కళింగ దేశం లేదా ఒడిశాను దర్శిస్తే ఒకటే అనిపిస్తుంది.  పేదరికానికి చిరునామా వంటి కలహండి అక్కడ ఉంది. మొత్తంగా వెనుకబడిన రాష్ట్రమని కూడా చెప్పుకుంటాం. కానీ అక్కడి సాంస్కృతిక సంపద, కళాత్మక దృష్టి, హస్త కళా వైభవం అద్భుతం. ఇదే కళింగవాసులకు ఒక గొప్ప సంస్కారాన్ని నేర్పించిందనిపిస్తుంది. జూన్‌ 13‌న జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇదే ప్రతిఫలించింది. మొదటిసారి అక్కడ భారతీయ జనతా పార్టీ గిరిజన నాయకుడు మోహన్‌చరణ్‌ ‌మాఝి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటలలోనే మంత్రి మండలి మొత్తం పూరీ వెళ్లి జగన్నాథుడికి మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్నది. అలాగే తమ ఎన్నికల హామీ మేరకు జగన్నాథ మందిర నాలుగు ద్వారాలు తెరిపించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ పెద్దలు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, అమిత్‌ ‌షా, జేపీ నడ్డా, నితిన్‌ ‌గడ్కరీ వంటి వారంతా హాజరయ్యారు. వారితో పాటు 24 సంవత్సరాల పాటు ఒడిశాను పాలించిన బిజూ జనతాదళ్‌ ‌నాయకుడు నవీన్‌ ‌పట్నాయక్‌ ‌కూడా హాజరయ్యారు. ఆయనను బీజేపీ నాయకులు సాదరంగా స్వాగతించారు. ఇదొక సత్సంప్రదాయం. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని కాదు. కానీ ఇటీవలి కాలంలో నవీన్‌లోనే ఆ సంస్కారం కనిపించింది. కార్యక్రమం తరువాత ప్రధాని మోదీతో నవీన్‌ ‌కొద్దిసేపు ముచ్చటించారు కూడా. దేశంలోని చాలా ప్రతిపక్షాల మాదిరిగా నవీన్‌ ‌పట్నాయక్‌ ‌కేంద్రంతో లేదా బీజేపీ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకోలేదు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను కొన్నింటిని ఆయన సమర్ధించారు. కొన్ని బిల్లుల విషయంలో వాకౌట్‌ ‌చేశారు కూడా. నిజంగానే నవీన్‌ ‌బీజేడీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంలా వ్యవహరించి, మార్గదర్శకంగా నిలిచింది.

భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ ‌రఘుబర్‌దాస్‌ ‌మోహన్‌చరణ్‌తో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా కనకవర్ధన్‌ ‌సింగ్‌, ‌ప్రభాతి పరిదా ప్రమాణం చేయగా, ఎనిమిది మంది కేబినెట్‌ ‌మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మోహన్‌ ‌చరణ్‌ ఒడిశాకు మూడో గిరిజన ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన హేమానంద్‌ ‌బిస్వాల్‌, ‌గిరిధర్‌ ‌గమాంగ్‌ ‌గిరిజనులే. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మోహన్‌చరణ్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వయసు 52 ఏళ్లు. మోహన్‌చరణ్‌ ‌తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. సర్పంచ్‌గా ప్రజాజీవితం ఆరంభించిన మోహన్‌చరణ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్త. పట్టభద్రుడైన తరువాత సరస్వతీ విద్యామందిర్‌లోనే కొద్దికాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. తరువాత న్యాయవాద వృత్తిలో కొద్దికాలం ఉన్నారు. కేంఝర్‌ ‌శాసనసభ నియోజక వర్గం నుంచి 2000, 2009, 2019, 2024లో వరసగా ఎన్నికయ్యారు. గత శాసనసభలో బీజేపీ సభా పక్ష కార్యదర్శిగా, చీఫ్‌ ‌విప్‌గా పనిచేశారు. ఆయన గతంలో ఎప్పుడూ మంత్రి పదవిలో లేరు.  147 స్థానాలు ఉన్న ఒడిశా శాసనసభలో బీజేపీ 78 స్థానాలు సాధించింది. బిజూ జనతాదళ్‌  51 ‌స్థానాలు గెలిచింది. కాంగ్రెస్‌కు 14 స్ధానాలు వచ్చాయి. ఇతరులు నాలుగు స్థానాలు గెలుచు కున్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో పూరీ జగన్నాథుడి అంశం కీలకంగా ఉందని అనుకోవాలి. ప్రమాణ స్వీకారోత్సవం తరువాత సాయంత్రమే మంత్రి మండలి మొదటి సమావేశం కూడా జరిగింది. 13వ తేదీ నుంచే జగన్నాథ స్వామి మందిరం నాలుగు ద్వారాలు తెరిపించి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ ఎన్నికలలో హామీ ఇచ్చింది. కొవిడ్‌ ‌ప్రవేశించిన తరువాత ఆలయంలోకి ప్రవేశం మీద ఆంక్షలు విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా కూడా తన ఎన్నికల ప్రచారంలో ఈ అంశం లేవనెత్తారు. నాలుగు ద్వారాలను తక్షణమే తెరిపించడంతో పాటు, ఆలయ రక్షణ, సుందరీకరణకు రూ. 500 కోట్ల కార్పస్‌ ‌నిధిని ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే బిజూ జనతా దళ్‌ ‌ప్రభుత్వం మీద విమర్శలు కురిపించి ఇరుకున పెట్టిన జగన్నాథ మందిరం రత్నభాండార్‌ ‌తాళం గురించి మంత్రి మండలి ఏమీ నిర్ణయం తీసుకోలేదు. ఆ తాళం గల్లంతయిందని వార్తలు వచ్చాయి. రత్నభాండార్‌ను 1978లో ఆఖరిసారి తెరిచారు. అయితే 13వ తేదీ ఉదయమే కొత్త ముఖ్యమంత్రి తన మంత్రులతో కలసి జగన్నాథస్వామిని దర్శించి, హారతి ఇచ్చారు. నాలుగు గేట్లను దగ్గర ఉండి తెరిపించారు.

మరొక ఎన్నికల హామీ, 100 రోజులలో చేపట్టే కార్యక్రమంగా చెప్పుకున్న వరికి కనీస మద్దతు ధర పెంపుపై కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు 3.100 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఇచ్చిన సుభద్ర పథకం అమలుకు కూడా మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల కాలవ్యవధిలో చెల్లుబాటు అయ్యే విధంగా రూ. 50,000 చెక్కులను ఇవ్వాలని నిర్ణయించారు.

-జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE