అక్కడ పశ్చిమ బెంగాల్‌, ఇక్కడ కేరళ, తమిళనాడు.. మచ్చుకైనా ప్రజాస్వామ్యం కనపడని ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు. అవినీతి, హింసాకాండ,  బుజ్జగింపు ఫలితంగా పెట్రేగిన మతోన్మాదం వంటి వాటికి ఆలవాలాలు కూడా. ఇవే పెట్టని కోటలుగా అక్కడ మూడు పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ఈసారి ఆ అరాచక పాలనలకు అడ్డుకట్ట పడుతుందని, బీజేపీ అక్కడ కూడా ఉనికిని చాటుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దకాలంగా అణచివేత కొనసాగుతున్నది. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చినట్టు దాఖలాలు ఉన్నాయి. సనాతన ధర్మం కేన్సర్‌ అం‌టూ మెజారిటీ ప్రజల మనోభావాలను దారుణంగా అవమానించిన చరిత్ర తమిళనాడును ఏలుతున్న డీఎంకేది. కేరళలో అటు ప్రభుత్వ అణచివేత, ఇటు ముస్లిం మతోన్మాదం జమిలిగా సాగుతున్నాయి. అయినా మళ్లీ పాత పార్టీలే గెలవడం విచిత్రం.

 సర్వేల అంచనాలకు భిన్నంగా పశ్చిమ బెంగాల్‌, ‌తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రజల తీర్పు వెలువడటం ఎగ్జిట్‌పోల్స్ ‌శాస్త్రీయతపై మరోసారి అనుమానాలు వ్యక్తం కావడానికి దోహదం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 26-31 స్థానాల్లో గెలుపు సాధిస్తుందని, తృణమూల్‌ ‌కేవలం 11-14 స్థానాలకే పరిమితమవుతుందన్న ఎగ్జిట్‌ ‌పోల్‌ అం‌చనాలు కూడా తల్లక్రిందులవడమే కాదు బీజేపీ ఆశలకు గండి కొట్టాయి. ఇండియన్‌ ‌సోషల్‌ ‌ఫ్రంట్‌ ‌వంటి ముస్లిం పార్టీకి పరోక్షంగా బీజేపీ మద్దతునిచ్చినా ముస్లిం ఓట్లలో చీలిక రాలేదు. రాష్ట్రంలో ఇండియన్‌ ‌సెక్యులర్‌ ‌ఫ్రంట్‌ (ఐఎంఎఫ్‌) ‌తాను ముస్లింలకు ప్రతినిధిగా చెప్పుకుంటుంది. బీజేపీ మద్దతున్నప్పటికీ ఇది బలహీనపడటం మమతకు లాభం చేకూర్చింది. ముఖ్యంగా ముస్లింల ఓట్లు చీలకుండా, గంపగుత్తగా టీఎంసీకి పడటం మమత విజయానికి ప్రధాన కారణం. బెంగాల్‌ ‌పరిస్థితుల రీత్యా నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఇక్కడ హిందూత్వను మరింత దూకుడుగా విస్తరించేందుకు ‘భద్రలోక్‌’ ‌వర్గాన్ని  ప్రోత్సహించారు. టీచర్ల రిక్రూట్‌మెంట్‌ ‌స్కామ్‌ ‌వంటివి తమను కాపాడతాయని భావించినా ఫలితమివ్వలేదు. అవినీతి, బంధుప్రీతి, స్కామ్‌లతో నిండిన మమతా ప్రభుత్వానికి ప్రస్తుతం అక్కడి సుసంఘటిత ముస్లిం ఓట్లు (30%) శ్రీరామ రక్షగా నిలిచాయి. మమత విజయం వెనుక ఉన్న కిటుకు ఇదే! ముస్లింలలో గణనీయంగా ఓట్లు చీలితే తప్ప మమతను ఓడించడం సాధ్యంకాదన్న సత్యం మరోసారి స్పష్టమైంది.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ఖాతా తెరవడం ఖాయమని ఇండియా టుడే, యాక్సిస్‌ ఇం‌డియా సర్వేలు అంచనా వేశాయి. తమిళనాడులో ఎన్డీఏ కూటమి 2-4 సీట్లు సాధిస్తుందని వేసిన అంచనాలు నిజం కాలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నించిన బీజేపీ సీట్ల రూపంలో ఫలితాలు సాధించనప్పటికీ, ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. కేరళలో విస్తరణకు బీజేపీ ఎందరో కార్యకర్తలను బలి చేసుకుంది. ఇది పీఎఫ్‌ఐ ‌పుట్టిన నేల. ముస్లిం మతోన్మాదం ఎక్కువ. అయితే క్రైస్తవులు నెమ్మదిగా వాస్తవాలు తెలుసుకుని బీజేపీకి దగ్గరవుతున్నారు. ఆ ఫలితాలే ఇప్పుడు కనిపించాయి.

ఒక పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందు తన స్థానాన్ని విస్తరింపజేసుకోవాలి. ప్రస్తుతం బీజేపీకి రెండు రాష్ట్రాలో ఒనకూడిన ప్రయోజనం ఇదే! రాబోయే ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రస్తుతం పార్టీకి ఒక భూమిక ఏర్పడిందనే చెప్పాలి. ద్రవిడవాదానికి పెట్టనికోటగా ఉన్న తమిళనాడులో పాగా వేసేందుకు, బీజేపీ రెండేళ్ల క్రితం నుంచే తన వ్యూహాన్ని అమలుచేస్తూ వచ్చింది. ద్రవిడ వాదాన్ని, ‘సనాతన ధర్మంతో’, ‘ప్రాంతీయ వాదాన్ని’, ‘జాతీయ వాదం’తో ఒక పద్ధతి ప్రకారం ఎదుర్కొంటూ వచ్చింది. రాజకీయంగా మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలైని తమిళనాడు పార్టీ అధ్యక్షుడిగా రంగంలోకి దింపింది. ఆయన రాక తమిళ రాజకీయాల్లో బీజేపీ ఒక ‘కుదుపు’ తెచ్చిందనే చెప్పాలి. ఇది సీట్ల రూపంలో ఫలితమివ్వకపోయినా రాష్ట్రంలో పార్టీ విస్తరణకు, 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ పునాది ఉపయోగపడగలదు. అయితే బీజేపీతో పొత్తును కాదనుకోవడం వల్ల అన్నాడీఎంకే నష్టపోయింది.

కేరళలో అరుణకాంతుల మధ్య కమలం తొలిసారి విప్పారింది. త్రిస్సూర్‌ ‌స్థానంలో సురేష్‌ ‌గోపి విజయంతో బీజేపీ ఖాతా తెరచింది. తమిళనాడుతో పోలిస్తే కేరళలో తన ఉనికిని చాటడంలో బీజేపీ విజయం సాధించిందనేది స్పష్టం. ఒకప్పుడు 6.54% గా ఉన్న ఓట్ల వాటా ఇప్పుడు 16.67%కు పెరగడం పార్టీ క్రమంగా బలపడుతున్న వైనాన్ని తెలియజేస్తోంది.

పశ్చిమబెంగాల్‌

‌మొత్తం 42 స్థానాల్లో టీఎంసీ 29 సీట్లలో (+7) విజయం సాధించగా, బీజేపీ 12 స్థానాల్లో (-6) కాంగ్రెస్‌ ఒక్క స్థానంలో (-1) గెలుపొందాయి. ఎగ్జిట్‌ ‌పోల్స్‌లో న్యూస్‌ ఎక్స్, ‌బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి రాష్ట్రంలో 21-24 సీట్లు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌కు 18-21 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ అంచనాలను తల్లక్రిందులు చేస్తూ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ 29 ‌స్థానాల్లో గెలవడం విశేషం. పశ్చిమబెంగాల్‌ అం‌టేనే ఎన్నికల హింసకు మారుపేరు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి ఎన్నికల్లో కూడా పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. వీటివల్ల ఎన్నికల సంఘం రెండు బూత్‌ల్లో జూన్‌ 3‌వ తేదీన రీపోలింగ్‌కు ఆదేశించడమే ఇందుకు దృష్టాంతం.

పార్లమెంట్‌లో ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొన్న మహువా మొయిత్రా కృష్ణనగర్‌ ‌నుంచి బీజేపీ అభ్యర్థి అమృతారాయ్‌పై (50వేల మెజారిటీ), బరహామ్‌పూర్‌ ‌నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అధిరంజన్‌ ‌చౌదరిపై టీఎంసీ అభ్యర్థి పఠాన్‌ ‌యూసుఫ్‌ (85,022 ‌మెజారిటీ), డమ్‌డమ్‌ ‌నుంచి టీఎంసీ అభ్యర్థి సౌగత్‌ ‌రాయ్‌(65 ‌వేలకు పైగా ఓట్ల మెజారిటీ), సందేశ్‌ఖలి సంఘటన జరిగిన బసిర్హాత్‌ ‌లోక్‌సభ నియోజవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి ఎస్‌.‌కె. నూరుల్‌ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖాపత్రాపై (3.34 లక్షల ఓట్ల మెజారిటీ) గెలిచారు. కోల్‌కతా (ఉత్తరం) 4.54 లక్షల ఓట్ల మెజారిటీతో, కోల్‌కతా (దక్షిణం)1.9 లక్షల ఓట్ల మెజారిటీతో కూడా టీఎంసీ ఖాతాలోకి వెళ్లాయి. డైమండ్‌ ‌హార్బర్‌ ‌నుంచి పోటీచేసిన అభిషేక్‌ ‌బెనర్జీ ఏకంగా 7.1లక్షల ఓట్ల రికార్డు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి అభిజిత్‌ ‌కుమార్‌పై విజయం సాధించారు.

జాతీయ స్థాయిలో 400 సీట్లను సాధించాలన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్‌లో తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, సందేశ్‌ఖలి సంఘటనను ప్రధానాంశాలుగా తన ప్రచారాన్ని కొనసాగించింది. నిజానికి సందేశ్‌ ‌ఖలి సంఘటనపై ఆశలు పెట్టుకున్నది కూడా. ప్రధాని నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీ మంచి పని తీరు ప్రదర్శించబోతున్నదని ఒక దశలో పేర్కొనడానికి బహుశా ఇదే కారణమై ఉండవచ్చు. కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్‌ ‌గంగోపాధ్యాయ్‌, ‌సందేశ్‌ఖలి సంఘటన బాధితురాలు రేఖాపత్రాను ఎన్నికల బరిలో దించడం ద్వారా బీజేపీ తన మద్దతును మరింత విస్తృతం చేసుకోవ డానికి యత్నించింది. రేఖాపత్రాను బసిర్హాత్‌ ‌పార్లమెంట్‌ ‌స్థానం నుంచి అభ్యర్థిగా రంగంలోకి దింపడంతో ఈ స్థానంపై దేశవ్యాప్త చర్చ జరిగింది. విశేష మేమంటే బసిర్హత్‌ ‌లోక్‌సభ స్థానంలో రేఖా పత్రా గెలవబోవడంలేదని, ఇక్కడ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్థి హాజీ నూరుల్‌ ఇస్లామ్‌కే విజయం దక్కుతుందని ఇండియాటుడే-యాక్సిస్‌ ‌మై ఇండియా చెప్పిన జోస్యం నిజమైంది. బసిర్హత్‌ ‌స్థానంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెట్లుండగా వీటిల్లో సందేష్‌ఖలి ఒకటి. ఇక్కడే మహిళలపై అత్యాచారాలు, భూఆక్రమణలు, హింసాకాండతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. వీటికి వ్యతిరేకంగా ఈ అసెంబ్లీ నియోజక వర్గంలో మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సందేశ్‌ఖలి నియోజక వర్గంలో బీజేపీ ఆధిక్యత సాధించినా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వెనుకబడుతుందన్న సర్వే అంచనాలు నిజమయ్యాయి. ఎందుకంటే ఈ నియోజక వర్గంలో ముస్లింల జనాభా 70శాతం!

2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీఎంసీపైనే విమర్శలను కేంద్రీకరించింది తప్ప మమతపై వ్యక్తిగత దాడి తీవ్రతను తగ్గించింది. ఆమెకున్న పలుకుబడి నేపథ్యంలో ఈ జాగ్రత్త తీసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భాజపా డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఈసారి సందేశ్‌ఖలి బాధితురాలు రేఖపత్రా, కృష్ణనగర్‌ ‌స్థానం నుంచి అమృతారాయ్‌ని మోదీ స్వయంగా ప్రమోట్‌ ‌చేసినా ఓటమి పాలవడం గమనార్హం. 13సంవత్స రాలుగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. మమత ప్రభుత్వంలో  విద్యా శాఖ మాజీ మంత్రి పార్ధా చటర్జీ, ఆహారశాఖ మాజీ  మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌లు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైల్లో ఉన్నారు. మమత సమీప బంధువు అభిషేక్‌ ‌బెనర్జీ కూడా అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విచారణ ఎదుర్కొంటున్నారు.

సింగూరులో టాటా నానో ఫ్యాక్టరీ సమస్య, నందిగ్రామ్‌ ఆర్థిక మండలి ఏర్పాటు విషయంలో లెఫ్ట్ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమతా బెనర్జీ మూడున్నర దశాబ్దాల లెఫ్ట్ ‌పాలనకు చరమగీతం పాడారు.

విచిత్రమేమంటే మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో శారదా గ్రూపు, రోజ్‌వ్యాలీ ఆర్థిక కుంభకోణాలు, నారదా స్టింగ్‌ ఆపరేషన్‌, ‌బొగ్గు అవకతవకలు, పశువుల అక్రమ రవాణా కేసు, 2022 ఎస్‌.ఎస్‌.‌సి. రిక్రూట్‌మెంట్‌ ‌కుంభకోణం వంటివి చోటుచేసుకున్నప్పటికీ, బీజేపీ వాటిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం లేదా ప్రజలు ముఖ్యంగా ముస్లిం సమాజం వాటిని పట్టించు కోకపోవడం ఆమె అధికారంలో కొనసాగడానికి ప్రధాన కారణం!

తమిళనాడు

తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి 39 స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కలిసి మొత్తం 40 స్థానాలను క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసింది. పుదుచ్చేరి స్థానాన్ని కాంగ్రెస్‌ ‌గెలుచుకుంది. బీజేపీ దించిన అన్నామలై సృష్టించిన ప్రభంజనం సీట్ల రూపంలో ప్రతిఫలించకపోయినా, పార్టీ విస్తృతికి దోహదం చేసిందని చెప్పాలి.

2023 సెప్టెంబర్‌లో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు విచ్ఛిన్నమైంది. ప్రస్తుతం అన్నాడీఎంకే నేతృత్వంలో ఏర్పాటైన కూటమిలో అన్నా డీఎంకె 32 స్థానాల్లో, డి.ఎం.డి.కె.(దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం) 5 స్థానాల్లో పోటీచేశాయి. ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ  19 స్థానాలు, పట్టలి మక్కల్‌ ‌కచ్చి (పి.ఎం.కె) 10 సీట్లలో పోటీచేశాయి. ఇక ఇండియా కూటమిలో డీఎంకే 21, కాంగ్రెస్‌ 8, ‌వడుత్తలై చిరుత్తైగల్‌ ‌కచ్చి (వీసీకే)2, సీపీఐ+సీపీఎం -2, దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డిఎండికె)-1, ఇండియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లిం లీగ్‌-1 ‌స్థానంలో పోటీచేశాయి. నామ్‌తమిళర్‌ ‌కచ్చి (ఎన్‌టీకే), బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ (బీఎస్‌పీ)లు పుదుచ్చేరిలో పోటీచేశాయి. ఈ మొత్తం స్థానాల్లో 950 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీజేపీ ఈసారి తమిళనాడులో 19 మంది అభ్యర్థులను రంగంలో దించినప్పటికి ఖాతా తెరవలేక పోయింది. డీఎంకే 25.77%, అన్నా డీఎంకే 20.40%, కాంగ్రెస్‌ 10.82% ఓట్ల వాటాలు కలిగి ఉండగా 10.72% ఓట్లతో ఇప్పుడు బీజేపీ నాలుగోస్థానాన్ని ఆక్రమించడం విశేషం.1999లో డీఎంకేతో జట్టు కట్టి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు బీజేపీ 4సీట్లు గెలుచుకున్నా అప్పుడు పార్టీ ఓట్ల శాతం 3.66% మాత్రమే! ఓట్లశాతం పెరగడానికి అన్నామలై కారణం. సంప్రదాయకంగా రెండు ద్రవిడవాద పార్టీల మధ్య పోరుకు పరిమితమైన తమిళనాడులో, బీజేపీ తరపున అన్నామలై (39) కోయంబత్తూరు నుంచి పోటీ చేయడమే కాకుండా, అటు రాష్ట్రంలో, ఇటు దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే డీఎంకే ప్రత్యర్థి గణపతి రాజ్‌కుమార్‌ ‌చేతిలో 1.13446 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో ఒక స్పష్టమైన ముద్ర వేయటానికి దోహదం చేశారు.

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే మూడో పరాజయాన్ని మూటకట్టుకుంది. ఒక్క స్థానంలో కూడా విజయం సాధించకపోవడానికి, బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే ప్రధాన కారణమని ఆ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్నా డీఎంకే బహిష్కృత నాయకుడు పన్నీర్‌ ‌సెల్వం, ఎం.ఎం.ఎం.కె. నాయకుడు టి.టి.వి. దినకరన్‌ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఒకవేళ వీరు గెలిచినట్లయితే అన్నా డీఎంకేను చీల్చి ఉండేవారు. ఇక బీజేపీ నేతలు ఎల్‌.‌మురుగన్‌ (‌కేంద్రమంత్రి), తమిళిసై (తెలంగాణ మాజీ గవర్నర్‌), ‌రాధిక శరత్‌కుమార్‌లు గట్టిపోటీ ఇవ్వడం బీజేపీ రాష్ట్రంలో క్రమంగా బలపడు తోందనడానికి నిదర్శనం. ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో అన్నాడీఎంకే దూసుకుపోగలదని భావించినప్పటికీ ఒక్క సీటు గెలుచుకోలేదు.

డీఎంకే, కాంగ్రెస్‌ అలయన్స్ ‌బీజేపీ వల్ల సమాఖ్య వ్యవస్థ, నాశనం అవుతుందనీ, మైనారిటీ, దళితులకు ప్రమాదమనీ, నీట్‌లో తమిళనాడు విద్యార్థులకు అన్యాయం వంటి వాటిని ప్రధానాంశాలుగా ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ తొమ్మిదిసార్లు ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రధానంగా అవినీతి, కుటుంబపాలనను అస్త్రాలుగా చేసుకొని, ఇప్పటివరకు అవకాశం లభించని తమిళనాడులో ఖాతా తెరవాలన్న లక్ష్యంతో తీవ్రంగా శ్రమించారు. ప్రచారం ముగిశాక వివేకానంద రాక్‌ ‌మెమో రియల్‌లో 45 గంటలు ధ్యానం చేశారు.

 కేరళ

కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 14, ఇం‌డియన్‌ ‌యూనియన్‌ ‌ముస్లింలీగ్‌-2, ‌సి.పి.ఐ (ఎం)1, బీజేపీ-1, కేరళ కాంగ్రెస్‌-1, ‌రివల్యూషనరీ సోషలిస్ట్ ‌పార్టీ -1 స్థానాల్లో గెలుపు సాధించాయి. మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి కాకుండా కేరళ ఎన్నికల్లో బహుముఖ అంశాలు ప్రాధాన్యత వహించాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నికల బాండ్లు, ఇతర వైవిధ్య అంశాలు కేరళ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచాయి. ఇక్కడ సహజంగానే కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యు.డి.ఎఫ్‌, ‌సి.పి.ఎం. నేతృత్వంలోని ఎల్‌.‌డి.ఎఫ్‌.‌ల మధ్య గట్టి పోటీ ఉండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ కాలుమోప డానికి యత్నిస్తోంది.

మళయాళ సినిమా నటుడు, బీజేపీ నాయకుడు సురేష్‌ ‌గోపి త్రిస్సూర్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ.కి చెందిన సునీల్‌ ‌కుమార్‌పై 74,686 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరచి నట్లయింది. సురేష్‌గోపికి 4,12,338ఓట్లు రాగా, సునీల్‌కుమార్‌కు 3,37,672 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి కె. మురళీధరన్‌కు 3,28,124 ఓట్లు వచ్చాయి. సురేష్‌ ‌గోపి త్రిస్సూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా గోపీ పోటీ చేసి దాదాపు మూడు లక్షల ఓట్లు సాధించారు. అప్పుడు యూడిఎఫ్‌ అభ్యర్థి ప్రతాపన్‌ ‌గెలిచారు.

తిరువనంతపురం లోక్‌సభ స్థానంనుంచి కేంద్రమంత్రి రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ 16,077 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శశిథరూర్‌ ఎన్నికవడం ఇది నాల్గవసారి. రాహుల్‌గాంధీ వాయనాడ్‌ ‌స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన 3.24లక్షల ఓట్ల మెజారిటీతో సమీప సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాను ఓడించారు. అలప్పుజా నుంచి కాంగ్రెస్‌ ‌నేత కె.సి.వేణుగోపాల్‌ ‌విజయం (2019లో ఇది ఎల్‌డిఎఫ్‌ ‌గెలిచిన స్థానం) సాధించగా,సీపీఎం అభ్యర్థి మహమ్మద్‌ అరీఫ్‌ ‌రెండో స్థానంలో, బీజేపీ ఫైర్‌‌బ్రాండ్‌ ‌శోభా సురేంద్రన్‌ ‌మూడోస్థానంలో ఉన్నారు.

కేరళలోని మొత్తం 20 స్థానాల్లో 194మంది రంగంలో నిలవగా మొత్తం 71.27% ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో యు.డి.ఎఫ్‌. ‌మొత్తం 19స్థానాలను గెలుచుకోగా, ఎల్‌.‌డి.ఎఫ్‌. ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఎన్నికల్లో నరేంద్రమోడీ కేరళలో అనేకసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాదు, బీజేపీ ఈసారి క్రైస్తవ ఓటర్లపై దృష్టి కేంద్రీకరించింది.

పెరిగిన ఓట్లశాతం

1999 రాష్ట్రంలో పార్టీ ఓట్ల వాటా కేవలం 6.56%గా ఉండేది. 2024 నాటికి అది 10.38%కు పెరిగింది. 2009, 2014, 2019ల్లో వరుసగా 6.31%, 10.33%, 12.93% చొప్పున ఓట్ల వాటాను పెంచుకుంది. ప్రస్తుతం 2024లో ఓట్ల శాతం 16.67%కు పెరగడం గమనార్హం. 2016లో బీజేపీ అభ్యర్థి ఒ.రాజగోపాల్‌ ‌నెమ్మన్‌ అసెంబ్లీ స్థానంలో గెలవడంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారి బీజేపీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత రెండు దశాబ్దాలుగా పరిశీలిస్తే బీజేపీ రాష్ట్రంలో క్రమంగా తన ఓట్ల వాటాను పెంచుకుంటూ రావడం గమనార్హం.

-జమలాపురపు విఠల్‌రావు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE