ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు వామపక్ష భావజాలానికి, వారి నిర్వచనాలకు దూరం జరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా కూడా ముందుగా తమ దేశాన్ని, అస్తిత్వాన్ని, జీవన విధానాన్ని కాపాడుకునేందుకు  ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు ఐరోపా నుంచి నేపాల్‌ వరకూ కనిపిస్తున్నాయి. దాదాపు దశాబ్దన్నర కాలం కిందట రాచరికం నుంచి ప్రజాస్వామ్యంగా పరివర్తన చెంది, హిందూరాష్ట్రంగా ఉండటానికి ఇష్టపడక సెక్యులరిజాన్ని ఆలింగనం చేసుకున్న నేపాల్‌లో ఇప్పుడు ప్రజలు తిరిగి వెనక్కి వెళ్లిపోదాం అని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంతటి స్వల్పకాలంలోనే ప్రజలు రాచరికానికి, హిందూ రాష్ట్రానికీ తిరిగి పోవాలని కోరుకోవడానికి కారణం రాజకీయ వర్గాల వైఖరే. ప్రజాహితాన్ని మించిన రాజకీయ అస్థిరతే.

నవంబర్‌ నెల ఆఖరివారంలో దేశ రాజధాని నగరం ఖాట్మాండులోకి ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహం ప్రభుత్వాన్ని, పాలనా యంత్రాంగాన్నీ కూడా తీవ్రమైన ఆశ్చర్యానికి లోను చేసింది. గత కొద్దికాలంగా, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో జరుగుతున్న ప్రజా ప్రదర్శనలను, ప్రభుత్వం రాజీనామా చేయాలని, ప్రస్తుత ప్రజాస్వామం స్థానంలో రాజ్యాంగపరమైన రాచరికాన్ని తిరిగి తీసుకురావాలంటూ వారు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు.

అసలు ఈ ఉద్యమం ఇంతై, ఇంతింతై… అన్నట్టుగా పెరుగుతుందని కూడా ఊహించలేక పోయింది. ‘దేశం, జాతీయత, మతం, సంస్కృతి పరిరక్షణకు పౌర ఉద్యమం’ (రాష్ట్ర, రాష్ట్రీయత, ధర్మ, సంస్కృతి ఔర్‌ నాగరిక్‌ బచావో ఆందోళన్‌) మద్దతుదారులు నవంబర్‌ 23న ఖాట్మాండు శివార్లలో పోగయ్యి, మాజీ రాజు గ్యానేంద్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ నగరం మధ్యలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనితో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. ఖాట్మాండు సహా దేశంలో ఏ జిల్లాలోనూ నిరసన ప్రదర్శనలు, సభలు జరపడానికి వీలు లేదంటూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

వాస్తవానికి నేపాల్‌లో ఇటువంటి ఉద్యమాలు కొత్త కాదు. 2006లో వారాల తరబడి వీధుల్లో ప్రజలు ఉద్యమించడంతో రాజు గ్యానేంద్ర తన రాచరికాన్ని వదులుకొని ప్రజాస్వామిక యుగానికి తెరలేపారు. రెండేళ్ల తర్వాత, అంటే 2008లో రాచరికాన్ని అధికారికంగా రద్దు చేయడంతో దేశ చరిత్ర ఒక కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. దేశంలో 1996 నుంచి 2006 మధ్య 17వేల మందికిపైగా ప్రజలను హననం చేసిన మావోయిస్టు తిరుగుబాటును అంతం చేసేందుకు 2008లో కుదిరిన ఒప్పందం కింద ప్రత్యేకంగా ఎన్నికైన రాజ్యాంగ సభ 239 ఏళ్ల రాచరిక వ్యవస్థను రద్దు చేసి, ఫెడరల్‌ రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసింది. ఇదే నేపాల్‌ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసింది. రాచరికం రద్దు అయినప్పటి నుంచీ, నేపాల్‌లో ఇప్పటివరకూ 10సార్లు ప్రభుత్వాలు మారాయి. ఆర్ధికాభివృద్ధి లేక యువత మలేసియా, దక్షిణ కొరియా, మిడిల్‌ ఈస్ట్‌కు వలుస పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికి తోడుగా, 80శాతం హిందువులు ఉన్న నేపాల్‌ను, మతపరమైన తటస్తకు కట్టుబడి ఉంటామంటూ నాటి రాజ్యాంగ సభ దానిని సెక్యులర్‌ రాజ్యంగా ప్రకటించడంపట్ల ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు హిందువు లంతా కూడా తమ దేశం హిందూ రాజ్యంగానే గుర్తింపు పొందాలని కోరుకుంటున్నారు.

పౌర ఉద్యమానికి కారణాలు

అధికారం కోసం పార్టీలు పోటీపడుతుండడంతో దేశంలో పలు సమస్యలు తలెత్తుతున్న సంకేతాలు పొడచూపడం ప్రారంభించాయి. దాదాపు 240 ఏళ్ల రాచరికాన్ని రద్దు చేస్తూ మే, 28, 2008లో నేపాల్‌ను ఫెడరల్‌ డెమొక్రెటిక్‌ రిపబ్లిక్‌గా రాజ్యాంగ సభ ప్రకటించినప్పటి నుంచే నేపాల్‌కు అవస్థలు మొదలయ్యాయి. తర్వాత ప్రజాస్వామ్యం పేరుతో రాజకీయ పార్టీలు పాల్పడుతున్న అంతర్‌ పార్టీ పోరాటాలు, అవినీతి ప్రజలకు విసుగు పుట్టించాయి. ముఖ్యంగా, కొవిడ్‌ మహమ్మారి కాలంలో దానిని నియంత్రించేందుకు తగిన చర్యలు లేకపోవడం రాజకీయ వ్యవస్థ అసమర్ధతను పట్టి చూపింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం (7.7శాతం)తో పాటు విపరీతమైన నిరుద్యోగం (19శాతం), ఆర్ధిక సంక్షోభం, సరైన పాలన లేకపోవడం ప్రజలలో రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజకీయ అస్థిరత, నిరుద్యోగం, ఆర్ధిక పరిస్థితి, ఖాట్మాండు ఆవల సరైన భౌతిక మౌలిక సదుపాయాలు లేకపోవడం, అరకొర వైద్య, విద్యా సౌకర్యాలు, పనిచేయని సామాజిక భద్రత వంటి మౌలిక విషయాలే నేపాలీలకు ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల నమ్మకం కోల్పోయేలా చేశాయని విశ్లేషకుల భావన.

నైతికత లేని రాజకీయ పార్టీలు

రాజకీయ నైతికతను పాటించకుండా దేశంలోని అగ్ర రాజకీయ నాయకులు కూడా అధికారం కోసం పరుగులు తీయడం, ఫలితంగా ఏర్పడుతున్న రాజకీయ అస్థిరతలు మెజారిటీ ప్రజలకు విసుగుతెప్పిస్తున్నాయి.

అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాలు ఏవీ కూడా ఇచ్చిన హామీలు నిలుపుకోలేక పోవడం ప్రాథమికంగా ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. దీనితో ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను అవినీతిమయమైనవిగా, నాయకులు నైతికత లేని అధికార దాహం కలిగిన వారిగా పరిగణించడం ప్రారంభమైంది. అందుకే ప్రస్తుత రాజకీయ వ్యవస్థను సరిగా పని చేయనిదానిగా, దేశంలో రాజకీయ నాయకుల ప్రయోజనాలను నెరవేర్చేదానిగా ప్రజలు చూస్తున్నారు.

అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దేశవ్యాప్తంగా మూడు లక్షలమంది ప్రజలు కష్టపడి సంపాదించు కున్నదంతా శక్తిమంతమైన, రాజకీయ నాయకుల అండదండలు కలిగిన సహకార సంఘాలు, మైక్రోఫైనాన్స్‌ కంపెనీలు దోచుకోవడం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి లోను చేసింది.

ఉద్యమ డిమాండ్లు

ప్రజా డిమాండ్లు అత్యంత స్పష్టంగా సూటిగా ఉన్నాయి. అవి ` రాజు గ్యానేంద్ర బీర్‌ బిక్రమ్‌ షా దేవ్‌, నేపాల్‌ క్రియాశీలక రాజుగా పగ్గాలు చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేస్తూ ఎన్నికైన మావోయిస్టు ప్రధానమంత్రి పుష్ప కమల్‌ దహాల్‌ (ప్రచండ) రాజీనామా.

రెండవది, సెక్యులరిజాన్ని త్యజించి నేపాల్‌ను తిరిగి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. మెజారిటీ హిందూ ప్రజలు రాజును విష్ణుభగవానుడి రూపంగా పరిగణిస్తారు. 2008లో రాజును అవమానకరంగా తొలగించారనే భావన కూడా వారిలో ఉన్నది.

ఈ క్రమంలోనే తిరిగి నేపాల్‌ను 2008కు ముందులా రాజ్యాంగబద్ధమైన రాచరికం (1990లో రాజు బీరేంద్ర ప్రకటించినట్టుగా) లాగా రాజుకు నిజమైన అధికారాలు ఉండగా, ప్రధానమంత్రి పదవి కోసం ఎన్నికలలో పోటీ చేసే పద్ధతిని పునరుద్ధరించా లన్న డిమాండ్‌ కూడా పుట్టింది.

తమ దేశాన్ని తిరిగి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌ వెనుక మరొక కారణం కూడా ఉన్నది. నేపాల్‌ను సెక్యులర్‌ దేశంగా ప్రకటించడంతో క్రైస్తవ, ఇస్లాం మతవ్యాపకులకు తలుపులు తెరిచినట్టు అయింది. దేశంలో ఉన్న దారిద్య్రాన్ని ఆసరాగా చేసుకుని, ఈ కొద్ది కాలంలోనే వారు ప్రజలకు ప్రలోభాలు ఆశచూపి అనేకమందిని క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మతాంతరీకరించారు. ఇది మెజారిటీ హిందువులను ఆగ్రహానికి గురిచేస్తోంది.

పైగా, కొత్తగా మతం పుచ్చుకున్నవారు హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు చేయడం, వాటిని ధ్వంసం చేయడం అన్నది దేశంలో నూతన సామాజిక ఉద్రిక్తలకు తెరలేపుతున్నది. అందుకే, ప్రజలు నేపాల్‌ను తిరిగి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు నలువైపుల నుంచీ మద్దతు కూడా లభిస్తున్నది.

వీటన్నింటికీ తోడుగా, యువత నిరుద్యోగిత, బలహీన ఆర్ధిక వ్యవస్థ కారణంగా అగమ్యగోచరమైన భవిష్యత్తును ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారు గతమే మేలు వచ్చు కాలము కంటెన్‌ అన్న భావనలోకి వస్తున్నారు.

ఈ డిమాండ్లన్నీ తిరోగమనవాదాన్ని అవలంబి స్తున్నట్టుగా, వారికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి తెలియనట్టుగా అనిపిస్తాయి. కానీ, వాస్తవం అది కాదు, ప్రజలకు తమ రాజ్యాంగపరమైన హక్కుల గురించి, ప్రజాస్వామ్యం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన ఉంది. కానీ, రాచరిక రద్దు తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ వారి ఆకాంక్షలను నెరవేర్చకుండా వారిని నిరాశ పరచడంతో వారికి మరొక ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

అవినీతి, రాజకీయ అస్థిరతలతో కూడిన ప్రజాస్వామ్యం వారికి చేటు చేసిందే తప్ప ఏ రకంగానూ మేలు చేయలేకపోయిందన్న భావన ప్రజలలో నానాటికీ పెరిగిపోతున్నది.

రాచరిక అనుకూల ఉద్యమానికి ప్రసేన్‌ అనే వ్యాపారవేత్త నేతృత్వం వహిస్తున్నాడు. గతంలో సిపిఎన్‌(యుఎంఎల్‌)తో అధిపతి ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలితో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి. కొద్దికాలం కింద అవి చెడడంతో ప్రసేన్‌ ప్రస్తుత పాలనా వ్యవస్థపైనే కాదు, ఓలిపై కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓలి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడని, ఆ సంపదనంతా కంబోడియాలో రియల్‌ ఎస్టేట్‌, ఇతర వెంచర్లలో పెట్టుబడిగా పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలను ఓలి తీవ్రంగా ఖండిరచినప్పటికీ, ప్రజలు వాటిని విశ్వసించారు, ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఆగ్రహం కేవలం ఓలికి పరిమితం కాకుండా ప్రస్తుతం ప్రచండ నేతృత్వంలోని  ప్రభుత్వానికి వ్యతిరేకతగా మారింది.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో గమనించిన ప్రసేన్‌ తన స్వంత వనరులను ఉపయోగించి , దేశంలో భిన్న ప్రాంతాలలో చిన్న చిన్న ఉద్యమాలను ప్రారంభించారు. గత నెల 23న ఖాట్మాండులో నిర్వహించిన భారీ ర్యాలీకి వీటిని రిహార్సల్స్‌గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అన్ని సమాజాల్లో నడుస్తున్న సరళిలాగే ప్రసేన్‌ కూడా సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని, ప్రజా మద్దతును ముఖ్యంగా, నిరుద్యోగ యువతను, నిరుపేదలను ఆకర్షించారు. ఆయన ఫేస్‌ బుక్‌ పేజీని, టిక్‌టాక్‌ వీడియోలను అనుసరించే ప్రజల సంఖ్య దేశంలోని ఏ రాజకీయనాయకుడికీ, సెలబ్రిటీకి లేనంతగా భారీగా ఉంది. రాజకీయ నాయకులను, ప్రస్తుత పాలనా వ్యవస్థను విమర్శిస్తూ ఆయన పోస్ట్‌ చేసే ప్రకటనలు, ఉపన్యాసాలకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. మిలియన్ల కొద్దీ వ్యూలను ఆ వీడియోలు మూటగట్టుకుంటున్నాయి.

రాచరికం తిరిగి రావాలని, నేపాల్‌ను తిరిగి హిందూ రాష్ట్రంగా మార్చాలని డిమాండ్‌ చేసే మరొక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆంపీపీి), ఈ ఉద్యమానికి ప్రత్యక్షంగా, అధికారికంగా మద్దతు ఇవ్వకపోయినా, అనేకమంది ఆర్‌పిపి నాయకులు పరోక్షంగా ఈ ఉద్యమానికి సహాయం చేస్తున్నారు.

ఈ ఉద్యమం ఇంత తీవ్రరూపం దాలుస్తుందని ప్రచండ ప్రభుత్వం కూడా ఊహించలేదు. అందుకే, మొదట్లోనే దీనిని అణచివేసే ప్రయత్నం చేయలేదు. తనపై ఆరోపణలు వచ్చినప్పటికీ, ప్రధాని సరైన రీతిలో స్పందించకపోవడంతో ప్రధాని దహాల్‌ (ప్రచండ), నేపాలీ కాంగ్రెస్‌ (అధికారంలో ఉన్న కూటమిలో అతిపెద్ద పార్టీ) కూడా నిశ్శబ్దంగా ప్రసేన్‌కు తోడ్పడుతున్నారంటూ ఓలీ విరుచుకు పడుతున్నారు.

కానీ ఈ ఉద్యమం ఉధృతమై ప్రభుత్వం రాజీనామా చేయాలని, ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో రాజ్యాంగపరమైన రాచరికాన్ని తేవాలన్న డిమాండ్లు ఊపందుకోవడంతో ప్రభుత్వంలో కూడా కొంత చలనం వచ్చినప్పటికీ, అప్పటికే ఉద్యమం ఏ స్థాయిలో విస్తరించిందో, ప్రజలలోకి ఎంత లోతుగా చొచ్చుకు పోయిందో ప్రధాని కానీ, ఇతర నాయకులు కానీ ఊహించలేకపోయారు. గత నెల ప్రదర్శనల కోసం వేలాదిమంది ప్రజలు దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఖాట్మాండుకు వస్తున్నారని నిఘావర్గాల నివేదికలు అందిన తర్వాత వారు ప్రసేన్‌ ప్రణాళికను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే టిక్‌ టాక్‌ను ప్రభుత్వం నిషేధించింది. కానీ, ప్రతి నిషేధంలాగానే ఇది కూడా విఫలమైంది. ప్రజలు ప్రైవేట్‌ నెట్‌వర్కుల ద్వారా ఈ సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు.

గత నెల ప్రదర్శనలకు ప్రజలు ఖాట్మాండు రాకుండా నిలువరించడం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది, పెద్ద ప్రభావాన్ని చూపలేకపో యింది. ఇందుకు కారణం రాజధానికి వస్తున్న ప్రజల సంఖ్య చెక్‌పోస్టులలో ఉన్న పోలీసులను మించి ఉండటమే. పైగా అన్ని వైపుల నుంచీ చుట్టుముట్టి నట్టుగా ప్రజలు వచ్చారు. దీనిని ప్రభుత్వం ఊహించలేదు.

అంతేకాదు, ప్రసేన్‌ ఉద్యమ మద్దతుదారులు అదే రోజున అతడికి ప్రతిగా వీధుల్లోకి సిపిఎన్‌ (యుఎంఎల్‌) కేడర్‌ను మించి ఉండటమన్నది దేశ రాజకీయ నాయకులకు ఒక షాక్‌ ఇచ్చిందనడం అతిశయోక్తి కాదేమో!

కేడర్‌ ఆధారిత పార్టీ అయిన సీపీఎన్‌ (యుఎంఎల్‌)కు దేశవ్యాప్తంగా లక్షలాది మంది సభ్యులు ఉండటమే కాదు, నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించడంలో ముందుండేవారు. ఎటువంటి వ్యవస్థలేకుండా స్వచ్ఛం దంగా పెరుగుతున్న ఉద్యమంలోని ప్రజలు ఒక వ్యవస్థీకృత పార్టీ కేడర్ల సంఖ్యను మించిపోవడం సిపిఎన్‌ (యుఎంఎల్‌) పార్టీ నాయకత్వాన్నే కాదు, ఇతర పార్టీల నాయకత్వానికి కూడా ఇబ్బందిని, ఆందోళనను కలిగించింది. వీటన్నింటికీ మించి, హింసాత్మక చర్యలకు పాల్పడడంలో సాటిలేనివారనే పేరున్న సీపీఎన్‌ (యుఎంఎల్‌) కేడర్లపై ప్రసేన్‌ ఉద్యమానికి చెందిన కార్యకర్తలు దాడి చేయడం వారిలో రగులుతున్న ఆగ్రహాన్ని వెల్లడిస్తోంది. ఇది నేపాల్‌లోని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలనా కూటమిలో సభ్య పార్టీలలో భయాన్ని రేకెత్తించింది.

ఎందుకంటే, గతంలో కూడా వీధి ప్రదర్శనలు భారీగా ఊపందుకొని, నాటి ప్రభుత్వాలను కూల్చివేసిన చరిత్ర ఉంది. దీనితో ప్రచండ, ఆయన పార్టీ సహచరులతో పాటు నేపాలీ కాంగ్రెస్‌ నాయకులందరూ కూడా ఈ పరిణామానికి అయోమయానికే కాదు ఆందోళనకు కూడా గురయ్యారు. తనదైన ఉద్వేగాన్ని, సజీవతను కలిగిన ప్రసేన్‌ ఉద్యమాన్ని అణచివేయడం ఎలాగో వారికి అర్థం కావడం లేదు. హింసాత్మకంగా వారిని అణచివేస్తే, ప్రజాగ్రహాన్ని మరింతగా చవి చూడాల్సి వస్తుందని వారికి తెలుసు. కానీ, ఉద్యమం కొనసాగేందుకు అనుమతించి, నేపాల్‌ అస్థిరం అయితే, అది తమ భవిష్యత్తుకే దెబ్బ అనే విషయం కూడా తెలుసు.

ఈ పరిస్థితుల్లో, ప్రదర్శన మరురోజే ప్రసేన్‌ను అనధికారిక గృహనిర్బంధంలో ప్రభుత్వం ఉంచింది. కానీ ఈ చర్య అతడి అనుచరుల ప్రదర్శనలు చేయడాన్ని నిలువరించలేకపోయింది. ఎటువంటి సంస్థాగత వ్యవస్థాలేని ఉద్యమాన్ని ఏమీ చేయకుండా వదిలివేస్తే అదే అదృశ్యమవుతుందని రాజకీయ వ్యవస్థలో ఒక వర్గం భావిస్తోంది. ముఖ్యంగా, పరిమిత ఆర్ధిక వనరుల కారణంగా ఉద్యమం తానంతట తానుగా ఆవిరైపోతుందన్నది వారి భావన. కానీ, దేశంలోని నిఘా, భద్రతా వర్గాలు మాత్రం అలా ఏమీ చేయకుండా వదిలివేస్తే ఉద్యమం మరింత బలపడి దేశంలో అరాచకాన్ని సృష్టిస్తుందని భావిస్తున్నారు. పైగా ప్రసేన్‌ ఉద్యమానికి బయట నుంచి నిధులు వస్తున్నాయని నిఘావర్గాల భావన. కానీ, దీనికి ఆధారాలు ఏమీ నికరంగా కనిపించక పోవడంతో వారు ప్రస్తుతానికి ఎటువంటి ఆరోపణలు చేయడంలేదు.

ఇది ఇలా ఉండగా, రాజు గ్యానేంద్ర హాజరయ్యే ప్రతి కార్యక్రమానికీ ప్రజల మద్దతు పెరుగుతున్నది. ఇటీవలే ఆయన ఆధునిక నేపాల్‌ వ్యవస్థాపకుడు రాజు పృధ్వీ నారాయణ్‌ షా విగ్రహాన్ని ప్రారంభించేందుకు నేపాల్‌లోని వాయువ్య జిల్లా రaాపాకు వెళ్లినప్పుడు వేలాదిమంది ప్రజలు ఆయనకు మద్దతుగా వీధులలోకి వచ్చారు. దాదాపు ఎనిమిదివేలకు పైగా ద్విచక్రవాహనాలు, మరొక వెయ్యి వాహనాలు, రాజు గ్యానేంద్రను కార్యక్రమ స్థలివరకూ అనుసరించడం కూడా దేశంలో సంచలన వార్తే అయింది. అలాగే, రాజు ఎక్కడికి వెడితే అక్కడ ప్రజలు ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. ఈ వైఖరి అంతా కూడా నేపాలీ ప్రజల ఆకాంక్షలను భగ్నం చేసిన రాజకీయ నాయకులకు చేటు తెస్తుందన్నది మెజారిటీ భావన.

ఏది ఏమైనాప్పటికీ, అంతర్గతంగా నేపాల్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. మావోయిస్టులు, నాటి ప్రభుత్వానికీ మధ్య జరిగిన శాంతి ఒప్పందం అన్నది అధికారాన్ని చేపట్టేందుకు ఒక మార్గంగా ఉన్నదే తప్ప ప్రజలకు న్యాయం చేసేట్టుగా లేదన్నది నేపాలీల భావన. శాంతి అనేది ఒక పరిస్థితికి ముగింపు కావలసి ఉన్నప్పటికీ, అక్కడ అది అక్కడ చోటు చేసుకోలేదనే విషయం గత నెలలో జరిగిన పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

– నీల

About Author

By editor

Twitter
YOUTUBE