తెలంగాణ ఆవిర్భావం తర్వాత దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన అప్పటి ఉద్యమకాలం నాటి తెలంగాణ రాష్ట్రసమితి..నేటి భారత రాష్ట్రసమితి పార్టీకి గడ్డుకాలం దాపురించింది. కనీసం కలలో కూడా ఊహించని రీతిలో ఆ పార్టీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఆ  పార్టీ వింత సమస్యను ఎదుర్కొంటోంది. రెండు పర్యాయాలు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ తరపున  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులు విముఖత చూపిస్తున్నారు. ఈ పరిణామం గులాబీ పార్టీ పెద్దలను కలవర పరుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిట్టింగ్‌ ఎంపీలు తిరిగి పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. వారిని బుజ్జగిస్తున్నా.. కొందరు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దీంతో.. ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో తప్ప ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. మిగిలిన 13 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో పడడం, ఇప్పటికిప్పుడు ఓటర్ల వైఖరిలో మార్పు వచ్చే అవకాశం లేకపోవడం, చాలాచోట్ల బీఆర్‌ఎస్‌ ఓటమితో క్యాడర్‌ చేజారడం, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ నడుమే ఉంటుందనే సంకేతాలతో బీఆర్‌ఎస్‌లోని ముఖ్యనేతలు ఎంపీ స్థానాలపై ఆశలు వదిలేసుకుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఖర్చును అభ్యర్థులే భరించాలని బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ స్పష్టం చేస్తుండడం కూడా లీడర్ల విముఖతకు కారణంగా భావిస్తున్నారు.

 జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్‌ఎస్‌ కు పార్లమెంట్‌ ఎన్నికలు సవాల్‌గా మారుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు నిరాశ పరచినా, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోన్న గులాబీ దళానికి, ఆదిలోనే హంసపాదు ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు బీఆర్‌ఎస్‌ పార్టీని వీడారు. ఒకటి రెండు రోజుల్లో ్ల మరో ముగ్గురు ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం సాగుతోంది.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం గట్టి పోటీ నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం టికెట్‌ వచ్చినా.. పోటీ చేసే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ముఖ్యంగా చేవెళ్ల సిటింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి పోటీకి నో అంటున్నట్లు సమాచారం. దాంతో ఆ స్థానం నుంచి కాసాని వీరేశం.. లేదా సబితారెడ్డి తనయుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రంజిత్‌రెడ్డి బాటలోనే దక్షిణ తెలంగాణలో ఓ సిటింగ్‌ ఎంపీ కూడా పోటీకి విముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని సమాచారం. మహబూబాబాద్‌ సిటింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత కూడా ఈసారి పోటీకి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ 3 చోట్ల, కాంగ్రెస్‌, బీజేపీ చెరో రెండు చోట్ల గెలిచాయి. కానీ, రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ చతికిలపడిరది. క్యాడర్‌ సైలెన్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోగా, మాజీ ఎమ్మెల్యేలు సహా నాయకులెవరూ బయటకు రావట్లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ కవిత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌ గుప్తాను పోటీకి ఒప్పించేందుకు హైకమాండ్‌ ప్రయత్నిస్తున్నా వారు ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ టికెట్‌ కోల్పోయిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు భువనగిరి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ భువనగిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం జనగామలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలవడంతో ఆయన మనసు మార్చుకున్నారు. అందుకే గెలుపు అవకాశాలున్న మల్కాజిగిరి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ముత్తిరెడ్డి అనుచరులు చెప్తున్నారు.

మరోవైపు.. తమ కుమారులను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించి రాజకీయంగా వారి భవిష్యత్‌కు బాటలు వేద్దామని ఆలోచించిన పలువురు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట తప్ప 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలవడంతో ఎంపీ ఎన్నికల్లో పోటీకి అక్కడి బీఆర్‌ఎస్‌ నేతలు వెనుకంజ వేస్తున్నారు.

మునుగోడు నుంచి టికెట్‌ ఆశించి, భంగపడిన గుత్తా సుఖేందర్‌ కొడుకు అమిత్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తామని అప్పట్లో బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ హామీ ఇచ్చింది. కానీ, మారిన పరిస్థితుల్లో ఆయన కూడా పోటీకి విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నల్గొండ నుంచి బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం లేనందున, తన కొడుకును బరిలో దింపితే అతని పొలిటికల్‌ కెరీర్‌కే ప్రమాదమని గుత్తా భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. అదే సమయంలో అమిత్‌కు చెక్‌ పెట్టేందుకు హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేరును మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

నాగర్‌ కర్నూల్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ రాములు.. ఈసారి తాను తప్పుకొని తన కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్‌ ప్రసాద్‌ను బరిలో నిలపాలని ఆశించారు. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లకు ఐదు సెగ్మెంట్లు కాంగ్రెసు ఖాతాలో పడడంతో ఆయన తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ సమయంలో భరత్‌ను బరిలో దింపితే రాజకీయ ఆత్మహత్యే అవుతుందని ఆయన భావించారు. ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారు. అంతటితోనూ ఆగలేదు. ఇటీవలే బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ నుంచి తన కుమారుడికి నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఇప్పించుకున్నారు.

మరోవైపు గత పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ఎంపీ స్థానానికి కంచుకోటగా ఉన్న జహీరాబాద్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ దిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జహీరాబాద్‌ టికెట్‌ను ఆయనకే ఇచ్చింది. ఇది అక్కడ స్థానిక నేతలు, కార్యకర్తలకు నచ్చలేదు. అయినా బీజేపీ అధిష్ఠానం బీబీ పాటిల్‌కే టికెట్‌ కేటాయించింది.

పార్లమెంట్‌ స్థానాల్లో పెద్దపల్లి పేరు చెప్తేనే బీఆర్‌ఎస్‌ నేతలు జంకుతున్నారు. కారణం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకోవడమే.ఆ నియోజకవర్గం పరిధిలో ఏకంగా 56శాతం ఓట్లు రాబట్టిన కాంగ్రెస్‌, ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఆరింటిని గెలుచుకున్న బీఆర్‌ఎస్‌ అదే ఊపులో 2019లో ఈ సీటును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అదే ఊపు కాంగ్రెస్‌లో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేష్‌ నేత కాంగ్రెస్‌పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే పోటీకి రెడీ కావాలని ఇటీవల బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ పలువురు నేతలకు సూచించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో, బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఇటీవల ధర్మపురి నుంచి పోటీచేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కొప్పుల ఈశ్వర్‌ పేరును ఖరారు చేసింది.

అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తల బొప్పికట్టిన బీఆర్‌ఎస్‌కు సిట్టింగ్‌ ఎంపీలు గండి కొడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. కొందరు సిట్టింగ్‌ ఎంపీలు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం గులాబీ పార్టీ నేతలను టెన్షన్‌ పెడుతోంది. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఖరారైంది. ఇరుపార్టీలు.. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నాయి. మార్చి ఐదోతేదీ ఉదయాన్నే.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

కాంగ్రెస్‌, బీజేపీలను ఎదుర్కొనేందుకు.. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇరు పార్టీల పొత్తు ఖరారైంది. తెలంగాణను కాపాడేందుకే ఈ పొత్తు పెట్టుకున్నట్టు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ భేటీ తర్వాత మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఈ లోక్‌ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయంలో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ఆర్‌ఎస్పీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నట్టు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐపీఎస్‌ అధికారిగా తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి మొదలు.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. అడుగడుగునా బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తూనే వచ్చారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధివిధానాలను ఎండగడుతూనే వచ్చారు. అంతేకాదు.. ప్రగతిభవన్‌ గడీలను బద్దలు కొడదామని, ఏనుగు ఎక్కి ప్రగతిభవన్‌కు వెళ్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కేసీఆర్‌తో దోస్తీ కట్టడం చూసి.. రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలను ఎదుర్కోవాలంటే.. బీఆర్‌ఎస్‌తో ఒంటరిగా సాధ్యమయ్యే పని కాదన్న నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారని.. అందుకే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్టుగా చర్చ నడుస్తోంది.ఈ పొత్తుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE