మాట ఇస్తే భూమ్యాకాశాలు తల్లకిందులైనా దానిని సాకారం చేయడం అన్నది సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు ఎన్నో కష్టనష్టాలను, అవాంతరాలను ఎదుర్కొన వలసి వస్తుంది. అంత రిస్కు ఎందుకని, రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి మర్చిపోవడమన్నది వారి జన్మహక్కన్నట్టుగా వ్యవహరించడం మనందరికీ అనుభవమే. కానీ, ‘మోడీ కీ గ్యారెంటీ’ మాత్రం అటువంటిది కాదు. గత ఎన్నికల (2019) సమయంలో సిఎఎ (సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ ` పౌరసత్వ సవరణ చట్టం)ని అమలులోకి తెస్తామని ఇచ్చిన హామీని 2024 ఎన్నికలకు పూర్వమే  హోం మంత్రి చేత నోటిఫికేషన్‌ను జారీ చేయించడం ద్వారా నెరవేర్చేశారు.

హోంమంత్రి అమిత్‌షా మార్చి 11వ తేదీన దీని అమలుకు సంబంధించిన నిబంధనల నోటిఫికేషన్‌ను జారీ చేసి సునామీని సృష్టించారు. అంతే, దేశంలో పలు పార్టీల నుంచి హాహాకారాలు మొదలయ్యాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, పార్టీలు, మరోవైపు దేశంలోని రెండవ అతిపెద్ద జనసంఖ్య కలిగిన వర్గం నుంచి ‘ఇది ఘోరం, అన్యాయం’ అంటూ పెడబొబ్బలూ మొదలయ్యాయి. కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్‌ వంటి వారు అయితే, తమ రాష్ట్రంలో సీఏఏని అమలు చేయమని ప్రకటించి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఎందుకంటే, పౌరసత్వమనేది దేశానికి సంబంధించింది తప్ప, ప్రాంతీయమైనది కాదు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నా మనం భారతీయ పౌరులం తప్ప తెలంగాణ పౌరులం, ఆంధ్ర పౌరులం లేదా యుపి పౌరులం కాదు, ఆ ప్రాంత వాసులం అంతే.

భారతదేశ చరిత్రలో మార్చి నెలకి ప్రత్యేక స్థానముంది. భారతదేశాన్ని విభజించేందుకు నియమించిన లార్డ్‌ మౌంట్‌ బ్యాటెన్‌ 24 మార్చిన వైస్రాయ్‌గా తన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన భారత్‌ చేరుకోకముందే, విభజన కోసం నాటి తాత్కాలిక ప్రభుత్వాన్ని రాజీనామా చేయమని మౌంట్‌ బాటెన్‌ కోరనున్నారంటూ సింగపూర్‌ నుంచి ప్రచురితమైన ‘ఇండియన్‌ డైలీ మెయిల్‌’ వంటి పత్రికలు పలు ఆంగ్ల పత్రికలు మార్చి 11, 1947న కథనాలను ప్రచురించాయి. సంవత్సరం వేరైనా అదే తారీకున సీఏఏ నిబంధనలు వెలువడడం యాధృచ్ఛికమా? లేక బీజేపీ ప్రభుత్వం కావాలని ఆ పని చేసిందా? అది మన ఊహకి అందని విషయం. ఏది ఏమైనా, 150కి పైగా క్రైస్తవ దేశాలు, 50కి పైగా ఇస్లామిక్‌ దేశాలు ఉన్న ఈ పృధ్వి మీద హిందువులు మాది అని చెప్పుకునేందుకు ఉన్న ఏకైక దేశం భారతదేశం. ఆ రకంగా చూస్తే, ప్రపంచంలో హిందువులు మైనార్టీలే. వారిపై జరుగుతున్న అరాచకాల నుంచి కాపాడే నైతిక బాధ్యతను ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌ స్వీకరించింది. అంతే తప్ప ఇక్కడ మైనార్టీలుగా చెప్పుకునే ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కాదు. ఈ విషయాన్ని వారు అంగీకరించి తీరవలసిందే.

ముఖ్యంగా, ఒకనాడు భారత దేశంలో భాగంగా ఉండి, తర్వాత విడిపోయి, చరిత్ర కాలగతిలో అతి యువ దేశాలుగా ఉన్న పాక్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులపై జరుగుతున్న హింస సాధారణమైంది కాదు. ఒకవైపు భారత దేశంలో మైనార్టీలుగా చెప్పుకునే ఇస్లామిస్టుల సంఖ్య రెట్టింపు అవుతుంటే, ఆ దేశాల్లో మైనార్టీలైన హిందు, బౌద్ధ, పార్శీల సంఖ్య అత్యల్పం అయినట్టు వారు అప్పుడప్పుడు విడుదల చేసే గణాంకాలు చెప్తున్నాయి. హిందువులపై దాడులు చేయడం, వారి ఆడపిల్లలను పిన్నవయస్సులో బలవంతంగా ఎత్తుకువెళ్లి ముల్లాలు, మౌల్వీలు వివాహం చేసుకొని వారి మతం మార్చేయడం, వారి డిమాండ్లను తిరస్కరించిన మైనార్టీలపై ‘దైవనింద’ అన్న నేరాన్ని మోసి అక్కడి మతోన్మాద మూకలు వారిని హతం చేయడం, అందుకు అక్కడి న్యాయవ్యవస్థలు మద్దతునివ్వడం, అన్నీ ప్రపంచం కళ్లముందు జరుగుతున్నవే. భారత్‌లో ఇస్లామిస్టులకు చీమకుట్టినా వారికేదో అన్యాయం జరిగిపోయిందంటూ ఉద్యమాలు చేసే మానవ హక్కుల కార్యకర్తలు కానీ, వామపక్ష వాదులు కానీ వారి విషయానికి వచ్చేసరికి మూగనోము పట్టేస్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తెచ్చి, అమలు చేస్తానని హామీ ఇచ్చింది, దానిని నిలబెట్టుకుంది.

ఇంతకీ అసలు సీఏఏ ఏమిటి?

భారతదేశాన్ని విభజించినప్పుడు పాకిస్తాన్‌లో, ఆఫ్ఘానిస్తాన్‌ తర్వాత ఏర్పడిన బాంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉండిపోయిన, ప్రధానంగా ముస్లిమే తరులు అయిన హిందూ, బౌద్ధ, సిక్కు, పార్శీ, క్రైస్తవులు తొమ్మిది రాష్ట్రాలు అయిన గుజరాత్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, పంజాబ్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢల్లీి, మహారాష్ట్రలలో నమోదు లేదా నాచురలైజేషన్‌ (ఇక్కడ ఎక్కువకాలం నివసించడం లేదా జన్మించడం) ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని పొందేందుకు 1955 పౌరసత్వ చట్టం ఆమోదిస్తుంది. కాగా, 2019లో పార్లమెంటు ఆమోదించిన ఈ సవరణ చట్టం ప్రకారం డిసెంబర్‌ 31, 2014 కంటే ముందు పొరుగు దేశాలలో హింసను భరించలేక భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవ మైనార్టీలకు భారత్‌ పౌరసత్వాన్ని ఇస్తుంది. అర్హులైన వ్యక్తులకు పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియలో పాటించవలసిన నియమాలను నిర్దేశిస్తూ మార్చి 11, 2024న జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పవచ్చు.

ఈశాన్యం, గిరిజన ప్రాంతాల మినహాయింపు

 హోం మంత్రి అమిత్‌ షా సీఏఏ నోటిఫికేషన్‌ జారీ చేసిన మరురోజే, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మిజోరాం, మణిపూర్‌ సహా స్వయంప్రతిపత్తి కలిగిన అస్సాం, త్రిపుర, మేఘాలయ మండళ్ల వంటి ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ (రక్షిత ప్రాంతాలలో పర్యటించేందుకు భారత పౌరులకు ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రాలు) అవసర మయ్యే రాష్ట్రాలలో సీఏఏ అమలును మినహాయిస్తు న్నట్టు ప్రకటించారు. స్థానిక తెగల హక్కులను పరిరక్షిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకున్నారు.

రాజ్యాంగం ఆరవ షెడ్యూల్‌, దాని అంశాలలో పొందుపరిచిన, ప్రత్యేకంగా ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ వంటి వాటి ద్వారా స్థానిక తెగల హక్కుల పరిరక్షణ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. ఈ వ్యూహాత్మక చర్య ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక జనాభాను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య జాతీయ విధానం, ప్రాంతీయ గుర్తింపు మధ్య సమతుల్యతను సాదిస్తుంది.

గతంలో ఏం జరిగింది

డిసెంబర్‌ 2019లో సీఏఏని పార్లమెంటు ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి దానిపై ఆమోద ముద్ర వేసిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో భారీగా హింసాత్మక నిరసనలు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఢల్లీిలోని షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో 69 రోజులపాటు ముస్లిం మైనార్టీల పౌరసత్వానికి భంగం కలుగుతుందంటూ మతోన్మాద శక్తుల ప్రేరణతో ‘ఆందోళన జీవులు’ ఢల్లీిని దిగ్బంధనం చేశాయి. వీరికి జార్జ్‌ సోరోస్‌ వంటి భారత విరోధుల నుంచి నిధులు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ అండా లేకుండా సాధారణ జనం మూడు నెలల కాలానికిపైన నిరసన ప్రదర్శనలలో కూర్చోవడం అన్నది సాధ్యం కానిపని. ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సి), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మూడూ కూడా ముస్లిం వ్యతిరేకమంటూ వారు షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో తమ అడ్డాను ప్రారంభించి, ఢల్లీి ప్రజలకు చుక్కలు చూపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో సుమారు 100మందికి పైగా వ్యక్తులు మరణించారు.

ఈ చట్టాన్ని అనుమతిస్తే ముస్లింల పౌరసత్వం రద్దవుతుందనే ప్రచారం భారీ స్థాయిలో ఆ సందర్భంగా చేశారు. అందుకు కారణం లేకపోలేదు, సరైన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా చొరబడిన రొహింగ్యాల వంటివారిని వారి దేశాలకు తిప్పి పంపాలన్న ప్రభుత్వ ఆలోచన మన మైనార్టీలకు వెన్నులో వణుకు పుట్టించిందన్న మాట. అందుకే, అక్రమం, సక్రమంతో పని లేకుండా ముస్లింలందరూ బాధితులవుతారనే ప్రచారానికి దేశ వ్యతిరేక శక్తులు పూనుకున్నాయి.

ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌, సిఎఎలు అంటే ఏమిటి?

భారతదేశం స్వాతంత్య్రం సాధించిన తర్వాత 1951లో తొలిసారి చేపట్టిన జనగణన సందర్భంగా ప్రతి గ్రామంలోని ఆవాసాలను ఒక క్రమపద్ధతిలో చూపుతూ, వాటి పక్కన అందులో నివసించే వారి పేర్లు, సభ్యుల సంఖ్య వేసి తయారు చేసిన పౌరుల జాతీయ రిజిస్టర్‌ ఎన్‌ఆర్‌సి. దీనిని కేవలం 1951లో మాత్రమే ప్రచురించారు. కాగా, తర్వాత ఎన్‌ఆర్‌సి అన్నది ఒక్క అస్సాం రాష్ట్రంలో మాత్రమే అమలవు తున్నది. బంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో నివసిస్తున్న అక్రమ చొరబాటుదారులను గుర్తించి, వారిని వారి దేశానికి తిప్పి పంపేందుకు రూపొం దించి, అమలు చేసిన జాబితా ఇది. కాగా, తర్వాత దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న వాదనలు వినిపించాయి.

అయితే, 2021 జనాభా లెక్కల తొలి దశలో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌)ను పౌరసత్వ చట్టం, 1955 కింద తాజాపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌పిఆర్‌ను నమోదు చేసేటప్పుడు ప్రతి కుటుంబం, వ్యక్తి, నివసిస్తున్న ప్రాంతం సహా వివరాలను సేకరించి, ఎన్‌పిఆర్‌ను తాజాపరచాలని భావించారు. కాగా, కొవిడ్‌`19 మహమ్మారి కారణంగా ఎన్‌పిఆర్‌ను తాజా పరచడం, తత్సంబంధిత క్షేత్ర కార్యకలాపాలను వాయిదా వేయడం జరిగింది. ఈ ప్రక్రియే పలు రాష్ట్రాలలో అక్రమంగా చొరబడిన రొహింగ్యాలు, ఇతర ముస్లిం జనాభాకు గొంతులో పచ్చి వెలక్కాయ అయింది. అందుకే, దీనికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభ మయ్యాయి. నిన్న మొన్న మణిపూర్‌లో జరిగిన అల్లర్లు, ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్రమ చొరబాటుదార్లను తిరిగి బర్మా పంపిస్తున్న తీరు, సరిహద్దులలో కంచెలు వేయడాలు వంటివన్నీ కూడా అది చొరబాటుదారుల అడ్డా అయిందనే విషయాన్ని పట్టి చూపుతున్నాయి.

దరఖాస్తుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ సిద్ధం

సీఏఏ చట్టాన్ని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేయడం ద్వారా అమలులోకి తీసుకువచ్చినప్పుడు, అర్హులైన వ్యక్తులు భారతీయ పౌరసత్వం పొందేందుకు ఇది వీలు కల్పిస్తుందని, హోం శాఖ అధికారులు పేర్కొన్నారు. ‘‘నిబంధనలు సిద్ధం చేశాం, మొత్తం ప్రక్రియ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేశాం, దీనిని డిజిటల్‌గా నిర్వహిస్తాం. దరఖాస్తు దారులు ఎటువంటి ధృవీకరణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించిన సంవత్సరాన్ని వెల్లడిస్తే చాలు. దరఖాస్తుదారుల నుంచి ఎటువంటి అదనపు డాక్యుమెంటేషన్‌ అవసరం లేదు,’’ అంటూ వారు వివరించారు.

గత డిసెంబర్‌ 27వ తేదీనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సీఏఏను నిలుపుదల చేయలేమని, ఇది దేశన్యాయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆయన చేశారు. కాగా, గత రెండేళ్లలో పౌరసత్వ చట్టం 1955 కింద, ఆఫ్ఘనిస్తాన్‌, బాంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ నుంచి వచ్చే ముస్లిమేతరులకు తొమ్మిది రాష్ట్రాలలో భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు 30మంది జిల్లా మేజిస్ట్రేట్‌లు, హోం కార్యదర్శులకు అధికారం ఇచ్చారు. అయితే, రాజకీయంగా సున్నిత ప్రాంతాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్‌ జిల్లాలోని అధికారులకు పౌరసత్వాన్ని మంజూరు చేసే అధికారం ఇవ్వకపోవడం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికలు జరుగబోయే ముందు నోటిఫికేషన్‌ను జారీ చేయడం ద్వారా అక్రమ చొరబాటుదారులు ఒకప్పటిలా బయటకు వచ్చి నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి రానివ్వకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, సరిహద్దు రాష్ట్రాల ఓటింగ్‌ తీరును బట్టి దీని ప్రభావం ఎంత ఉందో చెప్పవచ్చు.

About Author

By editor

Twitter
YOUTUBE