ఎం. హనుమంతరావు

వాకాటి పాండురంగరావు  స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


శ్రీరాముడు వనవాసానికి వెళ్లడంతో అయోధ్య నగర కళాకాంతులూ, వైభవం కూడా ఆయనతోనే వెళ్లిపోయాయేమో అన్నట్టు ఊరంతా ఒక్కసారి స్తబ్దంగా, నీరసంగా అయిపోయింది. పౌరులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా చేష్టలుడిగాయి. ఆగని శోకం అందరి ఆకలి దప్పులను అపహరించింది. ఆకులు కదలవు. పక్షులు పాడవు. ఉత్సాహం అంతా ఎటో ఎగిరిపోయింది. ఉల్లాసం అంతా ఎక్కడో ఇంకి పోయింది. ఉన్నదంతా నిస్సంతోషం, నిస్పృహ?

దశరథుడి అంతఃపుర భవనాలన్నీ బావురు మంటున్నాయి. తన భవనం ముందున్న ఉద్యాన వనంలో సుమిత్రాదేవి ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తున్నది. ఆ చూపులో ఏ భావమూ లేదు. దూరంగా కనిపిస్తున్న ఆకాశపు నీలి తెరమీద చిన్న రాణి ఊహలు మాత్రం ఒకే వరసలో మూడు చిత్రాలను పదే పదే చూస్తున్నాయి.

ఒక దృశ్యంలో, అయిదారు రోజులుగా తెరపిలేని నరకయాతన పడుతున్న తన భర్త. రోదించి, రోదించి ఇప్పుడు రోదించేందుకు కూడా శక్తి కోల్పోయి ఉన్నాడు. శత్రుదుర్నిరీక్షుడుగా వెలిగిన మహారాజు ఇప్పుడు శల్యావశిష్టుడై వట్టినేలమీద ఉన్మాదిలా పొర్లుతున్నాడు. శోకించే ఓపిక వస్తే, గువ్వ కుత్తుకతో ‘రామా! రామా!’ అంటూ వలవల విలపిస్తాడు.ఆ కొంచెం శక్తీ పోగానే స్పృహ కోల్పోతాడు. అలా స్పృహ లేనప్పుడే ఆయనకు కొంత ఊరట. స్పృహ రాగానే మళ్లీ శోకం.

రెండో దృశ్యంలో ఆమెకు తన ముద్దుల తనయుడు లక్ష్మణుడు కనిపిస్తున్నాడు. ఆదిశేషుడిలాంటి ప్రజ్ఞాశాలి, తనకు ప్రాణంలో ప్రాణం అయిన కుమారుడు, అన్నీ వదిలేసి, అన్నా వదినల వెంట అరణ్యానికి వెళ్లిపోతూ, తన వంకకు తిరిగి చేతులు జోడిరచి,‘అమ్మా, వెళ్లి వస్తాను. ఆశీర్వదించు’ అంటున్న ముఖముద్ర ఆమె అంత రాంతరాలను మెలిపెడుతున్నది.

మూడో దృశ్యం ఆమెకు మరింత బాధాకరం. అన్ని సౌకుమార్యాలూ పుణికి పుచ్చుకొన్న అపురూప సుందరి ఊర్మిళ అమాయకపు ముఖం. అరణ్యవాస కాలమంతా అన్నకు తోడుండి అన్ని విధాల సేవ చేయాలన్న బóర్త నిర్ణయాన్ని ఊర్మిళ నిస్వార్థంగా, మనస్ఫూర్తిగా ఆమోదించి, తనకు తానే పద్నాలుగు సంవత్సరాల ఏకాంతవాస శిక్ష విధించుకొన్నది. ఎలాంటి సాధ్వికి ఎలాంటి విధివిలాసం ఎదురయింది!

అలా నిశ్చేతనంగా కూర్చొని ఉండగా ఎంత సమయం గడిచిందో సుమిత్రకు ధ్యాస లేదు. ఆ మూడే దృశ్యాలు మళ్లీమళ్లీ మనోనేత్రం ముందుకు వచ్చి ఆమె హృదయాన్ని తొలిచి వేస్తున్నాయి.

వనజ వచ్చి తన ఎదుట అంజలి ఘటించి నిలబడి ఉన్నదన్న విషయం గ్రహించడానికి సుమిత్రకు రెండు గడియలపైనే పట్టింది. గ్రహించగానే, నివ్వెరపోయి,‘వనజా! నువ్వా! అకస్మాత్తుగా ఇలా వచ్చావు? ఏదయినా విశేషమా? అక్కగారికి కుశలమేగా?’ అన్నది.

వనజ, మహారాణి కౌసల్యాదేవికి ఆంతరంగిక పరిచారిక. కౌసల్య కొత్త పెళ్లికూతురుగా అయోధ్య వచ్చినప్పుడు, ఆమెతో వచ్చిన అరణంలో భాగంగా వనజ వచ్చింది. ఇప్పుడు బాగా వృద్ధురాలు. అంతఃపురంలో అందరికీ ఆమె తలలో నాలుక. కౌసల్యతోనూ, సుమిత్రతోనూ ఆమెకు చాలా చనువు.

‘భట్టారికకు అభివాదాలు! మహారాణి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. సుమంత్రుల రథం శ్రీరాముడిని తీసుకొని చూపుమేర దాటినప్పటి నుంచి మహారాణి కంటికీ మింటికీ ఏకధారగా కన్నీరు కారుస్తూనే ఉన్నారు. పగలు లేదు, రాత్రిలేదు. ఆహారం లేదు, నిద్ర లేదు. ఇంతటి దుఃఖం అటు మహారాజు గారినీ ఇటు పట్టమహిషినీ ఇలా దహించి వేస్తుంటే, అంతఃపుర పరిజనానికి దిక్కు తోచడంలేదు. ఆ దుఃఖభారాన్నుంచి కొంత కాలమైనా, కొంతయినా ఉపశమనం లేకపోతే చాలా ప్రమాదం అని మా అందరికీ స్పష్టంగా తెలుస్తు న్నది. కానీ మహారాణికి ఏమి చెప్పి దుఃఖం శాంతింపజేయాలో, ఎలా మళ్లీ మన లోకంలోకి తేవాలో బోధపడడం లేదు. కొడుకు దూరమైన నాటి నుంచి మహారాణి మాటలే మానేశారు. శోకమే ఆమె భాష. కన్నీళ్లే ఆమె మాట. కాలం గడిచిన కొద్దీ శమించాల్సిన దుఃఖం తగ్గుముఖం చూపటం లేదు సరికదా, మరింత పెరిగి పోతున్నది. ఈ స్థితిలో ఆమెను ఓదార్చగల స్థాయీ, చనువూ, చాకచక్యం ఉన్న వాళ్లు నాకు ఎవరూ కనబడక, ఏదయినా ఉపాయం చెప్తారని మీ దగ్గరికి వచ్చాను’ అంది వనజ. కౌసల్యా సుమిత్రల మధ్య ఉన్న గాఢమైన

మైత్రీ, పరస్పర ప్రేమాదరాలూ అంతఃపురంలో అందరూ ఎరిగినవే.

చటుక్కున లేచి నిలబడిరది సుమిత్ర. ఆమె పదహారణాలా రాజపుత్రిక. ఎప్పుడూ నిశ్చలంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా కనిపిస్తుంది. ముఖకవళికలు చూసి ఆమె భావనలు పసిగట్టడం వనజ లాంటి చనవరికీ, అనుభవజ్ఞురాలికి కూడా సాధ్యం కాదు.

‘పద, వనజా! ఇప్పుడే అక్కగారి మందిరానికి వెళదాం’ అంది సుమిత్ర. అతి నిరాడంబరంగా, ఆటోపాలేవీ లేకుండా, సమీపంలోనే ఉన్న కౌసల్యా మందిరానికి కాలి నడకన వెళ్లారు సుమిత్రా దేవీ, వనజా.

పట్టమహిషి అయిన తరువాత చాలా కాలం కౌసల్య జీవితం కష్టాలమయంగా సాగింది. భర్తకు తనపట్ల గాఢమైన అనురాగం కాదుగదా, సామాన్యమైన సుముఖత కూడా లేదు. చాలా కాలం పాటు సింహాసనానికి వారసుడు పుట్టకపోవడం ఆమె అపరాధమయినట్టు మహారాజు ప్రవర్తించే వాడు. సుమిత్ర విషయమూ దాదాపు అంతే. రాజ్యపాలన విషయంలో చూపిన ధర్మబద్ధతనూ, నిష్పాక్షికతను భార్యల విషయంలో దశరథుడు చూపలేదు. ఆయన కైక చేతిలో కీలుబొమ్మ. సవతులతో సామరస్యంగా మెలగడం కైక స్వభావం కాదు.

అదృష్టవశాన, యజ్ఞఫలంగా సంతానం కలిగింది. వాస్తవానికి ఆ తరువాత కూడా భర్తకు తనయుడి మీద మోహమే తప్ప, మహారాణి మీద మమత పెరగలేదు. అయినా శ్రీరామజననంతో కౌసల్య కష్టాలు చాలా వరకు గట్టెక్కాయి. రామచంద్రుడు అన్ని రకాల దైన్యాంధకారాలనూ తొలగించగల రాకాచంద్రుడు. సాక్షాత్తూ ఆయననే బిడ్డగా పొందిన తరవాత కౌసల్య జీవితం బాగా కుదుటబడిరది.

కరుణాపయోనిధి తల్లికయినా కడగళ్లే లేకుండా కాలం గడిచి పోతుంటే, క్రూరవిధికి కళ్లుకుట్టక మానవు కాబోలు. వారం క్రితం అంతఃపురంలో జరిగిన విచిత్ర ఘటనల వల్ల అయోధ్యరాముడి యౌవరాజ్య పట్టాభిషేకం అనూహ్యంగా ఆగిపోయింది. అదేకాదు, దాంతోపాటు కౌసల్యకు పిడుగుపాటు లాంటి మరో దెబ్బ తగిలింది. రామ వనవాస సమాచారం. రాముడి ఆకర్షణ గొప్పది. ఆయనను అసలెప్పుడూ చూడని వాళ్లను గూడా ఆయన గుణగణాలు అమితంగా ఆకర్షిస్తాయి. ఆయనతో కొంతకాలం గడిపిన వారికి, ఆయన లేని జీవితం నిస్సారం, నిరర్థకం అనిపిస్తుంది. ఆయనను బిడ్డగా పొందే భాగ్యం కలిగిన ఆయన తల్లిదండ్రుల మాట చెప్పాలా?సకలసద్గుణాభిరాముడైన కుమారుడి వియోగం దావాగ్నిలా తల్లితండ్రుల ఎడదలను దహించేస్తున్నది.

కౌసల్య దుఃఖాన్ని ఉపశమింపజేసేందుకు వనజ యోచించిన ఉపాయం కొంతలో కొంత పారింది. సుమిత్రను దూరం నుంచి చూస్తూనే కౌసల్య ఆత్మీయంగా లేచి వచ్చింది. చెల్లెలు అక్కను ఆప్యాయంగా అక్కున చేర్చుకొంది. అక్కచెల్లెళ్లు కొన్ని నిమిషాలపాటు బావురుమని ఏడ్చిన తరవాత దుఃఖం ఉధృతికొంత తగ్గింది.

ఆ తరవాత మౌనం రాజ్యం చేసింది. అక్క చేతిని తన చేతిలో తీసుకొని సుమిత్ర దూరంగా చూస్తూ కూర్చొంది. కౌసల్య ఆమె ముఖంలోకి చూస్తూ ఉంది. శోకదేవతలా ఉన్న అక్కతో పోలిస్తే సుమిత్ర నిర్వికారంగా ఉంది. అలా చాలా సేపు గడిచిన తరవాత, ‘చెల్లీ, వనజ నన్ను ఊరడిరచేందుకు నిన్ను పిలవడం చాలా అనాలోచితమైన పని అనుకొంటాను!’ అన్నది కౌసల్య.

‘ఎందుకని?’

‘ఎందుకేమిటమ్మా, నాకన్నా నువ్వు ఏ విధంగా తక్కువ దుఃఖంలో ఉన్నావు కనక? తన తప్పుకు కుమిలిపోతూ,కడలేని మనోవ్యథలో ఉన్న భర్త గురించిన చింత మన ఇద్దరికీ సమానమే. నా బహిఃప్రాణమైన నా బిడ్డ అడవి పాలయ్యాడు. నీ బహిఃప్రాణమైన నీ బిడ్డ కూడా అలాగే అదే అడవికి వెళ్లాడు. కనీసం నా కుమారుడు తండ్రి ఆజ్ఞ అన్న కారణంగా అడవికి వెళ్లాడు. అన్నకు తన సేవ అవసరమని నీ కుమారుడు స్వచ్ఛందంగా అడవికి వెళ్లాడు. నా కుమారుడికి తన భార్య తోడుగా వెళ్లింది. నీ కోడలు తన భర్త నిర్ణయానికి కట్టుబడి, తను ఒంటరిగా ఆయన కోసం సుదీర్ఘ నిరీక్షణలో కాలం గడుపుతున్నది. అన్నీ అనుభవించాల్సిన వయసులో కొడుకూ కోడలు, ఒకరికొకరు దూరమై, తపస్వుల్లా కాలం దొర్లించడం నీ కెంత చిత్తక్షోభ కలిగిస్తుందో నేను ఊహించ గలను. నీ పరిస్థితి మరొకరికి ఓదార్పు చెప్పగల స్థితా? నిజానికి నేనే నీకు సాంత్వన చెప్పాలి. కానీ ఇప్పుడు నేనూ అలాంటి మనఃస్థితిలో లేనమ్మా!’

‘అక్కా! నీవల్ల నాకు సాంత్వన ఇప్పటికే లభించింది. నీ వేదన తలచుకోగానే, నాకు మనసు కరిగిపోయింది. నీ బాధ పంచుకోవాలనే ఆరాటంలో నా బాధ కొంత తగ్గి, నేను భరించగల స్థాయికి వచ్చింది. నా బాధను నువ్వు గుర్తించి స్పందిస్తున్నా వంటే, నీ బాధ కూడా నువ్వు భరించగల స్థాయికి వచ్చినట్టే. ఇందుకే కదా కష్టాలను ఆత్మీయులతో కలబోసుకొంటే, మనోవ్యథ కొంత ఉపశమిస్తుంది అంటారు.ఇతరుల వేదన పట్ల మనలో కలిగే సంవేదన, మన మనోవేదనకు మంచి మందు.’

‘ఈ దుఃఖాన్ని నేను ఇప్పటికీ మోయలేకుండానే ఉన్నాను,సుమిత్రా !’

‘అక్కా, నేనది అర్థం చేసుకోగలను. కొంచెం హెచ్చు తగ్గులుగా మనిద్దరమూ అతితీవ్రమైన దుఃఖంలోనే ఉన్నాం. ఆ సత్యాన్ని నిరాకరిస్తే అది ఆత్మ వంచనే తప్ప పరిష్కారం కాదు.’

‘విధి పగబట్టి విధించిన శిక్ష ఇది. దీనికి పరిష్కారం ఎక్కడుంటుంది?’

‘బయటెక్కడా ఉండదు. ఉంటే మన చేతిలోనే ఉంటుంది. అక్కా, నేను నీకేదో చెప్పగలిగినంత దాన్ని కాను. సందర్భం వచ్చింది కనక ఎప్పుడో నువ్వు నేర్పిన మాటలే నీకు గుర్తు చేయాలి. అనుకోని పెనుదుఃఖం అకస్మాత్తుగా ఎదురై బాధించినప్పుడు, ఆ బాధలోనే మునిగి ఉండిపోతే, ఇక ఆ దుఃఖం దూరమయ్యేదెలా?ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని, ఆ దుఃఖాన్ని పోగొట్టుకొనే మార్గమో, కనీసం కొంత తగ్గించే మార్గమో మనమే అన్వేషించుకోక తప్పదు. ‘దుఃఖవశమైపోయిన మనసును స్థైర్యంతో, వివేచనతో కొంతవరకైనా మళ్ళీ స్వవశం చేసుకోకపోతే ఇక మనిషిపుటుకకు, అందునా రాచ పుట్టుకకు అర్థమేలేనట్టు!’ అని నువ్వు నాకు ఎన్నోసార్లు చెప్పావు’

‘నిజమే! అయితే, దైవం ఇంతగా ప్రతికూ లించినప్పుడు, ఏ వివేచన అక్కరకు వస్తుంది, తల్లీ?

‘అదీ నువ్వే చెప్పావు. మన వివేచనే!. ప్రాణులు దేహాలు ధరించి ఈ భూమిమీద జన్మ ఎత్తేది, వాళ్ల ప్రారబ్ధ కర్మను సుఖదుఃఖాల రూపంలో అనుభ వించేందుకే. కర్మఫలాలు నిశ్శేషంగా అనుభ వించేసిన వాళ్లకు ఆ పైన జన్మ రాహిత్యమేతప్ప జన్మ ఉండదుకదా! కనక జన్మ ఎత్తామంటేనే, అనుభవించాల్సిన సుఖదుఃఖాలేవో అనుభవించేసి, కర్మల అప్పు తీర్చేసుకోవ డానికి. అలాంటప్పుడు జీవితంలో వాస్తవంగా ఆ అనుభవాలు ఎదురయి నప్పుడు దుఃఖించడం అసమంజసం, నిష్ప్ర యోజనం.’

‘కావచ్చు, సుమిత్రా! అయినా కూడా ఆ అనుభవాలు కొన్ని మనల్ని భరించలేనంత దుఃఖంలో ముంచెత్తినప్పుడు, వాటిని తట్టుకోవడం ఈ మెట్ట వేదాంతాలు చెప్పినంత తేలిక కాదు.’

‘అవును. కానీ ఆ దుఃఖం తగ్గించుకొనేందుకు ఏదయినా చెయ్యాలికదా? రోగగ్రస్తుడికి తన వ్యాధి తత్త్వమూ, కారణమూ, అవధీ, పరిష్కారమూ తెలిస్తే, వ్యాధి వెంటనే నయమవకపోయినా, కొంత ఉపశాంతి. దుఃఖగ్రస్తులకూ అంతే!ఈ దుఃఖం మన పూర్వకర్మల వల్ల కలుగుతున్న పీడ. ఆ పీడ విరగడ కావాలంటే, దాన్ని అనుభవించడమొక్కటే మార్గం. మరో మార్గమే లేదు. దాన్ని అనుభవించేదాకా అది నీ వెనకే ఉండి భయపెడుతూ ఉంటుంది. కనక కష్టం అనుభవించేటప్పుడు,‘దీంతో నా దుష్ట కర్మఫలాల పీడ వదిలి పోతున్నది’ అన్న సకారాత్మక అవగాహన ఉంటే, ఆ కష్టాలు ఒకింత తక్కువ బాధిస్తాయి. అంతేకాదు, తక్కువ బాధించినా ఎక్కువ బాధించినా కష్టసుఖాలు కలకాలం ఉండవు కదా?వస్తుంటాయి, పోతుంటాయి. ఇది అనివార్య మని మన కులగురువులు మనకు చాలా సార్లు చెప్పిన మాటే’

‘చెప్పారు, కానీ,తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు ఈ సత్యాలు స్ఫురించవు. అలాంటప్పుడు వాటిని గుర్తు చేసేందుకు నీలాంటి ఆప్తులు లభిస్తే, అదొక ఊరట’అన్నది పట్టమహిషి. ఆమె ఆలోచనలో పడిరది. తరవాత, ‘కానీ, ఇప్పటివరకూ పోగుచేసుకొన్న కర్మ ఫలాలు ఎలాగో స్థైర్యంతో పళ్లబిగువున ఇపుడు అనుభవిస్తే, ముందు కాలం మాత్రం తిన్నగా సాగుతుందని ఎలా అనుకోగలం? ఇప్పుడు జన్మఎత్తి ఉన్నాం కదా,ఈ జన్మలో మళ్లీ ఏవేవో కొత్త కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. చేస్తే మళ్లీ కొత్త కర్మఫలాలు  పోగుపడుతూనే  ఉంటాయి కదా?’

‘అందుకేగదాపాత అప్పు తీరిపోయిందిలే అని ఏమరచి, దూకుడుగా మళ్లీ కొత్తకర్మల అప్పులు చేయకు అని ధర్మజ్ఞులు చెప్పేది. పాత అప్పు తీర్చడంలో పడుతున్న ఈ యాతనలన్నీ, ‘ఇకముందన్నా సత్ఫలాలనిచ్చే పుణ్యకర్మలు చేయి, పాపకర్మలు వద్దు!’ అని జీవితం నేర్పే పాఠాలుగా స్వీకరించమంటారు వసిష్ఠ మహర్షి. అంతకంటే గూడా ఉత్తమ మార్గం మరొకటి ఆయనే చెప్పారు- చేసే కర్మలన్నీ నిష్కామంగా, నిస్సంగంగా, ఫలం భగవదర్పితం చేసి చేస్తే, ఆ కర్మ ఫలాలు మనకు అంటవు. ముందుకాలంలో మనల్ని వేధించవు, అని. ఆయన మార్గ దర్శనం వల్ల కదా మనలాంటి వాళ్లం ఈ జన్మలో చేతనయినంత వరకు పుణ్యకర్మలే చేస్తూ పాప కర్మలకు దూరంగా ఉండే జాగరూకత చూపుతున్నాం.

‘బాగా చెప్పావు. సుమిత్రా,నువ్వు నాకు నిజంగా సు-మిత్రవు… .’

‘నీకు తెలియనిది నేనేం చెప్పానక్కా?’

‘లేదా?అయితే నాకు తెలియనిది ఒకటి ఇప్పుడడుగుతాను చెప్పు. మొన్న సుమంత్రుడి రథమెక్కేటప్పుడు లక్ష్మణుడికి, ‘రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజామ్‌’రాముడినే దశరథుడిగా, సీతనే నన్నుగా భావించు, సుఖంగా వెళ్లిరా’ అని అంత నిశ్చింతగా ఎలా చెప్పగలిగావు? అరణ్య వాసంలో కుమారుడి యోగక్షేమాల గురించి నాకున్నట్టు నీకు భయమే లేదా?’

‘అక్కడ ‘దశరథ’ అనడంలో నా ఉద్దేశ్యం, ‘దశ’- పక్షి, ‘రథ’-వాహనంగా కలవాడు..అని. శ్రీరాముడు గరుడవాహనుడైన శ్రీహరి అని గ్రహించమన్నాను. సీతను, ‘మా’- లక్ష్మీదేవి, అని గ్రహించమన్నాను. వాళ్ల రక్షణలో నీ యోగక్షేమాలకు ఏ లోటూ ఉండదు గనక, అడవికయినా సుఖంగా వెళ్లిరమ్మని నా ఆశీర్వాదం. అంతే’

కౌసల్య కళ్లలో నీళ్లు నిండాయి. ‘చెల్లీ,నా రాముడు అవతార పురుషుడంటావా?’

‘అక్కా, తల్లివి గనక నీకు బిడ్డగానే కనిపించినా, శ్రీరాముడు నూటికి నూరు పాళ్లు అవతారపురుషుడు. తాటక వధ, సుబాహువధ, శివ ధనుర్భంగం, పరశురామ గర్వభంగం, అన్నిటినీ మించి లోకాతీతమైన అతని సద్గుణసంపత్తి- ఇవన్నీ అందుకు నిదర్శనాలు. అలాగే మన సీత. ఆమె అయోనిజ. ఆమె శ్రీహరికి అనపగామినిగా వెంట ఉండే శ్రీదేవి అని నా ధారణ. లోకాలన్నిటి యోగక్షేమాలను వహించే ఆ లోకాతీతుల శరణులో ఉన్న నా బిడ్డ యోగక్షేమాల గురించి నాకు ఎలాంటి చింతా లేదు’

‘నువ్వు జ్ఞానివి. అర్థవంతంగా మాట్లాడతావు. నీ మాటలు నా దుఃఖ భారాన్ని తగ్గించి మనసును తేలికపరచాయి.’

‘అయితే రాజభవనంలో మనలాగే పుత్రవియోగ బాధతో విలవిలలాడుతున్న మహారాజు దగ్గరికి వెళ్లి ఆయనకు ఊరట కలిగించే ప్రయత్నం చేద్దాం.’

‘ఫలితం ఉంటుందా? ఆయన దుఃఖాన్ని తగ్గించడం సాధ్యమేనా?’

‘ఏమో,భర్త దుఃఖాన్ని తొలగించేందుకు యథాశక్తి ప్రయత్నించడం భార్య కర్తవ్యం. అది చేద్దాం. ఆయన దుఃఖాన్ని తగ్గించేందుకు చేసే ప్రయత్నం, మన దుఃఖం మీది నుంచి దృష్టిని మళ్లించడమైతే తప్పనిసరి!అయినా ఫలచింత మనకెందుకు, దాని వల్లే కదా కర్మబంధాలూ, దుఖాలూ?’ అంది సుమిత్ర.

మహారాజ మందిరానికి వెళ్లే ఏర్పాట్లు చేయాలని కౌసల్యా భట్టారికకు ఇచ్చిన ఆదేశం వనజకు కూడా సాంత్వనను కలిగించింది. పట్టమహిషి ఇక మనసు కుదుటపరచుకొని మనుషులలో పడుతున్నట్టే.

About Author

By editor

Twitter
Instagram