సంపాదకీయం

శాలివాహన 1945 శ్రీ శోభకృత్‌  మాఘ బహుళ విదియ – 26 ఫిబ్రవరి 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‘‘కాంగ్రెస్‌ ఎంత నిరాశలో ఉందంటే, సైద్ధాంతిక, సూత్రప్రాయమైన వాదనలతో వ్యతిరేకించే సాహసం కూడా దానికి లేకుండా పోయింది. అందుకే మోదీపై తప్పుడు ఆరోపణలుచేయడం, నిందలు వేయడమే వారి అజెండాగా మారింది,’’ అన్న విశ్వసత్యాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నేటి ప్రతిపక్షాలకు పట్టిన దుస్థితిని  ఎత్తి చూపడం వెనుక ఉన్నది ఆవేదనే తప్ప ద్వేషం కాదు. విపక్షం చతికిల పడడం ఎంత ప్రమాదమో గుర్తు చేయడం కూడా. దేశ పురోగతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేసేటప్పుడు వారు చేస్తున్న సానుకూల పనులకు సహకరిస్తూ, సమంజసం కాని వాటిని పట్టిచూపే ప్రతిపక్షం ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం దేశంలో విలసిల్లుతుంది. నేడు ఆ పరిస్థితి లేకుండా ప్రతిపక్షాలు చేస్తున్నాయన్న విషయం జగమెరిగిన సత్యం.

పరిస్థితులకు అనుగుణంగా మారకుండా, క్షేత్రస్థాయిలోని సమస్యలను అర్థం చేసుకోకుండా, దేశాన్ని ప్రేమించకుండా కేవలం అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా పాలిస్తే దేశం ఎలా ఉంటుందో మనం 2014కు ముందు చూశాం. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ పురోగతి కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేస్తే వాటిని సాధించవచ్చో చేసి చూపించింది. రాజకీయం చేయడం, ప్రభుత్వాన్ని నిర్వహించడం అనేవి ఎంత క్రమశిక్షణ, బాధ్యతతో కూడినవో తెలుసుకొని, తమను తాము మెరుగుపరచుకోవడానికి బదులుగా, ప్రతిపక్షాలు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు ధరలోన సుమతీ అన్నట్టుగా వ్యవహరించడం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి హాని కలిగించే పరిణామమే. అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తూ, తమ విధానాలలోని తప్పులను వెతుక్కుని సవరించుకోవలసి వస్తున్న పరిస్థితి నేడు ఉండడం గమనార్హం. వీటన్నింటినీ మించి  ప్రజల మధ్య అంతరాలను ఆసరాగా చేసుకుని దేశాన్ని చీల్చాలని  ప్రతిపక్షాలు అనుకుంటూ ఉంటే,  కాదు ప్రజలంతా భారతీయులేనంటూ వారిని ఐక్యం చేసే బాధ్యతను అధికార పార్టీ స్వీకరించడం వల్ల ప్రస్తుతం దేశంలో ఈ మాత్రమైనా శాంతి కొనసాగుతోంది.

త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు దేశంలో సృష్టిస్తున్న అరాచక పరిస్థితులు హేయమైనవి. ఒకవైపు అధికార పక్షం, 2047 నాటికి ‘వికసిత భారత్‌’ను సాధించాలని, రాత్రింబవళ్లు కష్టపడుతుంటే, మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలాలు లబ్ధిదారులకు అందకుండా చేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. భాజాపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన మోదీ, పార్టీ కార్యకర్తలు ఈ వంద రోజులూ రెట్టించిన ఉత్సాహంతో, విశ్వాసంతో సమాజంలోకి చొచ్చుకుపోయి, తొలిసారి ఓటర్ల దగ్గర నుంచి, అన్ని రంగాలను, సమాజాలను ఐక్యం చేసేందుకు సిద్ధం కావలసిందిగా మొదటిసారి పిలుపివ్వడం వెనుకనున్న కారణమిదే. గతంలోకన్నా అత్యధిక స్థానాలను సాధించి, దేశాన్ని సేవించాలంటే మన సామూహిక కృషి ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం అత్యవసరం అన్న ఆయన మాటలు అధికారం పట్ల ఆశతో కాక దేశ భవిష్యత్తు పట్ల ఆందోళనతో అన్నవే.

 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు యువత ఎలాంటి సంకల్పాలను, స్వప్నాలను కలిగి ఉండాలో చెప్పి వారికి మార్గ దర్శనం చేశారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీయే తిరిగి అధికారంలోకి రావడం తప్ప మరొక మార్గం లేదు. అది ఉచితం, ఇది ఉచితం అంటూ ప్రతిపక్షాలు హామీలు ఇవ్వగలదే తప్ప నిర్దిష్టకాలంలో వికసిత భారతాన్ని సాధిస్తామన్న హామీ ఎవరూ ఆత్మవిశ్వాసంతో ఇవ్వలేరన్న ప్రధాని మోదీ మాటలు అక్షరసత్యాలు. ముఖ్యంగా, నేటి యువత తమ తరంలో భారత్‌ అంతర్జాతీయంగానే కాదు దేశీయంగా కూడా సాధిస్తున్న విజయాల పట్ల గర్విస్తున్నది. అందుకే ప్రధాని ఇప్పటికే ప్రతి క్షేత్రంలోనూ భారత్‌ సాధించిన విజయాలు దేశ ప్రజలను మరింతగా ఐక్యం చేశాయని, ఇది అభివృద్ధి చెందిన భారత్‌ సంకల్పమని అంటూ, నేడు దేశం చిన్న స్వప్నాలను, సంకల్పాలను చేయలేదనే విశ్వాసాన్ని వ్యక్తం చేయడం వెనుక ఉన్న ఆయన కృషిని, ఆత్మవిశ్వాసాన్ని విస్మరించలేం.

పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పార్టీ వ్యక్తిగతంగా 350 స్థానాలను మించి కైవసం చేసుకుంటుందని, ఎన్డీయే లెక్క 400లు దాటుతుందని ప్రకటించినప్పటి నుంచీ దేశంలో పలుచోట్ల చేసుకుంటున్న హింసాత్మక ఘటనలను చూస్తున్నాం. అయితే, ప్రస్తుతం ప్రజలు కూడా వాటిని ఆ రాష్ట్ర సమస్యలుగా చూస్తూ, అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో గమనిస్తూ, అంచనాలు వేసుకొని, ఒక అవగాహనకు వస్తున్నారని, దీనినే సంఘటితపరచవలసిందిగా మోదీ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒకరితో ఒకరికి పొసగని పార్టీలన్నీ తాము ఏర్పరచుకున్న ఇండి కూటమి నుంచే విఘటితమైపోతున్న వైనాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వీటన్నింటికి మించి, నిన్నటి వరకూ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నవారందరూ తమ పార్టీల డొల్లతనాన్ని తెలుసుకోవడమే కాకుండా, తమ రాజకీయ భవిష్యత్తు కోసం సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాల్లా బీజేపీ, మోదీ చుట్టూ చక్కర్లు కొడుతున్న వాస్తవాన్ని  ప్రజలు అపార్థం చేసుకుంటారని కూడా అనిపించదు. ప్రజల దృష్టిలో  ఇది బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు అద్దం పట్టేదే. రాజకీయ వర్గాలలో నిర్మాణాత్మక దృక్పథం బలపడుతున్నదనడానికి నిదర్శనమే.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram