పోటెత్తుతున్న సాగరం.. పొంచి ఉన్న ప్రమాదం

పోటెత్తుతున్న సాగరం.. పొంచి ఉన్న ప్రమాదం

పర్యావరణం దృష్ట్యా భూ ఉపరితల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం ప్రతి ఒక్కరి అనుభవంలోకి వస్తున్నాయి. అవి భూమ్మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న పెనుతుఫానులు, సునామీలు కావచ్చు. అయితే మన తరువాత తరాలవారు ఎదుర్కొనబోయే పరిణామాలు మాత్రం చాలా ఘోరంగానే ఉంటాయి.

భూ ఉపరితల వాతావరణం పెరుగు తూండడంతో ఒకపక్క ధృవాల మధ్య, అతిశీతల ప్రాంతాలలో మంచు కరుగుతూండడం, మరోపక్క సముద్రజలాలు వేడెక్కి వ్యాకోచించడం వలన 1992 నుంచి సగటున ఏడాదికి సముద్రమట్టం మూడు అంగుళాలు (అనగా 8 సెంటీమీటర్లు) పెరుగుతోం దని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన సర్వే వివరాలు తెలుపుతున్నాయి.

అమెరికా-బౌల్డర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలొరాడోకి చెందిన Steve Nerem ‘ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే వందేళ్లలో సముద్ర మట్టం మరో మూడడుగుల ఎత్తుకి పెరగవచ్చు’ అంటారు. ఈయన నాసా ఆధ్వర్యంలో పనిచేసే సముద్రమట్టంలో వచ్చే పరిణామాలను అధ్యయనం చేసే బృందానికి నేతృత్వం వహిస్తున్నారు.

నాసాకి చెందిన Earth Science Divisionకి డైరెక్టర్‌గా పనిచేస్తున్న Michael Freilich, ‘సముద్ర జలాల మట్టం పెరగడం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉండే ఫ్లోరిడా వంటి రాష్ట్రాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. అలాగే మహా నగరాలైన సింగపూర్‌, టోక్యో (జపాన్‌)లకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. కొన్ని పసిఫిక్‌ దేశాలు పూర్తిగా నీట మునిగిపోవచ్చు. ప్రపంచ జనాభాలో 150 మిలియన్ల ప్రజలు సముద్రానికి ఒక మీటర్‌ ఎత్తులోనే జీవిస్తున్నారు. వీరిలో అధికులు ఆసియావాసులే’ అని అంటున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన Intergovernmental Panel on Climate Change (IPCC) 2013లో అందించిన నివేదిక ఈయన చేసిన హెచ్చరికకు ఆధారం.

సముద్రజలాల మట్టం పెరగడానికి ఒక వంతు కారణం భూ ఉపరితల వాతావరణం వేడెక్కడం, మరోవంతు కారణం అంటార్కిటికాలోను, గ్రీన్‌లాండ్‌ లోను భారీగా మంచు కరగడం వల్ల పెద్ద పెద్ద మంచు ఫలకాలు సముద్రంలో కలవడం, మిగిలిన ఒక వంతు కారణం చలి ప్రాంతాలలోని మంచు కొండలు కరగడం అవుతున్నాయి.

మరొక ఇబ్బంది ఏమిటంటే శాస్త్రజ్ఞుల అంచనాలను మించిన వేగంతో ధృవ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంచు కరుగుతోంది. అందువల్ల సముద్రమట్టం పెరుగుదల విషయంలో వారొక స్పష్టతకు రాలేకపోతున్నారు.

సహజంగా భూమిలో లభ్యమయ్యే చమురు, బొగ్గు, గ్యాస్‌ వంటి వాటిని ‘ఫోసిల్‌ ఫ్యూయెల్‌’ లేదా శిలాజ ఇంధనం అని వ్యవహరిస్తారు. వీటన్నింటినీ ఒక్కసారిగా దగ్ధం చేస్తే భూగోళంపై సగటున 12 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అదే జరిగితే ధృవాల వద్ద, ఇతర ప్రాంతాలలోనూ ఉండే మంచు అంతా కరిగి సముద్రమట్టం అనూహ్యంగా పెరుగుతుంది. అయితే ఇది ఒక్క రాత్రిలో సంభవించకపోవచ్చు. కానీ గ్రీన్‌లాండ్‌లోని పెద్ద మొత్తంలో మంచు, అంటార్కిటికా వద్ద త్వరితగతిన పెద్ద పెద్ద ఫలకాలు కరుగుతూండడం వెనుక భూ ఉపరితల ఉష్ణోగ్రతలలో పెరుగుదల వేగం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడానికి కారణం నేడు ప్రపంచంలో శిలాజ ఇంధనం ఏదో ఒక రూపంలో దగ్ధమౌతూండడమే. ఫలితంగా భవిష్యత్తులో భూమి ముఖచిత్రమే మారిపోనుంది.

