కొద్దివారాలలోనే జరగుతున్న లోక్‌సభ ఎన్నికల మీద కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా ఆశలు లేవు. ‘ఈసారికి ఇంతే!’ అన్న ధోరణికి హస్తం పార్టీ నేతలు వచ్చేశారు. అందుకే, సీనియర్‌ నాయకులు పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. టికెట్‌ ఇస్తామన్నా వద్దనే అంటున్నారు. అవకాశం ఉన్న నాయకులు ఇతర పార్టీలలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎవరి దాకానో ఎందుకు, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కూడా పార్లమెంట్‌ ప్రవేశానికి కొత్త దారులు వెతుక్కున్నారు. సోనియా గాంధీ రాజ్యసభ దారి, నిజానికి దొడ్డిదారి, ఎంచుకు న్నారు. అందుకు  శతాధిక కాంగ్రెస్‌ చెపుతున్న కారణం సోనియా వయసు, అనారోగ్యం. ఆ కారణాలు కొంత సహేతుకమే అయినా, అసలు కారణం ఓటమి భయమేనని అనుకోవడంలో తప్పులేదు. రాజ్యసభకు అడ్డురాని వయసు, అనారోగ్యం లోక్‌సభకు పోటీ చేయడానికి ఎందుకు వస్తాయి? అదీకాక, గత ఎన్నికల్లో 80 సీట్లున్న యూపీలో కాంగ్రెస్‌ నిలబెట్టుకుంది ఒకే ఒక్క సీటు, రాయ్‌బరేలీ. ఈసారి  ఎన్నికలపై అయోధ్య ప్రభావం బలంగా ఉంటుందని భావిస్తున్న నేపధ్యంలో, ఆ ఒక్క సీటు కూడా కష్టమనే  సంకేతాలు స్పష్టమవుతున్నాయి. గత ఎన్నికల్లోనే రాయ్‌బరేలీ నుంచి సోనియా అతికష్టం మీద గట్టెక్కారు. ఆ తర్వాత జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లోనూ  కాంగ్రెస్‌ అభ్యర్ధులు ఓడిపోయారు. అందుకే సోనియా గాంధీ, ‘సేఫ్‌ రూట్‌’ను ఎంచుకున్నారు. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాహుల్‌ గాంధీ విషయానికి వస్తే, 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అమేథిలో మరోమారు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు భయపడు తున్నారు. అందుకే, మిత్రపక్షం సీపీిఐ వద్దు పొమ్మన్నా  వినకుండా, గత ఎన్నికల్లో గెలిపించి పరువు నిలబెట్టిన, కేరళలోని ‘వాయనాడ్‌’ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సతీమణి, అన్నే రాజపై పోటికి దిగారు. రాహుల్‌ గాంధీ ‘వాయనాడ్‌’ నుంచి పోటీ చేయడాన్ని మిత్రపక్షం సీపీఐ ఎద్దేవా చేయడమే కాదు, అమేథీలో బీజేపీ అభ్యర్ధి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేయాలని సూచన లాంటి సవాలు విసిరింది. రాహుల్‌ గాంధీ తమ ప్రధాన ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధిపై పోటీ చేసి సత్తా చాటుకోవాలే కానీ, మిత్రపక్షంపై పోటీ చేసి సాధించేది ఏమిటని, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా గట్టిగానే చురకలు పెట్టారు. ఇదొక విధంగా, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతగా చెలామణి అవుతున్న రాహుల్‌ స్థాయి నాయకునికి ఇరకాటమే. తలవంపుల వ్యవహారమే. అయినా, రాహుల్‌ అదేమీ పట్టించుకోలేదు. సీపీఐ సవాలును స్వీకరించలేదు. గత ఎన్నికల్లో 50 వేలకు పై చిలుకు  ఓట్లతో తనను ఓడిరచిన బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీతో మరోమారు తలపడే సాహసం చేయలేదు. నిజానికి అదొకటే కాదు…రాహుల్‌ వాయనాడ్‌లో నామినేషన్‌ వేసిన సందర్భంగా ‘ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌’ (ఐయుఎంఎల్‌) మద్దతు కోసం కాంగ్రెస్‌ జెండాలు లేకుండానే ర్యాలీ నిర్వహించారు. ఇదొక సంచలన పరిణామంగా వార్తలకెక్కింది.

రాయ్‌బరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్‌ తప్పుకోవడం ఒక్క ఉత్తరప్రదేశ్‌’లోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పరువు తీసేసింది. ముఖ్యంగా, ముందుగానే కాంగ్రెస్‌ ఓటమి ఖరారు అయిన నేపథ్యంలో తెలంగాణ వంటి రాష్ట్రాలలో  ఏదో ఒక కారణంగా కాంగ్రెస్‌కు ఓటేయాలనుకునే తటస్థ ఓటర్లు మనసు మార్చుకునే ప్రమాదం ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు.

రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి, గాంధీ కుటుంబానికి కంచుకోటలు. మధ్యలో ఒకటి రెండు సందర్భాలు మినహా గాంధీ కుటుంబ సభ్యులే ఈ నియోజక వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అలాంటిది, ఇప్పడు అదే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకులు చెరో దారిన పలాయనం చిత్తగించడం, కాంగ్రెస్‌ దయనీయ స్థితికి దర్పణం పడుతోందని అంటున్నారు. అత్యవసర పరిస్థితి అనంతరం 1977 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌ బరేలీ, అమేథీ నుంచి పోటీ చేసిన తల్లీ కొడుకులు ఇందిరాగాంధీ, సంజయ్‌ గాంధీ ఓడిపోయారు. మళ్లీ ఇప్పడు గాంధీ కుటుంబం మూడో తరం తల్లీ కొడుకులు సోనియా, రాహుల్‌ ఓటమికి భయపడి పలాయనమే చిత్తగించారు. దీంతో, కాంగ్రెస్‌ పరిస్థతి ఏమిటో దేశ ప్రజలకు అర్థమైంది. ఆ ప్రభావం యూపీలోనే కాదు, వెలుపల కూడా ఫలితాలపై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ఇంతవరకు వచ్చిన అన్ని సర్వేలు, ‘ఫిర్‌ ఏక బార్‌ మోదీ సర్కార్‌’ అనే నినదిస్తున్నాయి. సంఖ్య విషయంలో కొంత తేడాలున్నా, కేంద్రంలో బీజేపీ హట్రిక్‌ ఖాయమనే నిర్ణయం జరిగిపోయిందనే విశ్లేషకులు అంటున్నారు. మరోవంక కాంగ్రెస్‌ పార్టీకి  వరసగా మూడవసారి ఓటమితో పాటుగా  సీట్ల సంఖ్య ఇంకా తగ్గి చివరకు ప్రాంతీయ పార్టీల స్థాయికి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

భావ దారిద్య్రం… భాషా దారిద్య్రం 

ఏదో విధంగా బీజేపీ, ఎన్డీఏ సంఖ్యా బలాన్ని తగ్గించేందుకు, తద్వారా తమ ఉనికిని కాపాడు కునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే, కాంగ్రెస్‌ పార్టీ గత వారంలో 2024 సార్వత్రిక  ప్రణాళికను విడుదల చేసింది. ఓట్ల కోసం వరాల జల్లు కురిపించింది. కురువృద్ద పార్టీకి ఇవే తొలి ఎన్నికలు అన్నట్లుగా, ఒక్క అవకాశం ఇస్తే అద్భుతాలుచేసి చూపిస్తామని చిటికెల పందిళ్లు వేసింది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి, 75 ఏళ్లలో అత్యధిక కాలం కాంగ్రెస్‌ పార్టీనే దేశాన్ని పాలించింది. అందులోనూ, మూడువంతులకు పైబడిన కాలాన్ని, గాంధీ కుటుంబం ఒక్కటే పాలించింది. ఈ మొత్తంకాలంలో పంచాయతీ మొదలు పార్లమెంట్‌ వరకు ప్రతి ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలను ప్రకటిస్తూనే ఉంది. హామీలను కురిపిస్తూనే వుంది. ముఖ్యంగా, పేదరిక నిర్మూలన, పేద ప్రజల ఉద్దరణ, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం  లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూ వచ్చింది.పథకాలను ఎరగా వేసి పేద ప్రజల ఓట్లతో అధికారాన్ని హస్త గతం చేసుకుంటూ వచ్చింది.

అదే క్రమంలో 1971లో ఇందిరా గాంధీ ‘గరీబీ  హఠావో.. దేశ్‌ కో బచావో’ నినాదంతో ఎన్నికలలో గెలిచి అందలం ఎక్కారు. ఆ ఐదేళ్లలోనే కాదు, తదనంతర కాలంలో ఇంచుమించుగా ఓ 30 ఏళ్లకు పైగానే కాంగ్రెస్‌  ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయి. అయినా, కాంగ్రెస్‌ ప్రభుత్వాల సుదీర్ఘ పాలనలో పేదరికం పెరిగింది కానీ, తగ్గింది లేదు. నిజానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో పేదరికం దిగివచ్చింది అంటే, అది గత పదేళ్ల బీజేపీ పాలనలోనే.. అవును.. ఈ పదేళ్లలో ఇంచుమించుగా 25 కోట్ల మందికి పైగా భారతీయులు బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారు.

కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న 50 ఏళ్ల పైబడిన కాలంలో ఇచ్చిన హామీల్లో సగం  అమలు చేసినా, దేశ పరిస్థితే కాదు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కాదు. అలాగే, కాంగ్రెస్‌ పార్టీ సక్రమంగా ఇచ్చిన హామీలను అమలుచేసి ఉంటే, ప్రాంతీయ, కుటుంబ పార్టీలు కుక్క గొడుగుల్లా పుట్టుకొచ్చేవే కాదు. అలాగే, ఈరోజున కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాకు అయినా నోచుకోని దౌర్భాగ్య స్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్‌ గతాన్ని వదిలేసి, ఇంతవరకు అధికారం వాసనే తెలియని, పార్టీ అన్నట్లుగా, ఒక్క ఛాన్స్‌ ఇస్తే  అద్బుతాలు సృష్టిస్తామని నమ్మ పలుకుతోంది.

ఇప్పుడు కూడా హస్తం పార్టీ, ‘న్యాయ పత్రం’ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టో మేడిపండులా నిగనిగలాడుతున్నా, లోపల భావ దారిద్య్రం, భాషా దారిద్య్రం పోటాపోటీగా పరుగులు తీస్తున్నాయని సీనియర్‌ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భూమి తనచుట్టూ తానూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు, తన చుట్టూ తాను తిరుగుతూ, రాహుల్‌ చుట్టూ తిరుగుతున్న హస్తం పార్టీ మేనిఫెస్టో, ఆయన అపరి పక్వ, అనాలోచిత ఆలోచనలకు అద్దం పడుతోందనే భావన/భయం పార్టీ వర్గాల్లో వినవస్తోంది.. ఎక్కడివో  ఫోటోలు తెచ్చి పెట్టుకోవడమే కాక, భాషను, భావాలను కూడా ఎరువు తెచ్చుకున్న కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో భావ దారిద్య్రం, భాషా దారిద్య్రం ఒకదానితో ఒకటి పోటీపడినట్లుందని అంటున్నారు.

నిజానికి కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కొత్త విషయం ఏమైనా ఉందా అని తరచి చూస్తే, ఏమీ కనిపించదు. అవే గ్యారెంటీలు, అవే పథకాలు, అవే ఉచితాలు, అవే హామీలు. కర్ణాటక, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కించిన గ్యారెంటీలనే తిరగేసి, మరగేసి మళ్లీ వండి వడ్డించారు. యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులు, అల్పసంఖ్యాక వర్గాలకు న్యాయం చేకూరుస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీఇచ్చింది. అందులో కొత్తదనం లేకపోగా, ‘హస్తలాఘవం’ కళ కొంచెం చాలా ఎక్కువగా ఉట్టి పడుతోందని సీనియర్‌  పాత్రికేయులు, రాజకీయ పండితులు విశ్లేషించారు. నిజానికి, రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ లేదా కాంగ్రెస్‌ సారథ్యంలోని ‘ఇండీ’ కూటమి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఎవరికీ లేదు. అలాగే, ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ అనే విషయంలోనూ ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఎటొచ్చి ‘ఇస్‌ బార్‌.. చార్‌ సౌ పార్‌…’ సాధ్యాసాధ్యాల విషయంలోనే, ఇటు మీడియాలో అటు, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరివరకు ఆసక్తిగా చూసిన సీనియర్‌  జర్నలిస్ట్‌, పొలిటికల్‌ కాలమిస్ట్‌ తవ్లీన్‌ సింగ్‌, ‘ఆ వీక్షణం మహా దుర్భరం’ (It made for dismal watching) అని వ్యాఖ్యానిచ్చారు. అలాగే, కురువృద్ధ కాంగ్రెస్‌ నాయకుల ముఖాలలో ఓటమి, బలహీనత కనిపించాయని అన్నారు. ఆ సందర్భంగా కురువృద్ధ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేసిన వాగ్దానాలు, నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రసంగాల నుంచి ఎత్తుకొచ్చినట్లున్నాయని కూడా ఆమె ఒక పత్రికకు రాసిన వ్యాసంలో విమర్శించారు. ప్రధానమంత్రి ప్రసంగాలలోని పదాలను సైతం మక్కికి మక్కి పట్టుకోచ్చుకోవడం తనను ఆశ్చర్య పరిచిందని తవ్లీన్‌ సింగ్‌ వ్యాసంలో పేర్కొన్నారు. ఉదాహరణకు ప్రధాని మోదీ చాలా కాలంగా తమ ఎన్నికల ప్రసంగాలలో, మోదీకా భరోసా.. మోదీ  గ్యారెంటీ అనే పదాన్ని వాడుతు న్నారు. అదే పదాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఏకరువు పెట్టడం విస్మయ పరిచిందని ఆమె పేర్కొనారు. అన్నిటినీ మించి, కాంగ్రెస్‌ ‘న్యాయపత్రం’లో పొందుపరిచిన అంశాలు భాషా దారిద్య్రంతో పాటు భావ దారిద్య్రానికి అద్దంపడుతోందనే అర్థంవచ్చే రీతిలో తవ్లీన్‌సింగ్‌, భాషతో పాటుగా భావాలను కూడా కాంగ్రెస్‌పార్టీ మోదీ ప్రసంగాల నుంచి కాపీ కొట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచి, తమ దృష్టిలో, ‘యువత, మహిళా, రైతు, పేదలు’  అనే నాలుగే కులాలే ఉన్నాయని చెపుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ ప్రసంగంలో కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోకు.. యువత, మహిళ, రైతు, పేదలు నాలుగు స్తంభాలని  పేర్కొన్నారు. అందుకే ఇలా ఆలోచనలు  భావాలు, పదాలు చివరకు ఫోటోలును కూడా ఎరువు తెచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి, ఏమిటని, కాంగ్రెస్‌ పార్టీలో ఇంతటి భావ దారిద్య్రం.. ఏమిటని  కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు సైతం విచారం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు, ఖర్గే ఉపన్యాసానికి చప్పట్లు కరువయ్యాయి. చివరకు ఆయన, ‘చప్పట్లు కొట్టడం మర్చిపోయారు’.. అని గుర్తు చేయవలసి వచ్చింది. సో .. ఈ పరిస్థితులను గమనిస్తే.. హస్తం పార్టీ చేతులు ఎత్తేసిందనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

  • రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram