మరొక వివాదాస్పద స్థలంలో సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖకు మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు అనుమతించింది. జస్టిస్‌ ఎస్‌ఏ ‌ధర్మాధికారి,జస్టిస్‌ ‌దేవ్‌నారాయణ్‌ ‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని ధార్‌లో ఉన్న భోజశాల ఆలయం/కమాల్‌ ‌మౌలా మసీదుకు సంబంధించి మార్చి 11న కోర్టు నుంచి ఈ ఆదేశాలు వెలువడినాయి. ఈ కట్టడాన్ని వాగ్దేవి ఆలయం లేదా సరస్వతి ఆలయం అని హిందువులు చెబుతారు. ఇది 11వ శతాబ్దానికి చెందినది. అయితే ఇది మసీదు అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. ఐదుగురు పురావస్తు నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, దాని చేత సర్వే చేయించి ఆరువారాల లోగా నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ కట్టడానికి ప్రార్థనా స్థలాల చట్టం 1991 వర్తించదని, ఇది భారత పురావస్తు శాఖ రక్షణలో ఉన్నదని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌ ‌జైన్‌ ‌తెలియచేశారు. కాశీలోని జ్ఞానవాపి వ్యాజ్యాన్ని కూడా జైన్‌ ‌వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కట్టడం వద్ద పలుసార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గడచిన సంవత్సరం ఇందులో సరస్వతి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడానికి కొందరు ప్రయత్నించి నప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. 1997లో ఈ కట్టడంలోకి హిందువుల ప్రవేశాన్ని జిల్లా యంత్రాంగం నిషేధించింది. 2002లో వసంత పంచమికి తమను లోపలికి అనుమతించాలని ఆందోళనకు దిగిన హిందువుల మీద జిల్లా కలెక్టర్‌ ‌లాఠీచార్జికి ఆదేశించారు. అప్పుడే భోజశాల విముక్తి ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అయితే ఏప్రిల్‌ 7, 2003 ‌సంవత్సరంలో భారత పురావస్తు శాఖ ప్రతి గురువారం ఇక్కడ పూజచేసుకోవానికి హిందువులకు అనుమతి ఇచ్చింది. అలాగే శుక్రవారం నమాజ్‌కు ముస్లింలను అనుమతించింది. 2006లో వసంత పంచమి శుక్రవారం వచ్చింది. దీనితో రెండు వర్గాలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరడంతో ఘర్షణ జరిగింది. అల్లర్లు జరిగాయి. 200 మంది మీద కేసులు పెట్టారు.

About Author

By editor

Twitter
YOUTUBE