వివాదాలతో గట్టెకాలని చూసిన ‘సర్కార్‌’

వివాదాలతో గట్టెకాలని చూసిన ‘సర్కార్‌’

తమిళనాట యువ కథానాయకులు అజిత్‌, విజయ్‌ మధ్య గట్టి పోటీ కొన్ని సంవత్సరాలుగా ఉంది. జయ లలిత ఉండగా అజిత్‌కు పరోక్ష మద్ధతు ఇస్తుండే వారు. దాంతో సహజంగానే విజయ్‌ అభిమాను లకు అన్నా డీఎంకే అంటే గిట్టేది కాదు. కారణాలు ఏవైనా విజయ్‌ సినిమా ఎప్పుడు విడుదలైనా ఏదో ఒక వివాదం రాజుకునేది. వివాదాలను హైలైట్‌ చేసుకోవడం వల్లే విజయ్‌ సినిమాలు కొన్ని సక్సెస్‌ అయ్యాయనే వారూ లేకపోలేదు. విజయ్‌ తాజా చిత్రం ‘సర్కార్‌’ పరిస్థితి కూడా అంతేలా కనిపిస్తోంది.

సుందర్‌ రామస్వామి (విజయ్‌) ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీకి సీఈఓ అతను ఏ దేశానికి వెళ్లినా స్థానిక ఐటీ కంపెనీల అధినేతలు భయపడి పోతుంటారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా ఎత్తుకు పైఎత్తు వేసి సుందర్‌ తమను కబళిస్తాడని వారి భయం. అలాంటి సుందర్‌ ఇండియాకు వస్తున్నాడనగానే ఇక్కడి ఐటీ కంపెనీలూ భయపడతాయి. అయితే… అతను కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికే వచ్చినట్టు తెలిసి ఊపిరి పీల్చుకుంటాయి. అంతదూరం నుండి సుందర్‌ ఇండియా వస్తాడు కానీ, అతను పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే సరికి ఎవరో ఆ ఓటును వేసేసినట్టు తెలుస్తుంది. దాంతో తన ఓటు తానే వేసేంత వరకూ ఆ నియోజకవర్గ ఫలితాలను పెండింగ్‌లో పెట్టాలని కోరుతూ సుందర్‌ కోర్టుకు వెళతాడు. ఇదే సమయంలో అధికారపక్ష నేతల నోటిదురుసు కారణంగా సుందర్‌ ఇగో దెబ్బతింటుంది. వారికి ఓ గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. తనలానే ఓటు హక్కు వినియోగించు కోలేకపోయిన వారందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తాడు. అన్ని నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్లు లక్షల సంఖ్యలో పోల్‌ కావడంతో చివరకు జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ అన్ని నియోజక వర్గాలలో అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం అక్కడి వారికే అప్పగిస్తాడు. ఆ రకంగా కేవలం పదిహేను రోజుల్లోనే అధికార పక్షానికి ఎదురు నిలిచి ముచ్చెమటలు పట్టిస్తాడు. మరి సర్కార్‌ పైనే తొడగొట్టిన సుందర్‌ లక్ష్యం నెరవేరిందా? అతను అనుకున్న విధంగా సజావుగా ఎన్నికలు జరిగాయా? అందుకోసం వేసిన ఎత్తులు పైఎత్తులు ఏమిటన్నదే ‘సర్కార్‌’ చిత్రం.

ఒకరి ఓటును వేరే వ్యక్తి వేసేసినప్పుడు ఏం చేయాలనే విషయమై రాజ్యాగంలో ఓ వివరణ ఉంది. అయితే అది పెద్దంతగా జనానికి చేరువ కాలేదు. గతంలో ఈ దొంగ ఓట్ల దందా జరిగినా… ఇప్పుడు ఫోటో ఐడెంటిటీ కార్డుల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ ఓట్ల శాతం బాగా తగ్గిపోయింది. ఆ రకంగా చూస్తే ఓ పాత పాయింట్‌ను తీసుకుని మురుగదాస్‌ ఈ చిత్రం తీసినట్టు తెలిసిపోతుంది. పైగా ప్రతి బూత్‌లోని ఎన్నికల అధికారికీ ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవచ్చనే విషయంలో ప్రభుత్వం తగిన శిక్షణ ఇస్తూనే ఉంటుంది. కానీ ఇలా దొంగ ఓట్ల బారిన పడిన వారిని ఏకీకృతం చేసి తిరిగి ఎన్నికలు తీసుకురావడం అనేది ‘సర్కార్‌’లో కొత్త పాయింట్‌.

నిజానికి ప్రభుత్వ దారుణ వైఫల్యాలు తన దృష్టికి రావడంతో అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలనే సుందర్‌ ఇదంతా చేశాడని మురుగదాస్‌ నిదానంగా రివీల్‌ చేశారు. అయితే ఆయా అంశాలలో కొత్తదనం లేదు. గతంలో ఎన్నో సినిమాల్లో ఆ సమస్యలను చూపించేశారు. ఇక ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోయే వ్యక్తితో చేసే పోరాటంలోనూ ఆసక్తికరమైన అంశం లేదు. అధికారాన్ని దక్కించుకోవడం కోసం తండ్రి చావును పావుగా ఉపయోగించుకోవాలనుకునే కోమలవల్లి (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) పాత్ర జయలలిత ఛాయలతో కనిపిస్తుంది. అదే ఈ సినిమాను వివాదాల్లోకి నెట్టింది. దీనిని నిర్మించింది సన్‌ నెట్‌వర్క్‌కు చెందిన కళానిధి మారన్‌ కావడం కూడా అన్నా డీఎంకే వారి ఆగ్రహానికి కారణమైంది. కావాలనే జయలలితను, ఆమె పథకాలను ఈ సినిమాలో తప్పుగా చూపించారనే విమర్శలు చెలరేగాయి. అవి అల్లర్ల వరకూ చేరకముందే నిర్మాతలు తప్పును అంగీకరిస్తూ, రీ-సెన్సారింగ్‌ చేయించి, వివాదాస్పద సన్నివేశాలను తొలగించి, కొన్ని మాటలను మ్యూట్‌ చేశారు. ఇంత చేసిన ‘సర్కార్‌’పై అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు.

గతంలో విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘తుపాకి, ‘కత్తి’తో ఈ సినిమాను పోల్చిచూసు కుంటున్నారు. బలమైన కథ లేకుండా.. చిన్న పాయింట్‌తో విజయ్‌ ఇమేజ్‌ను ఆధారం చేసుకుని మురుగదాస్‌ ఈ సినిమా తీశారని విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య తెలుగులో ‘స్పైడర్‌’తో మహేశ్‌ అభిమానులను మెప్పించలేకపోయిన మురుగదాస్‌ ఇప్పుడు విజయ్‌ అభిమానులనూ నిరాశకు గురిచేశారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం, గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రఫీ, శ్రీకర ప్రసాద్‌ ఎడిటింగ్‌ ఏవీ ‘సర్కార్‌’ను గట్టెక్కించలేకపోయాయి.

ఈ చిత్రానికి రామ్‌లక్ష్మణ్‌ సమకూర్చిన పోరాట సన్నివేశాలే హైలైట్‌గా నిలిచాయి. విజయ్‌ నటన కూడా అక్కడక్కడా అతిగానే ఉంది. ‘మహానటి’తో వచ్చిన గుర్తింపును నిలుపుకోవడంలో కీర్తిసురేశ్‌ విఫలమైంది. ప్రతినాయిక పాత్రలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ సైతం మెప్పించలేకపోయింది. రాధారవి, పాల కురుప్పై నటన కాస్తంత ఉత్తమం. ఏదేమైనా భారీ అంచనాలతో దీపావళి కానుకగా వచ్చిన ‘సర్కార్‌’ ఇటు తెలుగు, అటు తమిళ సినీ అభిమానులకు నిరాశనే మిగిల్చింది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *