కేంద్ర, రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఉచితాల పేరుతో ఇస్తున్న హామీలను అమలు చేయటం సాధ్యమేనా? రాష్ట్ర ఖజానాపైన పడే వేల కోట్ల భారాన్ని భరించగలమా? బడ్జెట్‌ అందుకు అనుమతిస్తుందా? అని ఏ పార్టీ ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. హామీలు గుప్పిస్తూ ఓటర్ల పైన మత్తుమందు చల్లుతున్నాయి. ఎన్నికల్లో గెలవటం, అధికారాన్ని అందుకోవటమే పరమావధిగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందే ఉంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోనే అందుకు రుజువు.

దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనాన్ని తట్టుకోలేక సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో కొత్త హామీలకు తెరతీసింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ విజయానికి ఈ తాయిలాలే దోహదం చేశాయని, వాటి సంఖ్యను మరింత పెంచి లబ్ధి పొందాలని చూస్తోంది. పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారంటీ పేరుతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇందులో ‘నారీ న్యాయ్‌’ విభాగం కింద.. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయల అందచేస్తామని ప్రకటించింది. ‘‘పెహ్లీ నౌక్రీ పక్కి’’ కింద, చదువుకున్న యువకులందరికీ సంవత్సరానికి రూ. 1 లక్ష లేదా నెలకు రూ. 8,500 చొప్పున ఒక సంవత్సరం వేతనంతో కూడిన అప్రెంటిస్‌షిప్‌ను వాగ్దానం చేసింది. వీటితో పాటు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రూ. 5వేల కోట్ల జాతీయ నిధి ఏర్పాటు చేసి స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువ పారిశ్రామికవేత్తలకు జిల్లాల వారీగా సాయం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌, కార్మికులకు సంపూర్ణంగా ఉచిత వైద్యం, ఉపాధిహామీ కూలీలకు రోజుకు రూ.400 ఆర్థిక సాయం, వాళ్లకు జీవితబీమా, ప్రమాదబీమా ఇలా లెక్కలేనన్ని హామీలను గుప్పించింది. ఆర్‌బీఐ చేసిన హెచ్చరికలను కూడా పెడచెవిన పెట్టి, దేశవ్యాప్తంగా పాత పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేస్తామన్న కీలకమైన వాగ్దానం చేసింది. ఈ హామీలను అమలు చేయటానికి రాష్ట్ర బడ్జెట్‌ అనుమతిస్తుందా అన్న అంశాన్ని పట్టించుకోకుండా ఇలా లెక్కకు మిక్కిలిగా హామీలు ఇవ్వటంలో హేతుబద్ధతను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు ద్రవ్యలోటు లక్ష్యాలను అందుకోవటానికి కేంద్రం సతమతమవుతుంటే, దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ఈ తీరుగా హామీలు ఇచ్చుకుంటూ పోవటం అనేది గుదిబండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కుటుంబంలో మహిళకు ఏడాదికి లక్షరూపాయల సాయం చేయటం అనేది ఓటర్లను మభ్య పెట్టటమే అని అభిప్రాయ పడుతున్నారు. (2023లో భారతీయ మహిళల జనాభా 691 మిలియన్లు).

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీలు

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో.. మహిళల్లో కుటుంబ పెద్దకు ఏడాదికి రూ. 10వేల ఆర్థిక సాయం, రూ. 500కి వంట గ్యాస్‌ సిలిండర్‌, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పొందేవారికి లాప్‌ టాప్‌ లేదా ట్యాబ్లెట్‌, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కుటుంబానికి రూ. 15లక్షల వరకూ బీమా.

మధ్యప్రదేశ్‌లో.. రూ. 2లక్షల వరకూ రైతు రుణమాఫీ, నారీ సమ్మాన్‌ యోజన కింద మహిళకు రూ.1500 అలవెన్స్‌, రూ.500కి ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌, ప్రజలందరికి ఉచితంగా రూ. 25లక్షల బీమా.

ఛత్తీస్‌ గఢ్‌.. క్వింటాల్‌కి 3,200 వంతున ధాన్యం సేకరణ, కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, రైతులకు రూ.500 వరకూ ఎల్పీజీ సబ్సిడీ, రైతులకు రుణమాఫీ.

తెలంగాణ.. మహిళలకు ఉచితంగా ప్రజా రవాణా, రూ.500కే వంట గ్యాసు, 200 యూనిట్లవరకూ ఉచిత విద్యుత్తు, అర్హులకు రూ. 4 వేల పెన్షన్‌, రూ.10 లక్షల వరకూ ఉచిత బీమా.

కర్ణాటకలో.. అన్ని కుటుంబాల్లో మహిళా పెద్దకు నెలకు రూ.2వేల ఆర్థిక సాయం (గృహలక్ష్మి), 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు (గృహజ్యోతి), గ్రాడ్యుయేట్‌ యువకులకు నెలకు 3వేలు, డిప్లమో హోల్డర్లకురూ. 1500 వంతున ఆర్థిక సాయం (యువనిధి), నెలకు ప్రతి వ్యక్తికి 10 కేజీల వంతున బియ్యం, మహిళలకు ఉచిత ప్రజారవాణా (శక్తి). ఇందులో ఎన్ని అమలవుతున్నాయో గమనిస్తే వీటిలో డొల్లతనం స్పష్టమవుతుంది.

పైగా ఇన్ని హామీలిచ్చినా ఒక్క కర్ణాటక, తెలంగాణలలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి.

గతంలోకి వెళితే..

ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టటానికి పార్టీలు ‘ఉచితాల’ను ప్రకటించటం కొత్తకాదు.మొన్ననే ముగిసిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చూశాం. తమిళనాడులో డీఎంకే, ఎఐడీఎంకె పార్టీలు అధికారం చేజిక్కించుకోవటానికి పోటాపోటీగా ఓటర్లకు హామీలు గుప్పించటంతో ఈ ఉచితాల సంస్కృతి ప్రబలిందని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఉచిత చీరలు, ప్రెజర్‌ కుక్కర్లు, వాషింగ్‌ మెషిన్లు, కలర్‌ టీవీలు, వీటితో పాటు మహిళలకు 8 గ్రాముల బంగారు తాళిబొట్లను ఎన్నికల తాయి లాలుగా ప్రకటించారు. ఆ తర్వాత ఇతర రాజకీయ పార్టీలు దానిని అనుసరించాయి. 2015 ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉచిత విద్య, ఆరోగ్యం, విద్యుత్తు, తాగునీరు, ఉచిత బస్‌ రవాణా హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఉచిత విద్య, ఆరోగ్యం అనేవి సంక్షేమ చర్యలుగా అందరి ప్రశంసలను అందుకున్నా, ఉచిత విద్యుత్తు, తాగునీరు విషయానికొచ్చేసరికి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఆ తర్వాత పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిస్తే 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు రూ. వెయ్యి వంతున నగదు ఇస్తామన్న హామీతో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, అకాలీదళ్‌ పార్టీలు, బీజేపీలు సోదిలో లేకుండా పోయాయి. రూ.2.82లక్షల కోట్ల అప్పుల భారంతో కునారిల్లుతున్న పంజాబ్‌ రాష్ట్రంలో ఈ హామీలను ఎలా అమలుచేస్తారు? పంజాబ్‌ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్‌ మాన్‌ ప్రధాని నరేంద్రమోదీని కలిసిన తొలిసమావేశంలోనే, రాష్ట్రాన్ని ఆర్థిక భారం నుంచి గట్టెక్కించటానికి తమకు రూ. 50వేల కోట్ల ప్యాకేజీని అందించమని కోరటం కొసమెరుపు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాల ప్రభావం స్పష్టం కనిపించింది. లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను చవిచూసిన అనంతరం అధికార ఎల్డీఎఫ్‌ పార్టీ సబ్సిడీ బియ్యం, ఫుడ్‌ కిట్స్‌ తదితర ఎన్నికల హామీలతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆయా రాష్ట్రాలు అమలుచేస్తున్న ఉచితాల వల్ల ఆర్థికరంగంపైన కలిగిస్తున్న దుష్ఫలితాలను కొందరు ఉన్నతాధికారులు ప్రధాని మోదీ దృష్టికి తీసికెళ్లారు. ప్రధానంగా ఓటర్లకు ఉచితంగా విద్యుత్తును అందించటం వల్ల ఖజానా పై పడే భారాన్ని, అలాగే కీలకంగా భావించే సామాజికరంగాలు ఆరోగ్యం, విద్యలకు బడ్జెట్‌ కేటాయించటం కష్టంఅని వివరించారు. ఎన్నికల కమిషన్‌ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టిని కేటాయించాలని కోరారు.

దాంతో ప్రధాని మోదీ సబ్సిడీలు, ఫ్రీబీలు, రేవ్డీలు.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఈ ‘ఉచితాల’పైన జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఉచిత విద్యుత్‌ వంటివి కాకుండా ప్రయివేటు వస్తువులను ప్రభుత్వం అందించే విధానాన్ని (న్యూవెల్ఫేరిజం మోడల్‌)మోదీ ప్రభుత్వం అనురిస్తుంది. సంపన్నమైన వ్యాపార సంస్కృతి ఉన్న గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా మోదీ అనుసరించిన విధానాలు భిన్నమైనవి. సంక్షేమంపైన కాకుండా రాష్ట్రంలోకి పెట్టుబడులను రప్పించి వ్యాపారం సాగించటంపైన దృష్టిపెట్టారు. హిమాచల ప్రదేశ్‌, కర్ణాటకల్లో పార్టీకి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధానంగా కర్ణాటకలో ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. బసవరాజు బొమ్మై ప్రభుత్వాన్ని గద్దెదించటానికి కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకర్షించాయి. ప్రధానంగా ఉచిత విద్యుత్తు, ఉచిత రేషన్‌, మహిళలకు, యువకులకు ఆర్థిక సాయం వంటి అంశాలను వాటి అమలులో సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా ఓటర్లు అధికారాన్ని కట్టబెట్టారు. ప్రజల సంక్షేమంపైన పూర్తిస్థాయిలో దృష్టి పెడతామని పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి ఇతర పార్టీలను నిలువరించింది. ప్రధానంగా మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో, కనీస మద్దతు ధర ధాన్యానికి రూ. 3,100, గోధుమకు రూ.2,700 ఇస్తానని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రకటించిన రూ.400, రూ.100కి దీటుగా ఈ హామీని ఇచ్చింది. దాంతోపాటు కాంగ్రెస్‌ ప్రకటించిన వివాహితకు నెలకు రూ.1500 వంతున ఇచ్చే నారీ సమ్మాన్‌ యోజనకు దీటుగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లాడ్లీ బెహానా స్కీం మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 1500కు పెంచుతామని, త్వరలో దానిని రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. డిసెంబరు ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో విజయం సాధించి బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆహార ధాన్యాల సబ్సిడీ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించటానికి సిద్ధమైంది. ఇందుకోసం 11.8 లక్షల కోట్లను కేటాయించింది.

ఉచితాలు మంచివేనా?

ఏదైనా ఉచితంగా లభిస్తే ప్రజలు సోమరులవు తారని వారిలో ఉత్పత్తి సామర్థ్యం సన్నగిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇది ఆర్థికరంగంపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ఉంది. ఆర్థికరంగంపైన, రాజకీయ వ్యవస్థలపైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక ప్రభావాలను గురించి చెప్పాలంటే, నగదు బదిలీ, సబ్సిడీ వస్తువులు, సేవలను అందించటంవల్ల ఆయా వస్తువుల వినియోగం అధికం అవుతుంది. తమకు అదనంగా లభించే డబ్బుతో కొనుగోళ్లు పెంచటంతో స్వల్ప కాలంలో ఆర్థికకార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రజల్లో ఆత్మ విశ్వాసం, సెంటిమెంట్‌ మెరుగు పడుతుంది. వినియోగదారులు డబ్బు ఖర్చు పెట్టటం, ఆర్థికాభివృద్ధి సాధ్యపడతాయి. ఉచితాల స్వభావాన్ని బట్టి, కొన్ని పరిశ్రమలు లేదా కొన్ని విభాగాల్లో డిమాండ్‌ అధికం అవుతుంది. దీని వల్ల ఆర్థిక మార్పు సాధ్యం అవుతుంది.

ఈ ఉచితాలు దీర్ఘకాలిక ప్రభావాలను కూడా చూపిస్తాయి. వాటి అమలును కొనసాగిస్తే ప్రభుత్వానికి వ్యయభారం పెరుగుతుంది. దాన్ని సక్రమంగా నిర్వహించకపోతే, బడ్జెట్లో సవాళ్లకు, ఆర్థిక లోటుకు కారణమవుతుంది. అలాగే ప్రజలు ఉచితాలకు అలవాటు పడతారు. శ్రమపడటం అనేది మాయం అవుతుంది. స్వావలంబన, వ్యవస్థాపకత తగ్గుముఖం పడతాయి. తాత్కాలిక ఎన్నికల విజయాల కోసం ప్రభుత్వం ఉచితాలను అమలు చేస్తూ పోతే దీర్ఘకాలికమైన అభివృద్ధి మందగిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా అస్థిరతకు గురవుతాయి.

విద్య, ఆరోగ్యం వంటివి ఉచితంగా అందిం చటం వల్ల పేదలు రాణించ టానికి, ఇతరులతో సమానంగా అవకాశాలు పొందటానికి అవకాశం లభిస్తుంది. నార్వే, డెన్మార్క్‌, జర్మనీ, స్వీడన్‌ లాంటి అభివృద్ధి దేశాలలో విద్య ఉచితంగా లభిస్తుందన్న విషయాన్ని మనం విస్మరించలేం. విద్య వల్ల లభించే ప్రయోజనాలు బహుముఖంగా ఉంటాయి. ఇక ఆరోగ్యం.. బస్తీ దవాఖానాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగటం, పీహెచ్‌ సీలో వసతులు మెరుగుపరచటం వల్ల ఎక్కువ ప్రయోజం కలుగుతుంది.

ఉచితంగా తాగునీరు.. తాగునీరు ఉచితంగా లభించటం వల్ల విచ్చలవిడి వినియోగం, దుబారా పెరుగుతాయి. తాగునీటి వినియోగంపైన పరిమితిని విధించటంతో పాటు భూగర్భజలాలను వృద్ధి చేయటంపైన దృష్టి సారించవలసి ఉంది. ఉచిత విద్యుత్తు అందించటం వల్ల ప్రభుత్వాలపై సబ్సిడీ పెరిగి, అది రాష్ట్రబడ్జెట్‌ పైన తీవ్రమైన ప్రభావం చూపటం మనకు తెలుసు.

2006లో బీహార్‌లో నితీష్‌ ప్రభుత్వం విద్యార్థినులకు సైకిళ్లను అందచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే పథకాన్ని 2008లో ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం, 2011లో పశ్చిమ బెంగాల్లోని సీపీఐ ప్రభుత్వం అమలు చేశాయి. బాలికలకు సైకిళ్లను అందచేయటం వల్ల బీహార్‌లో డ్రాపౌట్ల శాతం తగ్గుముఖం పట్టిందని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఉచితంగా సైకిళ్ల వరకూ మంచిదే. స్కూటర్‌ ఇవ్వటం అనేది ప్రాథమిక అవసరం కిందకు రాదు. అది విలాసం.అలాగే అసోంలో 2010-15 మధ్య మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. 4,656మంది మహిళల స్వావలం బనకు, స్వయంఉపాధికి దోహదం చేసింది. ఢల్లీిలో యోగశాలలు, సీనియర్‌ సిటిజన్లకు తీర్థయాత్ర వంటివి ఉపయుక్తమే, ఆరోగ్యకరమైన కార్యక్రమమే. కానీ ఆర్థికంగా స్థిరత్వం ఉన్న రాష్ట్రాలు ఇలాంటివి అమలు చేయవచ్చు తప్ప బీహార్‌ లాంటి రాష్ట్రాలకు దానివల్ల తలబొప్పి కడుతుంది. మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించటం వల్ల ఉత్పత్తిలో వారి భాగస్వామ్యం పెరిగిందని చెబుతున్నారు.

ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే..

జీడీపీలో 5.9శాతం ద్రవ్యలోటు ఉండాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించు కుంది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని అంటిపెట్టుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఉచితాలు గండికొడతాయని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.  ప్రభుత్వం ఏర్పడిన12 నుంచి 18 నెలల తర్వాత గానీ ఆర్థిక రంగం పై ప్రభావం తెలుసుకోవటం సాధ్యం కాదని అంటున్నారు.2024 ఆర్థికసంవత్సరంలో 11 రాష్ట్రాలు బడ్జెట్‌ అంచనాల దశ (బీఈ) లోనే ద్రవ్యలోటును కలిగి ఉన్నాయి.

– నగదు బదిలీని ఐదు రాష్ట్రాలు అమలు చేస్తుండగా, మధ్యప్రదేశ్‌ మినహా అన్ని రాష్ట్రాలు 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును చూపిస్తున్నాయి. 2023-24లో బడ్జెట్‌ అంచనాలు చూస్తే కర్ణాటకలో గృహలక్ష్మికి రూ.17,500 కోట్లు, మధ్య ప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి లాడ్లీ బహ్నాయోజన అమలుకు రూ. 7,850 కోట్లు, తమిళనాడు కలైంగిర్‌ మగలిర్‌ ఊర్మాయి తొగైకి ఏడు వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌ రూ. 12 వేల కోట్లు గా ఉంది.

– రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులో ఎక్కువ భాగాన్ని ఉచిత విద్యుత్తుకు, సబ్సిడీలకు వెచ్చిస్తున్నారు.

– 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయంలో 83 శాతం రెవెన్యూ కాగా, మిగిలింది మూలధన పెట్టుబడి వ్యయం.

– 53శాతం రెవిన్యూ రసీదులు వడ్డీలు, పెన్షన్‌లు, వేతనాలపైన ఉంటుంది. ఇందులో 28శాతం వేతనాలు, 13 శాతం పెన్షన్లు, 12శాతం వడ్డీరేట్లుకు ఖర్చు చేస్తారు.

 పాత పెన్షన్‌ విధానంతో చిక్కులు

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రముఖ వాగ్దానాల పేరుతో పాత పెన్షన్‌ విధానాన్ని రాష్ట్రాలు అమలు చేయవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు తమ స్థాయిలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని కోరింది. ఆదాయ పెంపును పక్కనబెట్టి అదనపు భారం మోపే పథకాల వైపు మళ్లటం సరికాదని పేర్కొంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ‘‘స్టేట్‌ ఫైనాన్స్‌ ఎ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ ఆఫ్‌ 2023-24’’ నివేదికలో పాత పెన్షన్‌ విధానం అమలుపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే, వాటి ఆర్థిక లోటు ఎన్‌పీఎస్‌తో పోలిస్తే 4.5 రెట్లు పెరుగు తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాత పెన్షన్‌ స్కీమ్‌ ఖర్చుల అదనపు భారం 2060 నాటికి జీడీపీలో 0.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం ఓపీఎస్‌ చివరి బ్యాచ్‌ 2040 ప్రారంభంలో పదవీ విరమణ చేస్తారు. వారు స్కీమ్‌ కింద 2060 వరకు పెన్షన్‌ను అందుకుంటా రని పేర్కొంది. కేంద్ర యూనియన్‌ బడ్జెట్‌ 2023-24లో భాగంగా, ఆర్థిక శాఖ కార్యదర్శి టి.ఎస్‌. సోమనాథన్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్‌ విధానం అమలుపై అధ్యయనం చేయటానికి నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి.

సుప్రీంకోర్టులో..

ఓటర్లను ఇలా ఉచితాలతో ప్రలోభపెట్టటం పైన.. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు హిందూ సేన ఉపాధ్యక్షుడు సుర్జీత్‌ సింగ్‌ సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఇది తీవ్రంగా పట్టించుకోవలసిన అంశం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిరది. 2013లో సుప్రీంకోర్టు ఉచితాలపైన కీలక వ్యాఖ్యలు చేసింది. అది ఎంత మాత్రం లంచం కిందకు రాదని వ్యాఖ్యానించింది. ప్రజాప్రతినిధ్య చట్టం 123 కింద, ఇలా ఉచితాలను ప్రకటించటం ఓటర్లను ప్రలోభపెట్టటమే అని పిటీషనర్‌ అప్పట్లో వాదించారు. ఇప్పుడు ఉచితాలు అంశం మరో మారు తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలకు సంబంధించి అశ్వినీ ఉపాధ్యాయ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సమీక్షించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి. పర్దీవాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన బెంచీ అంగీక రించింది. ఇది ఒక కీలకపరిణామంగా చెప్పుకో వచ్చు.

ప్రభుత్వ నిధులతో ఉచితాలను అమలు చేస్తామని అసంబద్ధంగా ఇస్తున్న హామీలు ఓటర్లపై అనుచితమైన ప్రభావాన్ని చూపుతాయని, స్వేచ్ఛా యుత ఎన్నికల విధానానికి భంగం కలిగిస్తాయని, ప్రతిఒక్కరికి సమాన అవకాశాలు అన్న విధానాన్ని దెబ్బతీస్తాయని పిటీషనర్‌ ఈ వ్యాజ్యంలో అభిప్రాయ పడ్డారు. సుప్రీంకోర్టు బెంచి ఈ అంశంలో ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 – డాక్టర్‌ పార్థసారథి చిరువోలు, సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram