ఒక రాష్ట్రం రెండుసార్లు ఆవిర్భావ దినోత్సవం చేసుకోవటం విచిత్రమైన విషయం. ఆంధప్రదేశ్‌ ‌విషయంలో ఇది జరిగింది. మొదటిసారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రాంతం విడివడింది. ఆంధ్రులు ఆరంభశూరులు కారని తన మరణంతో నిరూపించి, ఆంధప్రదేశ్‌ ఏర్పడటానికి, దానితో పాటు దేశమంతటా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు కారణభూతుడు అయిన వ్యక్తి  పొట్టి శ్రీరాములు. వారి సంక్షిప్త జీవిత చిత్రణ ఈ ‘అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ’.

‘పొట్టి శ్రీరాములు వంటి నిస్వార్థపరులైన దేశభక్తులు పది పన్నెండుమంది ఉంటే స్వరాజ్యాన్ని ఏనాడో సాధించి ఉండేవాడిని’ అంటూ గాంధీజీ నుండి ప్రశంసలందు కున్న వ్యక్తి. గాంధీ తత్వాన్ని గాంధీజీకంటే ఎక్కువగా ఆచరించి చూపిన గాంధేయవాది. ముప్ఫై ఏళ్ల చిన్న వయసులోనే తన వారందరినీ పోగొట్టుకుని మానసి కంగా సన్యాసం స్వీకరించిన వ్యక్తి. ఉద్యోగమా? స్వాతంత్య్ర పోరాటమా? తేల్చుకోవలసి వచ్చినపుడు మంచి భవిష్యత్తు ఉన్న రైల్వే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలివేసిన త్యాగశీలి. సామాజిక సమరసత కోసం ఒంటరిగా పోరాడిన ధైర్యశాలి. 1952లో ప్రభుత్వం నిర్వహించిన సమావే శానికి హాజరై పదహారు రూపాయల భత్యం తీసుకునే అవకాశం ఉన్నా రూపాయిన్నర మాత్రమే ఖర్చయిందని, అంతే స్వీకరించిన ఆదర్శవాది. గాంధీజీ ఆదేశాల మేరకు బిహారు భూకంప బాధితులకు సేవలందించిన సేవామూర్తి.

హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం మొదటి నిరసన దీక్ష చేశారు.

‘హరిజన సేవా దినోత్సవం కోసం రెండుసార్లు నిరాహారదీక్ష చేశారు.

1952లో చివరిగా చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష వారి ఆత్మార్పణతో ముగిసింది.

ఖాదీ ప్రచారం, వెల్లి కార్మికుల ఇక్కట్లు, మద్యపాన నిర్మూలన, జైళ్ల సంస్కరణలు, విద్యార్థుల సమస్యలు, హిందూ ముస్లిం ఐక్యత వంటి సమస్యలపై వారు కృషి చేశారు. తొంభై నాలుగు పేజీల ఈ చిన్న పుస్తకంలో వీలైనంత ఎక్కువ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. రచయిత డా।। నాగసూరి వేణుగోపాల్‌. ఆకాశవాణిలో వివిధ హోదాలలో పనిచేసి ఉద్యోగ విరమణానంతరం అనేక గ్రంథాలు వెలువరించే ఆంధప్రదేశ్‌ ఏర్పడటానికి, దానితో పాటు దేశమంతటా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు కారణభూతుడు, క్రమంలో ఉన్నారు.

ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల చరిత్ర గురించి అధ్యయనం చేయాలనుకునే వారికి కరదీపికగా ఉపయోగపడుతుంది.

అమరజీవి

పొట్టి శ్రీరాములు పోరాట జీవిత గాథ

రచన: డా. నాగసూరి వేణుగోపాల్‌

‌ప్రతులకు: కల్యాణలక్ష్మి నిలయం,

బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌డియా లేన్‌, ‌నల్ల కుంట, హైదరాబాద్‌ – 500044

‌సెల్‌: 9032428526 

సమీక్ష :  వింజనంపాటి రాఘవరావు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram