నేడు కంటికి కనిపించని ఒక వైరస్‌ ‌విశ్వంలోని 84 లక్షల జీవజాతుల్లో అత్యంత అభివృద్ధి చెందిన మానవజాతిని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్‌ ‌మూలాలు ఎక్కడున్నాయో గమనిస్తే, ఈ వైరస్‌ ఒక్కటే కాదు దాదాపు 32 వైరస్‌లు నేడు మానవునికి భయంకరమైన వ్యాధులను కలుగచేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్‌.ఓ.) ‌లెక్కల ప్రకారం దాదాపు 72 రకాల వ్యాధులు మానవునికి జంతువులతోనే సంక్రమిస్తాయి. కొన్ని రకాల వైరస్‌లు జంతువుల్లో ఉన్నప్పటికీ అవి ఆ జంతువులకు ఎటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టవు. కానీ మానవుని విపరీత ప్రవర్తన కారణంగా ఆ జంతువుల్లో ఉన్న వైరస్‌లు మానవునిలోకి ప్రవేశించి వ్యాధిని కలుగచేస్తున్నాయి.
సృష్టిలో ప్రతి జీవికి బ్రతికే హక్కుంది. ఈ హక్కును మానవుడు కాలరాసిన కారణంగానే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రపంచంలో ఇప్పటివరకు అనేక జంతువులను మానవుడు చంపాడు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 లక్షల జీవులను మానవుడు చంపుతున్నాడని ఒక సర్వే చెప్తోంది. దీనితో ప్రకృతిలో జీవుల సమతుల్యం దెబ్బతిన్నది. ఈ అనుభవాల్లోంచే మానవుడు పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌సకల మానవాళిని గడగడలాడిస్తోంది. అన్ని దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయి. చైనాలో కరోనా తీవ్రత తగ్గిందని వార్తలు వచ్చాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా వ్యాప్తి పెరిగిపోయింది. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్‌, ఇరాన్‌లు ఇప్పుడు కరోనా వైరస్‌తో వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అనేక మంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను వేగవంతం చేశారు. కానీ ఇప్పటి వరకు సరైన ఔషధాన్ని కనుగొనలేకపోయారు. ప్రస్తుతం కంటికి కనబడని వైరస్‌కు, శాస్త్రీయ వైజ్ఞానికులకు మధ్య పోరాటం జరుగుతోంది. ఇందులో ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది.
ఈ వైరస్‌కు డి.ఎన్‌.ఏ. ఉం‌డదు!
ప్రతి జీవి శరీర నిర్మాణం, దాని ప్రవర్తన, లక్షణాలు, ఆరోగ్యం, ఆయుష్షు ఇవన్నీ కూడా జన్యుపదార్థమైన డి.ఎన్‌.ఏ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ప్రతి జీవికి డి.ఎన్‌.ఏ. అవసరం. కానీ కరోనా వైరస్‌తో పాటు కొన్ని ఇతర వైరస్‌లకు డి.ఎన్‌.ఏ. ‌జన్యు పదార్థంగా ఉండదు. ఆర్‌.ఎన్‌.ఏ. ‌మాత్రమే ఉంటుంది. ఆ వైరస్‌ ‌సంఖ్యను పెంచడంలో ఈ ఆర్‌.ఎన్‌.ఏ ‌ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ వైరస్‌ ఒం‌టరిగా ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం. కాబట్టి ఇది బతకడానికి వేరే జీవి (మానవుడు, ఇతర జంతువులు) శరీర కణాలను చాల తెలివిగా వాడుకుంటుంది. వేరే జీవి శరీరంలోని కణాలలోనికి ప్రవేశించిన ఈ వైరస్‌ ‌తన సంఖ్యను పెంచుకోవడానికి ఆ జీవి ప్రోటీన్‌లను సహాయంగా తీసుకుంటుంది. శాస్త్రవేత్తలు ఈ ప్రోటీన్‌లను గుర్తించి వీటిని నిర్వీర్యం చేసినట్లయితే వైరస్‌ను చంపవచ్చునని అనుకున్నారు. అయితే ప్రోటీనులను నిర్వీర్యం చేసే ఔషధాలను కనుగొని ప్రయోగాలు మొదలుపెట్టిన తర్వాత అవి మానవ శరీరంలో గల ఇతర ప్రోటీన్లను కుడా నిర్వీర్యం చేస్తున్నాయని తెలుసుకున్నారు.
కరోనా వైరస్‌ ‌మానవుని శరీరంలోని కణాల్లోకి ప్రవేశించిన తర్వాత తన ఆర్‌.ఎన్‌.ఏ. ‌మాదిరిగా ఉండే మరో ఆర్‌.ఎన్‌.ఏ.‌ను తయారు చేసుకుంటుంది. ఈ పనికి ‘ఆర్‌.ఎన్‌.ఏ. ‌డిపెండెంట్‌ ఆర్‌.ఎన్‌.ఏ. ‌పాలిమరేజ్‌’ అనే ఒక ఎంజైమ్‌ ‌సహాయం తీసుకొంటుంది. కాబట్టి ఈ ఎంజైమ్‌ను నిర్వీర్యం చేసే పనిలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అయితే ఈ ప్రయోగానికి జాతీయ ఆరోగ్య సంస్థ, అమెరికా వారు ఎబోలా వైరస్‌ని నియత్రించే పనిలో భాగంగా రేమిడేసివిర్‌ అనే ఔషధాన్ని వాడిన ఒక ప్రయోగం ఊతమిచ్చింది. ఈ ఔషధం ‘మెర్స్ ‌కో-వి’ అనే వైరస్‌ ‌వ్యాప్తిని కూడా తగ్గించిందని కరోనా వైరస్‌పై కూడా ఈ తరహాలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన విన్సెంట్‌ అనే శాస్త్రవేత్త, ఈ ‘మెర్స్ ‌కో-వి’ రకం కరోనా వైరస్‌ ఆర్‌.ఎన్‌.ఏ. ‌పాలిమరేజ్‌ ఎం‌జైమ్‌, ‌ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ‘సార్స్ ‌కోవి-2’ కరోనా వైరస్‌ ఆర్‌.ఎన్‌.ఏ. ‌పాలిమరేజ్‌ ఎం‌జైమ్‌ ఒకే రకంగా ఉన్నాయని భావించి ‘ఆర్‌.ఎన్‌.ఏ. ‌పాలిమరేజ్‌’‌ను లక్షంగా చేసుకొని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఎంజైమ్‌ను నిర్వీర్యం చేసే ఔషధం తయారైన సంతోషం ఎక్కువసేపు మిగలలేదు. ఆ ఔషధం కేవలం ఆ ఎంజైమ్‌నే కాకుండా మానవుని కణంలో గల అదే మాదిరిగా ఉండే ‘డి.ఎన్‌.ఏ. ‌పాలిమరేజ్‌’ అనే ఎంజైమ్‌ను కూడా నిర్వీర్యం చేసి మానవునికి ఇతర వ్యాధులను కలుగచేస్తోందని ప్రయోగ ఫలితాల ద్వారా తెలుసుకొని మళ్లీ ఒక అడుగు వెనక్కి వేశారు.
వైరస్‌ను నియంత్రించడానికి ఉన్న పైరెండు అవకాశాలు విఫలమయ్యేసరికి మళ్లీ తరువాతి దశలో ప్రయోగాలు మొదలు పెట్టారు. ఇది ‘వైరస్‌ ‌ప్రతికృతి పూర్తి అయిన తర్వాత అది పరిపక్వమై వేరే కణాన్ని సంక్రమించే దశ’. ఈ దశలో కనుక లక్ష్యాన్ని చేధించకపోతే కరోనా వైరస్‌పై విజయం సాధించడం కష్టం అవుతుంది. కాబట్టి వైరస్‌ ‌వేరే కణాన్ని సంక్రమించడానికి అది పూర్తిగా పరిణతి చెందాలి. ఈ పరిణతిలో ‘సార్స్-‌కోవి-2 మెయిన్‌ ‌ప్రోటియేజ్‌’ అనే ఒక ఎంజైమ్‌ ‌ప్రోటియో లైసిస్‌ అనే పక్రియ జరపడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎంజైమ్‌కి అమైనోయాసిడ్‌ను బంధించే ఔషధం ఇచ్చినట్లయితే అప్పుడు ఆ ఎంజైమ్‌ ‌నిర్వీర్యమై ప్రోటియోలైసిస్‌ ‌పక్రియ జరగక కరోనా వైరస్‌ ‌పూర్తిగా పరిణతి చెందదు. దాని ద్వారా వైరస్‌ ‌ప్రతికృతిని ఆపే వీలుంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని ప్రపంచంలోని అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. అయితే మొట్టమొదట కంప్యూటర్‌ను ఉపయోగించి మాలెక్యులార్‌ ‌డాకింగ్‌, ‌సిమ్యులేషన్‌ ‌పద్ధతిలో ప్రస్తుతం వివిధ వైరల్‌ ‌వ్యాధులను నయం చేయడానికి వాడుతున్న ఔషధాలను ఎటువంటి ఖర్చు లేకుండా ఆ ఎంజైమ్‌ ‌ప్రయోగం జరపవచ్చనే ఆలోచనతో కాకతీయ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగ అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ అయిన వ్యాసకర్త ప్రయోగాలు చేశారు.
