వైసీపీ ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తూ, యంత్రాంగాన్ని ప్రచారంలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పాలనలో విఫలమైన వైకాపా ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం, మరోవంక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మచ్చిక చేసుకునే దిశగా ప్రచారం ప్రారంభించింది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’, ‘బస్సుయాత్ర’ కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు కావాలంటే!’ కార్యక్రమాన్ని చేపట్టింది.అందుకు వాలంటీర్లను, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని యథేచ్ఛగా ఉపయోగించుకుంటోంది.

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ముందు పార్టీ పరంగా చేపట్టినా ప్రజల నుంచి నిలదీతలు ఎదురుకావడంతో నాయకులు జనంలోకి వెళ్ల లేక ముఖం చాటేశారు. దీంతో దానిని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు. ఇటీవల చేపట్టిన బస్సుయాత్ర కూడా విఫలయమైంది. జనాన్ని ఎంతగా తీసుకు వస్తున్నా వారు కూర్చోవడం లేదు. ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు …’ కార్యక్రమం కూడా రాజకీయ నినాదంగా మొదలై, ప్రభుత్వ కార్యక్రమంగా రూపాంతరం చెందింది. దీని కోసం రూ. 500 కోట్లు ఖర్చుచేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల జాబితా తయారీలోను వాలంటీర్లను వాడుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, ఈ తాజా కార్యక్రమంలో యంత్రాంగం పాల్గొనేలా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడు తోందని విమర్శలొస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ముద్రించిన బ్రోచర్లకు రూ.40 కోట్లు పంచాయతీ రాజ్‌ శాఖ నిధుల నుంచి చెల్లించారు.

మరోవంక, ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు కావాలంటే ’ అనే కార్యక్రమం చేస్తుండగా, ప్రజలు మాత్రం ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్‌ ఎందుకు వద్దో వివరిస్తూ బహిరంగ ప్రచారం చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలకు సాధికారత లేకుండా చేసిన సర్కారుపై సర్పంచులతో పాటు గ్రామీణులు కూడా మండిపడుతున్నారు. ‘ఎందుకు మరలా జగన్‌… మా నెత్తినెక్కింది చాలు’ అంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశయమైంది.

పంచాయతీల నిర్వీర్యం

వైసీపీ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసింది. వాటి అభివృద్ధికి నిధులు కేటాయింపును అటుంచి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులనూ దారి మళ్లించింది. నాలుగున్నరేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భవనాలకు పార్టీ పతాక రంగులు వేయించారు. దానికీ పంచాయతీ రాజ్‌ శాఖనే వాడుకున్నారు. పంచాయతీరాజ్‌ భవనాలకు నీలం, ఆకుపచ్చ రంగులు వేయాలని, వాటిని ఎలా వేయాలో వివరించే నమూనా (మోడల్‌) రూపొందించి మెమో ఇచ్చారు. దీనిని హైకోర్టు తప్పుపట్టగా, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత ధర్మాసనం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీనితో తమ చర్యలను సమర్థించుకునేందుకు కొత్త కొత్త వ్యూహాలతో ప్రయత్నాలు చేసింది.

 ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై జాతీయ బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని, అందుకు ఉన్నత స్థాయి కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు సర్కార్‌ ఓ కమిటీని వేసి గతంలో ఉన్న రంగులతోపాటు అదనంగా టెర్రా కోటా మాత్రమే చేర్చి వైసీపీ రంగులను తొలగించకుండా నిర్ణయం తీసుకొని ఒక కొత్త జీవోను తీసుకొచ్చింది. అయితే ఆ జీవోను కూడా రద్దు చేస్తూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రంగులు మార్చకుంటే కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయినా రంగుల పిచ్చి ముదిరిన సర్కారు ఓ పట్టాన కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. ఇప్పుడు అదే పంజాయతీరాజ్‌ శాఖ నుంచే.. ‘ఏపీకి జగనే…’ ప్రచార బుక్‌లెట్ల కోసం రూ.40 కోట్ల నిధులు మళ్లించారు. ఇప్పుడు గ్రామ సచివాలయాల ముందు వైసీపీ పతాకాలను ఆవిష్కరిస్తుండగా, ఉద్యోగులు, అధికారులు… అధికార పార్టీ సేవలో తలమునక లయ్యారు.

 పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పెద్ద చర్చ జరుగుతోంది. పంచాయతీ పాలనకు సమాంతరంగా వాలంటరీ, సచివాలయ వ్యవస్థలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థలకు ప్రాధాన్యం లేకుండా చేసింది. ప్రజలు నేరుగా ఎన్నుకున్న సర్పంచికి కనీస గౌరవం లేకుండా పోయింది. ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించడంతో అభివృద్ధి మాట అటుంచి కనీస సమస్యల పరిష్కారం కూడా కావడం లేదు. కొందరు సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేసినా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిరది. నిధుల కోసం వారు పోరాడుతున్నారు. రాష్ట్రపతిని కలసి వైసీపీ సర్కారు తీరుపై ఫిర్యాదు కూడా చేశారు.

రాజ్యాంగానికి తూట్లు

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విపక్షాలు, బాధితులు ఆరోపి స్తున్నారు. ప్రజాస్వామ్య, రాజకీయ విలువలను, ఎన్నికల ప్రక్రియను ఈ ప్రభుత్వం ఏ మాత్రం గౌరవించడం లేదంటున్నారు. పవిత్రమైన ఓటు హక్కును చులకన చేసి ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. ఓటర్లకు భారీగా డబ్బులిచ్చి ఎన్నికలు గెలవటమే ప్రజాస్వామ్య మూలసిద్ధాంత మన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకుండా దౌర్జన్యాలు చేసి అధికారాన్ని పొందే కుట్రలు చేశారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యలు నిత్యకృత్యమై పోయాయి. వైసీపీ ప్రభుత్వం పాలనా యంత్రాంగాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటూ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసింది. పోలీసు యంత్రాంగం అధికార పార్టీ సేవలో తరిస్తోంది. వైసీపీ రాజ్యహింస, విధ్వంసాన్ని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై ఆత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం నుంచి సరైన స్పందన లేదని విమర్శ లొస్తున్నాయి. మహిళలపై వైసీపీ నేతలు దాడులకు దిగిన ఘటనలు కోకొల్లలు.

ఈ ప్రభుత్వం పేదలను కూడా దోపిడీ సాధకాలుగా మార్చుకుంది. మద్యం వ్యాపారాన్ని చేజిక్కించుకుని నాసిరకం మద్యం తయారుచేసి ప్రభుత్వమే రెండు రెట్ల అధిక ధరలకు అమ్మడాన్ని పేదలు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఇసుక, మట్టి, గ్రావెల్‌, సిలికా వంటి సహజ వనరుల సంపదను దోచేస్తున్నారనే ఆరోపణలపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వమే మత వివక్షకు పాల్పడుతున్నట్లు హిందూమత సంస్థలు ఆరోపిస్తున్నాయి. హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులు, ఆదాయాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు, దోపిడీలు జరుగు తున్నాయి. పవిత్ర తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరగడంపట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల లబ్ధికోసం మత మార్పిడులను ప్రభుత్వమే ప్రోత్సహి స్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ‘తనవారికో న్యాయం, ఎదుటివారికో న్యాయం’ అనేలా పరిస్థితి తయారైంది. ఎదుటివారిని వేధించటానికి వ్యవస్థలను ఉపయోగించటం, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు నిత్య కృత్యమయ్యాయి. ప్రతిపక్ష నాయకుల సభలు, సమావేశాలు, యాత్రలను అడ్డుకో వడానికి జీవో నెంబరు 1 జారీ చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా చెబుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అరాచకాలు, అక్రమాలు, దోపిడీని ఎత్తిచూపుతున్నందున విపక్షాల నాయకులు, కార్యకర్తలతో పాటు భారీ సంఖ్యలో దళిత, గిరిజన, అల్ప సంఖ్యాక, వెనుకబడిన తరగతుల వారు కూడా కక్షపూరిత దాడులకు బలయ్యారు. సామాజిక స్వేచ్ఛ అనేది కరవైంది. దళిత వైద్యుడు సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కొట్టిన ఘటన నుంచి తాజాగా కృష్ణా జిల్లాలో ఓ దళిత యువకుడిపై దాడిచేసి ఒంటిపై మూత్రం పోయడం వరకు.. దళితులపై జరిగిన దారుణాలు ఎన్నెన్నో! హత్యలు చేసి ‘డోర్‌ డెలివరీ’లు చేసే వారికి ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టడం సామాజిక న్యాయమా? అని దళితులు ప్రశ్నిస్తున్నారు. మైనార్టీల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన రూ.5,400 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని మైనార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో అమలు చేసిన 11 పథకాలను రద్దు చేశారని, ముస్లింల కుటుంబాలకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వం ఏనాడూ స్పందించ లేదంటున్నారు. ముఖ్యమంత్రి తన సామాజికవర్గం వారికే కీలక పదవులు కట్టబెట్టారని విమర్శలొస్తున్నాయి.

రాజకీయకేంద్రంగా సచివాలయాలు

గ్రామ, వార్డు సచివాలయాలను వైసీపీ సర్కార్‌ రాజకీయ వేదికగా మార్చేసింది. ప్రభుత్వ సొమ్ము నుంచి జీతాలు తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగులను, వాలంటీర్లను రాజకీయ ప్రచారానికి వాడుకుంటోంది. ‘పల్లెకు పోదాం…’, ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి…’ పేర్లతో సచివాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో సచివాలయ పరిధిలోని కుటుంబాల నుంచి జనాలను సమీకరించి వైసీపీ స్థానిక నేతలు, ఎమ్మెల్యేలతో ఉపన్యాసాలు ఇప్పించాలంటూ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందంటున్నారు. ఇప్పటికే సచివాలయాలను సీఎం జగన్‌ బొమ్మలతో, ఆ పార్టీ రంగులతో నింపి పార్టీ కార్యాలయాల్లా మార్చేశారు. ఇప్పుడు వైసీపీ సభలకు జనాలు మొహం చాటేస్తుండటంతో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో ప్రచారాలు నిర్వహిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

 ఉద్యోగులు వైసీపీ పాలన పట్ల సుముఖంగా లేరు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ను రద్దుచేస్తామన్న మాటను అటకెక్కించారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సరిగ్గా డీఏ బకాయిలు ఇవ్వట్లేదంటూ అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్‌ నానా పోరాటాలు చేశారు. అధికారంలోకి వచ్చాక డీఏలు, బకాయిల సంగతి అటుంచి జీతాల కోసమే ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఉపాధ్యాయలు చేస్తున్న పోరాటాలను అణగదొక్కే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి ఉద్యమ నాయకులపై కేసులు పెట్టి వేధించడం పరిపాటయింది.

– టీఎన్‌ భూషణ్‌,  సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
YOUTUBE