బీసీల పక్షపాతిగా  చెప్పుకుంటున్న వైసీపీలో తామే బాధితులమని బీసీలు చెబుతున్నారు. తమకు అసెంబ్లీ సీట్లు, పార్టీ బాధ్యతలు ఇచ్చినా పెత్తనం మాత్రం రెడ్లదే. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులివ్వలేదు. ఏళ్ల తరబడి అమలు చేస్తున్న స్వయంఉపాధి రుణాలు, ఆధునిక పనిముట్ల పంపిణి, ఇతర ఆర్థిక సహాయాలు నిలిపివేశారు. నవరత్నాల పథకాల్లో బీసీ లబ్ధ్దిదారులనే  ఆయా బీసీ కార్పొరేషన్ల లబ్ధిదారులుగా చూపిస్తున్నారు. ఎన్నికలు సమీపిచడంతో తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్యేపై నెట్టి బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరిస్తున్నారు. కొందరిని వేరే ప్రాంతాలకు మార్చుతున్నారు. ఇదీ వైసీపీ అధిష్టానం జరుపుతున్న తంతు. మొత్తానికి వైసీపీలో బీసీలే బాధితులుగా మారారు. 

వైసీపీ ప్రభుత్వం బీసీలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వంలో బీసీలకు ఎన్నో పదవులిచ్చామని, ఎంతో లబ్ధి చేకూర్చామని ప్రచారం చేసుకుంటూ ఆ వర్గాల ఓట్లకు గాలం వేస్తోంది. కాని ఇవన్నీ పచ్చి అసత్యాలని నాలుగున్నరేళ్ల పాలనలో తమకు ఎలాంటి మేలు జరగలేదని బీసీలు విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నా పెత్తనమంతా ఒక వర్గం వారిదేనని బీసీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. త్వరలో జరిగే ఎన్నికకు టిక్కెట్లు ఇవ్వకపోవడం, నియోజక వర్గాలు మార్చడం ద్వారా తమనే బాధితుల్ని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకూ వైసీపీ ప్రకటించిన మూడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల జాబితాల్లో మొత్తంగా 59 స్థానాల్లో మార్పులు, చేర్పులు చేసింది. అందులో ఎమ్మెల్యేలు 24, సమన్వయకర్తలు అయిదుగురు, 20 మంది సిటింగ్‌ల స్థానాలు గల్లంతయ్యాయి. ఈ 20లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 16 మంది ఉన్నారు. మరోవైపు టికెట్‌ ‌లేకుండా పూర్తిగా పక్కనపెట్టిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు బీసిలే. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఏడుగురు, ఒక సమన్వయకర్తను తొలగించారు. బీసీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురిని పక్కన పెట్టారు. ఎస్టీ, ముస్లిం మైనారిటీలు ఒక్కొక్కరిని చొప్పున తప్పించారు. రాబోయే జాబితాల్లో కూడా ఇదే రీతిన తమనే టార్గెట్‌ ‌చేస్తారని వెనుకబడిన వర్గాల నేతలంటున్నారు.ఈ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఉండేదని అనుకున్నామని, ప్రస్తుత పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని బీసీ ప్రజా ప్రతినిధులంటున్నారు. నిజంగా పరిస్థితులు బాగోలేక మారిస్తే పర్వాలేదని కాని, కేవలం ఒక వర్గం కోసం మార్చడం దారుణమని చెబుతున్నారు. బీసీలు, దళితులు ఒకరి చెప్పుచేతల్లో ఉండటం బాధ కలిగిస్తోందంటున్నారు.

 ఇదొక్కటే కాదు..అధికారం కోసం ఎన్నో హామీలిచ్చిన వైసీపీ నేత మాట తప్పి వాటిని గాలి కొదిలేశారని బీసీలంతా ఆక్షేపిస్తున్నారు. పలు పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయని, గతంలోని ఎన్నో పథకాలను రద్దు చేశారంటున్నారు. నవరత్నాల కింద అన్ని వర్గాలకు ఇచ్చే నగదు బదిలీల లెక్కలు చెబుతూ బీసీలకు అన్నీ ఇచ్చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు. వైసీపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అత్యధిక శాతం హామీలు అమలు చేయలేదని, ‘అన్నీ నెరవేర్చాం’ అనడం శుద్ధ అబద్దమని ఆరోపిస్తున్నారు. కొద్దిమంది బీసీ నేతలకు నిధులు లేని కార్పొరేషన్‌ ‌పదవులిచ్చి మొత్తం బీసీ వర్గాలను ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.

ఏది సామాజిక న్యాయం?

‘వెనుకబడిన వర్గాలకు అత్యధిక పదవులిచ్చాం. సామాజిక న్యాయం మేమే చేస్తున్నాం. దానిపై మాట్లాడే హక్కు మాకే ఉంది’ అంటూ వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారు. అన్నీ అసత్యాలు. బీసీలకు మంత్రి పదవులిచ్చినా సొంతగా నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం మాత్రం వారికి లేదు. అధికారం మొత్తం అధినేత, ఆయన నమ్మినబంటులుగా ఉన్న, అధినేతకు సంబంధించిన అగ్రకుల సామాజిక వర్గానికే చెందిన ప్రాంతీయ ఇన్‌ఛార్జుదే. తమ సామాజిక వర్గాలకు ఏదైనా మంచి చేద్దామనుకున్నా అవకాశం లేకుండా పోయింది’ అని బీసీ ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయినట్లు తమ వారి వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు.

 నియోజకవర్గ సమన్వయకర్తలుగా వచ్చిన అగ్రకుల నాయకులు తమపై పెత్తనం చెలా యించడాన్ని బీసీ ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. విధాన నిర్ణయం లేకపోతే ఇక అధికారం ఉండి ఉపయోగమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాధాన్యత లేని పదవులు ఎందుకని అంటున్నారు. ఇక ఈ వర్గాలకు వైసీపీ అధిష్టానం ఎలాంటి ప్రాధాన్యమిస్తున్నదీ సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో స్పష్టమవుతోంది.

నిధులులేని కార్పొరేషన్‌లు

రాష్ట్రంలో వెనుకబడిన కులాల అభివృధ్ధే లక్ష్యంగా చెబుతూ వైసీపీ ప్రభుత్వం డిసెంబర్‌ 17,2020‌న బీసీ కార్పోరేషన్లను ఆర్భాటంగా ప్రకటించింది. ప్రతి కార్పోరేషన్‌కు ఛైర్మన్‌ ‌సహా 12 మంది డైరెక్టర్లతో మొత్తం 136 కులాలకు గాను 56 కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది. అయితే వాటికి తగినన్ని విధులు ఏవీ లేవని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మెజారిటీ సంస్థలకు కనీసం కార్యాలయం లేదని, ఛైర్మన్‌ ‌డైరెక్టర్లకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. పైగా ఛైర్మెన్‌కి నెలకు రూ.56 వేలు, డైరెక్టర్లకి రూ.12 వేల వంతున, ఛైర్మన్‌కు వాహనభత్యం కింద మరో రూ.60 వేలు, ఆయన సహాయకులకు రూ.12 వేలు పారితోషికంతో పేరుతో ప్రతినెలా పెద్ద మొత్తంలో దుబారా చేశారనే విమర్శలూ లేకపోలేదు. నవరత్నాల పేరుతో కొందరికి నగదు జమ చేసి మొత్తం బీసీలందరినీ ఉద్ధరించినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని, రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయని అంటున్నారు. 2.14 కోట్ల బీసీ జనాభాలో కేవలం ఐదు రకాల కులాలకు చెందిన 44 లక్షల జనాభాకు తప్ప మిగతా 1.70 కోట్ల మందిని పట్టించుకోవడం లేదని మిగతా కులాల వారంటున్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్‌ ‌వృత్తిని చేపట్టిన కొన్ని కులాలను, మత్స్యకారులు, చేనేత వృత్తి వారికే నవరత్నాల పథకంలో నగదు అందుతోందని బాధిత వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. గతంలో బీసీ కార్పొరేషన్‌ ‌ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవారు. అందులో 50 శాతం సబ్సిడీ ఉండేది. ఒక్కొక్కరికి రూ.లక్ష సబ్సిడీ అందేది. ఇవికాక కులవృత్తులు చేసుకునే బీసీ వర్గాలకు అదరణ పథకం పేరుతో స్వయం ఉపాధి యూనిట్ల కొనుగోలు, పనిముట్లకు 90 శాతం సబ్సిడీ రూపంలో అందించేవారు.వైసీసీ అధికారానికి వచ్చాక ఈ పథకాలు అమలు కావడం లేదు.

ఎన్‌బీసీఎఫ్‌డీసీ రుణాల నిలిపివేత

బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సంకల్పంతో జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్వయం ఉపాధి రుణాలు అందిస్తుంది. యూనిట్‌ ఏర్పాటుకు ఇచ్చే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ అందిస్తే.. లబ్ధిదారుడు 10% చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని ఎన్‌బీసీఎఫ్‌డీసీ రుణంగా ఇస్తుంది. ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌నూ అమలు జరిగింది. వైసీపీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టేసింది. 2019లో దీన్ని అమలుచేసిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత పక్కనపెట్టింది. ఆ సంవత్సరం రూ.36 కోట్ల రుణ మంజూరుతో పక్రియను చేపట్టి, నిబంధనల్ని కఠినతరం చేసి ఆ రుణాన్ని రూ.26 కోట్లకు పరిమితం చేసింది. దీని ద్వారా 305 మందికే ఆర్థికసాయం అందించినట్లు సమాచారం.

-టిఎన్‌. ‌భూషణ్‌

About Author

By editor

Twitter
Instagram