ప్రస్తుతం ఎచ్‌.ఐ.‌వి. వ్యాధిగ్రస్తులకు, ఎచ్‌1ఎన్‌1 ‌వైరస్‌ ‌సోకిన వ్యాధిగ్రస్తులకు, టి.బి. వ్యాధిగ్రస్తులకు, మలేరియా సోకిన వ్యాధిగ్రస్తులకు వాడేటటువంటి మొత్తం 128 ఎఫ్‌.‌డి.ఎ. అనుమతి పొందిన ఔషధాలను ఎంపిక చేసుకొన్నారు. ఈ 128 ఔషధాల రసాయనిక నిర్మాణాలను (బయాలాజికల్‌ ‌డాటాబేస్‌) ఆధారంగా చేసుకొని మాలెక్యులార్‌ ‌డాకింగ్‌ అనే పద్ధతిని ఉపయోగించి ‘సార్స్ ‌కోవిడ్‌-2 ‌మెయిన్‌ ‌ప్రోటియేజ్‌’ అనే ఎంజైమ్‌ను నిర్వీర్యం చేసే దిశగా పరిశోధన ప్రారంభమైంది. ఈ ప్రాథమిక ప్రయోగాల ఆధారంగా 128 ఔషధాలలో కరోనా వైరస్‌ ‌ప్రోటీయేజ్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేసే కొన్ని ఔషధాలను గుర్తించారు. ఈ ఔషధాల పనితీరు మెరుగు పరచడానికి ‘ఇన్‌ ‌విట్రో’ పద్ధతిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇన్‌-‌విట్రో పద్ధతిలో ఈ ఔషధాల పనితీరు మంచి ఫలితాలనిస్తే ‘ఇన్‌-‌వైవో’ పద్ధతిలో క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌చేయడానికి సిఫారసు చేయవచ్చు. ఇటువంటి పరిశోధనలు అనేక మంది చేస్తున్నప్పటికీ ఔషధాన్ని ఎంపిక చేసుకోవడం, దాని లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవడం దీనిలో ముఖ్యమైనది.
మరోవైపు ప్లాస్మా థెరపీ వైద్య చికిత్స ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ప్రయోగ ఫలితాలు అంత ఆశాజనకంగా కనబడటం లేవు. రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్‌ ‌వారి శరీరంలో ఉన్నప్పటికీ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకపోవడం పెద్ద సవాలుగా మారింది. కాబట్టి ఆ వ్యక్తికి సన్నిహితంగా ఉండే ఇతర వ్యక్తుల్లోకి సులువుగా ఇది ప్రవేశిస్తుంది. అతనితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిలో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నట్లయితే వ్యాధి లక్షణాలు బయటకు వచ్చి ప్రాణ హాని కూడా జరిగే అవకాశం ఉంది అని ప్రస్తుత పరిశోధనలు చెప్తున్నాయి. మొదటి వ్యక్తిలోని రక్తంలో ఏర్పడే ప్రతిరక్షకాలు ఈ వైరస్‌ను తటస్థం చేయగలవని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కానీ ఈ దిశలో ఇటీవల చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్న వ్యక్తి ప్లాస్మాను దానం చేయడానికి ఒప్పుకునే అవకాశాలు కూడా తక్కువుగానే ఉన్నాయి. కాబట్టి ఈ విధానంలో కూడా వైరస్‌పై విజయం సాధించడం కష్టం అనిపిస్తోంది.
రంగులు మార్చే మహమ్మారి
ఏదో ఒక ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పటికీ ఆ ఔషధం ఈ కరోనా వైరస్‌పై పనిచేసే లోపే అది తన నిర్మాణాన్ని మార్చుకొని ఆ ఔషధాన్ని ఎదుర్కొంటుందని ప్రయోగాలు చెప్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు 7 రకాల వైరస్‌ల నుండి అనేక ఉత్పరివర్తనాలు (మార్పులు) జరిగి ఎటువంటి ఔషధానికి లొంగకుండా ఊసరవెల్లి లాగ రంగులు మారుస్తూ ఇది తన నిర్మాణాన్ని మార్చుకుంటూ ఔషధం వెనుదిరిగేలా చేస్తోంది. ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు జరిపిన ఒక వ్యాక్సిన్‌ ‌ప్రయోగం కూడా విఫలమైంది. కాబట్టి ప్రస్తుతం జరిగిన పరిశోధనల ఫలితాలను బట్టి వైరస్‌ ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా చర్యలు తీసుకుంటూ, రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరిచే ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా ముప్పు తప్పదు.

– ‌డా।। మామిడాల ఇస్తారి, 9848309231

అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌, ‌జంతుశాస్త్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్‌

 

About Author

By editor

Twitter
YOUTUBE