ఈ శిలాజ ఇంధనాన్ని వేరే వేటితోనూ భర్తీ చేయలేము. ‘ధృవాల వద్ద మంచు కరగకుండా ఉండాలంటే శిలాజ ఇంధనాల వినియోగం పూర్తిగా నిలిపివేయాలి’ అంటారు Ricarda Winkle mann. ఈమె Potsdam Institute for Climate Impact Research (PICIR), Potsdamఎలో జూనియర్‌ ప్రొఫెసర్‌.

సముద్రమట్టంలో భారీ పెరుగుదల

భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగి సముద్ర మట్టం ఏడాదికి 3 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతోంది. ఒకవేళ అంటార్కిటికాలోని మంచు పూర్తిగా కరిగిపోయినట్లయితే సముద్రమట్టం 58 మీటర్లు అనగా 190 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అప్పుడు భూగోళమంతా జలమయమైపోతుంది. ఇది జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. అయితే అంటార్కిటికాలోనూ, గ్రీన్‌లాండ్‌లోనూ ప్రస్తుతం మంచు కరుగుతున్న వేగం ఇలాగే కొన సాగితే రాబోయే 200 సంవత్సరాలలో సముద్ర మట్టం 20 అడుగుల ఎత్తుకు పెరుగుతుందనీ, దీనివల్ల ప్రపంచంలోని ప్రధాన నగరాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందనీ PICIR చేసిన అధ్యయనం వెల్లడిస్తోంది.

గ్రీన్‌లాండ్‌, అంటార్కిటికాలలోని మంచు ఇదే వేగంతో కరుగుతూన్నట్లయితే ఉత్తర ఐరోపాలోని నెదర్లాండ్స్‌ పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. జర్మనీలోని హాంబర్గ్‌, బెర్లిన్‌ నగరాలు కనుమరుగై పోతాయి. అంతేకాదు జర్మనీ తీరప్రాంతం 400 కిలోమీటర్లు దక్షిణానికి జరగనుంది.

డెన్మార్క్‌ దేశం ఒక చిన్న దీవిగా కుంచించుకు పోతుంది. వెనిస్‌ నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది.

‘టోక్యో, హాంగ్‌కాంగ్‌, షాంఘై, కోల్‌కతా, హాంబర్గ్‌, న్యూయార్క్‌ వంటి నగరాలు ఆధునిక నాగరికతా చిహ్నాలుగా భవిష్యత్తులో మిగిలి ఉండాలనుకుంటే తూర్పు అంటార్కిటికాలోని మంచు చరియలు చెక్కుచెదరకుండా జాగ్రత్తపడాలి. అందుకు మొదట మనం వాయు కాలుష్యాన్ని నిరోధించాలి. అది జరగాలంటే శిలాజ ఇంధన వినిమయాన్ని పూర్తిగా నిలిపివేయాలి’ అంటారు Potsdam Instituteకి చెందిన Andres Levermann.

సముద్రమట్టం పెరిగినట్లయితే ఎక్కువగా దెబ్బతినేది ఆసియా దేశాలలోనివారే! బంగ్లాదేశ్‌ మొత్తం వరదలకు గురై అక్కడి 180 మిలియన్‌ ప్రజలూ నిరాశ్రయులౌతారు. సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, షాంఘై, బీజింగ్‌ నగరాలు కనుమరుగై పోతాయి.

భూ ఉపరితల ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినా చాలు సముద్రమట్టం ఒక మీటర్‌ ఎత్తుకు పెరుగుతుంది. అప్పుడు మాల్దీవులు, తువలు (South Pacificలో గల బ్రిటిష్‌ కామన్వెల్త్‌కి సంబంధించిన దేశం) వంటి ద్వీప సముదాయాలు గల దేశాలు నీట మునిగిపోయి, భూమ్మీద కనబడ కుండా పోతాయి.

పర్యావరణం దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, ఎప్పుడు సంభవిస్తాయి అన్న విషయం పక్కన పెడితే భూ ఉపరితల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి అనుభవంలోకి వస్తున్నాయి. అవి భూమ్మీద పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న పెనుతుఫానులు, సునామీలు కావచ్చు. అయితే మన తరువాత తరాలవారు ఎదుర్కొనబోయే పర్యావరణ పరమైన పరిణామాలు మాత్రం చాలా ఘోరంగానే ఉంటాయి.

ఇప్పటిదాకా సముద్రమట్టం పెరగడంలో అంటార్కిటికా పరిణామాల పాత్ర 10 శాతమే. కానీ భూమిపై ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా పెరిగితే భవిష్యత్తులో ఏదో ఒకనాడు దక్షిణ ధృవం వద్దనున్న పెద్ద పెద్ద మంచు పర్వతాలన్నీ ఒక్కసారికా కుప్పకూలుతాయి. ఇది జరగడానికి కూడా చాలా సమయమే పట్టవచ్చు. కానీ భూగోళానికి పొంచి ఉన్న ఉపద్రవం మాత్రం అనివార్యమే!

– డా|| దుగ్గిరాల రాజకిశోర్‌, 8008264690

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *