–  క్రాంతి, సీనియర్ జనర్నలిస్ట్ 

రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు కొత్త కాదు.. కానీ కొన్ని అమితాశ్చర్యానికి గురి చేస్తాయి. మూడు రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరేసిన బీజేపీ వాటి ముఖ్యమంత్రుల ఎంపికను కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగానే చేసింది. సీనియర్‌ నేతలను కాదని కొత్త ముఖాలను తెర మీదకు తీసుకువచ్చింది. రాజస్తాన్‌లో భజన్‌లాల్‌ శర్మ, మధ్యప్రదేశ్‌లో మోహన్‌ యాదవ్‌, ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుదేవ్‌ సాయ్‌లను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంలో ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ కాస్త సమయం తీసుకోవడం విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా సీఎంలు ఎవరన్నదానిపై స్పష్టత రాకపోవడం నేతలు, కార్యకర్తలను సందిగ్ధంలో పడేసింది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే ముఖ్యమంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్న దిగ్గజాలు ఉన్నారు. అయినా సీఎంల ఎంపికలో ఆచితూచి వ్యవహరించింది జాతీయ నాయకత్వం. చివరకు అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రిని అధిష్ఠానం ప్రకటిస్తుంటే విస్తుపోవడం ప్రతిపక్షాల వంతయింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా తమ మార్కు చూపించారు. ఈ ఎంపికను గమనిస్తే అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సామాజిక సమతూక మంత్రం

మధ్యప్రదేశ్‌లో ఓబీసీ.. రాజస్థాన్‌లో బ్రాహ్మణుడు.. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుడు.. బీజేపీ ముఖ్యమంత్రులుగా కొలువు దీరారు. బీజేపీ చెప్పే ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌.. సబ్‌కా ప్రయాస్‌’ మంత్రానికి నిర్వచనం ఈ ఎంపిక.

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్రాల్లో బలహీనవర్గాల ప్రభావం ఎక్కువ. మధ్యప్రదేశ్‌ జనాభాలో ఓబీసీ జనాభా యాభై శాతానికిపైనే. అందులో అరవై శాతం యాదవులే. బీజేపీ బీసీలకు సమున్నత స్థానం కల్పిస్తోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌ యాదవ్‌కు ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. పొరుగున ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్‌ యాదవ్‌, బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన లాలు ప్రసాద్‌యాదవ్‌ బలమైన నాయకులుగా ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వీరి ప్రభావం ఈ రెండు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంది. ఇప్పడు మధ్యప్రదేశ్‌కు మోహన్‌ యాదవ్‌ను ఎంపిక చేసి అఖిలేశ్‌, లాలులకు గట్టి సవాలు విసిరింది.

రాజస్తాన్‌ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనూ బీజేపీ అధిష్ఠానం సామాజిక వర్గాన్ని కీలకంగా తీసుకుంది. రాజస్తాన్‌తోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో జాట్‌లు, రాజ్‌పుత్‌ల ప్రభావం ఎక్కువ. బ్రాహ్మణులు కూడా కీలకమే. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన నేతకు, మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నాయకుడికి అవకాశం కల్పించిన క్రమంలో రాజస్తాన్‌లో ఇలాంటి నిర్ణయానికి మొగ్గుచూపినట్లు విదితమవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు ఎక్కువ. వీరందరికీ బీజేపీ మద్దతుగా నిలుస్తుందని చెప్పేలా ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఆ తెగలకు చెందిన విష్ణుదేవ్‌ సాయ్‌ని ఎంపిక చేశారు. గతంలో జార్ఖండ్‌లో బీజేపీ అధికారం చేపట్టినప్పుడు రఘుబర్‌దాస్‌ ముఖ్యమంత్రిగా చేశారు. ఆదివాసీ రాష్ట్రం కాబట్టి ఆ వర్గానికి చెందిన వారినే నియమించాలని అక్కడి విపక్షాలు ఆందోళన చేశాయి. వీరికి సమాధానంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆ వర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత విష్ణుదేవ్‌ సాయ్‌కు ముఖ్యమంత్రి స్థానాన్ని కట్టబెట్టారు. దేశ జనాభాలో 9 శాతం మేర ఉన్న గిరిజనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది బీజేపీ. ఇప్పటికే ద్రౌపదీ ముర్ముతో దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిని అందించిన బీజేపీ ఆ వర్గంతో ఓట్ల బంధాన్ని బలోపేతం చేసుకుంటోంది.

ఈ మూడు రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి పదవులను సైతం ఎన్నికల రాజకీయాల్లో ప్రాధాన్యం కలిగిన వర్గాల నేతలకే కట్టబెట్టింది. మధ్యప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రులుగా రేవా ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీశ్‌ దేవ్‌రాలకు అవకాశం కల్పించారు. రాజస్తాన్‌లో ఉప ముఖ్యమంత్రులుగా దియా సింగ్‌ కుమారి, ప్రేమ్‌చంద్‌ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావో, ఎమ్మెల్యే విజయ్‌ శర్మలకు ఉప ముఖ్య మంత్రి బాధ్యతలు అప్పగించారు. మాజీ ముఖ్య మంత్రి రమణ్‌సింగ్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించారు.

నూతన నాయకత్వానికి అవకాశం

బీజేపీ విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లో హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మధ్యప్రదేశ్‌కు నాలుగు సార్లు, 15 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి. రాజస్తాన్‌లో వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తాజాగా వీరే కాకుండా సీఎం పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు. అయినా కొత్త ముఖాలనే బీజేపీ ఎంచుకుని, కొత్త నాయకత్వానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందన్న సందేశాన్ని పంపింది. మరోసారి ముఖ్యమంత్రి పదవి దక్క నందుకు వసుంధర రాజేలో అసంతృప్తి ఉండవచ్చు. కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కొత్త ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ పేరును అధికారి కంగా వసుంధరే ప్రతిపాదించారు. గవర్నర్‌ను కలవడానికి సైతం భజన్‌లాల్‌ వెంట వెళ్లారు. పదవీ ప్రమాణ స్వీకారం తరవాత సచివాలయంలోని సీఎం కార్యాలయానికి స్వయంగా తీసుకెళ్లారు. 2018లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరవాత రమణ్‌సింగ్‌ ప్రాధాన్యం కోల్పోయారు. ఇటీవలి ఎన్నికలదాకా తెరచాటునే ఉండిపోయారు. తాజా ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలవడంతో ఆయన పాత్ర కూడా ఉండటంతో మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టవచ్చని భావించారు. కానీ, స్పీకర్‌గా అవకాశం కల్పించారు.

ఎన్నికల ప్రచారంలో ఏ రాష్ట్రంలోనూ ముఖ్య మంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అంతర్గతంగానూ దానిపై అసలు చర్చే నడవకుండా జాగ్రత్త పడిరది. ఫలితంగా వర్గ విభేదాలు తలెత్తకుండా చూసుకుంది. ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలను ప్రస్తావించి నప్పటికీ, మోదీ పాలన, దేశాభివృద్ధినే ఆయుధాలుగా మార్చింది. సామాజిక, రాజకీయ పరమైన కోణాలతోపాటు సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుంది. కొత్త ముఖ్యమంత్రులు ముగ్గురూ ఆర్‌ఎస్‌ఎస్‌ మూలాలు ఉన్నవారే. తద్వారా సంఫ్‌ుపరివార్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నామన్న సంకేతాన్ని పంపినట్లయింది.

వ్యక్తులకన్నా వ్యవస్థ గొప్పది అని బీజేపీ సిద్ధాంత కర్తలు చెబుతారు. ఈ సత్యాన్ని ఎప్పటి కప్పుడు గుర్తు చేస్తుంటుంది జాతీయ నాయకత్వం. సీనియర్లను పక్కన పెట్టినంతమాత్రన వారి సేవలు అవసరం లేదని చెప్పడం కాదు. కొత్త తరానికి వారు మార్గదర్శ కులుగా ఉండాలని సూచించింది. రాజకీయాల్లో తరాల మార్పే కాక అధికార మార్పిడి సైతం సాఫీగా సాగేలా చూసుకుంది. దేశంలో 60 ఏళ్లు ఆ పైబడ్డ ఓటర్లు 15 నుంచి 20 శాతమే అని లెక్కలు వినిపిస్తున్న వేళ పెరుగుతున్న యువ ఓటర్లను ఆకర్షించే నవతరం నేతలను భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దే పథకరచనకు విజయవంతంగా శ్రీకారం చుట్టింది.

వారు కొత్తవారు కాదు: మోదీ

ఇంతకీ హేమాహేమీలను పక్కన పెట్టి కొత్తవారికి బీజేపీ అవకాశం ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సమాధానం ఆసక్తిని కలిగించింది. ‘మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ముఖ్య మంత్రులు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారు. వారు కొత్తవారు కాదు. ఎంతోకాలం ప్రజల కోసం కష్టపడ్డారు. అనుభవం ఉంది. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండి పోయింది. దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతాయి’ అన్నారు మోదీ.

ప్రతి విషయంలోకూ లెక్కలుంటాయి

మన ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలమే ప్రధానం. సభా నాయకుడిని ఎన్నుకునే స్వేచ్చ, స్వాతంత్య్రం సభ్యులకు ఉంటుంది. అయితే ఇది పార్టీల అంతర్గత వ్యవహారం. ఈ అంశంలో ఆ పార్టీల అధిష్టానాలు ముందుచూపును ప్రదర్శిస్తాయి. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం ఈ కోవలోనిదే. ఈ రాష్ట్రాల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు అక్కడి అగ్రనాయకులు ఎంతో చెమటోడ్చి కష్టపడ్డారు. కాదనలేం. అయితే దేశ వ్యాప్తంగా ఏడాది పొడవునా, ప్రతినిత్యం శ్రమించే జాతీయ నాయకత్వానికి ఉండే లెక్కలు వేరు.

విస్తృత రాజకీయ, సైద్ధాంతిక వ్యూహంతో పాటు రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాల బలాబలాలను బేరీజు వేసుకొని సమతూకం పాటిస్తూ.. కొత్త ముఖ్యమంత్రుల ఎంపికకు వ్యూహరచన చేశారని స్పష్టమవుతోంది. ముగ్గురు కొత్త సీఎంలు కూడా హిందూత్వ వాదులే. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నవారే.. బీజేపీకి అత్యంత విశ్వాసంతో సేవలు అందిస్తున్నవారే. ఇంతకు మించిన లెక్కలు ఇంకేముంటాయి?

విపక్ష వ్యూహానికి చెక్‌

బీజేపీ జాతీయవాదాన్ని, హిందుత్వను ఎదుర్కోవ డానికి సామాజిక సమీకరణాలనే నమ్ముకుంది కాంగ్రెస్‌ పార్టీ. ఇతర విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కూగా విభజన రాజకీయాలను నమ్ముకున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కులాన్ని ఒక వ్యూహంగా భావించింది విపక్ష ‘ఇండీ’ కూటమి. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ కులగణన కోసం గట్టిగా డిమాండు చేశారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇటీవల రాష్ట్రంలో కులగణన నిర్వహించి వివరాలు బయట పెట్టారు. కర్ణాటకలో గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఆ సర్వే శాస్త్రీయంగా నిర్వహించలేదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చెబుతున్నారు.


చాయ్‌వాలా కుమారుడు ముఖ్యమంత్రిగా..

మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా దక్షిణ ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్‌ యాదవ్‌ (58) బాధ్యతలు చేపట్టారు. శివరాజ్‌సింగ్‌ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా మోహన్‌ యాదవ్‌ సేవలందించారు. శివరాజ్‌ ప్రతిపాదన మేరకు శాసనసభాపక్ష నేతగా యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరసగా నాలుగోసారి ఓబీసీ నేతకే మధ్యప్రదేశ్‌ పాలనాపగ్గాలు అప్పగిస్తున్నట్లయింది. విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మోహన్‌ అనతికాలంలోనే ఉన్నత స్థానానికి ఎదిగారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టే స్థాయికి చేరారు. మోహన్‌ యాదవ్‌ మార్చి 25, 1965న ఉజ్జయినిలో జన్మించారు. పూనమ్‌చంద్‌ యాదవ్‌కు ఐదుగురు సంతానం. వీరిలో మోహన్‌ యాదవ్‌ చిన్నవాడు. వ్యవసాయ కుటుంబం. పూనమ్‌చంద్‌కు మాలిపురలో ఓ చిన్నపాటి చాయ్‌ దుకాణం ఉండేది. ఆర్థిక పరిస్థితి అంతంతే ఉన్నప్పటికీ అందర్నీ చదివించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖకు క్రమం తప్పకుండా వెళ్లేవారు మోహన్‌ యాదవ్‌. స్థానిక మాధవ్‌ సైన్స్‌ కాలేజీలో విద్యార్థి సంఘ కార్యదర్శిగా 1982లో ఎన్నికైన మోహన్‌ 1984లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991లో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ‘మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై మీడియా ఆలోచనాధోరణి’ అన్న అంశం మీద ి 2008లో పరిశోధన చేశారు. మోహన్‌ 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో నెగ్గి, మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2020లో శివరాజ్‌ ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించారు. తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మూడోసారి విజయం సాధించారు.


తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు పగ్గాలు

రాజస్తాన్‌ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన భజన్‌లాల్‌ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాలుగు సార్లు ఆయన ఈ పార్టీ పదవి చేపట్టారు. ఇప్పటివరకు పార్టీలో సంస్థాగతంగా కీలక వ్యవహరించిన భజన్‌లాల్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సంగనేర్‌ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 48వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న భజన్‌లాల్‌ గతంలో ఏబీవీపీ నేత. 56ఏళ్ల భజన్‌లాల్‌ పీజీ పూర్తి చేశారు. ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు. ముఖ్యమంత్రి పేరు ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు గ్రూప్‌ ఫోటో దిగారు. అందులో ప్రముఖులు, సీనియర్‌ నాయకులు తొలి వరుసలో కూర్చొని ఉండగా భజన్‌లాల్‌ చివరివరుసలో ఓ మూలన నిల్చొని కనిపించారు. సీఎం అభ్యర్థిపై కమిటీ సభ్యులు చర్చిస్తున్న సమయంలోనూ ఆయన ఎక్కడో వెనుక వరసలో కూర్చున్నారని వార్తలు వచ్చాయి. అక్కడికి నిమిషాల వ్యవధిలోనే ఆయన పేరును ముఖ్యమంత్రిగా ప్రకటించడం, కమిటీలో సభ్యుడిగా ఉన్న రాజ్‌నాథ్‌ సహా పలువురు కీలక నేతలు అభినందించడం వరుసగా జరిగిపోయాయి. భజన్‌లాల్‌కు సైతం ఆ షాక్‌ నుంచి తేరుకునేందుకే కొద్ది సమయం పట్టింది.


సర్పంచి నుంచి సీఎం వరకు..

ఫిబ్రవరి 21,1964న జన్మించిన విష్ణుదేవ్‌ సాయ్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. గిరిపుత్రుడైన విష్ణుదేవ్‌ సాయ్‌ సర్పంచిగా ప్రస్థానం ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీలో కీలక నాయకునిగా ఎదిగారు 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికయ్యారు. 1990, 2023లో శాసనసభకు ఎన్నికయ్యారు. 2020 నుంచి 2022 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జాష్పుర్‌ జిల్లాలోని కుంకురి నుంచి ఎమ్మెల్యేగా ఎన్ని కయ్యారు. 2014లో ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా సేవలందిం చారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు విష్ణుసాయ్‌ అత్యంత సన్నిహితుడు. రాష్ట్రంలో ఆదివాసీలు 32 శాతం. దీంతో సీఎం ఎంపికలో అధిష్ఠానం ఆయనవైపు మొగ్గు చూపింది. జాష్పుర్‌ జిల్లా జార్ఖండ్‌, ఒడిశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని చూరగొనేందుకు ఈయనను ఎంపిక చేసిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా విష్ణుదేవ్‌ను గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక ఆయనకు పెద్ద పదవి వచ్చేలా చూస్తామని అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక సభలో చెప్పడం గమనార్హం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram