– కటుకోజ్వల మనోహరాచారి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

శౌర్యానికి ప్రతీకలా ఉన్న సేనాధి పతి.. రాజు ఆంతరంగిక మందిరం లోకి అడుగుపెట్టి వినమ్రపూర్వకంగా నమస్క రించాడు.

 ‘‘ప్రభువులకు జయమగుగాక..!’’

అతని రాకకోసమే వేచిచూస్తున్నట్లుగా సముచిత ఆహ్వానం పలికి ఎదురుగా ఉన్న ఆసనాన్ని చూపించాడు ఛత్రపతి. విశాలమైన హాలు మధ్యలో వృత్తాకారంలో అమర్చిన బల్లపైన పచ్చని ముఖ్మల్‌ ‌వస్త్రం మెరుస్తోంది. కాస్త ఎత్తుపై నున్న ఆసనంపై కత్తికి రాజవస్త్రాలు ధరించినట్లున్న వీరకిశోరం శివాజీ మహరాజు కూర్చొని ఉన్నాడు.

  అప్పటికే  శివాజీ కుడిభుజమైన బాజీప్రభు దేశపాండే ఆసీనుడై ఉన్నాడు. కీలక సమయాల్లో శివాజీ ప్రాణాలకే వెన్నుదన్నుగా నిలిచిన ధీరుడతడు. వాళ్ల మంతనాల మధ్యనే సేనాధిపతికి ఆహ్వానం అందింది. బాజీప్రభుకూ నమస్కరించిన సేనాధిపతి బల్లకు ఒకవైపు, ప్రభువుకు అభిముఖంగా కూర్చు న్నాడు. ఆ సమావేశం పూర్తిగా ఆంతరంగికమైంది కావడంతో అక్కడ ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు. విషయాన్ని ముందే చూచాయగా గ్రహించిన సేనాధిపతిలో ఉత్సాహం ఉరక లెత్తుతుంది.

మరో కుంభస్థలాన్ని ఢీకొట్టడానికి జరుగుతున్న మంతనాలవి.

అప్పటికే సుల్తానుల పరిధిలోని  అనేక కోటల్ని వశం చేసుకొన్న వీరశివాజీ హిందూధర్మానికి విఘాతం కలిగిస్తున్న ఎవరినైనా ఎదిరించేదుకు కంకణబద్ధుడై ఉన్నాడు. మొఘలాయిల కోటలపైన కూడా దాడులకు తెగించాలనే దృఢ చిత్తం ఆయనది.

‘‘జయోస్తు సోన్దేవా! ఈ సమావేశం దేనికో గ్రహించే ఉంటావు. నువ్వు సాధించిన విజయ చిహ్నాల్లోకి మరో కలికుతురాయిని చేర్చాలను కుంటున్నాం. సిద్ధంగా ఉన్నావా?’’ అన్నాడు ప్రభువు విలాసంగా.

‘‘అవశ్యం ప్రభూ! మీ ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ సోన్దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు.. మొఘలుల కోటగోడలు బద్ధలు కొట్టేందుకు దండు సిద్ధం చేయమన్నారా..?’’ అన్నాడు రాజు ఆంతర్యం తెల్సినవాడిలా.

‘‘శబాష్‌.. ‌సోన్దేవా! మీ ఆత్మస్ధైర్యానికి అభినందనలు. కానీ మనమిప్పుడు ఆ బీజాపూర్‌ ‌సర్దారుని అణచాల్సిన పరిస్థితులు సమీపించాయి. కళ్యాణి దుర్గాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్నాం. మీరేమంటారు?’’ అడిగాడు శివాజీ.

‘‘అవశ్యం ప్రభూ! ఇప్పటికే ఆలస్యం చేశాం. ఆ సర్దారుల ముప్పేట దాడులు ఎదుర్కొనడానికి ముందే, మనమే కళ్యాణిని కైవసం చేసుకోవడం ఉత్తమం. ఈ దాడితో బీజాపూర్‌ ‌ప్రజల్ని మహ్మదీయ పాలనాపీడ నుండి విముక్తుల్ని చేసినట్లవుతుంది’’.

‘‘శభాష్‌ !  ‌మీ రాజభక్తకి, ప్రజాభక్తికీ మరొక్క మారు అభినందనలు. ఇపుడు ఆ బృహత్కార్యాన్ని మీ భుజస్కంధాలమీదే ఉంచదలచాం’’

‘‘జయము మహారాజా! మీ ఆశయాన్ని తక్షణం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. సేనలు కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాయి. మీ ఆనతే తరువాయి’’ అన్నాడు కృతనిశ్చయంతో సోన్దేవుడు.

మహారాజు సంతోషించాడు. హిందూధర్మ పరిరక్షణకు, హైందవ సామ్రాజ్య స్థాపనకు కంకణం కట్టుకున్న శివాజీ ఇప్పుడు మలిదశ పోరాటంలో ఉన్నాడు. ఉత్తర భారతదేశంలో మొఘలులు, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో బీజాపూర్‌, ‌గోలకొండ సుల్తానుల పాలనలో హిందూ ధర్మం మంటగలిసిపోతోంది. హైందవ గడ్డమీద ముసల్మానుల పాలనతో స్వదే శీయుల ధన, మాన, ప్రాణాలు హరించుకు పోతుంటే ఆత్మాభిమానంతో తిరగబడక తప్పని పరిస్థితి. ప్రజల  మాన ప్రాణాలకు రక్షణలేని ఆటవిక పాలనను అరి కట్టేందుకు ఒంటరిగా బరిలోకి దిగిన హైందవ సింహం శివాజీ.

పదిహేడో ఏటనే దుర్గాలపై దాడికి తెగబడిన సాహసిగా చరిత్ర సృష్టించిన శివాజీ.. బీజాపూర్‌ ‌సుల్తానులను  అణిచివేయడంలో భాగంగా ఒక్కో  కోటనూ కైవసం చేసుకొంటూ వస్తున్నాడు. బాజీ ప్రభుతో పాటు తానాజీ, అబ్బాజీ సోన్దేవుని వంటి సేనాధిపతులు, నమ్మకస్తులైన ముస్లిం సైన్యాధికారులూ శివాజీ విజయ పరంపరలో భాగం పంచుకొంటున్న తరుణం.

 ఈ నేపథ్యంలోనే తోరణ, కొండన, రాజ్‌ఘడ్‌, ‌విశాల్‌ఘడ్‌ ‌వంటి చాలా కోటల్ని హస్తగతం చేసుకొన్నాడు. విశాలమైన మరాఠా సామ్రాజ్య స్థాపన లక్ష్యంలో భాగంగా బీజాపూర్‌తో పాటు, గోల్కొండ సుల్తానులనూ జయించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు. అందులో భాగమే ఈ కళ్యాణిదుర్గ ముట్టడి సన్నాహాలు. హిందూధర్మ రక్షణే ధ్యేయంగా సామ్రాజ్య విస్తరణకు పూనుకున్న వీరశివాజీ ఇప్పుడు ఈ బీజాపూర్‌ ‌సుల్తాను మెడలు వంచడమూ ఒక చారిత్రక అవసరం. ఎలాగైనా కళ్యాణి దుర్గ పాలకుడు మౌలానా అహ్మద్‌ను జయించడం, కోటను వశపరచుకోవడం తప్పనిసరిగా భావిస్తున్నాడు.

బాజీప్రభు దేశపాండే కళ్యాణి దుర్గానికి చెందిన నమూనా చిత్రపటాన్ని వారి ముందుంచాడు. దుర్గం నిర్మాణ రూపురేఖలు, ప్రధాన ద్వారం, రక్షణ వ్యవస్థ, ఆక్రమణకు గల అనుకూలతలు, ఎదుర్కోవాల్సిన ప్రతికూలతలూ సర్వమూ రాజుతో చర్చించారు.

అప్పటికే దుర్గంపై ఒక అవగాహనకు వచ్చిన సోన్దేవుడు పూర్తి సన్నద్ధ్దతను ప్రకటించాడు. దాడికి దిగిన నాలుగు గంటల్లో కోటను వశం చేసుకో గలమనే విశ్వాసాన్ని ప్రకటించాడు. మూడు రోజుల్లో సైన్యాన్ని సమాయత్తం చేయగల మన్నాడు.

సమీక్షానంతరం కోటను వశం చేసుకోగలమనే దృఢనమ్మకానికి వచ్చిన శివాజీ ఆసనంపై నుండి లేచాడు. సోన్దేవుని రెండు భుజాల్ని తట్టి అభినందిస్తూ ‘‘శబాష్‌ ‌సోన్దేవా! నీ ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలే మరాఠా సామ్రాజ్య విస్తరణకు ఆలంబ•న కావాలి. వలసిన సేనాధిపతుల్ని వెంటతీసుకోండి. నీకు సర్వసైన్యాధిపతి బాధ్యతలు కట్టబెడుతున్నాను. దాడికి సమాయత్తం కండి. ముహూర్తం తెలియజేస్తాం’’ అన్నాడు శివాజీ మహారాజు.

సర్వసైన్యాధిపతి బాధ్యతలందుకొని ఇరువురకీ నమస్కరించి తన మంది రానికి బయలుదేరాడు అబ్బాజీ సోన్దేవుడు.

వారం రోజుల్లో దుర్గంపై దాడికి రంగం సిద్ధమైంది. ముహూర్తమూ నిర్ణయమైంది.

******

నిశ్చయించిన ముహూర్తానికి రెండ్రోజులు ముందుగానే కళ్యాణి దుర్గంపై మెరుపుదాడి జరి గింది. అనుకున్న సమయానికి ముందే దాడికిదిగడం కూడా శివాజీ యుద్దతంత్రంలో భాగమే!

నలుగురు మెరికల్లాంటి యుద్దవీరుల్ని సహాయంగా తీసుకొని కేవలం మూడువేల సైన్యంతో విరుచుకుపడ్డాడు అబ్బాజీ సోన్దేవుడు. ముందే అంచనా వేసిన కళ్యాణి దుర్గపు రక్షణ కవచాన్ని చీల్చుకొని ప్రధాన ద్వారాన్ని దాటి లోనికి చొచ్చుకుపోయింది శివాజీ సేన.

దుర్గాధిపతులు ఊహించలేనంత మెరుపు వేగంతో దాడులు చేయడం శివాజీ గెరిల్లా యుద్ధ తంత్రం అని తెల్సికూడా కళ్యాణిదుర్గ పాలకుడు మౌలానా అహ్మద్‌ ‌జాగ్రత్త వహించలేకపోయాడు. శివాజీ మహరాజ్‌ ‌కళ్యాణిపై కన్నేశాడన్న చారుల సందేశం కూడా ఆతన్ని అప్రమత్తుడిని చేయలేక పోయింది.

అయితే..అప్పటికే అనేక కోటలు కైవసం చేసుకున్న ఛత్రపతికి కళ్యాణి దుర్గాన్ని మాత్రం దక్కనీయకూడదన్న పట్టుదలతో బలంగా ఎదుర్కొంటున్నాయి అహ్మద్‌ ‌సేనలు. అక్కడ సేనానాయకుడు సమాయత్తమైనా పాలకుడు అప్రమ త్తంగా లేక నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన జాప్యం సోన్దేవునికి అనుకూలిం చింది. శివాజీ సేనల గెరిల్లా దాడుల వేగాన్ని కోటబయట నిలువ రించలేకపోవడంతో, నేరుగా కోటలోకి చొచ్చుకొచ్చాక నిలువరించడం అహ్మద్‌ ‌సేనలకు కష్టంగా మారింది.

శివాజీ ఎంచుకొన్న రోజు, సమయం, శత్రురాజు చారులను ఏమరిచిన విధానం, సోన్దేవుని యుద్ధ్ద నైపుణ్యం, సైనికుల ధైర్యసాహసాలు.. ఏకంగా పదివేల సైన్యం కలిగిన కళ్యాణి దుర్గంపైకి తెగపడేలా చేశాయి. కోటలో సేన పూర్తిగా సమాయత్తం అయ్యేలోపే దుర్గాధిపతి ఆంతరంగిక మందిరాన్ని ముట్టడించగలిగిన సోన్దేవుడు.. సర్దారు పిరికితనంతో అంతఃపురంలో దాక్కున్న విషయం తెల్సి రాణివాసాన్ని ముట్టడించాడు సైనికులతో. అత్యంత సాహసోపేతంగా రక్షణ వలయాన్ని చీల్చి, వెన్నంటి ఉన్న యుద్ధవీరుల సాయంతో కొద్ది నిమిషాల్లోనే రాజు మౌలానా అహ్మద్‌ను బంధించాడు సోన్దేవుడు.

అంతే! రాజు బంధితుడైన మరుక్షణం కోటలో సైన్యం మోకరిల్లింది. కేవలం అతికొద్ది సైనికులని మాత్రమే కోల్పోయిన సోన్దేవుడి ఆక్రమణ పూర్తయింది. అతని మొహంపై విజయగర్వం తొణికిసలాడింది.

బంధితుడైన రాజుతో రాణివాసం నుండి బయల్వెడలుతుండగా.. అనుకోకుండా అక్కడో మెరుపు మెరిసింది.  కదులుతున్నవాడు క్షణకాలం నిలిచి తిరిగి చూచాడు సోన్దేవుడు.

అది మెరుపా..? కాదేమో!

