‘‌ప్రధానమంత్రిగా అవకాశం వస్తే నేను వదులుకుంటానా?’ అంటూ విలేకరిని ఎదురు ప్రశ్నించారు మాజీ ముఖ్య మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు. ఆయన కుమారుడు  కె.టి. రామారావు ధాన్యం సేకరణలో రూ.1000 కోట్లు అవకతవకలు జరిగాయని ధాటీగా వాదిస్తున్నారు. ఇదే భారత రాజకీయాలలో కనిపించే ఒక వైచిత్రి. ఎందుకంటే కె.చంద్రశేఖరరావు హయాంలో జరిగిన ఫోన్‌ ‌ట్యాంపింగ్‌ ఇప్పుడు వాళ్ల పీకలకు చుట్టుకుపోయి ఉంది. ఆ ఉచ్చు బాగా బిగుసుకుపోయింది కూడా. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాజా పరిణామాలు, ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో అరెస్టయిన పోలీస్‌ అధికారులు వెల్లడించిన నిజాలు తెలంగాణనే కాదు, దేశాన్నే విస్తుపోయేటట్టు చేస్తున్నాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ రాజ్యాంగ సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని పదే పదే విమర్శించే, ఎదురు దాడికి దిగే  ఒక రాజకీయ ముఠా నిర్వాకమే ఇదంతా. తన అధీనంలో ఉండే పోలీసు, నిఘా వ్యవస్థలను దారుణంగా ఉపయోగించుకున్నారు కేసీఆర్‌.

‌తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తున్న బీజేపీని చూసి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తడబడిన సంగతి నిజం. ఫలితమే ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కుట్ర. తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ పథకాలు రచించిందని కేసీఆర్‌ ఆరోపించారు. ఆ పార్టీ ప్రముఖులను అరెస్టు చేయడానికి కూడా ఆయన పథకాలు వేశారు. ఆఖరికి ట్యాపింగ్‌ ‌కుట్ర పరిధిలోకి బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు, ఇతర ప్రముఖులతో పాటు తన పార్టీ వారిని కూడా కేసీఆర్‌ ‌తీసుకు వచ్చేటట్టు చేశారన్నది నిజం. ఆ నిజమే ఇప్పుడు మరీ విస్తుగొలుపుతున్నది. తనకు పెద్ద సవాలుగా మారిన బీజేపీని అప్రతిష్ట పాల్జేద్దామని కేసీఆర్‌ ఆరంభించిన జాతీయ విద్రోహ చర్య ప్రతికూలంగా పరిణమించింది. దారుణంగా బెడిసికొట్టింది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆ ‌కుట్రను వెలికి తీసింది. అసలు నిజం వెల్లడైంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఈ ‘దొంగ చెవుల’ నాటకం 2019 లోక్‌సభ ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికలు, 2023 ఎన్నికలలో కూడా కొనసాగింది. అందుకే ఈ కేసు పరిధి మరీ విస్తరించిపోయింది. ఇందుకు పదవీ విరమణ చేసిన తన తైనాతీలనే కేసీఆర్‌ ఎం‌చుకున్నారు. అది కూడా తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఈ బాధ్యతను అప్పగించారు. అంటే చట్టానికి ఎన్ని రకాలుగా తూట్లు పొడవచ్చునో అన్ని రకాలుగాను తూట్టు పొడిచారు.అయితే బీజేపీనీ, మోదీనీ ఆయన యథేచ్ఛగా విమర్శిస్తారు.

 ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కూరుకుపోయిన తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను రక్షించేందుకు కేసీఆర్‌ ‌వేసిన ఎత్తు ఇది అని అంతిమంగా తేలింది. బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్‌ ‌సంతోష్‌ను ఈ కుట్రలో చేర్చాలని కూడా కేసీఆర్‌ ‌ప్రయత్నించారు. సంతోష్‌ను అరెస్టు చేసి, కవితను ఢిల్లీ లిక్కర్‌ ‌గొడవ నుంచి బయటకు తేవాలన్నదే కేసీఆర్‌ ఆలోచన అని బయటపడింది. నేరాంగీకార వాంగ్మూలంలో టాస్క్‌ఫోర్స్ ‌మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఈ విషయాలు బయటపెట్టారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు తన పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం ఆడించారాయన. రేవంతరెడ్డి, బండి సంజయ్‌, ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్న ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ల ఫోన్‌లను కూడా కేసీఆర్‌ ‌ట్యాప్‌ ‌చేయించారు.

 ఇదంతా రాజకీయమని, తన ఉనికిని కాపాడుకునే వ్యూహమని ఇప్పటికీ కేసీఆర్‌ ‌నమ్ముతూ ఉండవచ్చు. ప్రభుత్వం ఓడిపోయిన తరువాత కూడా ఆయన ధోరణి మారలేదు. అహంకారం చావలేదు. అందుకే ఈ మాట అనుకోక తప్పదు. కానీ ఇదంతా నేర మనస్తత్వం మాత్రమే. అందుకే ఇప్పుడు కేసీఆర్‌ను అరెస్టు చేయాలని, ఇన్ని వాస్తవాలు బయటపడినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ అడగడం సబబే. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పెద్దలు, ముఖ్యులు అనుసరించిన పద్ధతులు, విచ్చల విడిగా ప్రవర్తించిన తీరు జుగుప్పాకరమే. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌వ్యవహారం దానికి పరాకాష్ట. అంతా బహిర్గతమైన తరువాత కూడా ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేదే కాదు. అధికారం తమకే శాశ్వతం అని, దానికి తమను ఎవరూ దూరం చేయలేరన్న అత్యుత్సాహం, అతి ఆలోచన ఎంతగా గూడుకట్టుకొని ఉందో ఈ ఉదంతం, దాని క్రమం ద్వారా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఈ రాజ్యాంగ వ్యతిరేక తతంగంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వ యంత్రాంగాన్నే కాదు, తన పార్టీని, ఎమ్మెల్యేలను కూడా ఎరగా వాడుకున్నారు. ఇందుకు వేదిక తనకు తెలిసిన ఫామ్‌ ‌హౌస్‌. ‌తమ సామాజిక వర్గానికి చెందిన ఓ కిందిస్థాయి పోలీసు అధికారిని వాహకంగా ఉపయోగించుకొని ఆయనకు అనైతికంగా, అడ్డదారుల్లో పోస్టింగులు, ప్రమోషన్లు ఇచ్చారు. అత్యున్నత స్థాయి అధికారులకు ఇవ్వాల్సిన బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ పెద్దలే తన వెనక ఉన్నారన్న భరోసాతో ప్రభుత్వంలోని పెద్దలు,ఇతర ముఖ్యులు చెప్పినట్టల్లా చేశారా అధికారి. అవసరాలకోసం వాళ్లకు గిట్టని, సవాళ్లు విసురుతున్న వారి సెల్‌ ‌ఫోన్లు ట్యాపింగ్‌ ‌చేశాడు. సినిమా ప్రముఖులు, హీరోయిన్లు సెల్‌ ‌ఫోన్లు కూడా ట్యాపింగ్‌ ‌చేసినట్లు వివరాలు బయటకు వచ్చాయి.

ఈ ఉదంతం గురించి ప్రస్తావిస్తూ బండి సంజయ్‌ అత్యవసర పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. నిజమే, నాడు ఇందిర ప్రచార సభలకు ప్రధాని సచివాలయ అధికారి ఒకరు పని చేశారు. అదే ఆమె ఎన్నికకు ముప్పు తెచ్చింది. గతాన్నీ, చరిత్రనీ గుర్తుంచుకుంటే ఇలాంటివి జరగవు. కానీ అధికార మదం నేతలను ఆ పని చేయనీయదు.

తెలంగాణలో కేసీఆర్‌ను మూడోసారి కూడా గెలిపించాలని ఎస్‌ఐబీ అహర్నిశలు శ్రమించింది. ఇంటెలిజెన్స్ ‌మాజీ చీఫ్‌ ‌ప్రభాకరరావే (ప్రస్తుతం ఈయన అమెరికాలో ఉన్నారు) ఈ బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నారు. ఈ విషయం రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో చెప్పారు. విపక్ష నేతలకు అండగా ఉన్న వ్యాపారులును దెబ్బ తీయడానికి కూడా ట్యాపింగ్‌ ఆయుధాన్ని ఉపయోగించారు. ఈ సమాచారంతో పాటు పార్టీలో ఉన్న అసమ్మతుల గురించి కూడా ‘‘పెద్దాయన’’కి చేరవేస్తూ ఉండేవారు. అవి ఎలా ఉండేవి? కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్న శంభీపూర్‌ ‌రాజు మీద, కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న టి. రాజయ్య వంటివారి కదలికలపైన, ఆఖరికి తాండూ ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డికి ఉన్న విభేదాల మీద ట్యాపింగ్‌తో సమాచారం తీసుకున్నారు. తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ ‌మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డిల ఫోన్‌ల మీద నిఘా ఉంచారు. ఇక బీజేపీ నేతలు బండి, అరవింద్‌, ఈటల ఫోన్‌ల మీద కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్‌ ‌కూడా ట్యాప్‌ ‌చేశారు.

ఇదంతా చట్ట వ్యతిరేకమని పోలీసులుకు తెలియక కాదు. కానీ అంతా తెలిసే ఈ వ్యవహారం వారు నడిపించారు. ఈ విషయాన్ని మాజీ డీఎస్‌పీ ప్రణీత్‌రావు చెప్పడం విశేషం. ఇంత భరోసా ఎందుకు? కేవలం బీఆర్‌ఎస్‌ ‌మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని నమ్మడమే. కానీ కథ అడ్డం తిరిగింది. ఆ పార్టీ ఓడిపోయింది. ఎంతయినా పోలీసులు కదా! జరగబోయే కథను ముందే ఊహించి ఒకరిని ఒకరు అప్రమత్తం చేసుకున్నారు. ఒకరినొకరు సంప్రదించుకుని అన్ని ఆధారాలను నాశనం చేశారు. దీనికి ఎస్‌ఐబీ సిబ్బంది కూడా తోడ్పడింది. పోలీసులు కావచ్చు. వారు నిఘా విభాగం కావచ్చు. కానీ వారు ఎన్నికల విశ్లేషకులు కాదు. ఆ స్పృహ వారికి లేదు.

అధికారం శాశ్వతం కాదని రాజకీయ నాయకులు బయటకు అంటారే గాని, వాస్తవంగా ఆ మాట పట్ల వారికి విశ్వాసం ఉండదు. ఒకసారి కుర్చీ దక్కిన తరువాత అది దూరం కాదని వారి పిచ్చి నమ్మకం. కేసీఆర్‌ ‌కూడా అంతే. బయటకి ఎంతో మెట్ట వేదాంతం చెప్పినా, ఆయన స్వతహాగా అహంకారి. నియంత. అందరి నియంతల మాదిరిగానే అధికారం పోయిన తరువాత ఆయన పరిస్థితి కూడా శరవేగంగానే పతనమైంది. తన కుట్ర తన కళ్ల ఎదురుగానే ఎలా పరిణామం చెందుతున్నదో ఆయనే చూస్తున్నారు. స్పెషల్‌ ఇం‌టెలిజెన్స్ ‌బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ల వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది.

ఈ వ్యవహారం వెనక ఉన్న బీఆర్‌ఎస్‌ ‌కీలక నేతను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ట్యాపింగ్‌ ‌వ్యవహారం నడిపించిన డీఎస్పీ ప్రణీత్‌రావును మొదట అరెస్టు చేయడాన్ని కూడా కేసీఆర్‌ ‌చూశారు. విచారణలో ప్రణీత్‌రావు నుంచి సేకరించిన వివరాలతో మరో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న కేసీఆర్‌ ‌కళ్ల ఎదుటే కటకటాల్లోకి వెళ్లారు.

ఆ క్రమం కూడా గుర్తు చేసుకోదగ్గదే. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలోని నిఘా వర్గాలు వేసిన ప్రతి అడుగు జాగ్రత్తగానే వేశారు. ముగ్గురు పోలీసు ప్రముఖుల అరెస్ట్ ‌తరువాత అధికారులు తెర వెనుక పాత్రలపై దృష్టి పెట్టారు. ఇంటెలిజెన్స్ ‌మాజీ చీఫ్‌ ‌టి.ప్రభాకర్‌రావు ఈ కేసులో కీలక నిందితుడని ఆది నుంచి అనుమానించినా, అదనపు ఎస్పీల అరెస్టు తర్వాతే దానిని రూఢి చేసుకున్నారు. విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను ట్యాపింగ్‌ ‌చేయడానికి ప్రభాకర్‌రావు ఆదేశాలే కారణమని భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలమిచ్చినట్లు రిమాండ్‌ ‌నివేదికలో పేర్కొన్నారు. ఇంకా బీఆర్‌ఎస్‌ ‌కీలక నేత ఒకరు ఉన్నట్లు, ఆయన చెప్పిన నంబర్లను ట్యాప్‌ ‌చేసినట్లు ఎఎస్పీలు అంగీకరించిన సంగతి కూడా వెల్లడైంది. ఆ నేత ఇచ్చే నంబర్లను వీరిద్దరూ ప్రణీత్‌రావుకు అందించేవారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు తిరిగి బీఆర్‌ఎస్‌ ‌నేతకు అందజేసేవారు.

అప్పట్లో హైదరాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్ ‌డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావు ఇచ్చిన నంబర్లన్నీ ట్యాప్‌ ‌చేసినట్లు ఒప్పుకొన్నారు. వాటి ఔట్‌పుట్‌ను కూడా ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు తిరిగి రాధాకిషన్‌రావుకు పంపేవారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్‌ ‌చేశామని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టామని ప్రణీత్‌రావు చెప్పక తప్పలేదు. వ్యాపారవేత్తలతో పాటు ప్రముఖుల ఫోన్లను కూడా టాప్‌ ‌చేశారు. పోలీసులు రిమాండ్‌ ‌రిపోర్టులో ఈ వివరాలను పొందుపరిచారు. ప్రైవేటు వ్యక్తులపై ఫోన్‌లు ట్యాపింగ్‌ ‌చేసి వారికి సంబంధించిన ప్రొఫైల్‌ ‌తయారు చేసినట్లు, అందుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేసినట్లు తిరుపతన్న, భుజంగరావు విచారణలో అంగీకరించారు. కేసీఆర్‌ ‌దిగిపోయిన తరువాత ఆధారాలు నాశనం చేయడం మరొక కోణం. ఈ కేసులో మరో కీలక నిందితుడు, ఐన్యూస్‌ ‌యజమాని శ్రవణ్‌కుమార్‌రావు, ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు విదేశాల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ ముగ్గురిపై లుక్‌ఔట్‌ ‌నోటీసులు జారీ చేశారు. ప్రణీత్‌రావు వాంగ్మూలం మేరకు నల్లగొండలో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ‌ధనుంజయ్‌, ‌వరంగల్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను కూడా దర్యాప్తు అధికారులు విచారించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌కు చెందిన డబ్బులను వీరిద్దరే వాహనాల్లో తరలించారని విచారణలో తేలింది.

ట్యాపింగ్‌ ‌వ్యవహారం కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించింది. 2018లో ఎస్‌ఐబీలో ఇన్‌స్పెక్టర్‌ ‌హోదాలో చేరిన ప్రణీత్‌రావుకు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కోసం 2 గదులు, 17 కంప్యూటర్లతో పాటు, ప్రత్యేక అధికారాలు కట్టబెట్టినట్లు సమాచారముంది. విదేశాల నుంచి తెచ్చిన అధునాతన టెక్నాలజీని ఇందుకోసం వాడినట్లు గుర్తించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌ ‌రెడ్డి, ఆయన సోదరుల ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ప్రణీత్‌రావు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.దాదాపు 2 కి.మీ. పరిధిలోని ప్రైవేట్‌ ‌కమర్షియల్‌ ‌బిల్డింగ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీతో ఈ పరికరాలు అమర్చినట్లు స్పెషల్‌ ‌టీమ్‌ ‌గుర్తించింది.

అయితే కథ అడ్డం తిరిగిందని తెలియగానే ఆధారాలను ధ్వంసం చేసే పని మొదలయింది. ప్రభుత్వం మారిన తర్వాత ట్యాపింగ్‌ ‌సంబంధించిన మెయిన్‌ ‌డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేసిన సంగతి 17 కంప్యూటర్లలో హార్డ్ ‌డిస్క్‌లన్నిటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్‌రావు చెప్పారు. రెండు లాకర్‌ ‌రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని కూడా వెల్లడించాడు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో అరెస్టయిన ముగ్గురు కీలక నిందితులు ప్రభాకర్‌రావు పేరు చెప్పడంతో ఆయనను కూడా పాత్రధారిగా దర్యాప్తు అధికారులు నిర్ధారిం చారు. ఇక సూత్రధారులు ఎవరనేది తెలియాలంటే ప్రభాకర్‌రెడ్డి అరెస్టు కావాల్సిందేనని చెబుతున్నారు. ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ వ్యవహారంలో ‘ఐన్యూస్‌’ ‌యజమాని శ్రవణ్‌కుమార్‌ ‌రావు పాత్ర కీలకమని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఆయన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కోసం తన సంస్థలో ప్రత్యేకంగా స•ర్వర్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేశాడు. వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావుకు అందజేసేవాడని గుర్తించారు.

ఈ కేసుకే సంబంధించిన ఇతర సమాచారం కోసం పట్టుబడిన ల్యాప్‌ట్యాప్‌ ‌తదితరాలను ఫోరెన్సిక్‌ ‌శాఖకు పంపారు. అందులో సమాచారం ఎలా ఉంటుందో? శ్రవణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 4 ట్యాబ్‌లు, 5 పెన్‌‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్, ఒక డీవీఆర్‌ ‌సీజ్‌ ‌చేసి ఫోరెన్సిక్‌ ‌విశ్లేషణకు పంపారు. పోలీసులు. ధ్వంసం చేసిన హార్డ్ ‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్‌ ‌డివైజ్‌ ‌ను రీట్రీవ్‌ ‌చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇతర సమాచారం ఆశించవచ్చు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావును ఏ1 గా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఏ1 గా ప్రభాకర్‌ ‌రావు, ఏ2 గా ప్రణీత్‌రావు, ఏ3గా భుజంగరావు, ఏ5గా తిరుపతన్న, ఏ6 గా మరో వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. అంతిమంగా రూఢి అయినదేమిటి? ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ప్రభాకర్‌ ‌రావే కీలక సూత్రధారి. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్‌ ‌జరిగింది.

అరెస్టయిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఒకే మాట చెప్పారు. అప్పటి ఇంటిలెజెన్స్ ‌చీఫ్‌ ‌ప్రభాకర్‌రావు ఆదేశాల ప్రకారమే తాము చాలామంది ఫోన్లను ట్యాపింగ్‌ ‌చేసినట్లు ఆ ముగ్గురు అంగీకరించారు. అదే సంచలనం సృష్టించింది. అమెరికా నుంచి ప్రభాకరరావు చేసిన వ్యాఖ్య మరింత విచిత్రంగా ఉంది. ఆయన టెలిఫోన్లో ఇక్కడి అధికారులతో మాట్లాడుతూ, ‘ఇప్పుడు మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వపెద్దల ఆదేశాల మేరకు మేమూ అలానేచేశాం’ అని చెప్పటం విచిత్రంగా ఉంది. అంటే పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో జరిగిన టెలిఫోన్‌ ‌ట్యాపింగులన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేయించినట్లు ప్రభాకరరావు అంగీకరించినట్లు అర్థవుతోంది. మరి ప్రతిపక్షాల నేతలతో పాటు అనుమానాస్పందంగా ఉన్న స్వపక్షం నేతల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో పెద్దలంటే కేసీయార్‌, ‌కేటీయార్‌, ‌హరీష్‌ ‌రావు, కవితతో పాటు మరికొంత మంది మాత్రమేనని అందరికీ తెలుసు. వీరిలో ట్యపింగ్‌ ‌వ్యవహారాన్ని నడిపింది ఎవరనే విషయం అరెస్టయిన ముగ్గురుపోలీసు అధికారులు, లేదా దేశా నికి తిరిగొచ్చిన తర్వాత ప్రభాకరరావు చెబితేకాని తెలీదు.

గతంలోను దేశంలో విపక్షాల ఫోన్‌లను ట్యాప్‌ ‌చేసిన ఉదంతాలు జరిగాయి. వాటి సారాంశం, తాజా తెలంగాణ ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌సారాంశం దాదాపు ఒక్కటే. అధికారం శాశ్వతమన్న అంధ నమ్మకంతో వ్యవహరించడం ఏ పార్టీకి సరికాదు. అలాగే అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని అంటకాగి పబ్బ గడుపుకోవాలని అధికారులు ప్రయత్నించడం సరికాదు. ఇంత పెద్ద ప్రజాస్వామిక దేశంలో అబద్ధాలు దాగవు. ఇంత పెద్ద మీడియా ఉన్న దేశంలో రహస్యాలు ఎక్కువ కాలం మరుగున ఉండవు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల లీకేజీలు, అవినీతి. మరో వైపు ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు కుంభకోణం, ఈ ఫార్ముల రేసులో అవినీతి, ధరణిలో భూ అక్రమాలు, ఢిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కవిత అరెస్టు లాంటి వివా దాల్లో పార్టీలోని కీలకనేతలు బాగా తగులుకున్నారు.

వీటన్నింటి మీద టెలిఫోన్‌ ‌ట్యాపింగ్‌ అం‌శం తీవ్రమైందనే చెప్పాలి. బీజేపీని రాష్ట్రం నుంచి తరిమివేయాలని అనుకుని, తానే చెత్తబుట్టలోకి పోయింది టీఆర్‌ఎస్‌.

About Author

By editor

Twitter
YOUTUBE