంకుల్లో భద్రంగా ఉండాల్సిన స్టైరీన్‌ అకస్మాత్తుగా వాయువుగా మారి వెలుపలకు వచ్చి విషం కక్కిందంటేనే నిర్దిష్ట ఉష్ణోగ్రతలో దానిని భద్రపరచాలన్న నియమం అమలు జరగనట్టే. లాక్‌డౌన్‌ ‌కారణంగా కొంతకాలం ఈ ప్లాంట్‌ ‌పని చేయనప్పటికీ నిబంధనల ప్రకారం రోజువారీ తనిఖీలు, మెయింటెనెన్స్ ‌జరగాల్సిందే. కానీ అవేమీ సక్రమంగా పాటించలేదు. స్టైరీన్‌ను నిల్వ ఉంచిన కంటైనర్లు పాతవి కావడం, వాటిని సరిగా నిర్వహించకపోవడం, ఫ్యాక్టరీల చట్టం ప్రకారం హానికర విషవాయువుతో నిత్యం వ్యవహరించే కంపెనీలో కీలకమైన వీవోసీ వ్యవస్థ పనిచేయని స్థితిలో ఉండటం ఆశ్చర్యం. స్టైరీన్‌ ‌స్థితిని ఎప్పటికప్పుడు తెలియచెప్పే ప్రత్యేక వ్యవస్థ లేనందునే లీకేజీని తక్షణమే గుర్తించక వాయువు ఇలా వేగంగా విస్తరించగలిగింది. కాబట్టి ఈ దుర్ఘటనలో మొదటి ముద్దాయి కంపెనీ యాజమాన్యమే.
జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఈ ‌ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. కంపెనీతో పాటుగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు, కేంద్ర కాలుష్య మండలికి నోటీసులు జారీ చేసింది. నిజానిజాలను విచారించేదుకు విశ్రాంత న్యాయమూర్తి శేషశయనరెడ్డి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. అంతేకాదు, హరిత ట్రిబ్యునల్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఆదర్శకుమార్‌ ‌గోయల్‌ ‌సారథ్యంలోని ధర్మాసనం కంపెనీ యాజమాన్యం తక్షణ సహాయంగా రూ.50 కోట్లు మధ్యంతర జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ ‌చేయలేదు సరి కదా నేరానికి తగ్గ కేసులు పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. స్థానిక ప్రజలు కంపెనీని అక్కడి నుంచి తరలించాలని ఆందోళనకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రి కంపెనీలో ఉద్యగాలు ఇప్పిస్తామని యువతకు ఎర వేస్తున్నారు. అంటే విషవాయువులు వెదజల్లే కంపెనీతో సహజీవనం తప్పదని చెప్పకనే చెపుతున్నారు. అయితే ఈ విషాదంలో ఒక గుణపాఠం మాత్రం ఉంది. రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రస్త్తుతం ఇవ్వన్నీ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. రేపు తిరిగి ఉత్పత్తి ప్రారంభించే సమయంలో ఇదొక గుణపాఠంగా తీసుకుంటే మరికొన్ని ప్రాణాలు పోకుండా ఉంటాయి.

About Author

By editor

Twitter
Instagram