–  డాక్టర్‌ పార్థసారథి చిరువోలు

మద్యం కుంభకోణంలో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తు ఏమిటి? తనకు తాను చెప్పుకుంటున్నట్టు కడిగిన ముత్యంలా బయటకొస్తారా? లేకపోతే విచారణలో మరిన్ని నిజాలు బయటకొచ్చి ఆమెకు ఉచ్చు బిగుసు కుంటుందా? ఓ వైపు ఈడీ విచారణ, రెండో వైపు ఆమె చేస్తున్న న్యాయపోరాటం ఆమెను ఏ గమ్యానికి చేరుస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

కవిత అరెస్టు కావటం అనేది అకస్మాత్తుగా అనుహ్యంగా సంభవించిన పరిణామేం కాదు. గత ఏడాదిగా ఆమె అరెస్టవుతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. మద్యం కుంభకోణంలో, మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను సీబీఐ, ఈడీ విభాగాలు ఇప్పటికే విచారించాయి. మొదట్లో ఆమెను సాక్షిగా విచారించిన అధికారులు తర్వాత ప్రధాన ముద్దాయిగా చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె ఇంటి నుంచి అరెస్టు చేశారు. అంతకు ముందు ఐదు గంటలపాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ‘‘ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, ముంబయి, చెన్నైలతో పాటు 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ.128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశాం’’ అని ఈడీ తన వెబ్‌ సైట్‌లో వివరించింది.

అసలు మద్యం కుంభకోణం ఏమిటి?

2021 వరకూ ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనేది ఆరోపణ. దీనిపై నాటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త విధానం వద్దనుకుని పాత పద్ధతిలోనే వెళ్లాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

2021 నవంబర్‌ నుంచి కొత్త విధానం అమలయింది. ప్రైవేటు సంస్థలకు మద్యం అమ్మే పద్దతి ప్రారంభించడంతోపాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు ఆప్‌ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానంవల్ల గతంకన్నా ఎక్సైజ్‌ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్‌పీ కన్నా తక్కువకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయ దారులకు రాయితీలను అందించింది. వినియోగ దారులకు మేలు కలుగుతుందని పేర్కొంది.

మద్యం రిటైలర్లు, ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్‌పీ కన్నా తక్కువ మద్యం అందుబాటు లోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి.

ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు చోటుచేసుకు న్నాయని పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. దీనితో సీబీఐ విచారణ చేపట్టింది. ఆప్‌ మంత్రి మనీష్‌ సిసోదియా ఇంటిలో సీబీఐ సోదాలు చేసింది. ఆ వెంటనే, దీని వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత హస్తం కూడా ఉందని ఢల్లీి బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇదంతా బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసే కుట్రగా కేసీఆర్‌ తో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు. ‘ఈడీ..మోడీ.. బోడీ’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు.

2022 నవంబర్‌ 29న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. రెండు వేర్వేరు నెంబర్లతో మొత్తం పది మొబైల్‌ ఫోన్లను మార్చారని, డిజిటల్‌ ఆధారాలు ధ్వంసం చేశారని ఆమెపైన ఆరోపణలు వచ్చాయి. అదే ఏడాది డిసెంబరు 11న కవితను ఆరుగంటల పాటు సీబీఐ విచారించింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని మీడియాకు వివరించారు కూడా. గత ఏడాది మార్చి 16, 20, 21తేదీలలో మూడుసార్లు విచారించారు.

ఈడీ ఛార్జిషీటులో కీలకవిషయాలు

కవితను విచారణకు హాజరుకావలసిందిగా ఈడీ నోటీసులు ఇవ్వటం అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో తొలుత ఇండో స్పిరిట్స్‌ సంస్థ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత వరుసగా 11 మంది అరెస్ట్‌ అయ్యారు. సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌ సమయంలో ఈడీ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు ప్రస్తావిం చింది. లిక్కర్‌ స్కాంపై ఈడీ చార్జ్‌ షీట్‌లో అరుణ్‌ పిళ్లై పాత్రపై కీలక సమాచారం ఉంది. కవిత తరపున అరుణ్‌పిళ్లై అన్నీ తానై చూసుకున్నారని, అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో దక్షిణాది నుంచి రూ. వందకోట్లు ముడుపులు ముట్టజెప్పారని వివరించింది. సమీర్‌ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జీషీట్‌లో ఈడీ కవిత పేరును మొత్తం 28 సార్లు ప్రస్తావించింది. సౌత్‌ గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌, బుచ్చి బాబు ఉన్నారు. పిళ్లై సూచనలతో ఇండో స్పిరిట్స్‌ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు కోటి రూపాయలు, ఇండియా ఎహెడ్‌ సంస్థకు రూ.70 లక్షల బదిలీ అయ్యాయి. కవిత ఈ ప్రయోజనాలకు అరుణ్‌ పిళ్లై ప్రాతినిధ్యం వహించారు. తమ తరపున వాస్తవంగా పెట్టుబడి పెడుతున్నవారు కవిత, శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట అని సమీర్‌ మహేంద్రుకు అరుణ్‌ పిళ్లై చెప్పారు.

2021లో ఢిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో విందు ఏర్పాటయ్యింది. అరుణ్‌పిళ్లై ద్వారా, ఫేస్‌ టైంలో సమీర్‌ మహేంద్రు, కవిత మాట్లాడుకున్నారు. ఎల్‌1 దరఖాస్తు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అరుణ్‌ పిళ్లై ద్వారా కవితతో సమీర్‌ మహేంద్రు మాట్లాడారు. ఈ వ్యాపారాన్ని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విస్తరిస్తామని కవిత వెల్లడిరచారని పేర్కొంది.

జనవరి6, 2023న స్పెషల్‌ కోర్టులో ఈడీ రెండో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరును ప్రస్తావించి సమీర్‌ మహేంద్రుతో ఆయన మాట్లాడినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 8న ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 25న సమీర్‌ మహేంద్రు, విజయ్‌ నాయర్‌, దినేష్‌ అరోరా, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, అమిత్‌ అరోరా తదితరుల ఆస్తులను జప్తు చేసింది. ఫిబ్రవరి 26న ఢల్లీిలో హైడ్రామా చోటు చేసుకుంది. మనీష్‌ సిసోడియాను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అదే రోజు సాయంత్రానికి అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటినుంచి మధ్యంతర బెయిల్‌ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావటం లేదు. ఆయన తీహార్‌ జైలులోనే మగ్గుతున్నారు. ఆయనతో పాటు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఆప్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్ఛార్జి విజయ్‌ నాయర్‌ కూడా అరెస్టుకాగా, సంజయ్‌సింగ్‌కు తాజాగా బెయిల్‌ లభించింది.

కవితను అరెస్టు చేయటానికి ముందు, ఆమెతోపాటు మనీష్‌ సిసోడియా, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్ళై, దినేష్‌ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్‌, ఎక్సైజ్‌ శాఖ మాజీ అధికారులు కుల్దీప్‌ సింగ్‌, నరేంద్ర సింగ్‌లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా కవిత, అరుణ్‌ పిళ్లైలని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్‌ స్కాంలో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. మొదటిసారి కవితను విచారించినప్పుడే సాయంత్రం 6గంటలు దాటితే మహిళను విచారించ కూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే రెండోరోజు విచారణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రెండో రోజు మొత్తం 9 గంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. కీలక ఆధారాలు దొరక్కుండా చేయటంలో భాగంగానే మొబైల్‌ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్‌లో సౌత్‌ గ్రూప్‌ పాత్రపై విచారించారని సమాచారం. ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు అప్రూవర్లుగా మారటంతో కేసు అనేక మలుపులు తిరిగింది. కేసులో కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారారు. దీనితో కవితకు ఉచ్చు బిగుసుకుంది.

కేసీఆర్‌ మౌనం వెనక వ్యూహం ఉందా?

అందరిలోనూ ఇదే ప్రశ్న. మద్యం కేసులో కన్నబిడ్డ అరెస్టయి జైలు పాలయినా కేసీఆర్‌ ఎందుకు నోరుమెదపలేదు? బీఆర్‌ఎస్‌ శ్రేణులతో పాటు ప్రత్యర్థి పార్టీల వారినీ ఈ పరిణామం ఆశ్చర్యానికి గురిచేసింది. అరెస్టు సమయంలో ఆయన కవిత ఇంటికి రాలేదు. బహిరంగంగా ఆమెకు దన్నుగా నిలబడ్డానన్న సంకేతాలను ఇవ్వలేదు. కవితకు అండగా సోదరుడు కేటీఆర్‌, సమీపబంధువు హరీష్‌ రావు నిలబడ్డారు.

ఆ తర్వాత వరుస పరిణామాలు సంభవిస్తున్నా, కేసీఆర్‌ ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ స్పందించలేదు. నిజానికి ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీపైన విమర్శలు చేయటం ద్వారా నైతికంగా పార్టీకి ఊపు రావచ్చు. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్‌ ఓడిపోకపోయి ఉంటే, పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా మారకపోయి ఉంటే కవిత అరెస్టయ్యేది కాదనే అభిప్రాయాలూ ఉన్నాయి. రాజకీయంగా దయనీయ మైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సమస్యలు కొనితెచ్చు కోవటం ఎందుకని ఆయన భావించి ఉండొచ్చు. కుంగి కునారిల్లిన దశలో మోదీపైన కత్తులు నూరగలిగిన సత్తా కేసీఆర్‌కు ఉంటుందని చెప్పలేం. ఈడీ విచారణకు హాజరు కావలసిందిగా గత ఏడాది కవితకు నోటీసులు పంపిన సందర్భంలో- ఢిల్లీ వెళుతున్న కవితకు ఫోన్‌ లోనే కేసీఆర్‌ ధైర్యం చెప్పారు. కేసీఆర్‌ చెప్పిన ఈ ఒక్కమాటతో కవిత ధైర్యంగా ముందుకు వెళ్లారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో లేకపోవటం వల్లనో లేక రాజకీయ ప్రాబల్యం తగ్గిపోవటం వల్లనో తెలీదు, ఈ దఫా కేసీఆర్‌ స్పందన బాహ్యప్రపంచం దృష్టికి చేరలేదు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ క్షేత్రపర్యటనలు మొదలు పెట్టారు. మళ్లీ తనను తాను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలలో అనుకూల ఫలితాలు వస్తే కేసీఆర్‌ మళ్లీ దూకుడుగా వ్యవహరిస్తారేమో చూడాలి.

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి ముఖ్య మంత్రి రేవంత్‌ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు కావటం వల్లనే, కవిత అరెస్టు కావటం లేదని ఆరోపించిన రేవంత్‌, తీరా ఆమె అరెస్టయిన తర్వాత నాలిక మడత వేశారు. కేసీఆర్‌ ప్లాన్‌ ప్రకారమే కవిత అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాల్లో ఇదో కొత్త నాటకం అని ఆరోపించారు. ఈ అరెస్టు ద్వారా ఆ రెండు పార్టీలకు రాజకీయ మైలేజి ఉంటుందని, ఉభయులూ పర స్పరం ఒకరికొకరు మేలు చేసుకోవడానికే.. ఇలాంటి సరికొత్త నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు.

కవిత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు

కవిత రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవటం, వంద రోజులు కూడా గడవకముందే పార్టీ బలహీనపడటం ఒక కారణ మైతే, కేంద్రంలో బీజేపీని, మోడీని దూరం చేసుకోవటం, అదే సమయంలో ఇండియా కూటమిలోనూ భాగస్వామి కాకపోవటం వంటి కారణాల వల్ల ఒంటరిపోరాటం తప్పేలా కనిపించటం లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావటంతో, 2014లో కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావటంతో ఆమె రాజకీయ ప్రగతి ఉచ్ఛస్థితికి చేరింది. 2014 నుంచి 2019 వరకూ నిజామాబాద్‌ లోక్‌ సభ స్థానం నుంచి ఎంపీగా వ్యవహరించారు. 2019లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 2020 నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌, అమెరికాలో ఎం.ఎస్‌. చేసిన కవిత వివాహా నంతరం అమెరికాలో ఉద్యోగం చేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రమైన దశలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన తండ్రి కేసీఆర్‌ కు చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రజాఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఏర్పాటుచేసి మహిళలు, యువతలో చైతన్యాన్ని తెచ్చారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా ఏర్పాటయిన నైపుణ్య కేంద్రాలలో దాదాపు 8,500 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారు.

పూలపండగ ‘బతుకమ్మ’కు విశేష ప్రాచుర్యాన్ని కల్పించటంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో బతుకమ్మలు ఏర్పాటు చేస్తున్నారు. మంచి వక్తగా కూడా పేరుతెచ్చుకున్నారు. ఇదంతా గతం. ఇప్పుడు కవిత చుట్టూ మద్యం కేసు ఉచ్చు బిగుసుకుంది. కవిత భర్త, ఆమె బంధువులపై నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఆమె భర్త అనిల్‌ వ్యాపారలావాదేవీలు, సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. తగినన్ని ఆధారాలు లభిస్తే ఓ బృందం నిజామాబాద్‌కు కూడా రావాలని యోచిస్తోంది. దీనితో ఈ కేసు ఇప్పటి కిప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం కనిపించటం లేదు. మరో వైపు కవిత అరెస్టు తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా నిలిచింది. దీని ద్వారా లబ్ధిపొందాలని ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తుంటే, సానుభూతి కోసం బీఆర్‌ఎస్‌ అర్రులు చాస్తోంది. కవిత అరెస్టు కాకపోవటాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకుని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ లబ్ధి పొందింది. మరి రేపటి పార్ల మెంటు ఎన్నికల్లో అది ఏ పార్టీకి ఓట్లు రాలుస్తుందో చూడాలి.

కొన్ని కీలకపరిణామాలు

–      సెప్టెంబర్‌ 4, 2020 న కొత్త లిక్కర్‌ పాలసీ తయారీ కోసం ఎక్సైజ్‌ కమిషనర్‌ నేతృత్వంలోని కమిటీకి డిప్యూటీ సీఎం ఆదేశాలు.

–     జనవరి 5, 2021న లిక్కర్‌ పాలసీ పై సీఎం కేజ్రీవాల్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ. సిసోడియా, సత్యేంద్రజైన్‌, కైలాశ్‌ గెహ్లాట్‌తో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఏర్పాటుకు నిర్ణయం.

–      మార్చి 22, 2021న రెండు నెలల తర్వాత నివేదికను సిద్ధం చేసిన కమిటీ. కేబినెట్‌ మీటింగ్‌లో సమర్పించడంతో దీని ప్రకారమే 2021-22 పాలసీ తయారు చేయాలని ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు కీలక ఆదేశాలు.

–     మే 21, 2021న కొత్త లిక్కర్‌ పాలసీకి కేజ్రీవాల్‌ కేబినెట్‌ ఆమోదం

–     నవంబర్‌ 8, 2021న ఫారిన్‌ లిక్కర్‌ ధరల విషయంలో సంబంధిత అథారిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సెనా ఆరోపణ.

–      జులై 20, 2022న పాలసీలో అన్నీ అవకతవకలు ఉన్నాయని, ఇదంతా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేంచేలా ఉందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేఖ.

–      జులై 22, 2022న లేఖ పరిగణనలోనికి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు.

–     ఆగస్టు 19, 2022న 15 పేర్లతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌.. ఇదే రోజు డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు 25 చోట్ల సోదాలు.

–      ఆగస్టు 22 న ఈడీ ఎంట్రీ, కేసు ఫైల్‌

–      సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌లో ఉన్న అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైకు చెందిన రాబిన్‌ డిస్టలరీస్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ కంపెనీలు.. నివాసంపైనా మొత్తం ఆరుచోట్ల ఈడీ సోదాలు

–      సెప్టెంబర్‌ 17న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు పర్సనల్‌ ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు నివాసం, ఆఫీసులో ఈడీ సోదాలు

–      సెప్టెంబర్‌ 22న మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డినిపై ఈడీ ప్రశ్నల వర్షం.

–      అక్టోబర్‌ 7న ముత్తా గౌతమ్‌ విచారణ, సంబంధింత ఆఫీసుల్లో సోదాలు

–     అక్టోబర్‌ 10న లిక్కర్‌ స్కామ్‌లో సంబంధాలున్నాయని బోయిన్‌పల్లి అభిషేక్‌ను అదుపులోనికి తీసుకున్న సీబీఐ.. అదే రోజు అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటన.

–      అక్టోబరు 12న ముత్తా గౌతమ్‌ అరెస్ట్‌

–      అక్టోబరు 17న డిప్యూటీ సీఎం సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.

–      నవంబరు 10న అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసిన ఈడీ అధికారులు.

–      నవంబరు 14న ఆప్‌కు చెందిన విజయ్‌ నాయర్‌, బోయిన్‌పల్లి అభిషేక్‌ అరెస్ట్‌.

–      నవంబరు 16న దినేశ్‌ అరోరా అప్రూవర్‌గా మారడానికి ప్రత్యేక కోర్టు అనుమతి.

–     నవంబర్‌ 25న ఢిల్లీలోని స్పెషల్‌ కోర్టులో 10వేల పేజీల చార్జిషీట్‌ను సమర్పించిన సీబీఐ

–      నవంబరు 26న లిక్కర్‌ కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఈడీ మొదటి చార్జిషీట్‌.

–      నవంబరు 29న సౌత్‌ గ్రూపులో అమిత్‌ అరోరా కీలక పాత్ర పోషించినట్లు ఈడీ రిమాండ్‌ రిపోర్టు.

–      నవంబర్‌ 29న తొలిసారి కల్వకుంట్ల కవిత పేరు.. రెండు వేర్వేరు నెంబర్లతో మొత్తం పది మొబైల్‌ ఫోన్లను మార్చారని.. డిజిటల్‌ ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు

–      డిసెంబరు 6న విచారణకు రావాలని కవితకు సీబీఐ నోటీసు.

–      డిసెంబరు 11న కొన్ని అనివార్య కారణాలతో సీబీఐ విచారణకు హాజరుకాని కవిత

–     డిసెంబర్‌ 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు కవిత నివాసంలోనే 6గంటలపాటు సీబీఐ విచారణ.

–      ఫిబ్రవరి, మార్చి 2023: నాటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాను సీబీఐ, ఈడీలు అరెస్టు. ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.

–      మార్చి 15, 2024 : హైదరాబాద్‌లో సోదాల అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌

–      మార్చి 21: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.

  • వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram