రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రాబోయే కరవును సూచిస్తున్నాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన జలాశయాలైన తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల, వెలిగోడు, సోమశిల, కండలేరుల్లో నీరు అడుగంటింది. వీటిలో గత సంవత్సరం ఇదే సయయానికి 807.69 టీఎంసీల నీటి నిల్వలు ఉంటే ప్రస్తుతం 343.41 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వర్షాలు పడక, ప్రాజెక్టుల నీటిమట్టం, భూగర్బజల నీటిమట్టం తగ్గిపోవటంతో సాగులో ఉన్న పంటలు ఎండిపోయి దిగుబడులపై ప్రభావం పడిరది. ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 34.39 లక్షల హెక్టార్లు కాగా 24.98 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. కొందరు బోర్లు, బావులు తవ్వించి అయినా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు చెరువులు, కుంటల్లో అడుగంటిన బురద నీటినే మోటార్లు, డీజిల్‌ ఇంజిన్ల సాయంతో కిలోమీటర్ల కొద్దీ పైపులైన్లు వేసి తరలిస్తున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తుడుపు తున్నారు. నాలుగైదు తడులు ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇరిగేషన్‌ అధికారులను కలసి ఒక్క తడికైనా నీరివ్వాలని ప్రాధేయ పడుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు. ఎండ తీవ్రత అంత కంతకూ పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు వచ్చినా వర్షాభావం కొనసాగుతోంది. మరో నెల పొడి వాతావారణం కొనసాగితే పశుగ్రాసానికీ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఖరీఫ్‌లో పంట వేయలేక పోయిన రైతులు రబీలో వేద్దామన్నా. పంటకు నీరు అందుతుందనే నమ్మకం లేదు. విత్తనం నాటితే మొలకెత్తే వాతావరణం లేని పరిస్థితి ఉంది.

రాష్ట్రంలోని 20 జిల్లాల్లో జూన్‌ నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నా, భారత వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం 26 జిల్లాల్లోనూ వానలోటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు నెలలో 10శాతం కూడా వాన పడలేదు. 679 గ్రామీణ మండలాలకుగాను 446 మండలాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. 221 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షమే పడిరది. కేవలం12 మండలాల్లోనే ఆధికవర్షాలు కురిశాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా, రాయలసీమ, కోస్తాలోని మిగతా జిల్లాల్లో సగానికి పైగా మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. పంట వేసిన రైతులు గాలిలో దీపం పెట్టినట్లు భావిస్తున్నారు. వర్షాభావంతో పాటు, ఎండ తీవ్రతతో విత్తనం వేసినా మొలకెత్తడం కష్టమని, వాన పడితే చూద్దాంలే అన్నట్లు చాలామంది. రైతులు ఉన్నారు. ఈ సమయంలో రాయలసీమ, దక్షిణకోస్తాలో వానలు పడితేనే ఈ ప్రాంతాల్లో రబీ శనగ, వేరుశనగ, అపరాలు ఎక్కువగా సాగు చేసే అవకాశం ఉంది.

బాపట్ల జిల్లాలో సాగునీరందక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కాలువల మరమ్మతులు చేపట్టక పోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని దుస్థితిని ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడులో జిల్లాలో 3.14 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, కందిపంటల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. అన్నదాతలు స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులను కలసి సాగునీరు ఇప్పించాలని మొర పెట్టుకుంటున్నారు.

కృష్ణాజిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 4.10 లక్షల ఎకరాల్లో రైతులు వరినాట్లు వేశారు. ప్రకాశం బ్యారేజీకి సమీపంలో ఉన్న కంకిపాడు, ఉయ్యూరు తదితర మం డలాల రైతులకు సైతం సాగునీరు సక్రమంగా అందడం లేదు. శివారు ప్రాంతా లైన కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తి వెన్ను, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోనూ నీరులేక ఎండిపోయే స్థితికి చేరాయి.

ప్రకారం జిల్లాలో ఖరీఫ్‌లో 5.36 లక్షల ఎకరాలకుగాను, రెండొంతులు మాత్రమే సాగైంది. వ్యవసాయశాఖ సమాచారం ప్రకారం 3.53 లక్షల ఎకరాలలో సాగైనట్లు ఉండగా ప్రధాన మెట్ట పంటలైన కంది, పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో రెండొంతుల విస్తీర్ణంలో మాత్రమే పైర్లు పడ్డాయి. అక్టోబరులో వర్షాలు పడక రబీ పంటల్లో ఏ ఒక్కటీ ముందుకు సాగలేదు. ప్రధానంగా ఈ సమయంలో జిల్లావ్యాప్తంగా పొగాకు విస్తారంగా సాగు చేస్తారు.

అన్నమయ్య జిల్లాలో పంటల పరిస్థితి దయనీయంగా తయారైంది.. ఈసారి వేరుశనగ పంట రైతును కుదేలు చేసింది. జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ వేశారు. పంటకు అవసరమైన నీరందక మూడుకాయలు, ఆరు బుడ్డలుగా దిగుబడి ఉండడంతో బావురుమంటున్నారు. ఒకప్పుడు ఖరీఫ్‌ కాలంలో కళకళలాడే పంటభూములు ఇప్పుడు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో వందకు పైబడి చెరువులు, కుంటలు, లక్షకు పైబడి బోరుబావులు వంటి నీటి వనరులు వర్షాభావంతో పూర్తిగా అడుగంటాయి.

ఉమ్మడి కడప జిల్లాలో పెన్నానదిలో అరకొర వరదనీరు పోతుందే తప్ప, బాహుదా, చెయ్యేరు, గుంజనేరు, పుల్లంగేరులలో వర్షాలు లేక చుక్కనీరు లేకుండా ఉన్నాయి. వీటి కింద లక్ష ఎకరాలకు పైబడి అరటి, మామిడి, నిమ్మ, బొప్పాయి, చెరువుల కింద సుమారు లక్ష ఎకరాల వరకు వరి పంటను సాగు చేస్తారు. అయితే గత రెండేళ్లుగా పూర్తిస్థాయిలో వర్షం కురవక పోవడంతో చెరువులన్నీ చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి.

అనంతపురం జిల్లాలో కరువు ఘంటికలు మోగుతున్నాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడక దీంతో సాగు విస్తీర్ణం తగ్గింది. ఖరీఫ్‌లో రైతులకు ఖర్చు మాత్రమే మిగిలింది. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలుపడి ఉంటే దాదాపు 4 లక్షల హెక్టార్లల్లో పంటలు సాగయ్యేవి. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ సారి 2.40 లక్షల హెక్టార్లల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు. కీలక సమయంలో వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాల్లో వేరుశనగ ఎండిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో పొలాల్లో చూసేందుకు పైరు పచ్చగా ఉన్నా కాయలు కాయలేదు. కొన్ని చోట్ల చెట్టుకు రెండు, మూడు కాయలు కాశాయి. చాలా చెట్లను పెరికి చూస్తే ఊడలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

ఈసారి పంట దిగుబడి రాకపోవడంతో బాధిత రైతులు గుండెలు బాదుకుం టున్నారు. ఇప్పటికే విడపనకల్లు, గుత్తి మండలంలోని గొందిపల్లి, జక్కల చెరువు, గాజులపల్లి, కొత్తకోట, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో వేరుశనగ పంటను తొలగిం చారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా పంటను తొల గించేందుకు సిద్ధమవుతున్నారు.. వేరుశనగతోపాటు ఆముదం, పత్తి పంట కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు.

విజయనగరం జిల్లాలో పంటల సాగు దినదినగండంగా మారింది. ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటలూ కలిపి 2.9 లక్షల ఎకరాల్లో సాగవగా, అత్యధికంగా 2.35 లక్షల ఎకరాల్లో వరి వేశారు. ఇందులో లక్ష ఎకరాల వరకు నీటి ఎద్దడి నెలకొంది.

విద్యుత్‌ కనోతలు

లో ఓల్టేజీ సమస్యతో పాటూ విద్యుత్‌ కోతలు వేధిస్తున్నాయి.వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామన్న ప్రభుత్వ హామీలు నీటి మూటలయ్యాయి. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు.

మిర్చి రక్షణకు తంటాలు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో లక్షల రూపాయల పెట్టు బడులు పెట్టిన పంట కళ్లముందే ఎండి పోతుంటే ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్లతో రక్షక తడులు అందిస్తున్నారు. ఇప్పటికే రైతులు ఎకరాకు 80వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు. ట్యాంకర్ల కోసం రూ.25`30 వేలు వెచ్చించవలసి వస్తోంది.

స్పందించని ప్రభుత్వం

పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడంలేదు. సమగ్ర సాగునీటి సరఫరా విధానాలను ప్రభుత్వం విస్మరించింది. వర్షాభావం వ్యవసాయంపై ప్రభావం పడిరది. దీంతో గ్రామీణ రైతు కూలీలు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. వందలాది గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. అయినా, ముఖ్యమంత్రి వ్యవసాయ, ఉద్యాన, జలవనరుల శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించ లేదు. ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించలేదు. కరువు మండలాలుగా ప్రకటించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్న కనీస విజ్ఞత రాష్ట్ట్ర ప్రభుత్వానికి కొరవడిందని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ఆదుకునేందుకు వెంటనే సమీక్షలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని రైతాంగం ముఖ్య మంత్రిని కోరుతోంది.

 ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. రబీ పంట కాలానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలి. నష్టపోయిన పంటలను ఎన్యుమరేషన్‌ చేసి ఆహార పంటలకు నష్టపరిహారం చెల్లించాలి. వాతావరణ పంటల బీమా, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి వలసల నివారణకు చర్యలు చేపట్టాలి. ఖరీఫ్‌ కాలంలో రైతులు, కౌలు రైతులు తీసుకున్న అన్ని రకాల అప్పు లను రద్దుచేసి, రబీ పంట కాలానికి తిరిగి వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. రబీలో పంటలు వేసే రైతాంగానికి 90శాతం సబ్సిడీతో విత్తనాలు, పశుగ్రాసం, దాణా ఉచితంగా అందించాలనే డిమాండ్లు వస్తున్నాయి.

టి.ఎన్‌.భూషణ్‌ : సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram