– ‌పాక్‌ ‘ఉ‌గ్ర’ సంస్థల కుయుక్తి
ప్రపంచమంతా కరోనా వైరస్‌ ‌విలయతాండవం చేస్తోంది. అన్ని దేశాలు మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తలమునకలై ఉన్న సమయాన్ని ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌ ఆం‌క్షల కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని, ఖాళీగా ఉన్నవారిని గుర్తించి ఆకర్షించి తమ విధ్వంసకర చర్యల కోసం పావులుగా మార్చుకునే కుట్ర జరుగుతోంది. భారత్‌ ‌సహా అమెరికా, యూరోప్‌ ‌దేశాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో ఈ వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఈ కుట్రను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. మరోవైపు జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రంలోకి కరోనా సోకిన ఉగ్రవాదులను ప్రవేశ పెట్టడాన్ని భారత సైన్యం గుర్తించింది.

కరోనా వ్యాప్తిని అడ్డుకునే దిశగా ప్రజలు భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లకే పరిమితం కావాలనే లాక్‌డౌన్‌ ఆం‌క్షల కారణంగా అగ్రరాజ్యాలు సహా అన్ని దేశాలు స్థంబించిపోయాయి. కరోనా కట్టడి ఆంక్షల కారణంగా అనేక దేశాల్లో విద్యాలయాలు, కార్యాలాయాలు, కర్మాగారాలు, వాణిజ్య కార్యకాలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా అనేక సంస్థలు నష్టాల పాలవడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోట్లాది మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకునే దిశగా వైద్య సేవలపైనే అన్ని దేశాల ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. ఆంక్షల కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడం అన్ని దేశాలకూ సవాలుగా మారిపోయింది. మరోవైపు లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇళ్లకే పరిమితమైన యువత ఎక్కువ సమయం సోషల్‌ ‌మీడియాపైనే గడుపు తున్నారు. ఈ పరిస్థితిని ఉగ్రవాద సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లో యువతను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద కార్యకలాపాలలో ఎక్కువగా బలైపోతున్నది యువతే.
లాక్‌డౌన్‌ ‌వేళ ఉగ్రవాద సంస్థలు పన్నిన ఈ కుట్రపై ఇటీవల ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ‌ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వెంటనే జోక్యం చేసుకోక పోతే యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు హింసాత్మక ప్రవృత్తి దిశగా ఆకర్షితులవు తున్నారని గుటెరస్‌ ‌గుర్తు చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలతో వారికి గాలం వేస్తున్నారు. దేశాల సరిహద్దులు దాటివస్తున్న శరణార్థులను కూడా ఈ ఉగ్రవాదులు పావులుగా వాడుకుంటున్నారు
‘బయో’ ఉగ్రవాద భయం
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న యుద్ధ తంత్రాలను ఉగ్రవాదులు అందిపుచ్చుకుంటు న్నారు. బాంబులు పెట్టడం, కాల్పులకు పాల్పడటం లాంటి విధ్వంస కార్యకలాపాలను పక్కన పెట్టి అధునాతన సాంకేతిక పద్ధతిని ఉపయోగించుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం అమెరికాలోని ట్విన్‌ ‌టవర్స్ ‌మీద విమానాల దాడికి అల్‌ఖైదా సంస్థ యువకులనే పావులుగా వాడుకుంది. కొద్ది సంవత్సరాల క్రితం ఇరాక్‌, ‌సిరియాలతో పాటు పశ్చిమాసియా దేశాలను తమ గుప్పిట పెట్టుకున్న ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఉ‌గ్రవాద సంస్థ ఖలీఫా రాజ్య పునఃప్రతిష్ట పేరుతో నిర్వహించిన యుద్ధానికి ప్రపంచంలోని పలు దేశాల నుంచి యువకులను చేరదీసి అధునాత ఆయుధాలతో శిక్షణ ఇచ్చింది. వేలాది మంది యువత ఆ యుద్ధానికి బలైపోయారు. మన దేశంలో కేరళ తదితర రాష్ట్రాల నుంచి కూడా యువత ఐసిస్‌ ‌మార్గంలోకి వెళ్లడం తెలిసిందే.
ఇప్పటికే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్న ఉగ్రవాదులు బయో యుద్ధానికి కూడా తెరలేపే ప్రమాదం పొంచి ఉన్నది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఈ ‌విషయలో కూడా ప్రపంచ దేశాలను హెచ్చరించారు. చైనా లాంటి స్వార్థపూరిత దేశాలు తమ ప్రయోజనాల కోసం అమెరికా, భారత్‌ ‌లాంటి దేశాలనే టార్గెట్‌ ‌చేసేందుకు పరోక్షంగా ఉగ్రవాదులకు సహకరించే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు అణు పరిజ్ఞానాన్ని అందజేసింది చైనానే అని అందరికీ తెలుసు. భారత్‌లో ఉగ్రవాద కార్యాకలాపాను నిర్వహిస్తున్న పాకిస్తాన్‌కు అండగా నిలిచిన చైనా, ఉగ్రవాదాన్ని కట్టడి చేసే దిశగా భారత్‌ ‌చేస్తున్న ప్రయత్నాలను ఐక్యరాజ్య సమితితో నిసిగ్గుగా అడ్డుకుంటోంది.
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనా సృష్టి అనేది కాదనలేని సత్యం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పడగొట్టడమే లక్ష్యంగా చైనా కరోనాను సృష్టించిందని ప్రపంచ దేశాలన్నీ నమ్ముతున్నాయి. మున్ముందు జరిగే యుద్ధాలన్నీ ఇలాంటి ‘బయో’వార్‌లే అని చెప్పక తప్పదు. ఈ ప్రమాదకర వైరస్‌లు పాకిస్తాన్‌ ‌ద్వారా ఉగ్రవాదుల చేతిలో పడితే ఇక జరిగేది ప్రపంచ వినాశనమే. కరోనా వైరస్‌ ఇం‌తటితో ఆగిపోయే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో ఇది అంతర్జాతీయ శాంతిభద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. దీనిపై పోరాటంలో ప్రపంచ దేశాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్లయితే అది బయో ఉగ్రదాడులకు దారితీయవచ్చని గుటెరస్‌ ‌హెచ్చరిస్తున్నారు.
మళ్లీ విరుచుకుపడుతున్న ఐసిస్‌
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌శాంతిదూతగా మార్కులు కొట్టేయాలనుకున్నారు. ఉగ్రవాదంపై పోరు పేరుతో ఆఫ్గానిస్తాన్‌తో సహా ఇరాక్‌ ‌తదితర గల్ఫ్ ‌దేశాల్లో అమెరికా సైనిక దళాలు దశాబ్దాలుగా తిష్టవేసుకొని ఉన్నాయి. ఎంతో మంది తమ సైనికులు పరాయి గడ్డపై పోరాటంలో మరణించడం అమెరికా ప్రజలకు నచ్చడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది భారంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా నుంచి తన దేశ దళాలను ఉపసంహరించుకొని తదుపరి ఎన్నికల్లో తిరిగి అధ్యక్షునిగా గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్‌. ‌దురదృష్టవశాత్తు ఇదే సమయంలో కరోనా మహమ్మారి అమెరికాతో పాటు పలు దేశాలను దెబ్బ తీసింది. సైన్యం లోకి కూడా కరోనా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళకరంగా మారింది. సరిగ్గా ఈ సమయాన్ని ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌చక్కగా ఉపయో గించుకుంటోంది. మూడేళ్ల క్రితం తాను కోల్పోయిన ప్రాబల్యాన్ని తిరిగి సాధించే దిశగా పావులు కదుపుతోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనాతో పోరాడుతున్న సమయంలో ఇరాక్‌లో పెద్దఎత్తున విరుచుకుపడింది. సమర్రా నగర సమీపంలోని పాపులర్‌ ‌మొబిలైజేషన్‌ ‌ఫోర్సెస్‌ ‌దళాలపై ఐఎస్‌ ఉ‌గ్రవాదులు పెద్దఎత్తున దాడులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది ఇరాక్‌ ‌సైనికులు మరణించారు. దీంతో ఇరాక్‌ ‌మరోసారి ఐసిస్‌ ‌ఛాయల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది.
కశ్మీర్‌లోనూ కరోనా ఉగ్రవాదులు
ఇటీవలి కాలంలో భారత ప్రభుత్వం చేపట్టిన సర్జికల్‌ ‌స్ట్రైక్‌, ఆర్టికల్‌ 370 ‌రద్దు, కశ్మీర్‌ ‌విభజనతో పాకిస్తాన్‌ ‌ప్రేరిత ఉగ్రవాదానికి చాలా వరకూ తెరపడింది. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌దళాల కుయుక్తులను భారత సైన్యం సమర్థవతంగా తిప్పి కొడుతోంది. ఈ నేపథ్యంలో మరో కుతంత్రానికి తెర లేపింది పాకిస్తాన్‌. ‌కరోనా సోకిన ఉగ్రవాదులను కశ్మీర్‌ ‌లోయలోకి ప్రవేశపెట్టే ప్రయత్నాలను ప్రారంభించింది. కశ్మీర్‌ ‌ప్రజలకు వైరస్‌ను అంటించడం ద్వారా సంభవించే మరణాలకు భారత ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయాలన్నదే ఈ కుట్ర. స్వయంగా జమ్ముకశ్మీర్‌ ‌డీజీపీ దిల్బాగ్‌సింగ్‌ ఈ ‌కుట్రను బయటపెట్టారు. శ్రీనగర్‌ ‌సమీపంలోని గందర్బాల్‌ ‌జిల్లాలోని ఓ క్వారంటైన్‌ ‌కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన దిల్బాగ్‌ ‌సింగ్‌ అక్కడ జరిగిన మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పటికే కరోనా ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందిందని పేర్కొన్నారు.
పాకిస్తాన్‌ ‌నాలుగు వేల మంది ఉగ్రవాదుల పేర్లను నిఘా పరిధి నుంచి తొలగించిందని, వీరిలో 2008 ముంబయి మారణహోమం సూత్రధారులు సైతం ఉన్నారని దిల్బాగ్‌సింగ్‌ ‌పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌ద్వారా తెలుసుకున్నట్టు దిల్బాగ్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. భారత్‌ ‌సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో దాడులకు ఉగ్రవాదులను పాక్‌ ‌పంపుతోందని ఆయన పేర్కొన్నారు.
పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీఓకే) మీదుగా కరోనా రోగులను సరిహద్దు దాటిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్టు కొన్ని వారాల కిందటే ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పీఓకేలో ఇప్పటిదాకా 50 మంది కరోనా వైరస్‌ ‌బారినపడగా, వారంతా మీర్పూర్‌ ‌జిల్లాకు చెందినవారే. జమ్ముకశ్మీర్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్‌ ఎంఎం ‌నరవాణే పాకిస్తాన్‌పై ఇదేరకమైన ఆరోపణలు చేశారు. భారత్‌ ‌సహా ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుంటే, పాకిస్తాన్‌ ‌మాత్రం ఉగ్రవాదాన్ని దేశంలోకి ఎగదోస్తోందని నరవాణే దుయ్యబట్టారు.
కరోనా వైరస్‌ ‌యావత్‌ ‌ప్రపంచాన్ని భయపెడుతుంటే పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులకు మాత్రం ఇది వరంలా మారింది. అక్కడి జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్‌ ‌సోకుతుందన్న సాకు చూపి ఇళ్లకు పంపిస్తున్నారు. ఇలా విముక్తి పొందిన వారిలో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న లష్కరే తోయిబా అధినేత హఫీజ్‌ ‌సయీద్‌ ‌కూడా ఉన్నాడు. లాహోర్‌ ‌జైలులో ఉన్న 50 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు గత నెలలో గుర్తించారు. దీన్ని సాకుగా చూపి సాధారణ ఖైదీలతో పాటు ఉగ్రవాదులను కూడా విడుదల చేయడం విమర్శలకు దారి తీస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ‌స్వర్గధామం అనే విమర్శలున్నాయి. అమెరికా సహా ప్రపంచం లోని పలు ఆర్థిక సంస్థల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు, గ్రాంటుగా తీసుకుంటున్న పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం వాటిని అభివృద్ధి, సంక్షేమ, మౌళిక సదుపాయాల కల్పనకు ఉపయోగించకుండా ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నట్లు ఆధారాలు న్నాయి. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్‌ ‌యాక్షన్‌ ఆన్‌ ‌మనీ లాండరింగ్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ఆ ‌దేశాన్ని బ్లాక్‌ ‌లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించింది. ఈ ముప్పు తప్పాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌గట్టిగా హెచ్చరించింది. దీంతో తప్పనిసరిగా పాక్‌ ‌ప్రభుత్వం అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేసి జైళ్లలో మేపుతోంది.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌ను బ్లాక్‌ ‌లిస్ట్‌లో చేర్చాలా? వద్దా? అనే అంశంపై వచ్చే నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌మరోసారి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈలోపే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సుమారు 1000 మందిని అధికారిక జాబితా నుంచి పాక్‌ ‌ప్రభుత్వం తొలగించింది. పాకిస్తాన్‌లో ఇప్పటికే అల్‌ ‌ఖైదా, తాలిబాన్‌, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌సహా ఎన్నో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. జైళ్ల నుంచి విడుదైన ఉగ్రవాద నాయకులు మరింతగా రెచ్చిపోయి పని చేసే అవకాశం ఉంది. వీరందరి తక్షణ లక్ష్యం భారత్‌ అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గల్ఫ్ ‌నుంచి తబ్లిఘి జమాత్‌కు నిధులు!
ఢిల్లీలో మత సమావేశాలు నిర్వహించి భారత్‌లో కరోనా వ్యాప్తికి కారకులైన తబ్లిఘి జమాత్‌ ‌పెద్దల ఖాతాల్లోకి గల్ఫ్ ‌దేశాల నుంచి కోట్లాది రూపాయల నిధులు వచ్చాయని బయట పడింది. నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌జమాత్‌ ‌చీఫ్‌ ‌మౌలానా సాద్‌ ‌ఫాంహౌస్‌పై దాడి చేసినపుడు రూ.2 కోట్ల అంతర్జాతీయ నిధులతో ఆస్తులు కొన్నట్లు డాక్యుమెంట్లు లభించాయి. మౌలానా సాద్‌ ‌తోపాటు తన ముగ్గురు కుమారులు, మేనల్లుడి ఖాతాల్లోకి గల్ఫ్ ‌దేశాల నుంచి నిధులు వచ్చాయని గుర్తించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ ‌పోలీసులు ఈ సమాచారాన్ని ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు అందించారు. ఈ విషయంలో ఈడీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.
– క్రాంతిదేవ్‌ ‌మిత్ర

About Author

By editor

Twitter
Instagram