జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి వైశాఖ బహుళ ఏకాదశి – 18 మే 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌

——————————————————————————————————————————–

భారతదేశానికి కొన్ని జాతీయ చిహ్నాలు ఉన్నాయి – ధర్మచక్రం, గోవు, నెమలి, పులి, కలువపువ్వు- ఇలా. ఈ దేశానికి జాతీయ ఆదర్శాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు వివేకానందులవారు. అవి- ‘సమర్పణ, సేవ. జాతీయ చిహ్నాలు స్వాతంత్య్రం తెచ్చుకున్న తరువాత ఎంపికైనవి. జాతీయ ఆదర్శాలు భారతీయ నాగరికత అంతటి పురాతనమైనవి. నిత్య నూతనమైనవి కూడా. భారతీయ సనాతన ధర్మాన్ని తరచిన మనీషిగా స్వామివారు జాతికీ, నిజానికి ఈ విశ్వానికీ గుర్తు చేసిన ఆదర్శాలవి. నవీనమైన జాతీయ చిహ్నాలకీ, సనాతనమైన ఆ ఆదర్శాలకీ తల్లివేరు మళ్లీ మనదైన గతమే. జాతీయ చిహ్నాలు మేధోమథన ఫలితాలు. జాతీయ ఆదర్శాలు పరంపరాగతమైనవి. రక్త జనితమైనవి.

దారిద్య్రం పాపఫలితమన్న భావన నుంచి బయటపడకపోవడమంటే, దారిద్య్రం పెరగడానికి అవకాశం కల్పించడమే. అప్పుడు అదీ పాపమే. మహాపాపం అనాలి కూడా. దీనిని ధర్మం తప్పి ఆచరించడంగానే మన పూర్వీకులు విశ్వసించారు. కాబట్టి దారిద్య్రం బారిన పడిన వారిని, ఒక మెట్టు పైకెక్కి, అక్కడ స్థిరంగా నిలబడినవారు ఆదుకోవాలి. దారిద్య్రం అంటే లేమి మాత్రమేనా? అన్నం లేకపోవడమేనా? ఒక దుర్భర స్థితిలో కూడా దారిద్య్రం జాడలే ఉంటాయి. మృచ్ఛకటికం నాటకంలో శూద్రకుడు ఏం చెప్పాడో చూద్దాం. దారిద్య్రానికి అనేక కోణాలు. పేదవాడిని ఎవరూ నమ్మరు. పేదరికంతో మనిషి మొదట కోల్పోయేది ఆత్మ స్థయిర్యం, ఆత్మ గౌరవం. బంధుమిత్రులు దూరమవుతారు. కాబట్టే మనిషి మానుష ధర్మాన్ని విడిచిపెడతాడని ఆ మహాకవి సిద్ధాంతీకరించాడు. దొంగగా మారవచ్చు. మరొక అకృత్యం చేయవచ్చు. అందుకే దరిద్రుడిని కాదు, దారిద్య్రాన్ని ద్వేషించాలి. ఇది సేవ ద్వారా, సమర్పణ ద్వారా జరగాలని రుషితుల్యులు ఈ జాతి ఆదర్శంగా నిర్దేశించారు.

ఏ మనిషైనా నిండు నూరేళ్లూ జీవించాలని అంతా ఆకాంక్షించాలి. ఎందుకంటే, మంచిపనులు చేయడానికి. తద్వారా ఈశ్వరానుగ్రహం పొందడానికి. ఇందులో చూడవలసింది- పరిపూర్ణ జీవితం సాగించడానికి మనిషికి ఉన్న సహజ హక్కును రక్షించే బాధ్యత అందరిదీనన్న సందేశాన్నే. దారిద్య్రం, కొన్ని దుర్భర పరిస్థితులు మనిషికి దైవం లేదా ప్రకృతి ప్రసాదించిన ఆ సహజ హక్కుకు భంగకరంగా పరిణమిస్తాయి. కానీ పరిస్థితులన్నీ మనిషి చేతులలో ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలు, యుద్ధాలు, కరవు కాటకాలు, మహమ్మారులు కన్నెర్ర చేస్తూనే ఉంటాయి. అప్పుడు సర్వం కోల్పోయిన వాళ్లకి సురక్షితంగా ఉన్నవాళ్లు చేయి అందించాలి. ఇదే సేవ. ఇందుకే సమర్పణ. రఘు మహారాజు యజ్ఞాలు చేయడం, ఆ క్షణాన బొక్కసంలోని రొక్కమంతా అవసరమైన ప్రజలందరికీ పంచి పెట్టడమనే సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. ఆ సంప్రదాయాన్ని తన వారసులు కూడా ఆచరించాలని కాంక్షించాడు. దుర్భర స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడం కలిమి కలిగినవారు బాధ్యతగా స్వీకరించాలని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతోంది. మహా భారతంలో యుధిష్ఠిరునికి నారాయణుడు చేసిన హితోపదేశం ఏ కాలానికైనా ఆదర్శనీయమే. ‘ఓ యుధిష్ఠిరా! పేదలను (కానుకలు సమర్పించి) ఆదుకో. కలిగినవారికి ధన సంబంధమైన సాయం వ్యర్థం. ఔషధం, పథ్యం రోగం వచ్చినవారికే గానీ, ఆరోగ్యవంతులకు ఎందుకు?’ ఇవి శిలాక్షరాలు కావూ!

ఉన్న దాన్లోనే మనం సమర్పించేది, అంటే దానంగా ఇచ్చేది, సమాజ సంక్షేమానికి ఇతోధికంగా ఉపయోగపడాలనే మన పూర్వుల అభిమతం. అన్నార్తుల కోసం మరింత ధాన్యాన్ని పండించమని చెబుతోంది తైత్తరీయ ఉపనిషత్‌. ‌క్షుద్బాధా పీడితులను పట్టించుకోకుండా ఆహారం ఆరగించడం నేరమని ఘోషిస్తున్నది రుగ్వేదం. కాబట్టి పేదలనీ, ఆర్తులనీ ఆదుకోవడం మన ధర్మంలో అంతర్భాగం. ఈ జాతి జీవనంలో ఒక పార్శ్వం. ఈ భూమి మీద పుట్టిన వారు ఆచరించాలని చెప్పే సర్వ సామాన్య ధర్మాలు పది ఉన్నాయట. అందులో దానమూ ఒకటి. అంటే దానం ఈ జాతి సర్వ సాధారణ ధర్మం. దానమిచ్చి అదొక ఘనకార్యంగా చాటుకునేది కాదన్నమాట. అదైనా ధార్మిక, మతదృష్టిలో చేయమంటున్నారు. అదీ స్వార్థ రహితంగా. దుర్భిక్షమో, ప్రకృతి వైపరీత్యమో, యుద్ధమో, అంటువ్యాధో భౌగోళికంగా ఒక భాగాన్నో, ఒక ప్రాంతం వారినో ఛిద్రం చేసినట్టు స్థూలదృష్టికి అనిపించవచ్చు. అది వాస్తవం కాదు. సమాజమే ఒక మనిషి అనుకుంటే, అందులో ఒక అంగం ఛిద్రమయినట్టు లెక్క. అన్ని అంగాలు స్వస్థతతో ఉంటేనే ఆరోగ్యవంతుడు. అన్ని వర్గాలు స్వస్థతతో ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం. దానాలూ, ధర్మాలూ ఇందుకు!

ఇంతకీ దానాలూ, కానుకలూ ఏవి? ఆహారం, దుస్తులు, నీడ, తృణమో ఫణమో డబ్బు, గృహోపకరణాలు, భూమి ఇలాంటివి. ఇవన్నీ కొత్త జీవితాన్ని ఇచ్చేవే. మొత్తంగా, పేదలు, అన్నార్తులు, బాధలలో ఉన్నవారిని ఆదుకోవడం మన ధర్మంలో ముఖ్య అంగమని అర్థమవుతుంది. నేటి దేశకాల పరిస్థితులలోనూ ఇది ప్రతిబింబించడమే ఈ జాతి ఔన్నత్యానికి నిదర్శనం.

About Author

By editor

Twitter
Instagram