మెరుపు తీగవంటి రాణీవాసపు పడతి. మేలిముసుగులో ఉన్న ఆ జవ్వని మేనికాంతి.. దట్టమైన కారుమేఘాలను చీల్చుకొని వస్తున్న చంద్రుని వెన్నెలను తలపిస్తుంది. మందిరంలో నుండి బయటపడలేక చిక్కుకుపోయిన ఆమె సిగ్గుని భయం అధిగమించగా ఎటూ పాలుపోక శిలాప్రతిమలా నిల్చొని ఉంది. సోన్దేవుడే కాదు. రాణివాసంలోకి అడుగుపెట్టిన యుద్ధవీరులతోపాటు, సైనికులు కూడా క్షణకాలం తమను తాము మరిచారు. మరుక్షణం కర్తవ్యం గుర్తుకొచ్చి బంధితుడైన సర్దారునితో ముందుకు కదిలారు.

ఆ యువతిని చూడగానే సోన్దేవుని మదిలో అనేక భావాలు కదిలాయి. పరాజితులైన హిందూ రాజపుత్రరాజుల అంతఃపుర కాంతలను మహ్మదీయ పాలకులు, వారి సైనికులు చెరపడుతుంటే, తట్టుకోలేక అగ్నిగుండాల్లో దూకిన భారతీయ మహిళల దీనత్వం కనిపించింది. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహ్మదీయ దురాక్రమణదారులు అమాయక హిందూ స్త్రీలపై జరిపిన మానభంగాల పర్వం గుర్తుకొచ్చింది. దుర్మార్గుల పాలనలో సమిధలైన ఎందరో హిందూ స్త్రీలు మదిలో మెదిలారు.

 తనలో కలిగిన ఆలోచనలను తనలోనే దాచుకొని తన సంకల్పాన్ని నలుగురు యుద్దవీరుల చెవిలో వేశాడు. వాళ్లు అతని నిర్ణయాన్ని శ్లాఘిం చడంతో సేనాధిపతి తక్షణం తన ఆలోచనల్ని అమల్లో పెట్టాడు. అనంతరం కోటపై జయపతాకాన్ని ఎగరేసిన సోన్దేవుని సేన విజయగర్వంతో ముందుకు సాగింది.

******

 ఛత్రపతి శివాజీ రాజదర్భార్‌ ‌విజయోత్సా హంతో పొంగిపోతున్నవేళ..

శివాజీ కూర్చిన రణతంత్రానికి తన వీర విక్రమాన్ని జోడించి కళ్యాణి దుర్గాన్ని గెలవడంతో పాటు, దుర్గాధిపతి మౌలానా అహ్మద్‌ను బందీగా తెచ్చిన సేనాధిపతి సోన్దేవుడికి సభాసదులు బ్రహ్మరథం పట్టారు. నేరుగా మహారాజే సింహాసనం దిగివచ్చి అఖండ స్వాగతం పలికి ఆలింగనం చేసుకొన్నాడు.

ఘన సన్మానం, ప్రశంసలూ అందుకొన్న సోన్దేవుడు ‘ఈ విజయానికి గుర్తుగా ఒక అమూల్య మైన కానుకను మహారాజుకు సమర్పించబోతున్నాను’ అని ప్రకటించాడు.

సభలో ఉత్కంఠతతో పాటు కలకలం బయలు దేరింది. ఛత్రపతి కూడా ఉత్సుకతగా చూశాడు.

మరుక్షణం మెరుపు మెరిసినట్లుగా అక్కడ ప్రత్యక్షమైంది…ఓ జవ్వని. మేలి ముసుగు తెరలో కూడా మెరుపులా మెరుస్తున్న ఆ నితంబిని పైన దృష్టి పడిన ఛత్రపతి శివాజీ కళ్లు విప్పారితం అయ్యాయి. భృకుటి విశాలం అయింది. కళ్లల్లో వినూత్న భావాలు కదలాడాయి.ఆయన పక్కనే ఉన్న బాజీప్రభు దేశపాండే వైపు చూశాడు. శివాజీ ఆంతర్యం గ్రహించినట్లుగా బాజీప్రభు లేచి అక్కడి నుండి లోనికేగాడు.

కోహినూరు వజ్రం వంటి ఆ కోమలిని చూస్తున్న ప్రతివారూ వివశులై పోతున్నారు. శివాజీ మహరాజుకు అపూర్వ సౌందర్యరాశిని బహుమతిగా సమర్పించినందుకు సభ్యులలో చాలామంది సోన్దేవుని కళ్లతోనే అభినందించారు. శివాజీ పొడ గిట్టని కొందరు, రాజు పొందబోయే సౌఖ్యానికి కుళ్లుకుంటున్నారు.

ఛత్రపతి సింహాసనంపై నుండి లేచి నిల బడడంతో సభికులందరూ ఆయన వంక చూచారు.  ఆయన కళ్లలో కదలాడుతున్న భావాలను చదవడం కష్టంగా మారింది. మెల్లిగా మెట్లుదిగి కిందకు వస్తుంటే అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.

ఆమెను సమీపించిన శివాజీ బేలగా నిలబడియున్న ఆమెను పరీక్షగా తిలకించాడు.

‘‘ఏం పేరు??’’

ఆమె బెరుకు, భయంతో తడబడుతూనే చెప్పింది.

శివాజీ క్షణమాగి ‘‘నా తల్లి కూడా నీ అంత సౌందర్యవతి. నువ్వు మా అమ్మకు ప్రతిరూపంలా కనిపిస్తున్నావ్‌..’’ అన్నాడు.

ముందామె విస్తుబోయింది. తర్వాత అప్రతిభు రాలవుతూ.. స్థాణువైంది.

చూస్తున్న సభికులూ విచలితులయ్యారు. అలాగే చూస్తుండి పోయారు.

 క్రమంగా ఆయన కళ్లు రక్తవర్ణం దాల్చాయి.

 ‘‘ సేనాపతీ…’’ సింహగర్జనలా వినిపించిన ఆ అరుపుకు సభాస్థలంతా క్షణకాలం వణికింది.

విలాసంగా నవ్వుతున్న సోన్దేవునికి ముచ్చమటలు పట్టాయి. ఒక్క ఉదుటున రాజును చేరాడు.

‘‘ఎవరీ స్త్రీ రత్నం..??’’

సన్నగా వణుకు మొదలైన సోన్దేవుడు ‘‘ప్ర.. ప్రభూ..! క.. కళ్యాణి దుర్గం… మౌలానా.. కో..డ..లు..’’

‘‘మూర్ఖుడా?  హైందవ ధర్మాన్ని అతిక్రమించి మహాపరాధం చేశావు. పరస్త్రీని తల్లిలా భావించే సంస్కృతి మనది. నా అభిమతాన్ని, దీక్షను గ్రహించక పూజనీయులైన స్త్రీలను బంధించే సాహసం చేసిన నీకు శిక్షా….’’ మహారాజు మాట పూర్తి చేయకుండానే సోన్దేవుడు ఛత్రపతి కాళ్లపై పడ్డాడు.

‘‘నా అవివేకాన్ని మన్నించండి ప్రభూ! ఇకముందు మహిళామణులకు అవమానం కలిగించే ఎలాంటి చర్యలు జరగవని మాటిస్తున్నాను ప్రభూ!’’ పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతున్నాడు.

   అతడు చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకున్న శివాజీ వెంటనే  ప్రసన్నుడయ్యాడు. ‘‘క్షమాపణలు నాక్కాదు సోన్దేవా! ఆ అమాయకురాలికి చెందాలి. తిరిగి అంతే పవిత్రంగా ఆమె యథాస్థానానికి చేరాలి..’’ అన్నాడు.

‘‘తమ ఆజ్ఞ ప్రభూ!’’ అంటూ లేచి ఆ మహ్మదీయ వనిత వైపు చేతులు జోడించాడు. అప్పటికే బాజీప్రభు నేతృత్వంలో చారికలు ‘చీర, సారెల’తో ముందు కొచ్చారు. క్షణంలో పల్లకీ వచ్చింది.

శివాజీ మహారాజు ఆ కాంతకు పసుపు కుంకుమ, చీర సారెలు సమర్పించి మొక్కాడు. ‘‘తల్లీ! నన్ను మన్నించు. మా హిందూ ధర్మంలో పరస్త్రీలను తల్లిలా, తోబుట్టువులా భావిస్తాం. మా సేనాపతి చేసిన తప్పుకుగాను నిన్ను సగౌరవంగా, ససైన్యంగా మీ రాణీవాసానికి చేరుస్తాడు..’’ అంటూ ఆమెను పల్లకీలోకి ఎక్కించాడు.

 సభాసదులంతా లేచి హర్షధ్వానాలు చేస్తుంటే, వెంట సాయుధ సైనికులు తోడురాగా పల్లకీలో ఆ యవనకాంత తరలిపోతుంది.

పల్లకీ రాజమందిరం దాటుతుంటే మేలి పరదాలు పక్కకు జరిపి ఛత్రపతి వైపు ఆమె చూసిన చూపులు ఆ సభాసదులు జీవితంలో మరచిపోలేరు.

 అలాంటి చూపులే నేటికీ హైందవ ధర్మాన్ని రక్షిస్తున్నాయేమో!!.

About Author

By editor

Twitter
YOUTUBE