వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన

చంద్రమౌళి రామనాథశర్మ

విజయదశమి భోజనాలు గారెలు, అపడలు, పాయసం, పులిహోర, పిల్లలకు మిర్చిబజ్జీలతో అందరూ కలిసి ఏకపంక్తిన పూర్తి చేశారు. ఇక సాయంత్రం గుడిలో శమీపూజకు వెళ్లారు.

‘‘గోపాలం నేను చెప్పినట్లు చెయ్యి! శివయ్య భవిష్యత్తు బాగుంటుంది. నీకూ ఆర్థికంగా లాభిస్తుంది! ఆలోచించు’’ అన్నాడు అన్నయ్య గోవింద దీక్షితులు!

గోవింద దీక్షితులు సెయింట్‌ ‌జోసెప్స్ ‌హై స్కూలులో ప్రథమ శ్రేణి తెలుగు పండితులుగా పని చేస్తున్నాడు. ఆ పాఠశాల హెడ్‌మాస్టరుకి, చర్చి ఫాదర్‌ (‌కరస్పాండెంట్‌)‌కి యాజమాన్యంలోని పెద్దలకు అందరికీ గోవిందయ్య పట్ల ప్రత్యేక గౌరవం, అభిమానం ఉన్నాయి. ఆ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటారు దీక్షితులు..

దీక్షితులి పాండిత్యం విద్యార్హతలు చూచి ఉద్యోగమిచ్చారు. ఇంటర్వూ చేసిన వారిలో ఒకరు ‘‘మీరు బ్రాహ్మణులు కదా! మతం మారి క్రైస్తవ మతంలోకి వస్తే మీకు చాలా ప్రయోజనాలుంటాయి ఆలోచించుకోండి’’ అన్నారు. తనని మతం మార్చుకో మన్నందుకు చాలా కోపం వచ్చింది. ఉద్రేకంతో గీతా శ్లోకం చెప్పాడు.

‘శ్రేయాన్‌ ‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌ ‌స్వనుష్ఠితాత్‌

‌స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (3-35)8..అంటూ అర్థాన్ని వివరించాడు. ఉద్యోగం కోసం మతం మార్చుకోను అవసరమైతే యాయావారం చేసుకుంటానన్నాడు.

చర్చి ఫాదర్‌ ‘‘‌సార్‌! ‌సార్‌! ఆవేశం వద్దు. మీ ఉద్యోగానికి అది కండిషన్‌ ‌కాదు. మీ వంటి మహాపండితులు, మా పాఠశాలలో పని చేయటమే మాకు గొప్ప. మీరు వెంటనే ఉద్యోగంలో చేరండి’’ అన్నాడు.

గత పుష్కర కాలంగా అక్కడే పని చేస్తున్నారు దీక్షితులు. క్రైస్తవ విద్యా సంస్థలు హిందూ పండితులను ఎంత ఘనంగా గౌరవిస్తాయో అందరికీ గొప్పగా చెప్తామంటారు ఆయన.

                                                                                                         *   *    *

తను ఉద్యోగంలో చేరిన సంవత్సరం తర్వాత స్టాఫ్‌ ‌మీటింగ్‌లో విద్యార్థులలో నైతికత, వ్యక్తిత్వ వికాసం కోసం అసెంబ్లీలో ప్రతి రోజు ఒక సూక్తిని వివరించటం మంచిదని గోవింద దీక్షితులు ప్రతిపాదించారు. అందరూ ఆమోదించారు. దీక్షితులు ఆ పని చేయటానికి సమర్థులుగా నిర్ణయించారు. క్రైస్తవ పాఠశాలలో సూక్తిసుధ కార్యక్రమము ప్రారంభించటం తన వ్యక్తిగత విజయంగా భావించి చాలా ఆనందపడ్డారు ఆయన. ఆ తరువాతి సోమవారం నుంచి కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు ఉపాధ్యాయులు బాగా ఆనందిస్తున్నారు. ఒక రోజు స్కూలు అసెంబీకి చర్చి ఫాదర్‌ ‌వచ్చి విన్నారు. దీక్షితులును తన గదికి పిలిపించుకొని, పుష్ప గుచ్ఛమిచ్చి శాలువా కప్పారు. ‘‘తమ సేవ అద్భుతం. తమరు మాకు గురుతుల్యులు’ అంటూ… ‘తమరు మూడు రోజులు సంస్కృత సూక్తులు, మూడు రోజులు బైబిల్‌ ‌సూక్తులు చెప్పగోరెదను. ఈ సూక్తిసుధ సేవకు నెలకు ప్రత్యేక వేతనంగా 5000 రూపాయలు ఇస్తాము. బైబిల్‌ ‌సూక్తులను నేను తమకు చెప్తాను. మీరు ఈ పని చేస్తే యాజమాన్యం ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు’’ అన్నారు.

‘‘నేను బైబిల్‌ ‌చెప్పటం ఏమిటి సార్‌! ఆలోచించి చెప్తాను’’ అన్నారు దీక్షితులు. ఆ రాత్రి ఆయన భార్య ‘‘పాఠ్య పుస్తకంలో ఉండే ఏసు క్రీస్తును గూర్చి చెప్తున్నారు కదా! మీ బోధనలో భాగంగానే భావించి బైబిల్‌ ‌సూక్తులు చెప్పండి 5000 వస్తాయి కదా!’ అంటూ ప్రోత్సహించింది. దీక్షితులు ఆలోచించారు. రోజు సంధ్య వారుస్తూ, గాయత్రీ జపం, ఇష్టదేవతారాధన చేస్తున్నాను. పిల్లలకు బైబిల్‌ ‌సూక్తులు చెప్పటంవల్ల నా ధర్మానుష్టానానికి ప్రమాదం లేదు. స్వీయ ఆరాధన అన్య ఆదరణ’’ సమ్మతమే!

                                                                                                          *   *    *

కొంతకాలం తర్వాత ‘‘దీక్షితులు గారి క్రైస్తవ సూక్తిసుధ’’ అందమైన పుస్తకం చేశారు. ఉచితంగా విస్తృతంగా పంచారు. పట్టణం అనేక ప్రాంతాలలోని క్రైస్తవులు దీక్షితులి ఆశీస్సులు పొందుతున్నారు. ధనవంతులు విలువైన బహుమతులు ఇస్తున్నారు. అన్ని క్రైస్తవ సమాజాలు కారులో తీసుకొని వెళ్లి బైబిల్‌ ‌సూక్తులు తెప్పించుకుంటున్నారు. సన్మానాలు చేస్తున్నారు. పొగడ్తలు… సన్మానాలతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ప్రతి ఆదివారం వెళ్తున్నారు. నెలకు 50 వేలకు వరకు గిట్టుబాటు అవుతున్నది. కారు కొన్నారు.హోదా పెరిగింది! కుమార్తెలిద్దరు క్రైస్తవ విద్యాసంస్థలలో ఉన్నత విద్యలు చదివి ఒకరు అమెరికాలో, మరొకరు ఆస్ట్రేలియాలోనూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెద్ద అమ్మాయికి అమెరికన్‌తో వివాహం జరిగింది. రెండో అమ్మాయి పెళ్లి చేయాలి.

                                                                                                          *   *    *

బంధువులకు స్నేహితులకు జరుగుతున్నది తెలియటంలేదు. దీక్షితులుకు అంత సంపద ఎట్లా సమకూరుతున్నదో అర్థం కావటం లేదు. ఆయన ఇంట్లో నిత్యం పూజలు, జపాలు, అభిషేకాలు, వ్రతాలు, హోమాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఆయన నూటికి నూరు పాళ్లు హిందువు సత్‌ ‌బ్రాహ్మణుడు! అనుమానం లేదు. ఆయన అతిథులను కలిసే డ్రాయింగ్‌ ‌రూంలో రెండగుల ఏసుక్రీస్తు విగ్రహం, బుద్ధుడి విగ్రహం ఉంటాయట. ఆ గది తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి.

తన ప్రవర్తన ఇంట్లో హిందువుగా ఆదివారం క్రైస్తవ ప్రచారం అధర్మం అనిపిస్తున్నది. బుద్ధి హెచ్చరిస్తున్నది! ‘‘స్వధర్మ ఆచరణ పరధర్మ ఆదరణ’’ కనుక తను ధర్మమే చేస్తునట్లు సమధాన పడేవాడు.

వర్తమానంలోకి వచ్చి తమ్ముడు గోపాలం, ‘‘అన్నా! నీవు తోవ తప్పుతున్నావు. క్రైస్తవుడిగా మారి ప్రచారం చేస్తూ! అందరినీ మోసం చేస్తున్నావు. మన ఊరి జక్రియ్య పంతులు అన్ని విషయాలు చెప్పారు. నీతో కలసి పండుగ చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అయినా కుటుంబబంధం వల్ల రమ్మన్నాను. నీవు క్రైస్తవుడిగా మారదలచుకుంటే, నాటకాలు ఆపి ఆ మతంలోకి వెళ్లిపో! మన బంధం తెగినట్లే! నీ మొహం నాకు చూపకు’’ అని గ•ట్టిగా మాట్లాడాడు. గోవింద దీక్షితులు చిత్తరపోయాడు. వెంటనే భార్యను తీసుకొని పట్నం బయలుదేరాడు. ఆనందం లేదు! కారును గ్రామ దేవాలయం వద్ద ఆపాడు. శమీ వృక్షానికి నమస్కరించాడు. ‘శమీ శమయతే పాపం..’ శ్లోకం చదివి జమ్మి తీసుకొనివెల్తాడు!

తర్వాత 10 రోజులకు విశాఖపట్నంలో క్రైస్తవ కూ•మి సమావేశంలో గోవింద దీక్షితులు అనే హిందే బ్రాహ్మణుడు ఉపన్యాసిస్తూ ‘‘నేను హిందువుగా పుట్టాను. హిందువుగానే బతుకుతున్నాను. హిందువుగానే చచ్చిపోతాను. నేను మతం మారలేదు, మారను’’ అని చెప్ప విషం తాగి వేదికపైన మరణించినట్లు పత్రికలలో వార్త వచ్చింది! గోపాలం కంటతడిపెట్టాడు.

ఆ మరునాడు గోపాలానికి గోవింద దీక్షితులు రాసిన జాబు అందినది. ‘‘గోపాలం! దేవుడు కూడా నన్ను క్షమించడు. నేను హిందువుగానే ఉంటూ పొగడ్తలకు, ప్రలోభాలకులొంగి క్రైస్తవ మతం ద్వారా ప్రయోజనాలు పొంది నా ధర్మానికి ద్రోహం చేశాను. నాకు లాగానే అనేక మంది క్రైస్తవులుగా ఉంటూ హిందువులు పొందవలసిన ప్రయోజనాలను పొందుతున్నారు. నువ్వు నా కళ్లు తెరిపించావు. మన జమ్మి నాకు పాప విముక్తి కల్గించింది. వచ్చేవారం విశాఖపట్నంలో ఒక కూటమి వెళ్తున్నాను. 5 లక్షల రూపాయలు అడ్వాన్సుగా తీసుకున్నాను. ఆ డబ్బు నీకు పంపుతున్నాను. శివయ్యను చదివించు.మళ్లీ జన్మలో కూడా మనం అన్నదమ్ములుగానే పుడదాం! నా పాపానికి ప్రాయశ్చిత్తం ఆలోచించాను! ’’

శాంతిః శాంతిః శాంతిః

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram